అక్కడ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి | Shimla Area in Trains Mystery | Sakshi
Sakshi News home page

అక్కడ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి

Published Sun, Dec 13 2015 11:30 AM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

అక్కడ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి

మిస్టరీ
సిమ్లా... 2005...
‘‘సురభీ... సురభీ... ఏంటా మొద్దు నిద్ర? బాబు ఏడుస్తున్నాడు చూడు’’... భార్య వీపు మీద చరిచాడు రాజేందర్.
 ఉలిక్కిపడి లేచింది సురభి. పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. గబగబా చేతుల్లోకి తీసుకుని పాలు పట్టింది. ఊరుకున్నాడు. ‘‘ఏంటింత నిద్ర పట్టేసింది? పిల్లాడు ఏడ్చినా మెలకువ రాలేదు. ఛ’’... మనసులో అనుకోవాల్సింది పైకే అంది.
 ‘‘ఫర్లేదులే... అలసిపోయావ్ కదా, అందుకే మత్తుగా నిద్ర పట్టేసివుంటుంది’’ అంది అత్తగారు.
 

‘‘రైలు ఆగి చాలా సేపయ్యింది. ఇంకా బయలుదేరడం లేదేంటి?’’ అన్నాడు రాజేందర్ కిటికీలోంచి బయటకు చూస్తూ. అప్పుడుగానీ రైలు కదలడం లేదన్న విషయం మిగిలినవాళ్లకి అర్థం కాలేదు. అందరూ ఒకేసారి కిటికీలోంచి బయటకు చూశారు. కానీ ఏమీ కనిపించడం లేదు. చిమ్మ చీకటి.  ‘‘బాబోయ్... ఏంటింత చీకటిగా ఉంది?’’ అంది సురభి భయంగా.
 
‘‘నేను తెలుసుకుని వస్తాను ఉండు’’ అంటూ లేచి వెళ్లాడు రాజేందర్. చాలా బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అంటే వాళ్లంతా కూడా దిగి ఉంటారు. వడివడిగా తనూ రైలు దిగాడు.
 అది ఒక టన్నెల్... రైలు సరిగ్గా అందులో ఆగిపోయింది. అందుకే అంత చీకటిగా అనిపించింది.
 డ్రైవర్, కొంతమంది టెక్నీషియన్లు లాంతర్లు పట్టుకుని రైలు ఎందుకు ఆగిందా అని పరిశోధిస్తున్నారు. విసిగి పోయిన ప్రయాణికులు అటూ ఇటూ తిరుగుతున్నారు. కొందరు సిగరెట్లు ముట్టించారు. కొందరు పక్కవాళ్లతో బాతాఖానీ కొట్టడంలో మునిగిపోయారు.
 ‘‘ఏమైందండీ... ఇంకా ఎంతసేపు పడుతుంది రైలు బయలుదేరడానికి?’’... డ్రైవర్‌ని అడిగాడు రాజేందర్.
 
‘‘ఏమోనయ్యా... సమస్య ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకు ఆగిందో ముందు నాకు తెలిస్తే, ఎంత సమయం పట్టుద్దో నేను నీకు చెప్తా’’ అన్నాడు విసుగ్గా. రాజేందర్ మౌనం వహించాడు.
 అంతలో... ‘‘పోనీ నన్ను ఓసారి చూడమంటారా?’’ అన్న స్వరం వినబడింది. డ్రైవర్, రాజేందర్‌లతో పాటు అందరూ అటువైపు చూశారు.
 ఎవరో పెద్దాయన. తెల్లగా ఉన్నాడు. విదేశీయుడనుకుంటా. ‘‘మీకు అభ్యంతరం లేకపోతే నేను చూస్తాను’’ అంటూ వచ్చాడు.
 ‘‘మీకు ఎలా తెలుస్తుంది?’’ అన్నాడు డ్రైవర్.
 
‘‘నేను ఇంజినీరింగ్ చేశాను. అలా అని కచ్చితంగా సమస్యేంటో నేను కనిపెట్టేస్తానని చెప్పడం లేదు. కనిపెట్టడానికి ట్రై చేస్తానంతే’’ అన్నాడు చిరునవ్వు నవ్వుతూ.
 సరేనని తలూపి లేచాడు డ్రైవర్. మిగతా వాళ్లంతా కూడా తప్పుకుని దారి ఇచ్చారు. ఆ పెద్దాయన ఇంజిన్ దగ్గరకు వెళ్లి తన పనిలో తాను మునిగిపోయాడు.
 ఐదు... పది... ఇరవై నిమిషాలు గడిచాయి. ‘‘ఓకే... అయిపోయింది. చిన్న సమస్యే. ఇక స్టార్‌‌ట చేయండి’’ అన్నాడాయన ఊపిరి గట్టిగా వదులుతూ.
 
