
సత్వం: సృష్టికర్తల సృష్టికర్త
దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినట్టయితే, మరి ఆ దేవుణ్ని ఎవరు సృష్టించినట్టు? నిరాకారుడైన దేవుడిని ఎలా పోల్చుకోవాలి? భావవాద, భౌతికవాదాల మధ్య జరిగే చర్చల్లో పుట్టే ప్రశ్నలు సాధారణంగా ఇలా ఉంటాయి.
ఏప్రిల్ 29న చిత్రకారుడు రవివర్మ జయంతి
దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినట్టయితే, మరి ఆ దేవుణ్ని ఎవరు సృష్టించినట్టు? నిరాకారుడైన దేవుడిని ఎలా పోల్చుకోవాలి? భావవాద, భౌతికవాదాల మధ్య జరిగే చర్చల్లో పుట్టే ప్రశ్నలు సాధారణంగా ఇలా ఉంటాయి. దేవుడి ‘ఉనికి’ని ఒప్పుకుంటే గనక, ‘నిరాకారుడైన’ దేవుడికి రూపం ఇవ్వడమనేది మనిషి సృజనశక్తితో సంభవించింది. ఇంకా చెప్పాలంటే, రవివర్మలాంటివాళ్లవల్లే సాధ్యమైంది.
ఊహలకు ఒక సాధికార రూపమిచ్చాడు రవివర్మ. దేవుళ్లకు ఒక ఫ్రేమ్ కట్టాడు. ఇక, సరస్వతి అంటే ప్రశాంత చిత్తంతో వీణను మీటుతూ కూర్చున్న నాలుగు చేతుల తల్లే! లక్ష్మి అంటే, ఏనుగులు తొండమెత్తి కొలుస్తుండగా అన్నే చేతులతో తామరపువ్వుమీద నిలబడిన అమ్మే! రాజా రవివర్మ (1848-1906) ఇప్పటి కేరళలో భాగంగావున్న ట్రావెన్‌కోర్ రాజకుటుంబంలో జన్మించాడు. తను చూసిన పశువులు, రోజువారీ జీవిత వ్యవహారాల్ని పసితనంలో గోడల మీద చిత్రించేవాడు. పాత గాథల్నీ, వాటిల్లో ఇమిడివున్న అంతరార్థాన్నీ ఆకళింపుచేసుకుని తన చిత్రాలకు ముడిసరుకును కూర్చుకునేవాడు.
నల- దమయంతి, శంతను-మత్య్యగంధ, శంతను-గంగ, రాధామాధవులు, కంస మాయ, సుభద్రార్జునుల ప్రణయం, ద్రౌపదీ వస్త్రాపహరణం, హరిశ్చంద్రుడి జీవితంలోని విషాదఘట్టం, మేనక -విశ్వామిత్ర, శ్రీకృష్ణ జననం, కృష్ణ రాయబారం, సీతా స్వయంవరం, శ్రీరామ పట్టాభిషేకం, శివపార్వతులతో వినాయకుడు, సింహం పిల్లతో భరతుడు, కీచకుడు సైరంధ్రి, జటాయు వధ, శకుంతల, హంస రాయబారం; ఇలా రామాయణ, మహాభారత ఇతిహాసాలూ, కాళిదాసు కావ్యాలూ ఆయనకు కుంచెనిండా పని కల్పించాయి.
పాత్రని మలిచిన మృదుత్వం, ముఖంలో పలికే భావం, సున్నిత శృంగారం, స్కిన్ టోన్, వస్త్రాలు అమర్చిన తీరు, అవయవాల పొందిక, ఆభరణాల సొగసు, రంగుల మేళవింపు, వెలుతురు జాడలు, డీటెయిల్స్, చిత్రాన్ని చూడటానికి కావాల్సిన మూడ్... అన్నీ కుదిరాయి కాబట్టే, భారతీయ చిత్రకళకు రవివర్మ ఆద్యుడు కాగలిగాడు. భారతీయ రంగస్థలం, అటుపైన సినిమా రంగం కూడా ఆయన చిత్రాలు ఇచ్చిన ప్రేరణతో తమ పాత్రల్ని మలుచుకున్నాయి.
కొత్త అనుభవం, కొత్త అనుభూతుల కోసం రవివర్మ దేశం మొత్తాన్నీ చుట్టివచ్చాడు. భిన్న నేపథ్యాల్లోంచి వచ్చిన ఎందరో స్త్రీలను ప్రత్యేకంగా గీశాడు. పిల్లాడికి పాలిస్తున్న తల్లి, భర్తకోసం ఎదురుచూస్తున్న భార్య, దీర్ఘాలోచనలో ఉన్న మహిళ, అప్పుడే స్నానంచేసిన మగువ, ఏకాగ్రతతో చదువుతున్న విద్యార్థి, సంగీత కారులు, భిక్షగాళ్ల కుటుంబం... మనదేశం వరకూ లైవ్ మోడల్స్‌ను వాడటం కూడా ఆయనతోనే ప్రారంభమైంది. అందమైన అమ్మాయికి కొలమానం కూడా ఆయన సెట్‌చేశాడు. రవివర్మ చిత్రంలా ఉందనడమే ఒక విశేషణం కదా! బ్రిటిష్‌వాళ్లు కూడా ఆయనతో తమ పొర్ట్రెయిట్స్ గీయించుకునేవారు. చిత్రాలు గీయించుకోవాలన్న విజ్ఞాపనలు ఎక్కువవడంతో ఒక సమయంలో ఆయనకోసం వాళ్ల ఊరిలో కొత్త తపాలా శాఖను ప్రారంభించాల్సివచ్చింది!
చిత్రంలో స్వేచ్ఛకూ, వ్యక్తీకరణకూ పెద్దపీట వేసే ఆధునిక విమర్శకులు ‘క్యాలెండర్ ఆర్ట్’ అనీ, ‘ఎకాడమిక్ స్టైల్’ అనీ రవివర్మను నిరసిస్తారు. అదే సమయంలో, ఆయన గీసిన గరిష్ట హద్దును దాటినవాళ్లు ఇంతదాకా లేరని ప్రశంసించేవాళ్లు కూడా ఉన్నారు. అయితే, భారతీయ సంప్రదాయానికి ఐరోపీయ టెక్నిక్‌ను అద్దిన అద్భుతమైన సంగమంగా మాత్రం ఆయన్ని అందరూ ఒప్పుకుంటారు. అందుకే ఆయన పాతవాళ్లలో కొత్తవాడు; కొత్తవాళ్లలో పాతవాడు. ఖరీదైన బెడ్రూముల గోడలు దాటిరాని స్వేచ్ఛాయుత పెయింటింగ్స్‌కంటే, మామూలు ఇళ్లల్లోకి కూడా వెళ్లగలిగిన రవివర్మ చిత్రాలు నిక్కమైన మన జాతీయ సంపద!