మా ఇల్లొక ప్రయోగశాల!
మహిళా విజయం
బాలామణి పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లో. ఆమెకు రంగుల అద్దకపు అందం తెలిసింది అత్తారింట్లో. చేనేత కుటుంబం కావడంతో ఇంట్లో అందరూ నిష్ణాతులే. ఆ ఇంటి మగ్గాలకు ఇరుసుగా మారిన మహిళ విజయగాథ ఇది.
మా అత్తవాళ్ల కుటుంబానిది చేనేతతో విడదీయలేని బంధం. ఇకత్ నేతలో నిష్ణాతులు. గోల్కొండ నవాబులకు వస్త్రాలు నేసేవారు. అప్పట్లో వస్త్రాలకు సహజ రంగులే వాడేవారు. కృత్రిమ రంగుల ధాటికి అవి కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. సహజరంగుల తయారీ శ్రమతో కూడినది. కేటాయించాల్సిన సమయమూ ఎక్కువే. దాంతో తయారీ ఖర్చులు పెరుగుతాయి. సంపన్నవర్గాల దృష్టి వీటి మీద పడటంతో మళ్లీ సహజరంగులు అద్దిన బట్టల అమ్మకాలు పెరుగుతున్నాయి.
నేచురల్ కలర్స్‌కి ముడిసరుకు బేగంబజార్‌లో దొరుకుతుంది. చెట్ల బెరడు, పండ్ల తొక్కలు, పూలరెక్కలు వంటివన్నీ ఎండబెట్టి అమ్ముతారు. పొడులు కూడా దొరుకుతాయి కానీ కల్తీ ఉంటుందేమోననే సందేహంతో నేను యథాతథంగా కొని మర పట్టించుకుంటాను. ఇండిగో మాత్రం చెన్నై నుంచి తెప్పిస్తాను.
ఈ యూనిట్ నడపాలంటే పారే నీటి సౌకర్యం ఉండి తీరాలి. గతంలో గండిపేట, కాప్రా, దుర్గం చెరువుల్లో అద్దిన వస్త్రాలను శుభ్రం చేసేవాళ్లం. ఇప్పుడవీ కలుషితమయ్యాయి. ఇంట్లోనే సొంతబావి ఉండటంతో పెద్ద సిమెంటు తొట్టి, నీరు ప్రవహించే ఏర్పాటు చేసుకున్నాను. మా యూనిట్‌లో నాతోపాటు మా తోడికోడళ్లు శ్రీలత, సంగీత కూడా చురుగ్గా పాల్గొంటారు. మాది ఉమ్మడి కుటుంబం కావడమే ఈ యూనిట్‌ని సమర్థంగా నిర్వహించడానికి ప్రధాన కారణం.
విస్తరించిన పరిశ్రమ...
నా భర్త నరసింహులు, మామ నాగయ్య నాకు వస్త్రాన్ని నేయడం నేర్పించారు. పెళ్లయిన నాలుగేళ్లకు అంటే 1984లో నా చేత్తో తొలి వస్త్రం (లుంగీ) నేశాను. 2004లో నిఫ్ట్ విద్యార్థిని సౌమ్య చల్లాకు డెనిమ్ క్లాత్ మీద కలంకారీలో టాటూ డిజైన్ వేసిచ్చాను. ఆమె పేపర్ మీద తెచ్చుకున్న డిజైన్‌ని పెన్ కలంకారీ విధానంలో చిత్రించాను. అది పదివేల రూపాయల ప్రథమ బహుమతికి ఎంపికైంది. ఆమె ఫోన్లో థ్యాంక్స్ చెప్పినప్పుడు సంతృప్తిగా అనిపించింది.
నేనూ అవార్డు అందుకోగలననే ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందా సంఘటన. రెండేళ్ల కిందట ‘ఇకత్ డబుల్ డోరియా చీర’ నేసి రాష్ట్రపతి చేతుల మీదుగా బహుమతి పొందాను.మా పెద్దవాళ్లు కాటన్ మీద మాత్రమే రంగులద్దేవారు. ఇప్పుడు ప్యూర్ సిల్క్, షిఫాన్, క్రేప్, జార్జెట్‌ల మీద కూడా అందమైన రంగులతో ప్రింట్స్ వేస్తున్నాను.
ఇండియన్ ఎంపోరియమ్ వంటి ప్రఖ్యాత వస్త్రాలయాలకు రన్నింగ్ ఫ్యాబ్రిక్ సరఫరా చేస్తున్నాం. ఈ కళను ప్రదర్శించుకోవడం మాకు తెలియదు. కానీ ఈ పనిలో ఇంటిల్లిపాదీ సంతోషంగా ఉన్నాం. నెలకు యాభై వేలకు పైగా జీతాల రూపంలో ఖర్చయినప్పటికీ... బయట పని చేస్తే వచ్చే జీతాలకంటే మెరుగైన రాబడి ఉంటోంది.
హోమ్‌సైన్స్ విద్యార్థులు, నిఫ్ట్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) విద్యార్థులు వీవింగ్, నేచురల్ ప్రింటింగ్ శిక్షణ తరగతులకు నా దగ్గరకు వస్తుంటారు. ప్రస్తుతం ప్రధానమంత్రి మానసపుత్రిక అయిన ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా రూపుదిద్దుకున్న ‘వందేమాతరం’ పథకం ద్వారా శిక్షణనిస్తున్నాను.
- కందగట్ల బాలామణి, తాళ్లగడ్డ(హైదరాబాద్)లోని ‘ఇండియన్ ఇకత్స్’ చేనేత, అద్దకం పరిశ్రమ నిర్వాహకురాలు
రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి , ఫొటోలు : శివ మల్లాల