రోటీ బ్యాంకు!
మార్గం ఎప్పుడూ ఉంటుంది. ఉండాల్సింది మనసే!
మనసున్న ఆ యువకులు ఆకలితో అలమటించే వాళ్ల కడుపులు నింపాలనుకున్నారు. అది చిన్న విషయమేమీ కాదు. ఎంత ఖర్చవుతుందో వాళ్లకి తెలుసు.
అయినప్పటికీ వాళ్లు ఖర్చుకు భయపడలేదు.
‘మా కోరిక సాధ్యపడుతుందా?’ అని ఒకటికి పదిసార్లు ఆలోచించలేదు. మనసు ఉంది... మార్గం తెరుచుకుంది. ఆ మార్గమే... ‘రోటీ బ్యాంక్’!
రోటీ బ్యాంకు అంటే ఒక చల్లని నీడ. పేదోళ్ల కంటిపాప. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా వెనకబడిన జిల్లా. ఈ జిల్లా కేంద్రంలో సౌకర్యాలు, అభివృద్ధి మాట అలా ఉంచి... ఏ మూల చూసినా పేదరికం ఉట్టిపడుతున్నట్లు ఉంటుంది. అన్ని పక్కల్నుంచీ ఆకలికేకలు వినిపిస్తున్నట్లుగానే ఉంటుంది. ఈ పరిస్థితికి చలించిన ఐదుగురు యువకులు... అన్నార్తుల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో ఒక బృందంగా ఏర్పడ్డారు. వారికి మరో అయిదుగురు తోడయ్యారు. ఆ అయిదుగురికి ఇంకో అయిదుగురు... ఇలా మొత్తం నలభై మంది యువకులు ఒక బృందంగా ఏర్పడ్డారు. రోటీ బ్యాంకును స్థాపించారు.
ఈ బృందంలోని యువకులు రోజూ పట్టణమంతా తిరుగుతూ ధనికులు, మధ్యతరగతి కుటుంబాల నుంచి రొట్టెలను, కూరలను సేకరిస్తారు. ప్రతి ఇంటి నుంచి రెండు రొట్టెలు సేకరించాలని నియమంగా పెట్టుకున్నారు. నిజానికి ఇలా సేకరించడం మొదట కష్టంగా ఉండేది. కొందరు రేపుమాపు అని తప్పించుకునే వారు. మరి కొందరు ‘‘ ఈ రొట్టెలను ఎక్కడైనా అమ్ముకుంటారా ఏమిటి?’’ అని అనుమానంగా ప్రశ్నించేవాళ్లు. కొందరైతే వాసన వచ్చే నిల్వ రొట్టెలు ఇచ్చేవారు. అయినా కూడా బృంద సభ్యులు నిరాశ పడలేదు. వెనక్కి తగ్గాలనుకోలేదు.
తమ ఆలోచన గురించి, ఆశయం గురించి ఓపిగ్గా చెప్పడం ప్రారంభించారు. మెల్లగా అందరిలోనూ కదలిక వచ్చింది. ప్రతి ఇంటివారూ రెండు తాజా రొట్టెలను ఇవ్వడం ప్రారంభించారు. స్థానిక పత్రికల ద్వారా రోటీ బ్యాంకు గురించి అందరికీ తెలిసింది. ఇక అపార్థాలు బంద్. మూతివిరుపులు బంద్. పాచి రొట్టెలు, పనికి రాని రొట్టెలు ఇవ్వడం బంద్.
పట్టణాన్ని ఎనిమిది భాగాలుగా విభజించి ఆయా ప్రాంతాలకు సంబంధిం చిన బాధ్యతలను పంచుకున్నారు ఈ నలభైమంది యువకులు. మెల్లగా ‘రోటీ బ్యాంక్’లో రొట్టెల సంఖ్య రోజురోజుకూ పెరగడం ప్రారంభించింది. ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి పొందడం మొదలైంది. రొట్టెలు ఇవ్వలేనివారు పిండి ఇస్తే, దానితో వాలంటీర్లు రొట్టెలు చేసి పంచుతుంటారు.
చిన్నగా మొదలైన ‘రోటీ బ్యాంకు’ ఇప్పుడు ఒక ఉద్యమంగా మారి రోజూ నాలుగు వందల మంది ఆకలి తీరుస్తోంది. రైల్వేస్టేషన్ ముందు కనిపించే యాచకులు, చెత్త ఏరుకునే వాళ్ల నుంచి మొదలు... ఆస్పత్రిలో బీద పేషెంట్ల వరకు ఈ ‘రోటీ బ్యాంకు’ ఎందరి ఆకలినో తీరుస్తోంది. అరవై ఏళ్ల రామ్‌ప్రకాశ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దాంతో ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నాడు. అతడి పరిస్థితిని అర్థం చేసుకున్న ‘రోటీ బ్యాంకు’ ప్రతిరోజూ అతడి ఆకలిని తీరుస్తోంది.
ఇరవై నాలుగేళ్ల సురేష్ నిరుద్యోగి. రోజంతా ఉద్యోగం కోసం ఎక్కడెక్కడో ప్రయత్నిస్తుంటాడు. ఎక్కడికి వెళ్లినా కాలినడకనే వెళ్లే సురేష్ దగ్గర చిల్లర డబ్బులు కూడా ఉండవు. అతడి ఆకలినీ తీరుస్తోంది రోటీ బ్యాంక్. ఇంతమంది కడుపులు నింపుతోన్న రోటీ బ్యాంక్ అంటే మహోబాలోని వారికి, ఆ చుట్టు పక్కల ప్రాంతాల వారికీ ఎంతో గౌరవం. ‘‘ఆ యువకులను... పేదవాళ్ల కోసం దేవుడు పంపించాడు’’ అంటాడు కృతజ్ఞత నిండిన కంఠంతో రామ్‌ప్రకాశ్.
‘‘రోటీబ్యాంక్ అనేది లేకుంటే ఆకలితో చనిపోయేవాడిని’’ అంటాడు సురేష్. ‘‘ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఒక్కటే. దయచేసి మా బ్యాంకుకు తాజా రొట్టెలను మాత్రమే ఇవ్వండి’’ అంటు న్నాడు ‘రోటీ బ్యాంకు’ సభ్యుడైన హాజీ మహ్మద్. మరిన్ని నగరాలలో ‘రోటీ బ్యాంక్’ కేంద్రాలను ఏర్పాటు చేయాలనేది నలభైమంది యువకుల ఆశయం. వారి ఆశయం త్వరగా ఫలించాలని ఆశిద్దాం!