
ప్రియాంక చోప్రా.. ఈ జనరేషన్ యాక్టర్స్‌కు ఒక ఇన్స్‌పిరేషన్. హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలన్న స్టీరియోటైప్‌ను బ్రేక్ చేసిన హీరోయిన్. హీరోలకు సమాంతరంగా హీరోయిన్ స్టేటస్ ఉండాలని... పెద్దపెద్ద ప్రయోగాలే చేసిన స్టార్. మిస్ వరల్డ్. బాలీవుడ్‌లో సూపర్‌స్టార్. సింగర్‌గానూ సక్సెస్. హాలీవుడ్ పిలిస్తే అక్కడా సూపర్ అనిపించుకున్న అచీవర్. ఇప్పుడు ప్రియాంక ప్రపంచమంతటా వినిపించే పేరు. మనల్ని మనం బలంగా నమ్మితే వచ్చే సక్సెస్ ఇది.
నన్నెవ్వరూ ‘రీప్లేస్’ చెయ్యలేరు!
‘‘సినీ పరిశ్రమలో హీరోయిన్ అనే ప్లేస్‌కి ఎప్పుడూ ఆప్షన్స్ ఉంటాయి. ఎవ్వరైనా, ఎవ్వరినైనా రీప్లేస్ చేయొచ్చు!’’ ప్రియాంక ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒక నిర్మాత ఆమెతో చెప్పిన మాటలివి. ప్రియాంక మనసులో బలంగా నాటుకున్నాయి ఈ మాటలు. తాను ఆ మాటకు సమాధానం చెప్పాలనుకుంది. కష్టపడింది. సూపర్‌స్టార్‌గా ఎదిగింది. ఇప్పుడు ప్రియాంకే గర్వంగా చెప్పుకుంటుంది ఈ మాట, ‘‘నన్నెవ్వరూ రీప్లేస్ చెయ్యలేరు!’’
మాటలతో సరిపెట్టలేదు!
‘మిస్ వరల్డ్’ కిరీటం దక్కించుకున్న రోజు, ప్రియాంక, తన స్పీచ్‌లో మదర్ థెరిస్సా ప్రస్తావన తెచ్చింది. ఈ ప్రపంచంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ లేడీ ఎవరంటే మదర్ థెరిస్సా పేరే చెబుతానని ప్రియాంక అంది. అవి కేవలం మెప్పు పొందడానికి అన్న మాటలు కానే కాదు. ఎందుకు కాదో ప్రియాంక చోప్రా ఫౌండేషన్‌పై ఆడపిల్లల చదువుకు, సమాజంలో ఆడవాళ్లు వెనకబడిపోవడాన్ని ప్రశ్నించే కార్యక్రమాలకు, యూనిసెఫ్ తరపున కాంపెయిన్స్‌కు తన సమయాన్ని, సంపదను వెచ్చిస్తోన్న ప్రియాంక చోప్రా చర్యలే చెబుతాయి. ఇలా ప్రియాంక పేరు చెప్తే ఆమెలోని ఈ కోణం కూడా ఎప్పుడూ కనిపిస్తూ, వినిపిస్తూ ఉండే గొప్ప విషయం.
‘క్వాంటినో స్టార్’.. రెమ్యునరేషన్‌లో నెం. 1
ప్రియాంక చోప్రాకు ‘క్వాంటినో’ అనే అమెరికన్ టెలివిజన్ సిరీస్‌లో అవకాశం వచ్చినప్పుడు, ఆమె మెప్పించలేదని అన్నారు. అయితే ఆ టీవీ సిరీస్ విడుదలయ్యాక ప్రియాంక చోప్రా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయింది. ‘బే వాచ్’ అనే ఓ హాలీవుడ్ సినిమా కూడా చేసింది. టెలివిజన్ నటీమణుల్లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటోంది మన ప్రియాంకే! ఫోర్బ్స్ జాబితాలో టాప్ టెన్‌లో చోటు దక్కించుకుంది.
ఎవ్వరూ గుర్తించలేదు.. అందరూ ఓన్ చేసుకున్నారు!
ప్రియాంక చోప్రా కెరీర్‌ను ఈ ఒక్క లైన్‌లో చెప్పేయొచ్చు. ఆమె రావడం రావడమే సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోలేదు. మొదట్లో అసలెవ్వరూ ఆమెను నటిగా కూడా గుర్తించలేదు. కొన్ని కమర్షియల్ సక్సెస్‌లు వచ్చాయి. గుర్తింపు వచ్చింది. ‘ఫ్యాషన్’ అనే సినిమా మాత్రం ప్రియాంక చోప్రా అన్న ఒక బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆమె వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఇండియన్ సినిమాలో సూపర్‌స్టార్, అమెరికన్ టీవీ సిరీస్‌లో అవకాశం, హాలీవుడ్ సినిమాలో అవకాశం.. ఇప్పుడు ప్రియాంక.. అందరూ ఓన్ చేసుకున్న సూపర్‌స్టార్.
మాటల తూటాలు!
ప్రియాంక చోప్రా చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ కనిపిస్తూనే ఉంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఆమె వస్త్రధారణపై చాలా విమర్శలు వచ్చాయి. దానికి ‘‘ఇలాంటి అనవసరమైన కామెంట్లకు స్పందించేంత ఖాళీగా లేను నేను.’’ అని ఘాటైన సమాధానం ఇచ్చింది ప్రియాంక.
ఒకసారెప్పుడో ‘మీకు ఒకరు రింగు తొడిగి ప్రపోజ్ చేసే వారు ఉండాలని అనుకోరా?’ అనడిగితే, ‘‘పిల్లలు కనడానికి తప్ప నాకు మగతోడు అవసరం లేదు.’’ అని రిప్లై ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment