కమెడియన్‌కి మైనస్‌లే ప్లస్సులు! | Minuses of comedian are pluses! | Sakshi
Sakshi News home page

కమెడియన్‌కి మైనస్‌లే ప్లస్సులు!

Published Sun, Apr 13 2014 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM

కమెడియన్‌కి మైనస్‌లే ప్లస్సులు!

కమెడియన్‌కి మైనస్‌లే ప్లస్సులు!

 సంభాషణం

నవ్వడం తేలికే. కానీ నవ్వు పుట్టించడం అంత తేలిక కాదు. దానికి ప్రతిభ ఉండాలి. హాస్యం అనేది అణువణువునా నిండివుండాలి. అలాంటివారే అందరినీ నవ్వించగలరు అంటారు సుమన్‌శెట్టి. విభిన్నమైన లుక్‌తో, వైవిధ్యభరితమైన హావభావాలతో కడుపుబ్బ నవ్వించే ఈ కమెడియన్‌తో మాటా మంతీ....

ఈ మధ్య కాస్త తక్కువ కనిపిస్తున్నట్టున్నారు...?
 కెరీర్ కొంచెం డల్ అయిందిలెండి.

ఎందుకలా?
కొత్తవాళ్లు వస్తున్నారు. పోటీ పెరిగింది. అలా అని మరీ డల్లేమీ కాదు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా నటిస్తున్నాను కాబట్టి ఫర్వాలేదు.
     
ఇక్కడ చాన్సుల్లేవని అక్కడికెళ్లారా?

అలా ఏమీ లేదు. ‘జయం'లో చేసిన పాత్ర తమిళ వెర్షన్‌లో కూడా నేనే చేశాను. దాంతో అక్కడ కూడా మొదట్నుంచీ అవకాశాలు బాగానే వచ్చాయి. ఇప్పుడు కన్నడంలో కూడా వస్తున్నాయి.
     
ఇప్పటికి ఎన్ని సినిమాలు చేశారు?
తెలుగులో మూడొందల పైనే చేశాను. తమిళంలో అరవై వరకూ చేశాను.
     
అన్నిట్లోకీ బెస్ట్ అనుకునే పాత్ర...?
ఎప్పుడూ ఫస్ట్ చేసిందే బెస్ట్ అవుతుందని నా అభిప్రాయం. ఎన్ని రకాల పాత్రలు చేసినా... నన్ను నటుడిని చేసిన ‘జయం' సినిమాలో పాత్ర అంటే నాకు ప్రత్యేమైన ఇష్టం! అలాగే ‘7/జి బృందావన్ కాలనీ’లో చేసింది కూడా!
     
ఇన్ని సినిమాలు చేశారు. రావలసినంత గుర్తింపు వచ్చిందంటారా?
దర్శకులు పిలిచి అవకాశాలు ఇస్తున్నారంటే గుర్తింపు వచ్చినట్టే. కానీ తృప్తి కలిగించేటి రోల్స్ చేయలేదంటే ఇంకా గుర్తింపు రావలసి ఉన్నట్టే!
     
ఇంత కాంపిటీషన్ మధ్య నిలబడటానికి మీకున్న ప్రత్యేకతలేంటి?
నా మాడ్యులేషన్! కొండవలస గారిని తీసుకోండి... ఆయన మాట్లాడినట్టు వేరేవాళ్లు మాట్లాడలేరు. ప్రయత్నించినా రాదు. నాదీ అంతే. ఓ డిఫరెంట్ మాడ్యులేషన్. అదే నాకంటూ ఓ గుర్తింపునిచ్చింది. నన్నిక్కడ నిలబెట్టింది.
     
మరి మైనస్ పాయింట్స్...?

అవి నేను కాదు... నన్ను చూసేవాళ్లు చెప్పాలి. అయినా నెగిటివ్ పాయింట్స్ హీరోలకు మైనస్ అవుతాయి. అదే కమెడియన్‌కి అయితే మైనస్‌లే ప్లస్ అవుతాయి. (నవ్వుతూ) నన్ను చూడండి... నా రూపం చూస్తేనే నవ్వొస్తుందంటారు అందరూ. అంటే మైనస్ ప్లస్ అయినట్టేగా!
     
మీ రోల్‌మోడల్ ఎవరు?
పద్మనాభంగారంటే నాకు చాలా ఇష్టం. కమెడియన్‌గా ఎంత నవ్వించారో... హీరో దగ్గర్నుంచి నెగిటివ్ రోల్స్ వరకూ అన్ని రకాల పాత్రలూ చేసి అంతగానూ అలరించారాయన. అలాగే రేలంగిగారు, రాళ్లపళ్లిగారు అన్నా ఎంతో ఇష్టం.
     
ఫలానా దర్శకుడితో చేయాలి అన్న కోరికేమైనా ఉందా?
అలా ఏం లేదు. తేజ నన్ను పరిచయం చేశారు. ఇప్పటి వరకూ తన ప్రతి సినిమాలో చాన్స్ ఇస్తూనే ఉన్నారు. అలాగే మిగతా దర్శకులు కూడా నాకు సరిపోయే పాత్ర ఉంటే పిలిచి ఇస్తున్నారు. అలాంటప్పుడు ఒక్క దర్శకుడి పేరు ఎలా చెబుతాను! నాకు అందరూ ముఖ్యమే. ఎవరన్నా గౌరవమే. అందరూ నన్ను ప్రోత్సహించి నడిపిస్తున్నవారే కదా!
     
మీ డ్రీమ్ రోల్...?
ఎప్పుడూ నవ్విస్తూ ఉండే నాకు ఓ మంచి నెగిటివ్ రోల్ చేసి... నాలోనూ ఓ సీరియస్ నటుడున్నాడని చూపించాలని ఉంది.
     
చాలామంది కమెడియన్లు హీరోలవుతున్నారు. మీకూ అలాంటి కోరికేదైనా...?
అస్సలు లేదు. ఉన్నదాంతో తృప్తిపడే తత్వం నాది. మధ్యలో అవకాశాలు తగ్గి ఓ సంవత్సరం గ్యాప్ వచ్చినప్పుడు కూడా నిరాశపడలేదు. ఈసారి వచ్చే అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని, మళ్లీ ఒక్కో మెట్టూ ఎదగాలనుకున్నాను. నేనేది చేయగలనో, నాకేది తగునో అవే చేస్తాను తప్ప ఎక్కువ ఆశలు పెట్టుకోను.
 - సమీర నేలపూడి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement