అక్కయినా అమ్మలా చూస్తుంది!
రిలేషణం
చెల్లెళ్లందరూ అక్కయ్యలను అనుకరిస్తూ ఉంటారు. అక్క కంటే ఎక్కువ మార్కులు కొట్టేయాలనుకుంటారు. అనీషా కూడా చిన్నతనంలో అలానే చేసింది. కానీ ఇప్పుడు అలా చేయలేనంటుంది. అక్కయ్య అంటే ఎంత ఇష్టమున్నా ఆమె మార్గంలో నడిచే ఉద్దేశం తనకు లేదని చెప్పేసే అనీషా... అందాల భరిణె దీపికా పదుకొనే చెల్లెలు. అక్కయ్యతో పెనవేసుకున్న అనుబంధం గురించి అనీషా చెబుతోన్న కబుర్లు...
అక్కకీ నాకూ అయిదేళ్లు తేడా. ఎంత కొట్టుకునేవాళ్లమంటే... ఆ తర్వాత అమ్మ మమ్మల్ని కొట్టకుండా కంట్రోల్ చేసుకోలేనంత అల్లరి చేసేవాళ్లం. చాక్లెట్లు, బొమ్మల కోసం యుద్ధాలు చేసేవాళ్లం. అయిదేళ్ల గ్యాప్ మరీ ఎక్కువేమీ కాదు కదా! అందుకే ఒకరినొకరు అర్థం చేసుకునేంత పరిణతి ఇద్దరికీ ఉండేది కాదు. అందుకే తగాదాలు పడేవాళ్లం. పోటీ పడేవాళ్లం. అయితే కాలం గడిచేకొద్దీ, వయసు పెరిగేకొద్దీ అక్కలో చాలా మార్పు వచ్చింది. నన్ను చూసుకోవడం తన బాధ్యత అన్నట్టుగా తను మారిపోయింది.
అక్క చాలా కేరింగ్‌గా ఉంటుంది. అవతలివాళ్ల మనసు తెలుసుకుని ప్రవర్తించడం తన నైజం. ఇతరుల విషయంలోనే అలా ఉంటే, ఇంట్లోవాళ్ల విషయంలో ఇంకెలా ఉంటుంది! ఇక నన్ను చూసుకోవడంలో తను అమ్మతో పోటీపడేదంటే అతిశయోక్తి కాదు. బయటకు వెళ్లినప్పుడు చేయి వదిలేది కాదు. ఎప్పుడూ కాచుకుని ఉండేది. అవన్నీ తలచుకుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది... అలాంటి అక్క నాకు ఉన్నందుకు!
నాన్న రక్తం మా ఇద్దరినీ క్రీడల వైపు నడిపించింది. ఇద్దరం మొదట ఆటల మీదే దృష్టి పెట్టాం. కానీ అక్కకి నటి అవ్వాలని రాసిపెట్టి ఉన్నట్టుంది. నేనేమో అంతర్జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని కావాలని కలలు కన్నాను. అది తప్ప దేనిమీదా ఆసక్తి లేదు నాకు. సినిమాలంటే అస్సలు పడవు మనకి. మేకప్పులు, కాల్షీట్లు, షెడ్యూళ్లు... నాకు సూటయ్యే విషయాలు కావు. అందుకే నన్ను ఎవరైనా ‘నువ్వు కూడా నటివవుతావా’ అని అడిగితే అక్క నవ్వేస్తుంది. నేనేం సమాధానం చెబుతానో తనకి తెలుసు కదా!
అక్కయ్యకి నేను అన్ని విషయాలూ చెబుతాను. తన సలహా తీసుకోకుండా ఏ పనీ చేయను. నాకు తన సాయం అవసరమైన ప్రతిసారీ తను నాకు ఉంది. ఏ రోజూ అక్క లేదే, ఎలా అని బాధపడే పరిస్థితి రాలేదు. తనలో నచ్చే మరో విషయం... తొణకకపోవడం. తనపై వచ్చే గాసిప్స్ చూసి మేం కంగారుపడతామేమో కానీ, తను మాత్రం రియాక్ట్ అవ్వదు. అలా ఉండటం ఓ ఆర్ట్. అది అక్కకి బాగా వచ్చు!
నేను తన సినిమాలన్నీ చూస్తాను. ఓం శాంతి ఓం, కాక్‌టెయిల్, కార్తీక్ కాలింగ్ కార్తీక్, యే జవానీ హై దివానీ, లవ్ ఆజ్‌కల్ చిత్రాల్లో తన నటన బాగుంటుంది. ‘లఫంగే పరిందే’ అయితే సూపర్బ్. అంధురాలిగా ఎంత అద్భుతంగా నటించిందో! తనని నేను దారుణంగా విమర్శిస్తాను. ‘మొన్నటికి మొన్న... చెన్నై ఎక్స్‌ప్రెస్’ నాకసలు నచ్చలేదు అన్నాను. నవ్వేసింది. తనెప్పుడూ అంతే. దేనికీ నొచ్చుకోదు. విమర్శలను సైతం నవ్వుతూ స్వీకరిస్తుంది. సలహాలు చిన్నవాళ్లు ఇచ్చినా పాటిస్తుంది. ఆ స్వీట్‌నెస్ అంటే నాకు ఇష్టం. అంత స్వీట్‌గా ఉండే మా అక్కంటే ఇంకా ఇష్టం!
అనీషాకి నిజాయతీ ఎక్కువ. మనసులో ఒకటి పెట్టు కుని, పైకి ఒకటి మాట్లాడటం తనకు చేతకాదు. మంచయినా, చెడయినా ముఖమ్మీదే చెప్పేస్తుంది. అందుకే నాకు అనిపిస్తుంది... తనకు సినీ పరిశ్రమకు సూట్ కాదని. తనకి కూడా పెద్ద ఆసక్తి లేదనుకోండి. తనకి ఆటలే ప్రపంచం. తనకేది ఆనందమో.. అదే మాకు ఆనందం.
- దీపిక