
విషోదయం
ప్రభాకర్ ఒకసారి ఆయన వంక చూసి, జేబులోంచి కర్చీఫ్ తీసి మొహం తుడుచుకుని చుట్టూ చూశాడు...
ప్రత్యేక ప్రశంసకు ఎంపికైన కథ
ప్రభాకర్ ఒకసారి ఆయన వంక చూసి, జేబులోంచి కర్చీఫ్ తీసి మొహం తుడుచుకుని చుట్టూ చూశాడు. ఇద్దరు ముగ్గురు ముసలాళ్లు దూరంగా నిలబడి చూస్తున్నారు. వాళ్ల గాజు కళ్లల్లో నిర్లిప్త భయం దోబూచులాడుతోంది. ‘‘మీ అమ్మగారు తన శరీరాన్ని మా సంస్థకి డొనేట్ చేశారు. మీరూ ఈ పేపర్ల మీద సంతకం చేస్తే, మిగిలిన పని పూర్తిచేసుకుంటాం!’’ ప్రభాకర్ వాళ్లు చూపించిన చోట సంతకాలు చేశాడు.
‘‘ప్రభాకర్‌గారా?’’
‘‘ఎవరు?’’
‘‘నేను మజిలీ ఓల్డేజ్ హోమ్ నుంచి మేనేజర్‌ని మాట్లాడుతున్నాను. సారీ మీకో బాడ్ న్యూస్. మీ అమ్మగారు ఈ రోజు తెల్లవారు ఝామున నిద్రలోనే మరణించారు.’’
‘‘నేనొచ్చి శవాన్ని హాండోవర్ చేసుకోవాలా?’’
‘‘అవసరం లేదు. ఆమె తన బాడీని మెడికల్ కాలేజీకి డొనేట్ చేశారు. ఒకసారి మీరు వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే, శవాన్ని మెడికల్ కాలేజీవాళ్లు తీసుకెళ్లిపోతారు.’’
‘‘వెంటనే బయల్దేరి వస్తున్నాను.’’
తల్లికి తనొక్కడే కొడుకు. బంధువులంతా ఎక్కడెక్కడో వున్నారు. ఎవరికీ తెలియపర్చాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి తేలిగ్గా నిట్టూర్చాడు. శవాన్ని అపార్ట్‌మెంట్ దగ్గరకు తీసుకెళ్లి కర్మకాండలు చెయ్యాలంటే అదో పెద్ద తలనొప్పి వ్యవహారం! పైగా స్వప్న ఒప్పుకుంటుందో లేదో? స్వప్నకి ఫోన్ చేసి విషయం చెప్పాడు, ‘‘త్వరగా పన్చూసుకొని ఇంటికొచ్చేయ్’’ అంది.
అరగంటలో ఊరిబయట వున్న ఓల్డేజ్ హోమ్ ముందు కారాపాడు. ఒక ముసలాయన గబగబా ఎదురొచ్చాడు. ‘‘మీరు ప్రభాకర్‌గారు కదా? రండి లోపలికి వెళ్దాం’’ అంటూ ఓల్డేజ్ హోమ్ వెనక్కు తీసుకెళ్లాడు.
మెడికల్ కాలేజీ స్టాఫ్, ఓల్డేజ్ హోమ్‌లో పనిచేస్తున్న ఇద్దరు వర్కర్లు అక్కడున్న ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చున్నారు. కొద్ది దూరంలో ఫ్రీజర్ బాక్సులో తల్లి శవం కనబడుతోంది. నెమ్మదిగా తల్లి దగ్గరకు వెళ్లి మొహం వంక చూశాడు. పీక్కుపోయిన దవడలు! గుంటలు పడ్డ కళ్లు! సరుగుడు కర్రలాంటి శరీరం. నిద్రలోనే ప్రాణం పోయినందున, మొహంలో మరణయాతన తాలూకు ఛాయలు కనిపించడం లేదు.
ముసలి మేనేజర్ ముందుకొచ్చి, ప్రభాకర్ భుజం మీద చెయ్యేసి ఓదార్పుగా ఒత్తాడు. ‘‘రాత్రి కూడా చాలా హుషారుగా వున్నారు. పొద్దున్న మార్నింగ్ వాక్‌కి రాలేదేమని అడగడానికి వెళ్తే యి...లా! అయినా బతికినంతకాలం ఎవరి మీదా ఆధారపడలేదు, గ్రేట్ డెత్’’ నిట్టూర్చాడు.
ప్రభాకర్ ఒకసారి ఆయన వంక చూసి, జేబులోంచి కర్చీఫ్ తీసి మొహం తుడుచుకుని చుట్టూ చూశాడు. ఇద్దరు ముగ్గురు ముసలాళ్లు దూరంగా నిలబడి చూస్తున్నారు. వాళ్ల గాజు కళ్లల్లో నిర్లిప్త భయం దోబూచులాడుతోంది.
‘‘మీ అమ్మగారు తన శరీరాన్ని మా సంస్థకి డొనేట్ చేశారు. మీరూ ఈ పేపర్ల మీద సంతకం చేస్తే, మిగిలిన పని పూర్తిచేసుకుంటాం!’’
ప్రభాకర్ వాళ్లు చూపించిన చోట సంతకాలు చేశాడు.
అరగంటలో వాళ్లు పని పూర్తిచేసుకొని ఫ్రీజర్ నుంచి శవాన్ని బయటకు తీసి, తమ వ్యాన్‌లో ఎక్కించి, ప్రభాకర్‌కి షేక్‌హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు.
‘‘పనైపోయింది కదా! ఇక నేను వెళ్లవచ్చా!’’
ముసలి మేనేజర్ ప్రభాకర్ వంక తేరిపార చూశాడు, ‘‘ఒకసారి నాతో రండి’’ అంటూ ఓల్డేజ్ హోమ్ ముందు భాగంలోకి కదిలాడు.
ఐదేళ్ల క్రితం తల్లిని చేర్పించడానికి వచ్చినప్పుడు, ముందున్న స్థలం అంతా బోసిగా ఉండేది. ఇప్పుడంతా పచ్చని చెట్లతో కళకళలాడుతోంది. మొక్కల మధ్యలో అక్కడక్కడా సిమెంటు బెంచీలు వేశారు. వాటి పక్కనే కరెంట్ పోల్స్ కనబడుతున్నాయ్.
‘‘సామాన్యంగా ఇక్కడ ఎవరైనా చనిపోతే, ఆ వార్త వీలైనంత వరకూ హోమ్‌లో ఉన్న మిగిలినవాళ్లకి తెలియనివ్వం! వెనక గేటులోంచి శవాన్ని పంపించేస్తాం. సగం చచ్చిపోయిన తరువాతే వాళ్లు ఇక్కడకొస్తారు. చివరి దశలో వాళ్లు ప్రశాంతంగా వెళ్లిపోవాలని మా కోరిక! రేపు నేనైనా సరే!’’
ప్రభాకర్ విసుగ్గా మొహం పెట్టాడు. అతనికి వీలైనంత తొందరగా అక్కడి నుంచి వెళ్లిపోవాలనుంది. సాయంత్రం బావమరిది కొడుకు పెళ్లి రిసెప్షన్ ఉంది. వెళ్లకపోతే స్వప్న ఊరుకోదు.
‘‘మీ అమ్మగారు వచ్చిన తరువాతే ఈ కూరగాయ మొక్కలు, ఆకుకూరల మడులు పెట్టించారు. సిమెంటు బెంచీలు వేయించారు. చుట్టుపక్కలుండే పిల్లలకి ఫ్రీగా ట్యూషన్లు చెప్పేవారు. ఆవిడ రామదాసు కీర్తనలు పాడుతుంటే...’’ ముసలి మేనేజర్ గొంతు కొద్దిగా తడబడింది.
‘‘అవునూ మీరొక్కరే వచ్చారేంటి? మీ భార్యగారు రాలేదా?’’
‘‘ఆవిడకి టైఫాయిడ్. హాస్పిటల్‌లో ఐసీయూలో ఉంది.’’
ముసలి మేనేజర్ ప్రభాకర్ వంక జాలిగా చూశాడు. ప్రభాకర్‌కి ముళ్లమీద ఉన్నట్టుంది.
‘‘మరి నేను బయల్దేర్తాను. హాస్పిటల్‌కి వెళ్లాలి.’’
‘‘రెండు నిమిషాలలో వెళ్లిపోదురుగాని, రండి! మీ అమ్మగారి గదిలోకి వెళ్దాం.’’
‘‘యిప్పుడు జరిగిన కార్యక్రమానికి డబ్బులు కట్టాలా?’’ ప్రభాకర్ భయం భయంగా అడిగాడు. ‘‘ఎందుకంటే నా దగ్గర ఐదు వందలో, వెయ్యో ఉన్నాయి. ఎమోంట్ కావాలంటే నేనెళ్లి పంపుతా.’’
‘‘నీ పర్సులో అరడజను డెబిట్ కార్డులు ఉన్నాయ’’ని నాకు తెలుసన్నట్టు మేనేజర్ బోసిగా నవ్వేడు. ‘‘అంత అవసరం లేదండి. మీ అమ్మగారు అన్ని ఏర్పాట్లు ముందే పూర్తిచేసుకున్నారు.’’
యిద్దరూ గదిలోకి నడిచారు. తల్లి తాలూకు చీరలు ఒక సంచీలో సర్దబడున్నాయి. ఒక మూల టేబుల్‌మీద పుస్తకాలు పేర్చున్నాయ్.