అందరి ముఖాలూ ఒక్కసారిగా వెలిగాయి. క్యాబిన్‌లోకి వెళ్లి డ్రైవర్ స్టార్ట్ చేశాడు. స్టార్‌‌ట అయ్యింది. ‘‘థ్యాంక్సండీ. పొద్దుటి వరకూ ఈ చీకట్లో ఇక్కడే పడిగాపులు పడాలేమోనని భయపడి చచ్చాను’’ అన్నాడు ఆనందంగా.
 ‘‘ఫరవాలేదు’’ అన్నాడాయన. ‘‘అందరూ వెళ్లి ఎక్కండి... త్వరగా’’ అన్నాడు ప్రయాణీకుల వైపు చూస్తూ.
 
అందరూ గబగబా వెళ్లి ఎవరి బోగీల్లోకి వాళ్లు ఎక్కారు. రాజేందర్ కూడా వెళ్లబోతూ ఆయన దగ్గర ఆగాడు. ‘‘యు ఆర్ గ్రేట్ సర్. మీరు ఎక్కడం లేదేంటి’’ అన్నాడు.
 ‘‘మీరు పదండి. కాస్త చేతులు కడుక్కుని ఎక్కుతాను’’ అన్నాడాయన నవ్వుతూ.
 ‘‘సరే. ఇంతకీ మీది ఏ కోచ్?’’
 ‘‘ఎస్ 2... బెర్త్ నంబర్ పదిహేడు’’
 ‘‘ఓకే’’ అనేసి వెళ్లి రెలైక్కి తన సీట్లోకెళ్లి కూచున్నాడు రాజేందర్. రైలు బయలుదేరింది. ఒక్కసారిగా అతడి మెదడులో ఏదో మెదిలినట్లయ్యింది. చప్పున లేచి నిలబడ్డాడు. గబగబా కోచ్ అంతా కలియదిరిగాడు. ఆయన ఎక్కడా కనిపించలేదు. మతి పోయినట్లయ్యింది. నీరసంగా వచ్చి సీట్లో కూర్చున్నాడు.
 
‘‘ఏమైందండీ... ఎందుకలా టెన్షన్ పడుతున్నారు?’’... అడిగింది సురభి.
 ‘‘ఆయన... ఆయన లేడు. ఎక్కడా లేడు. ఏమయ్యాడు?’’ అంటూ మౌనంగా బెర్తుపై వాలాడు రాజేందర్.
 ఉదయం రైలు దిగాక కూడా అతడి గురించి అంతా వెతికాడు. కానీ ఆయన ఎక్కడా కనిపించలేదు.
 ‘‘మళ్లీ ఆయన కోసమే వెతుకు తున్నారా?’’ అంది సురభి భర్తవైపు విచిత్రంగా చూస్తూ.
 ‘‘అవును సురభీ. ఎస్ 2... బెర్త్ నంబర్ పదిహేడు అని చెప్పాడు. నేనూ ఊకొట్టేశాను. కానీ ఆ బెర్త్ నాది. అందులో నేనే ప్రయాణిస్తున్నాను. ఆ విషయం నాకు తట్టనే లేదు. అసలు ఎవరాయన? ఎందుకలా చెప్పాడు? ఏమైపోయాడు?’’
 
ప్రశ్నలే ప్రశ్నలు. జవాబు లేని ప్రశ్నలు. బహుశా ఆ రైలు ఆగిపోయిన స్థలం గురించి పూర్తిగా తెలిసివుంటే రాజేందర్ మనసులో అన్ని ప్రశ్నలు తలెత్తేవి కావు. ఇంతకీ ఏమిటా స్థలం వెనుక, ఆ వ్యక్తి వెనుక ఉన్న రహస్యం?
 రైలు ఆగిపోయిన ఆ చోటు... బరోగ్ టన్నెల్. రైలు బాగు చేసిన ఆ వ్యక్తి... బ్రిటిష్ కల్నల్ బరోగ్. ఆయన చనిపోయి అప్పటికి చాలా సంవత్సరాలయ్యింది!!!
   
 టన్నెల్ నంబర్ 33... బరోగ్ టన్నెల్... ఈ మాట వింటేనే సిమ్లాలో చాలామంది ఉలిక్కిపడుతుంటారు. దాని గురించి మాట్లాడటం ఎందుకులే అన్నట్టు ముఖం పెడతారు. ఎందుకంటే దాని చరిత్ర అలాంటిది.
 
