ఆవిష్కరణం: షాంపూ మనదే!
టీవీలో అనునిత్యం షాంపూ కంపెనీల యాడ్స్ హోరెత్తుతుంటాయి. హీరోలు, హీరోయిన్లు వివిధ షాంపూ బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తూ వాడమని చెబుతుంటారు. వాడితే మీ జుట్టుకు పోషణ అందుతుందని, బలపడుతుందని, చుండ్రు ఉండదని చెబుతుంటారు. మరి ఇన్ని లక్షణాలున్న షాంపూను కొనగొన్నదెవరు? ఇది ఎలా విస్తృతంగా వాడకంలోకి వచ్చింది.. అనే విషయాన్ని పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న షాంపూల్లో ఎక్కువ భాగం విదేశాలవే.
అయితే షాంపూను కనుగొన్నది, తొలిసారి వాడినది, దాన్నొక అలవాటుగా మార్చుకొన్నది, తొలి సారి మార్కెట్ చేసిందీ భారతీయులు! మధ్యయుగం నుంచే భారతీయులకు శిరోజ సంరక్షణ కోసం షాంపూను వాడటం అలవాటు చేసుకున్నారు. అసలు ‘షాంపూ’ అనే మాట కూడా భారతీయులదే. హిందీ, మరి కొన్ని ఉత్తరభారతదేశ భాషల్లో ’ఛాంపో’ అంటే ‘మాలిష్’ అనే అర్థం వస్తుంది. ఈస్టిండియా కంపెనీ వాళ్లు బెంగాల్‌లో స్థిరపడ్డాక షేక్‌దీన్ మొహమ్మద్ అనే ఒక బెంగాలీ వ్యాపారీ బ్రిటిషర్లకు షాంపూ గురించి పరిచయం చేసి, బ్రిటన్‌కు ఎగుమతిప్రారంభించాడు. శిరోజాలను శుభ్రం చేయడంతో పాటు సుగంధాన్ని అద్దే షాంపూ పట్ల బ్రిటిషర్లు మక్కువ పెంచుకున్నారు. అలా షాంపూ భారతదేశ తీరాలను దాటింది. ఆ తర్వాత ఫార్ములాను తెలుసుకుని పాశ్చాత్యులు అనేక మార్పు చేర్పులతో షాంపూలను మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టారు. అదే క్రమంగా వేల కోట్ల రూపాయల పరిశ్రమగా మారింది.