‘‘మీ అమ్మగారి వంటిమీద ఎటువంటి బంగారం లేదు. రిస్ట్ వాచీ, సెల్‌ఫోన్ లాంటివి కూడా లేవు’’ ప్రభాకర్ ఒక్కసారి తప్పు చేసినవాడిలా తలదించుకున్నాడు. ‘‘ఆ బట్టలు ఎవరైనా అడుక్కునేవాళ్లు ఉంటే ఇచ్చేయండి.’’
‘‘మీ అమ్మగారి గుర్తుగా తీసుకెళ్లరా?’’
‘‘వద్దండి. వాటిని చూస్తే నా మనసు వికలం అయిపోతుంటుంది’’ ముతక వాసన వస్తున్న వాటి వంక దొంగచాటుగా అసహ్యంగా చూశాడు.
ముసలి మేనేజర్ ఒక్క క్షణం ప్రభాకర్ వంక పరకాయించి చూశాడు.
‘‘మీ అమ్మగారికి మీరంటే చాలా ఇష్టం! కనీసం రోజుకొక్కసారైనా మిమ్మల్ని తలుచుకుంటుంటారు. మిమ్మల్ని చాలా సుకుమారంగా పెంచారట కదా!’’
ప్రభాకర్ ఇబ్బందిగా తలూపాడు.
‘‘మీ అమ్మగారి చివరి కోరికేంటో తెలుసా?’’
కొంపదీసి అస్థికలు గంగలో కలపమందా? అయినా మెడికల్ కాలేజీవాళ్లు తీసికెళ్లిం తర్వాత యింకేం మిగుల్తాయ్! లేదంటే ఈ ఓల్డేజ్ హోమ్‌కి లక్ష రూపాయలు డొనేషన్ ఇమ్మందా?’’ ప్రభాకర్ నోరు తడారిపోయింది.
‘‘ఏంటది?’’ పీలగా అడిగేడు.
‘‘ఆఫీస్ రూంలో కూర్చుని మాట్లాడుకుందాం రండి’’ యిద్దరూ కలిసి ఆఫీస్ రూమ్‌లో కూర్చున్నారు.
‘‘టీ గాని, కాఫీ గాని తాగుతారా?’’
‘‘వద్దండి! అలవాటు లేదు’’ అబద్ధం ఆడేడు ప్రభాకర్.
ముసలి మేనేజర్ డ్రాయర్ సొరుగులోంచి ఒక కాగితం బయటకు తీశాడు. ‘‘ఇది మీ అమ్మగారి వీలునామా లాంటిది! ఒక రకంగా ఆవిడ చివరి కోరికని చెప్పొచ్చు.’’
ప్రభాకర్ మొహం విచ్చుకుంది. ‘‘ఏమైనా డబ్బులు దాచిపెట్టిందేమో?’’
ముసలి మేనేజర్ చిన్నగా నవ్వేడు, ‘‘మీరు ఫ్రిజ్ వాటర్ తప్ప ఇంకోటి ముట్టుకోరట కదా! వుక్కపోత అసలు భరించలేరట! టీవీలో అర్ధరాత్రి దాకా సినిమాలు చూస్తుంటారట కదా! అందుకే మీ అమ్మగారు మీకు ఒక ఫ్రిజ్, ప్లాస్మా టీవీ, ఎయిర్ కూలర్ ఇమ్మన్నారు. వాటి తాలూకు డబ్బు బ్యాంకులో వేసుంచారు.’’
ప్రభాకర్ నోరు చప్పరించాడు. ‘‘యివన్నీ నాకున్నాయండి! ఆ వస్తువుల డబ్బిస్తే, మా అమ్మగారి గుర్తుగా ఇంకేదైనా కొనుక్కుంటాం.’’
(స్వప్న ఎప్పట్నించో రవ్వల దుద్దులు అడుగుతోంది)
ముసలి మేనేజర్ గొంతు సవరించుకున్నాడు, ‘‘మీ అమ్మగారికి మీరంటే పంచప్రాణాలు. అందుకే ఎటువంటి పరిస్థితుల్లోను డబ్బులివ్వద్దని రాశారు.’’
‘‘ఓకే! ఐటమ్స్ కోసం ఎప్పుడు రమ్మంటారు?’’ ప్రభాకర్ మనసులో వాటిని అమ్మితే ఎంతొస్తుందో లెక్కేసుకుంటున్నాడు.
‘‘నేను చెప్పేది మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు.’’
‘‘అవి మీరు ఇంటికి తీసుకెళ్లడానికి కాదు.’’
ప్రభాకర్ అర్థంకానట్టు చూశాడు.
‘‘ఇవాళ కాకపోయినా రేపైనా మీరిక్కడికి రాక తప్పదు కదా! అప్పుడు మీరు ఇబ్బంది పడకూడదని మీ అమ్మగారు చేసిన ఏర్పాటు ఇది!’’
ప్రభాకర్ బతికున్న శవంలా బిగుసుకుపోయాడు.
- రాఘవేంద్ర శ్రీనివాస్