అమ్మ మనసు
జ్ఞాపకం
పదవ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై, తిరుపతి శ్రీ వేంకటేశ్వరా జూనియర్ కాలేజీలో ఇంటర్‌లో చేరాను. ఒకరోజు అమ్మతో, ‘‘అమ్మా! ప్రతిరోజూ మనవూరి నుండి పదిమైళ్ల దూరం నడచి తిరుపతికి పోయి చదువుకొని రావాలంటే చాలా కష్టంగా ఉంది. నాతో చదివే పిల్లలంతా అక్కడే హాస్టల్లో చేరి చదువుకొంటు న్నారు. నన్ను కూడా హాస్టల్లో చేర్పించం డమ్మా! మనకు బియ్యం కార్డు కూడా ఉంది కాబట్టి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉచితంగా సీటు ఇస్తారు’ అని చెప్పాను. అమ్మ, నాన్న ఎలాగో కష్టపడి నాకు హాస్టల్లో సీటు సంపాదించారు.
నేను హాస్టల్లో ఉంటూ వారానికి ఒకసారి మా వూరికి వెళ్లి వస్తూండేవాణ్ని. మా పల్లెలో ఓ టూరింగు టాకీస్ ఉండేది. ఆదివారం ఊరెళ్లగానే స్నేహితులతో కలసి సినిమాకి వెళ్లేవాడిని. సోమవారం ఉదయం కాలేజీకి వెళ్లిపోయేవాణ్ని. నాన్నకది నచ్చేది కాదు. ‘‘వారానికి ఒక్కసారి వస్తావు. ఓ నిముషం కూడా ఇంట్లో ఉండకుండా, స్నేహితులతో సినిమాలకెళ్తావు. ఇక్కడే ఇలా ఉంటే, తిరుపతిలో ఎలా ఉంటున్నావో’’ అన్నాడు ఓరోజు. దాంతో నేను అలిగి ‘‘ఇక నేను వారం వారం రాను, నెలకో సారి వస్తాను’’ అని చెప్పి వెళ్లిపోయాను.
మరుసటి ఆదివారం నేను ఇంటికి రాకపోయేసరికి సోమవారం ఉదయాన్నే అమ్మ నన్ను కలవడానికి తిరుపతికి బయలుదేరింది. ఎలాగో కాలేజీ కను క్కుని, కాలేజీ గేటు దగ్గరకు చేరి వచ్చే పోయే పిల్లలందర్నీ నా గురించి అడు గుతూ ప్రాధేయపడుతోంది. మీ పిల్లోడు ఏం చదువుతున్నాడని అడిగితే చెప్పలే కుంది. ‘నా బిడ్డను చూడాలయ్యా’ అని ఏడుస్తోంది. ఉదయం పది గంటల్నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే అన్నం, నీళ్లు లేకుండా ఆక్రోశిస్తూ ఉంది.
ఇంతలో మావూరి విద్యార్థి, నా మిత్రుడైన చంద్ర అమ్మను గుర్తుపట్టాడు. తనని తీసుకుని హాస్టల్‌కొచ్చాడు. నన్ను చూడగానే అమ్మ కళ్లు జలపాతాల య్యాయి. ‘‘నిను చూడకుండా ఈ అమ్మ ఎలా బతకాలిరా, నువ్వు నాతో రాకుంటే నేను వెళ్లను’’ అని భీష్మించి కూర్చుంది. నా తోటి విద్యార్థులంతా అమ్మ పడే వేదన చూసి చలించిపోయారు. నాకైతే కన్నీళ్లు ఆగలేదు. ఇక జన్మలో అమ్మా నాన్నల్ని బాధ పెట్టకూడదని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను!
- ఆనంద్, మదనపల్లి