బ్రిటిష్‌వాళ్లు భారతదేశాన్ని పరిపా లించిన కాలంలో, కల్కా ప్రాంతంలో ఒక రైలు మార్గాన్ని నిర్మించాలని తలచారు. ఆ పనికి కల్నల్ బరోగ్‌కి అప్పగించారు. బరోగ్ రైలు మార్గాన్ని వేయడానికి ప్రణాళికలన్నీ సిద్ధం చేశాడు. అయితే అక్కడ ఓ కొండ అడ్డుగా ఉంది. దాన్ని తొలిచి, సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసి, అందులో రైల్వే లైను వేయాలన్నది బరోగ్ ఆలోచన. అనుకున్నదే తడవుగా ఆ పని మొదలు పెట్టేశాడు. త్వరగా పూర్తవడం కోసమని... కొండను రెండు పక్కల నుంచి తవ్వుకుంటూ రమ్మని పనివాళ్లను ఆదేశించాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది.
 
ఆ అతి పెద్ద కొండని చెమటోడ్చి తవ్వసాగారు పనివాళ్లు. అయితే కొలతలు వేయడంలో తేడా వల్ల రెండు పక్కల నుంచీ తవ్వుకుంటూ వెళ్తే ఆ దార్లు ఒకేచోట కలవడం అసాధ్యమని తేలింది. షాకైపోయాడు బరోగ్. తన లెక్క ఎక్కడ తేడా వచ్చిందో అర్థం కాలేదు. తప్పును సరి చేసుకుందామంటే అప్పటికే లక్షల్లో ఖర్చయ్యింది. పనివాళ్లు కూడా తవ్వి తవ్వి విసిగిపోయి ఉన్నారు. దానికితోడు అధికారులు కూడా గుర్రుమంటున్నారు. దాంతో తీవ్ర మనస్తాపం చెందాడు బరోగ్. తన తప్పుకు తనలో తానే కుమిలి పోయాడు. ఓ రోజు మార్నింగ్ వాక్‌కి వెళ్లిన ఆయన... కొండ దగ్గరకు వెళ్లి, తుపాకీతో కాల్చుకుని మరణించాడు.
 ఈ సంఘటన అందరినీ నివ్వెర పరిచింది. అధికారులు సైతం షాకై పోయారు. కేవలం ఓ రైలు మార్గం కోసం ఓ మంచి అధికారి ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలచివేసింది. దాంతో ఆ కొండ దగ్గరే ఆయన్ని గొయ్యి తీసి పూడ్చి పెట్టారు. ఆ తర్వాత మరో అధికారిని నియమించి, కొత్త ప్లాన్ వేసి, టన్నెల్‌ను పూర్తి చేశారు. దానికి బరోగ్ పేరునే పెట్టారు. అక్కడితో ఆ కథ ముగిసిపోయిందని అనుకున్నారు.

 కానీ ముగియలేదు. మొదలైంది. రైళ్లు ఆ టన్నెల్ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఏవేవో వింత శబ్దాలు, అరుపులు వినిపించడం మొదలైంది. ఒక్కోసారైతే ఎవరో మౌనంగా ఏడుస్తున్నట్టు అనిపించేది. ఆ ఏడుపు చాలా బాధతో నిండినట్టుగా ఉండేది. అలాగే బరోగ్ కూడా చాలా మందికి కనిపిస్తూ ఉండేవారు. మొదట్లో ఆయనెవరో ఎవరికీ తెలిసేది కాదు. కానీ బరోగ్ ఎలా ఉంటారో తెలిసిన కొందరు, అది బరోగ్ ఆత్మ అని తేల్చారు. నాటి నుంచీ బరోగ్ ఆత్మ తన ప్రాణాన్ని బలి తీసుకున్న టన్నెల్ చుట్టూనే తిరుగు తోందనే వార్త అంతటా పాకింది.
 
అయితే ఎప్పుడూ ఎవరికీ ఏ హానీ మాత్రం జరగలేదు. పైగా ఓసారి రైలు చెడిపోతే ఆయన ఆత్మ వచ్చి రైలును బాగు చేసిందని కూడా కొందరు చెబుతుంటారు. ఇవన్నీ నిజమని నమ్మేవాళ్లు చాలామంది ఉంటే... కాదని వాదించేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. టన్నెల్ విషయంలో జరిగిన తప్పు వల్ల ఆయన ప్రాణాలు తీసుకుని ఉండొచ్చు, కానీ ఆయన ఆత్మ అక్కడే ఉందనడం మాత్రం అసత్యం అని తేల్చి చెప్పేస్తున్నారు వాళ్లు.

 ఏది నిజమో మనకు తెలియదు. నిజమే అయినా మనం చేసేదేమీ లేదు. నిజం కాకపోతే దాని గురించి ఆలోచించాల్సిన అవసరమూ లేదు. అయితే నిజమా అబద్ధమా అన్నదానితో సంబంధం లేకుండా నేటికీ ఆ సొరంగ మార్గంలో రైళ్లు ప్రయాణిస్తూనే ఉన్నాయి. నిజానిజాలు నిర్ధారించుకోవాలన్న ఆసక్తి కనుక మీరు ఉంటే... ఓసారి మీరూ వెళ్లి ఆ దారిలో ప్రయాణించి రావొచ్చు!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement