
అగ్గిపూలు
‘ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తమదైన స్థానం ఉంది’ అనే వాస్తవం వెలుగులో మొదలైన కేఫ్ ఇది.
ఆదర్శం
రైటర్స్ కేఫ్, చెన్నై, తమిళనాడు.
ఇచట తీయటి కబుర్లతో కాఫీ తాగవచ్చు.
ఇష్టమైన పుస్తకం చదువుకోవచ్చు.
ఇష్టంగా ఏదైనా రాసుకోవచ్చు.
నచ్చిన పుస్తకంపై చర్చలు చేయవచ్చు.
... ఇది మాత్రమే అయితే రాయపురలోని ‘రైటర్స్ కేఫ్’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. మరి ఏమిటి ఈ కేఫ్ ప్రత్యేకత? ‘ప్రత్యేకత’ అనడం కంటే... ‘విశిష్ఠత’ అనడం సబబుగా ఉంటుందేమో.
‘ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తమదైన స్థానం ఉంది’ అనే వాస్తవం వెలుగులో మొదలైన కేఫ్ ఇది. ఈ కేఫ్‌లో పనిచేసే ఏడుగురు మహిళలు... బర్న్ విక్టిమ్స్. ప్రతి ఒక్కరికీ తమదైన కన్నీటి చరిత్ర ఉంది. వాళ్లు...విధి చేత వెక్కిరించబడ్డారు. జీవితాన్ని ఇక చాలించాలనుకున్నారు. ఇప్పుడు ‘రైటర్స్ కేఫ్’ సహకారంతో కొత్త అడుగు వేస్తున్నారు. ఇరవై ఏళ్ల ప్రియదర్శినిని కదిలిస్తే ఇలా చెబుతుంది... ‘‘నా గురించి అమ్మ కన్న కలలను నిజం చేయలేకపోయాను. చదువులో రాణించలేకపోయాను. అమ్మ నన్ను మా బంధువుల ఇంట్లో పనికి కుదిర్చింది. అక్కడ కృంగుబాటులోకి వెళ్లిపోయాను. ఇక్కడి నుంచి తీసుకువెళ్లమని ఒకరోజు అమ్మను అడిగాను. ‘ఇక్కడే ఉండు... లేదా చావు...’ అని ఆమె కోపంగా అరిచింది. ఆత్మహత్య చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఒంటిపై కిరోసిన్ పోసుకొని అగ్గిపుల్ల వెలిగించాను. అదృష్టశాత్తు దగ్గర్లో ఉన్న చిన్న వాటర్ కంటైనర్ మీద పడిపోవడంతో ముఖం కాలలేదు’’
‘‘రైటర్స్ కేఫ్‌లోకి అడుగు పెట్టిన తరువాత... కొత్త జీవితంలోకి అడుగు పెట్టినట్లు అనిపించింది’’ అంటుంది ప్రియదర్శిని.
ఆస్మాది మరో కథ.
ఆస్మా ప్రేమ వివాహం చేసుకుంది. తన భర్తకు గతంలోనే పెళ్లైన చేదు నిజం కాస్త ఆలస్యంగా తెలిసింది. తాగే అలవాటు ఉన్న భర్త రోజూ ఆస్మాను మానసిక, శారీరక హింసలకు గురి చేసేవాడు. ఇది తట్టుకోలేక ఒంటి మీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. అయితే కాలిన గాయాలతో ఆమె చాలా కాలం పాటు బాధ పడాల్సి వచ్చింది. భుక్తి కోసం ఎక్కడైనా పనిచేయాలన్నా ఈ కాలిన గాయాల గుర్తులు అడ్డంకిగా ఉండేవి. ఇలాంటి సమయంలో...‘రైటర్స్ కేఫ్’ ఆమెకు ఉద్యోగం ఇవ్వడమే కాదు... సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ధైర్యాన్ని ఇచ్చింది. ‘రైటర్స్ కేఫ్’లో పనిచేసే ఏడుగురిలో ఎవరిని కదిలించినా కన్నీటి కథలు ఎన్నో వినిపిస్తాయి. ‘‘సమాజమే కాదు... సొంతవాళ్లు కూడా మాలాంటి వాళ్లను సూటిపోటి మాటలతో అవమానిస్తుంటారు. మరోవైపు... నేను వికారంగా కనిపిస్తున్నానేమో అనే ఆలోచన మరింత కృంగుబాటులోకి తీసుకువెళుతుంది.ఇలాంటి సమయంలో బాధితులకు రైటర్స్ కేఫ్ అండగా నిలవడం అనేది గొప్ప విషయం’’ అంటుంది కేఫ్‌లో ట్రైనీగా చేరిన లూలు బుహారి.
స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన చెఫ్ స్టాడ్లర్, సిబ్బందికి వంటలు చేయడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ‘రైటర్స్ కేఫ్’ అనేది ‘ఓరియెంటల్ క్యుసైన్’ ఛైర్మన్ యం.మహాదేవన్ మానసపుత్రిక. కీల్‌పాక్ మెడికల్ కాలేజీ ‘బర్న్ వార్డ్’ నుంచి కేఫ్‌కు అవసరమైన సిబ్బందిని ఎంపిక చేసుకున్నారు మహాదేవన్. ఈ ప్రక్రియలో ‘క్రైమ్ ప్రివెన్షన్ అండ్ విక్టిమ్ కేర్’ (పీసీవీíసీ) సంస్థ తమ వంతు సహకారాన్ని అందించింది. పీసీవీసి అనేది గృహహింస బాధితుల కోసం పనిచేస్తున్న సంస్థ. ‘‘మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు. ఈరోజు నువ్వు వంద రూపాయలు సంపాదిస్తే... అందులో 50 రూపాయలు మాత్రమే నీవి. మిగిలిన డబ్బును సమాజం కోసం ఉపయోగించు అని. సమాజం కోసం నావంతుగా ఏదైనా చేయాలనుకోవడానికి ఈ మాట ఎంతో ప్రేరణ ఇచ్చింది’’ అంటున్నారు మహాదేవన్. కేఫ్ అంటే కాఫీ కబుర్లతో సేద తీరే ప్రదేశం కావచ్చు. అయితే ఈ ‘రైటర్స్ కేఫ్’ మాత్రం.... అణువణువూ ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే చోటు. జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే చోటు. బతుకు సమరంలో విజయానికి సరికొత్త ఆయుధాన్ని ఇచ్చే చోటు.