సైదులు | Saidulu story | Sakshi
Sakshi News home page

సైదులు

Published Sun, Oct 25 2015 2:05 AM | Last Updated on Mon, Oct 22 2018 7:57 PM

సైదులు - Sakshi

సైదులు

సింగిల్ పేజ్ స్టోరీ
నిన్న రాత్రి ఎనిమిది, ఎనిమిదింపావు మధ్యలో వచ్చినట్టుంది చీకటి. వచ్చి ఎనిమిది గంటలు దాటిందో ఏమో? సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగిలా వెళ్లటానికి సిద్ధమవుతూ, తర్వాత షిఫ్ట్ రావలసిన సూర్యుడికి రమ్మని కేకేసింది. క్యాబ్ మిస్సయ్యి సిటీ బస్‌లో వస్తున్న ఉద్యోగిలా సూర్యుడు మెల్లగా వస్తున్నాడు.
 పీరయ్య మటన్ కొట్లో... కోళ్ల బోన్లో ఉన్న శీనయ్య కోడి ‘సైదులు’ గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటోంది. మర్డర్ చేసి దొరికిపోయిన నేరస్తుడిలా బిక్కుబిక్కుమని భయంతో అటూ ఇటూ చూస్తూ... ‘ఏంటో ఈ కోడి బతుకు!’ అని తిట్టుకుంటోంది.
 
రామ్‌గోపాల్‌వర్మ సినిమాల్లోలా తలుపు తీసిన చప్పుడయ్యింది. లోపలికి వచ్చిన పీరయ్య ఎడం చేత్తో లైట్ వెయ్యబోయి, ఆగి కుడిచేత్తో వేశాడు. ఓల్టేజ్ సరిగా లేదో, బల్బ్ సరిగా లేదో... లైట్ మాత్రం దీనంగా వెలుగుతోంది. సాన పట్టించుకొచ్చిన రెండు కత్తులు అరుగుమీద పెట్టి, దేవుడి పటం ముందు నిల్చొని మొక్కుకుంటున్నాడు పీరయ్య. తనని బతికించమని అదే దేవుణ్ని మొక్కుకుంది సైదులు. చంపటానికి వచ్చిన పీరయ్యా అదే దేవుణ్ని మొక్కుతుండటం చూసి అసలీ దేవుడి కాన్సెప్ట్ ఏమిటో అర్థం కాలేదు సైదులికి. పూజ ముగించిన పీరయ్య కోళ్లను నరికే మొద్దు బండని శుభ్రం చేస్తున్నాడు. కొట్లో క్యాలెండర్ అక్టోబర్ మూడు చూపిస్తోంది.
 
‘‘గాంధీతాత దయవల్ల ఒక్కరోజు ఎక్స్‌ట్రా అయినా బతకగలిగాను. కాని, లాభమేంటి? రోజు మొత్తం భయం భయంగా బతకటం తప్ప. ఎవరికొచ్చిందో స్వాతంత్రం, మాకు మాత్రం రాలేదు’’ అని సైదులు నిట్టూర్చింది.
 ‘‘దేవుడా... దేవుడా... ప్లీజ్! బతికి బయటపడే అవకాశమైతే కనపడట్లేదు. కానీ బతకాలనుంది. గుడ్లు పెట్టే వయసు రాకముందే గుడ్లు తేలెయ్యాల్సొస్తుందని బాధగా ఉంది. ప్లీజ్ దేవుడా... ప్లీజ్, ప్లీజ్’’ అని దేవుణ్ని ప్రార్థిస్తోంది సైదులు.
 
పీరయ్య వచ్చి బోను తెరిచాడు. అంతలో దీనంగా వెలుగుతోన్న లైట్ కాస్తా ఆరిపోయింది. సైదులు వెంటనే బోను నుంచి బయటికి దూకి చీకట్లో పరిగెత్తింది. ఏమీ కనిపించకపోవడంతో కోడి ఎటు పోయిందో గుర్తించలేకపోయాడు పీరయ్య.
 అక్కడి నుండి బయటపడ్డ సైదులు మాత్రం పక్కనున్న పొలాల్లోంచి రయ్యిరయ్యిమని శీనయ్య ఇంటికి బయలుదేరింది. తను చిన్నగా వున్నప్పటినుంచి తనని ప్రేమగా పెంచాడు శీనయ్య. తనకున్న దాంట్లో భార్యాపిల్లలతో హాయిగానే జీవిస్తున్నాడు. శీనయ్య ఇంట్లోంచి సైదులుని దొంగతనంగా ఎత్తుకొచ్చి పీరయ్యకి అమ్మేశాడు సుబ్బులు.
 
