హంతకుడెవరు? | police story | Sakshi
Sakshi News home page

హంతకుడెవరు?

Published Sat, Mar 26 2016 10:20 PM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM

హంతకుడెవరు?

హంతకుడెవరు?

  పట్టుకోండి చూద్దాం
 ఆగస్టు పదిహేను, 2007... హైదరాబాద్. సమయం ఆరున్నర కావస్తోంది. తన కజిన్ రిసెప్షన్‌కి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు ఇన్‌స్పెక్టర్  అవినాష్. అంతలో అతని ఫోన్ రింగయ్యింది. చూస్తే కానిస్టేబుల్ వీరభద్రం.‘‘ఏం వీరభద్రం... లీవ్ రోజున కూడా వదిలిపెట్టవా.... ఏం జరిగింది?’’... నవ్వుతూ అన్నాడు ఫోన్ తీసి. ‘‘సర్... మీరు త్వరగా రావాలి. గచ్చిబౌలిలో మర్డర్ జరిగిందని తెలిసింది’’ అన్నాడు వీరభద్రం కంగారుగా.  ‘‘ఎవరు చెప్పారు?’’ అన్నాడు అవినాష్ అలర్‌‌ట అవుతూ. ‘‘శ్రీనివాస్ అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు సర్. చనిపోయినతని కొడుకట.’’ ‘‘సరే మీరు వెళ్లండి. నేను ఇట్నుంచిటే వచ్చేస్తాను’’ అని ఫోన్ పెట్టేసి హుటాహుటిన బయలుదేరాడు అవినాష్.
   
 హతుడి ఇంట్లో దృశ్యం చూస్తూనే మతి పోయింది పోలీసులకి. చాలా దారుణంగా చంపేశారతణ్ని. ఒంటినిండా కత్తిపోట్లు ఉన్నాయి. మెడ తెగి వేళ్లాడుతోంది. గదంతా రక్తమే. వెంటనే బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి ఎంక్వయిరీ మొదలుపెట్టాడు అవినాష్.  ఇంట్లోవాళ్ల మాటల్ని బట్టి పెద్దాయన రోజూ భోజనం చేసి రెండు గంటలకు పడుకుంటాడు. నాలుగున్నరకి లేస్తాడు. ఐదు గంటలకి మెల్లగా నడుచుకుంటూ దగ్గర్లో ఉన్న పార్కుకి వెళ్తాడు. గంటా రెండు గంటలు అక్కడే గడిపి ఇంటికొస్తాడు.
 
 ఈరోజు మాత్రం నాలుగున్నర దాటినా ఆయన లేవలేదు. కోడలికి అనుమానం వచ్చి ఐదింటికి తలుపు కొట్టింది. లోపల్నుంచి సమాధానం రాకపోవడంతో కిటికీలోంచి చూసింది. రక్తపు మడుగులో పడివున్న మామగార్ని చూసి షాకై భర్తకి ఫోన్ చేసింది. అతడొచ్చి చూసి పోలీసులకి ఫోన్ చేశాడు.  ‘‘మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే హత్య రెండు నుంచి నాలుగ్గంటల మధ్యలో జరిగింది’’ అన్నాడు అవినాష్. శ్రీనివాస్ మాట్లాడలేదు. ‘‘ఇంత దారుణంగా పొడిచి పొడిచి చంపారు. ఆయన కచ్చితంగా కేకలు పెట్టేవుంటాడు. ఎవ్వరికీ వినిపించలేదా?’’ అన్నాడు శ్రీనివాస్ వైపు చూస్తూ.
 
 ‘‘నేనసలు ఇంట్లోనే లేను సర్. వయసు మీద పడటంతో నాన్న బిజినెస్ చూడలేక పోతున్నారు. నేనే చూసుకుంటున్నాను. మధ్యాహ్నం లంచ్‌కి కూడా రాను. ఉదయం వెళ్తే మళ్లీ రాత్రికే.’’ అతని మాటల్లో ఎక్కడా తడబాటు లేదు. ‘‘సరే. మొత్తం ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారో అందరినీ పిలవండి’’ అన్నాడు అవినాష్. క్షణాల్లో అతని ముందు అందరూ హాజరయ్యారు.  ‘‘హత్య జరిగిన సమయంలో ఎవరు ఎక్కడున్నారో నాకు తెలియాలి’’ అన్నాడు అందరినీ తేరిపార చూస్తూ.
 
 ‘‘నేను కుకట్‌పల్లిలో ఉన్న మా షాప్‌లో ఉన్నాను’’ అన్నాడు శ్రీనివాస్. ‘‘నేనసలు రెండు రోజులుగా ఊళ్లోనే లేను సార్. మా అమ్మకి ఒంట్లో బాలేదంటే చూడ్డానికి మా ఊరెళ్లాను. ఇందాకే వచ్చాను. వచ్చేసరికి అయ్యగారు..’’... చెప్పాడు వాచ్‌మేన్. ‘‘నేను కూడా ఆ సమయానికి ఇంట్లో లేనయ్యా. అయ్యగారు పడుకునేముందు చెక్ ఇచ్చారు... బ్యాంక్‌లో వేసి రమ్మని. ఆ పనిమీదే వెళ్లాను’’ అన్నాడు డ్రైవర్.  పెద్దాయన కోడలివైపు చూశాడు అవినాష్. ‘‘నాకు కూడా మధ్యాహ్నం పడుకోవడం అలవాటు సర్. మావయ్యగారు పడుకున్నాక నేనూ పడుకున్నాను. నాకే కేకలూ వినిపించలేదు’’ అందామె. ‘‘పక్క గదిలోనే ఉన్నా వినిపించలేదా కేకలు’’ అన్నాడు అవినాష్ అనుమానంగా.
 
 ఆమె ముఖంలో రంగులు మారాయి. ‘‘నిజం సార్. నాకేమీ వినిపించలేదు. వింటే వెంటనే లేచేదాన్ని కదా’’అంది భయపడుతూ.  ‘‘అంత భయపడాల్సిన అవసరం లేదులెండి. హత్య చేసిందెవరో నాకు తెలిసిపోయింది’’ అంటూ బేడీలు అందుకున్నాడు అవినాష్. తిన్నగా వెళ్లి డ్రైవర్ చేతికి సంకెళ్లు వేశాడు. అందరూ విస్తుపోయారు. అతడే హంతకుడని ఇన్‌స్పెక్టర్ ఎలా కనిపెట్టాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. మీకు అర్థమైందా... డ్రైవరే హంతకుడని ఇన్‌స్పెక్టర్ ఎలా కనిపెట్టాడో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement