
బ్లడ్‌గ్రూప్స్ ఒక్కటి కాకపోతే..?
రక్తకణాల పై పొరలో రీసస్ ఫ్యాక్టర్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది ఉంటే ఆ గ్రూపును పాజిటివ్ అంటారు. పదిహేను శాతం మందిలో ఆ ప్రొటీన్ ఉండదు. వారి గ్రూపును నెగిటివ్ అంటారు. .
నా వయసు 34. నాకు ఈ మధ్య యోని దగ్గర చాలా దురదగా ఉంటోంది. దానివల్ల చాలా అనీజీగా ఫీలవుతున్నాను. నిజానికి నేను ఎప్పుడు యూరిన్‌కి వెళ్లినా వెంటనే క్లీన్ చేసేసుకుంటాను. అయినా ఇలా ఎందుకవు తోంది... పరిష్కారం చెప్పండి.
- రోహిణి, మెయిల్
మీకు పెళ్లయిందో లేదో రాయలేదు. అలాగే తెల్లబట్ట అవుతుందో లేదో కూడా తెలియజేయలేదు. యోని దగ్గర దురద రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఫంగల్, బ్యాక్టీరియల్, ట్రైనో మోనియల్, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల ఈ సమస్య ఏర్పడవచ్చు. కొంతమందికి దురదతో పాటు పెరుగులాగా చిక్కగా లేక నురుగులాగా డిశ్చార్జి అవుతుంది. చెడు వాసన కూడా ఉంటుంది. కొంతమందికి అయితేలో దుస్తుల వల్ల అలర్జీ వచ్చి దురద రావచ్చు. బిగుతుగా ఉండే లో దుస్తులు, జీన్స్ ప్యాంట్లు వంటివి ధరించడం వల్ల అక్కడ చెమట పట్టి, గాలి ఆడక ఇన్ఫెక్షన్లు వస్తాయి.
అలాగే రాపిడి వల్ల కూడా దురద, మంట ఉండవచ్చు. బరువు ఎక్కువగా ఉండి, ఎక్కువగా నడుస్తూ ఉండేవారికి తొడలు రాసుకోవడం జరుగుతుంది. అది మాత్రమే కాక... కొందరు ఆ భాగాన్ని మరీ ఎక్కువగా శుభ్రం చేసేస్తూ ఉంటారు. సోప్, డెటాల్, సావలాన్ వంటి యాంటీ సెప్టిక్‌లు ఎక్కువగా వాడేస్తుంటారు. దానివల్ల యోని భాగంలో ఉండే ల్యాక్టోబ్యాసిలై అనే మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. దాంతో ఎక్కువగా ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. కాబట్టి మీరు ఓసారి గైనకాలజిస్టును సంప్రదిస్తే మీకు వీటిలో ఏ కారణాల వల్ల ఈ సమస్య ఏర్పడిందో కనిపెట్టి, తగిన చికిత్స చేస్తారు.
నా వయసు 23. నేనొక అబ్బాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటానన్నాడు కదా అని శారీరకంగా దగ్గరయ్యాను. కానీ అతను నన్ను మోసగించి వేరే అమ్మాయిని చేసుకున్నాడు. ఇప్పుడేమో మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. అయితే నేను పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే నా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసినప్పట్నుంచీ నా యోని ద్వారం దగ్గర పుండులా అయిపోయింది. మందుల షాపులో ఏవో మందులు అడిగి వేసుకుంటే తగ్గింది కానీ మళ్లీ వచ్చింది. పెళ్లి చేసుకుంటే దాని గురించి నా భర్తకి తెలిసిపోతుందేమోనని చాలా భయంగా ఉంది. నా సమస్య ఎలా తీరుతుంది? నేనేం చేయను?
- ఓ సోదరి, మంచిర్యాల
పెళ్లి కాకుండా ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడం మంచిది కాదు. గర్భం దాల్చినా, సుఖవ్యాధులు అంటుకున్నా ఎంత ప్రమాదం! మీకు కచ్చితంగా ఏదో ఒక వ్యాధి వచ్చిందని నేను చెప్పలేను. ఎందుకంటే కొన్నిసార్లు వ్యక్తిగత శుభ్రత లేకపోయినా కూడా జననేంద్రియాల దగ్గర చెమట చేరి కురుపులు రావొచ్చు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నా కూడా యోని ద్వారం దగ్గర ఇన్ఫెక్షన్లు ఏర్పడి, ఇలా కురుపులు వస్తూంటాయి. కాబట్టి ఓసారి గైనకాలజిస్టును సంప్రదించి ఎయిడ్స్ పరీక్షతో పాటు హెమోగ్లోబిన్ వంటి రక్త పరీక్షలు కూడా చేయించుకోండి. కారణం తెలిశాక చికిత్స తీసుకోవచ్చు.
నా వయసు 21. నాకు ఈ మధ్యనే పెళ్లి కుదిరింది. అప్పట్నుంచీ ఓ అనుమానం నన్ను బాగా వేధిస్తోంది. వేర్వేరు బ్లడ్ గ్రూప్స్ ఉన్నవాళ్లు శారీరకంగా కలిస్తే సమస్యలు వస్తాయని ఎక్కడో చదివాను. అది నిజమేనా? నా బ్లడ్‌గ్రూప్ ఎ పాజిటివ్. నేను ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తినైనా పెళ్లి చేసుకోవచ్చా? లేక నా గ్రూప్ ఉన్న వ్యక్తినే చేసుకోవాలా? నాది పాజిటివ్ కదా... ఒకవేళ తనది నెగిటివ్ అయితే ఏమైనా సమస్యలు వస్తాయా?
- మంజూష, గుంటూరు
రక్తకణాల పై పొరలో రీసస్ ఫ్యాక్టర్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది ఉంటే ఆ గ్రూపును పాజిటివ్ అంటారు. పదిహేను శాతం మందిలో ఆ ప్రొటీన్ ఉండదు. వారి గ్రూపును నెగిటివ్ అంటారు. దంపతులిద్దరి రక్తాల గ్రూపులూ వేర్వేరు అయినా ఏ సమస్యా ఉండదు. ఇద్దరివీ పాజిటివ్ అయినా ఏ సమస్యా ఉండదు. కానీ ఒక్కోసారి అమ్మాయిది నెగిటివ్, అబ్బాయిది పాజిటివ్ గ్రూప్ అయితే మాత్రం పుట్టబోయే బిడ్డకు రక్తహీనత, కామెర్లు, కడుపులో ఉండగానే నీరు చేరడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. కొన్నిసార్లు బిడ్డ కడుపులోనే చనిపోవచ్చు కూడా. అదే అమ్మాయిది పాజిటివ్ అయ్యి, అబ్బాయిది నెగిటివ్ అయితే మాత్రం ఎలాంటి సమస్యా ఉండదు. మీది ఎలాగూ పాజిటివ్ కాబట్టి మీరు చేసుకోబోయే అబ్బాయిది నెగిటివ్ అయినా, పాజిటివ్ అయినా ఎటువంటి సమస్యా రాదు. ధైర్యంగా ఉండండి.
- డా॥వేనాటి శోభ