‘ఆడు కనపడాలీ... ముక్కుతో వాడి పిక్క ముక్కలు ముక్కలు చేసి చంపేస్తా’ అని తిట్టుకుంటూ వెళ్తోంది సైదులు. శీనయ్యని చూసి రెండు రోజులు దాటింది. తనని చూసి శీనయ్య ఎంత ఆనందపడతాడో గుర్తుకొస్తూనే సైదులు వేగం ఇంకా పెరిగింది.
 ఎలాగైతేనేం ఇంటికి చేరుకుంది సైదులు. దొడ్డి గుమ్మం వైపు వెళ్లి కిటికీ లోంచి లోపలికి చూసింది. శీనయ్య నాలుగేళ్ల కొడుకు అశోక్, అక్క స్వాతి మీద చెయ్యేసుకుని పడుకున్నాడు. ఎప్పటిలాగే వాడి భయం చూసి నవ్వుకుంది సైదులు. ఒంట్లో నలతగా వుందో ఏమో? శీనయ్య భార్య లక్ష్మి మంచం మీద పడుకుని వుంది.
 
రెండు ప్లేట్లలో ఉప్మా పెట్టుకుని వచ్చి ‘తిను’ అంటూ ఒక ప్లేట్ లక్ష్మికి ఇచ్చాడు శీనయ్య.
 ‘‘భార్య లక్ష్మి అంటే అంత ప్రాణం శీనయ్యకి. అందుకే శీనయ్య అంటే అంత గౌరవం లక్ష్మికి. వాళ్లిద్దరి అన్యోన్యత గురించి మాట్లాడుకోని కోడి గానీ, మనిషి గానీ లేడు’’ అనుకుంటూ దొడ్డి వాకిలి గుండా ఇంట్లోకి వచ్చింది సైదులు. ఉప్మా వాసన బాగా వస్తుండటంతో వాళ్లకి కనిపించకుండా వంటింట్లోకెళ్లింది.
 తనలాగే శీనయ్యకీ పల్లీలు ఎక్కువగా వేసి చేసిన ఉప్మా అంటే ప్రాణం. మెల్లిగా వంటింట్లోకెళ్లిన సైదులు తన ముక్కుతో ఉప్మా కాస్త పక్కనేసుకుని ఆస్వాదిస్తూ తింటోంది. రెండు రోజుల్నుంచి తినిందో లేదో గబగబా నాలుగు ముద్దలు కడుపులోకేసింది.
 
ఎందుకో గొంతు పట్టేసినట్టు అనిపించింది సైదులుకి. కడుపులో మెలికలు తిరిగే నొప్పి, కళ్లు తిరుగుతున్నాయ్. కడుపులో అగ్గి పోసినట్టుగా వుంది. ఏమయ్యిందో ఏమో అర్థం కావట్లేదు. భరించలేని బాధ. కాస్త ఓపిక తెచ్చుకుని వంటింటి గుమ్మం దాకా వచ్చి చూసింది. నోట్లోంచి నురగులు కక్కుతూ చచ్చిపోతున్నారు శీనయ్య, లక్ష్మి. కోడి గుండె ఆగిపోయింది.
 విషయం తెల్సి చుట్టుపక్కలవాళ్లంతా వచ్చారు. ఉత్తమ వ్యవసాయదారుడు అని రాసున్న ఒక అవార్డు ముక్క, సగం కాలి కట్టెల పొయ్యిలో ఉంది. పీరయ్య మటన్ కొట్లోనే చావాల్సిన సైదులు చావు శీనయ్య ఇంట్లో రాసిపెట్టుంది.
 పిల్లల్ని ఓదార్చిన ఆ వూరి ఎం.ఎల్.ఎ. బయటికి వచ్చి, ఎవరూ చూడకుండా డెటాల్‌తో చేతులు కడుక్కుని వెళ్లిపోయాడు.
 - కళ్యాణ్ రాఘవ పసపుల

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement