
పంచామృతం: ఆత్మ బంధువులు..!
అనుకోకుండా భారతదేశంతో అనుబంధాన్ని ఏర్పరుచుకొన్నారు.. ఆసక్తికరమైన రీతిలో ఆ బంధాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఈ దేశం గొప్పదనమో..
అనుకోకుండా భారతదేశంతో అనుబంధాన్ని ఏర్పరుచుకొన్నారు.. ఆసక్తికరమైన రీతిలో ఆ బంధాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఈ దేశం గొప్పదనమో.. వాళ్ల గొప్పదనమో కానీ... సేవాదృక్పథంతో కొనసాగుతోంది ఆ అనుబంధం. అందుకే వీళ్లను మన వాళ్లే అనుకోవచ్చు! ఆత్మబంధువులని చెప్పవచ్చు!
బ్రెట్ లీ...
ఈ ఆస్ట్రేలియన్ సూపర్‌ఫాస్ట్ బౌలర్ మైదానంలో భారతీయ క్రికెట్‌టీమ్ అభిమానులను బాధపెట్టిన వాడే అయినా... భారత్ అంటే ప్రత్యేకాభిమానం చూపడం ద్వారా ఇష్టుడిగా మారాడు. సంగీతం అంటే ప్రత్యేక ఆసక్తి కలిగి ఉన్న లీ... లతా మంగేష్కర్‌తో కలిసి ఒక ఆల్బమ్‌తో స్వరకల్పన చేశాడు. ముంబైలోని అనాథ ఆశ్రమాలతో కలియదిరుగుతుంటాడు లీ. కొన్ని స్వచ్ఛంద సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.
ప్రిన్స్ చార్లెస్
బ్రిటన్ యువరాజు పెద్దగా మీడియా హడావుడి కూడా లేకుండా భారత్ వచ్చి వెళుతూ ఉంటాడు. తమ దేశంలోని స్వచ్ఛంద సంస్థలు భారత్‌లో సాగించే సేవాకార్యకలాపాలకు అండగా ఉంటాడు ప్రిన్స్. భారతదేశ పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉన్న ప్రిన్స్ ప్రత్యేకంగా విద్య, ఆరోగ్యం విభాగాలపై దృష్టి నిలిపిపనిచేయాలని చారిటబుల్ ట్రస్ట్‌లకు సూచిస్తుంటాడు.
మిషెల్ ఒబామా...
భారతీయ సంస్కృతితో తాను ప్రేమలో పడ్డానని ప్రకటించుకొంది అమెరికన్ ఫస్ట్ లేడీ మిషెల్ ఒబామా. అమెరికా అధ్యక్షుడైన భర్త బరాక్ ఒబామా తొలిసారి భారత పర్యటనకు వచ్చినప్పుడు..మిస్టర్ ఒబామా భారతీయ ప్రముఖులతో వాణిజ్య వ్యవహారాల గురించి చర్చలు జరపగా.. మిసెస్ ఒబామా మాత్రం వివిధ స్వచ్చంధ సంస్థలతో మమేకం అయ్యారు. వాళ్లతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకొన్నారు. అప్పట్లో పరిచయం అయిన వివిధ స్వచ్ఛంద సంస్థలవారితో ఇప్పటికీ మిషెల్‌సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. వాళ్లకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తూ తన ప్రత్యేకతను నిరూపించుకొంటున్నారు మిషెల్.
స్టీవ్ వా...
ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ మాజీకెప్టెన్‌కు కోల్‌కతాలో అభిమాన సంఘాలే ఉన్నాయి! 1986లో తొలిసారి టీమ్‌తో పాటు భారత పర్యటనకు వచ్చిన వా.. కోల్‌కతాలోని ఒక ఆశ్రమంలో ఉన్న కుష్టువ్యాధి గ్రస్తులైన పిల్లలను చూసి చలించిపోయాడు. అప్పటి నుంచి వాళ్ల సంరక్షణను చూస్తున్న వారికి ఆర్థికంగా అండగా నిలవడమే కాకుండా.. అనాథల్లా పెరుగుతున్న ఆ పిల్లలకు ఆలంబనగా మారాడు. ప్రత్యేకించి కోల్‌కతా నగరం మీదే దృష్టి నిలిపిన స్టీవ్ తరచూ అక్కడికి వస్తూ కొన్ని అనాథ ఆశ్రమాల బాలురతో సరదాగా క్రికెట్ ఆడుతూ అలరిస్తూ ఉంటాడు.
రఫెల్‌నాదల్..
ఈ స్పెయిన్ టెన్నిస్ బుల్.. మన దేశంలో టెన్నిస్ అభివృద్ధికి సహకారం అందిస్తున్నాడు. అనంతపురం జిల్లాలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఒక స్పెయిన్ సంస్థతో కలిసి టెన్నిస్ అకాడమీని నెలకొల్పే ప్రయత్నాల్లో ఉన్నాడు. వారికి నాదల్‌తో ఉన్న సంబంధాలు అతడికి భారత్‌తో అనుబంధం ఏర్పరిచాయి.