సాంకేతికం: స్మార్ట్‌ఫోన్లను నడిపించే నావ ‘ఓఎస్’
మార్కెట్లో ఎన్ని ఫోన్లు.. ఎన్ని ట్యాబ్లెట్లు. వీటన్నింటినీ వరుసగా పేర్లు చదివినా కూడా కనీసం ఒక రోజు పడుతుందేమో. ఒకప్పుడు ఫోనంటే ఏ నోకియోనో, మోటారోలోనో ఉండేది. ఇపుడు వందల కొలదీ కంపెనీలు, వేలకొలదీ మోడళ్లు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలన్నీ మార్కెట్లోకి వచ్చాయి. మరి ప్రతి కొత్త ఫోను ప్రత్యేక ఫీచర్లతో తయారుచేయడం ఎంత కష్టం. ఎంత వృథా శ్రమ... దీనికి ఓ పరిష్కారం అంటూ ఏం లేదా అని వెతికితే దొరికిందే ఆపరేటింగ్ సిస్టమ్స్, వాటి ఆధారంగా నడిచే స్మార్ట్ ఫోన్స్. ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా అత్యధికులు స్మార్ట్ ఫోన్లనే వాడుతున్నారు. మరి ఈ స్మార్ట్‌ఫోన్లను నడిపించే ఆపరేటింగ్ సిస్టమ్స్, వాటి ఆదరణ గురించి క్లుప్తంగా వివరించే ప్రయత్నమిది.
ఇపుడు ‘ఫోన్ ఏ కంపెనీ’ అని అడగరు... ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్) ఏది అని అడుగుతారు. ఒకే ఓఎస్‌పై నడిచే ఏ కంపెనీ ఫోను వాడకం అయినా ఒకేవిధంగా ఉంటుంది. లక్షల కొలదీ ఫోన్లున్నా ఓఎస్‌లు కేవలం పదుల సంఖ్యలోనే ఉన్నాయి. వాటిలోనూ అత్యధిక ఆదరణ పొందిన ఓఎస్‌లు ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, బ్లాక్‌బెర్రీ. వీటి తర్వాత ప్రపంచానికి కాస్త పరిచయం ఉన్న ఓఎస్‌లు ఫైర్‌ఫాక్స్, సింబియాన్, ఉబుంటు, టైజైన్, బడా, బ్రూ. బాగా ప్రాచుర్యం పొందిన మొదటి నాలి గింటి గురించి తెలుసుకుందాం.
ఆండ్రాయిడ్
ఈ ఓఎస్ అన్ని దేశాల్లో అత్యధిక ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం 70 శాతానికి పైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ ఓఎస్‌నే వాడుతున్నారు. ఒక్క యాపిల్ కంపెనీ తప్ప అన్ని కంపెనీలు ఈ ఓఎస్ ఆధారంగా పనిచేసే ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. ఆండ్రాయిడ్ అనే కంపెనీ దీన్ని రూపొందించినా ప్రస్తుతం గూగుల్ కంపెనీ టేకోవర్ చేసింది. ఈ ఓఎస్ మీద పనిచేసే యాప్స్ (అప్లికేషన్స్) ‘గూగుల్ ప్లే’లో దొరుకుతాయి. ఫోన్ కొనేటపుడే వచ్చిన యాప్స్‌ను కూడా గూగుల్ ప్లే ద్వారా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇప్పటివరకు సుమారు ఏడు లక్షల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికపుడు ఆండ్రాయిడ్‌కు మార్పులు చేస్తూ కొత్త వెర్షన్లు విడుదల చేస్తున్నారు. ఇంతవరకు విడుదలైనవి... డోనట్, ఎక్లెయిర్, ఫ్రయో, జింజర్‌బ్రెడ్, హనీకోంబ్, ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్, జెల్లీ బీన్. ఒక విషయం గమనించారా ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో విడుదలయ్యాయి. డి, ఇ, ఎఫ్, జి, హెచ్, ఐ, జె... రాబోయే వెర్షన్ ‘కె’తో రానుండటం విశేషం. అది కీ లైమ్ పై. ఇవన్నీ తిండిపదార్థాల పేర్లు!
ఐఓఎస్
ప్రపంచానిది ఒక దారైతే యాపిల్‌ది ఒకదారి. కంప్యూటర్ల తయారీలోనే వైవిధ్యం చూపించిన ఈ కంపెనీ మొబైల్ ఫోన్ల తయారీలోనూ తన మార్కును చాటుకుంది. ఖరీదైన వర్గంలో ఉండే ఈ ఫోన్ల కంపెనీ తనే సొంతంగా ఐఓఎస్ అప్లికేషన్ కూడా సృష్టించుకుంది. ఐప్యాడ్లు, ఐఫోన్లలలో మాత్రమే ఈ ఓఎస్ ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్లు ఐస్టోర్‌లో దొరుకుతాయి. ఇది ఫోన్లతో పాటే అప్‌గ్రేడ్ అవుతూ వస్తుంది. లేటెస్ట్ వెర్షన్ అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశమూ ఉంది. 2007లో ఇది విడుదలైంది. దీని లేటెస్ట్ వెర్షన్ ‘ఐఓఎస్ 7.1’. ఐవోఎస్ వినియోగదారులు తక్కువే ఉన్నా కూడా ఆండ్రాయిడ్‌లో దొరికే దాదాపు అన్ని అప్లికేషన్లు ఇందులో దొరకడం విశేషం.
విండోస్ ఫోన్
ఇది మైక్రోసాఫ్ట్ తయారుచేసిన మొబైల్ ఓఎస్. దీనిని ఎక్కువగా నోకియా ఫోన్లో వాడుతున్నారు. 2010లో మార్కెట్లోకి వచ్చిన విండోస్ ఫోన్ ఓఎస్ ఇప్పటికింకా మూడు వెర్షన్లే విడుదల చేసింది. అవి విండోస్ ఫోన్ 7, విండోస్ ఫోన్ 8, విండోస్ ఫోన్ 8.1. ఇందులో వాడే అప్లికేషన్లు థర్డ్ పార్టీవి వేరు, కంపెనీవి వేరు, మ్యూజిక్ అప్లికేషన్లు వేరు. విండోస్ ఫోన్ స్టోర్, ఎక్స్ బాక్స్ మ్యూజిక్, అప్లికేషన్స్ అండ్ గేమ్స్. ఇందులో ప్రస్తుతం 2 లక్షల యాప్స్ ఉన్నాయి.
బ్లాక్ బెర్రీ ఓఎస్
కెనడాకు చెందిన మొబైల్ ఫోన్ల ఉత్పత్తి దారు బ్లాక్‌బెర్రీ తయారుచేసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఇది. ఆండ్రాయిడ్‌లాగే ఇది కూడా ఓపెన్ ఫ్లాట్ ఫారం. బ్లాక్‌బెర్రీ ఫోన్లకోసం ఎక్స్‌క్లూజివ్‌గా ఆ కంపెనీ తయారుచేసిన ఓఎస్ ఇది. అయితే, ఎవరైనా యాప్స్ క్రియేట్ చేయొచ్చు. దీంతో దీనికి కూడా మంచి ఆదరణ దక్కుతోంది. థర్డ్ పార్టీ అప్లికేషన్లకు భారీ నిబంధనలు లేవు. ఇందులో యాప్స్ కావాలంటే ‘బ్లాక్‌బెర్రీ వరల్డ్’ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది ఐస్టోర్, గూగుల్ ప్లే వంటిది. బ్లాక్‌బెర్రీ తొలి వెర్షన్ 1999లోనే విడుదలైంది. బ్లాక్‌బెర్రీ 10ఓఎస్ లేటెస్ట్ వెర్షన్.