
ఆ సీరియల్‌కి ఆమే ప్లస్!
పదే పదే కొడితే పిల్లి కూడా పులిలా మారి ఎదురుదాడి చేస్తుందంటారు. మరి అభిమానం ఉన్న ఆడపిల్ల మనసును గాయపరిస్తే ఆమె మాత్రం ఉగ్రరూపం దాల్చదా? అన్యాయం చేసినవాడికి బుద్ధి చెప్పదా? దుర్గ అదే చేస్తోంది... ‘ఏక్ హసీనా థీ’లో!
స్టార్ ప్లస్‌లో కొద్ది వారాల క్రితమే మొదలయ్యిందీ సీరియల్. మొదటి ఎపిసోడ్ నుంచీ ఉత్కంఠ భరితంగానే ఉంది. దుర్గా ఠాకూర్ చాలా అందమైన అమ్మాయి. ఆమె గాజు కళ్లలో మెరుపులే కాదు... ఎవరికీ అర్థం కాని భావాలు కూడా ఉంటాయి. ఆమె నవ్వులో తళుకులే కాదు... ఎవరూ చదవలేని రహస్యాలు దాగివుంటాయి. ఓ ధనిక కుటుంబాన్ని దెబ్బ తీయడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది.
ఓ యువకుడిని నాశనం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉంటుంది. అసలింతకీ ఆమె జీవితంలో ఏం జరిగింది? ఎందుకు అంతగా పగబట్టింది? అన్న విషయాలను కొద్దికొద్దిగా రివీల్ చేస్తూ అద్భుతంగా తెరకెక్కించారు సీరియల్‌ని. ఈ సీరియల్ మొత్తం క్రెడిట్ దుర్గగా నటించిన సంజీదా షేక్‌కి ఇచ్చేయవచ్చు. నాలుగైదు సినిమాలు, పదికి పైగా సీరియళ్లు చేసిన ఆమె దుర్గ పాత్రను అవలీలగా చేస్తోంది. అద్భుతంగా పోషిస్తోంది. తన అందానికి అభినయాన్ని జోడించి అదరగొట్టేస్తోంది. ఆమే ఈ సీరియల్‌కి పెద్ద ప్లస్!
రవీందర్ కిచెన్‌లో మన వంటలు!
వంటల షోల పట్ల మహిళల ఆసక్తి ఏపాటిదో చెప్పాల్సిన పని లేదు. కొత్త వంటకాలు నేర్చుకోవడానికి పెన్నూ, పేపరూ పట్టుకుని టీవీ ముందు హాజరైపోతారు. అయితే ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతం వంటలు నేర్చుకోవాలన్న ఆసక్తే ఉంటుంది. అందుకే టీఎల్‌సీ లాంటి చానెళ్లు మన వారిని పెద్దగా అలరించలేవు. ఆ లోటును తీర్చడానికి నడుం కట్టింది... యూకేకి చెందిన రవీందర్ భోగల్.
రవీందర్ మూలాలు భారతదేశంలోనే ఉన్నాయి. ప్రతిరోజూ రాత్రి పది గంటలకు టీఎల్‌సీలో ప్రసారమయ్యే ‘రవీందర్స్ కిచెన్’ షోలో... అన్ని దేశాల వంటలతో పాటు మన వంటలనూ కూడా చేసి చూపిస్తుంది. పాత తరహా వంటలకు కొత్త రుచులను అద్దడంలో రవీందర్ మహా నేర్పరి. గతంలో 136 దేశాల వంటకాల గురించి ఆమె రాసిన ‘కుక్ ఇన్ బూట్స్’ పుస్తకం ప్రపంచ ఉత్తమ వంటల పుస్తకంగా అవార్డునందుకుంది!
పేదపిల్ల ప్రేమ పోరాటం!
ఒక ఊరిలో ఓ జమిందారు. మనుషుల జీవితాలతోటి, అమ్మాయిల తనువుల తోటి ఆడుకోవడం ఇతగాడికి మహా సరదా. ఇలాంటి వాడి వలలో చిక్కుతుంది హీరోయిన్. ఓ పేద రైతు కూతురైన ఈమెను లొంగదీసుకోవడానికి పన్నాగాలు పన్నుతాడు జమిందారు. అతడినామె ఎలా ఎదుర్కొంది, మృగంలాంటి వాడిని మనిషిగా ఎలా మారుస్తుంది?
హిందీలో ‘బైరీ పియా’గా అలరించిన ఈ సీరియల్‌ని జెమినీవారు ‘నువ్వే కావాలి’గా తీసుకొచ్చారు. పేదపిల్లగా సుప్రియ జాలిగొలిపే నటన, క్రూరుడైన జమిందారుగా శరద్ హావభావాలు ప్రేక్షకుడిని కట్టి పడేస్తున్నాయి!