షాక్..
పట్టుకోండి చూద్దాం
అప్పటి వరకు మౌన మునిలా ఉన్న వాతావరణం ఉన్నట్టుండి ఉగ్రరూపం దాల్చింది.
రాక్షసులందరూ కట్టగట్టుకొని అరుస్తున్నట్లు ఆకాశంలో శబ్దాలు వినిపిస్తున్నాయి.
కాసేపట్లో భారీ వర్షం వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
హారికకు మనసులో భయంగా ఉంది.
ఇంట్లో ఒంటరిగా ఉండడం హారికకు ఇదే మొదటిసారి.
కుటుంబ సభ్యులందరూ ఒక పెళ్లి కోసం బెంగళూరు వెళ్లారు. ఎగ్జామ్స్ లేకపోతే... తాను కూడా పెళ్లికి వెళ్లేది.
‘‘ఈసారి ఎలాగైనా సరే... మంచి మార్కులు తెచ్చుకోవాలి’’ అని మనసులో గట్టిగా అనుకుంది.
గాలి హోరును, ఆకాశం నుంచి వినిపించే శబ్దాలను పట్టించుకోకుండా చదువులో నిమగ్నమైపోయింది హారిక.
ఇంతలో ఫోన్ మోగింది.
‘‘అప్పటి నుంచి నాన్నగారి ఫోన్‌కు ప్రయత్నిస్తున్నాను. నాట్ రీచబుల్... అని వస్తోంది. నాన్నగారు ఊళ్లో లేరా?’’
‘‘అమ్మా, నాన్న, తమ్ముడు పెళ్లికి వెళ్లారు అంకుల్. రేపు సాయంత్రానికి వచ్చేస్తారు’’ అని చెప్పింది హారిక.
ఫోన్ చేసిన వ్యక్తి సబ్ ఇన్‌స్పెక్టర్ ఆనంద్. హారిక వాళ్ల ఇంటి దగ్గరలోనే ఉంటాడు.
హారిక నాన్న శేఖర్‌కు ఆనంద్ క్లోజ్‌ఫ్రెండ్.
అప్పుడే డ్యూటీ నుంచి వచ్చిన ఆనంద్, శేఖర్‌తో కాసేపు మాట్లాడిపోదామనుకున్నాడు. కానీ ఫోన్ కలవక పోవడంతో ఇంట్లోనే ఉండిపోయాడు.
కాసేపటికి.....
గాలి గట్టిగా వీస్తోంది.
కిటికీ వైపు నుంచి ఏదో పెద్ద శబ్దం వినిపించింది.
‘‘ఎవరూ?’’ అంటూ స్టడీరూమ్ నుంచి బయటికి వచ్చింది హారిక.
ఎవరూ కనిపించకపోవడంతో మళ్లీ స్టడీరూమ్‌లోకి వెళ్లింది.
‘ఎక్కడి నుంచి వచ్చింది ఆ శబ్దం? పిల్లి దూరి ఉంటుంది’ అనుకుంది.
రెండు నిమిషాల తరువాత...
ఏదో అలికిడి కావడంతో స్టడీరూమ్ నుంచి బయటికి వచ్చింది హారిక.
అంతే... వెనక నుంచి ఎవడో గట్టిగా పట్టుకున్నాడు.
కణతల దగ్గర గన్ పెట్టాడు.
‘‘నీ ప్రాణాలు పోవడమా? రక్షించుకోవడమా? అన్నది పూర్తిగా నీ చేతుల్లో ఉంది.
మీ ఇంట్లో ఉన్న డబ్బు, నగలు... ఎక్కడ ఉన్నాయో చెబితే... నీకేమీ కాదు...’’ అన్నాడు ఆ దొంగ.
షాక్ నుంచి కోలుకోని హారిక ఏం మాట్లాడలేదు.
‘‘మాట్లాడవేం....’’ గద్దించాడు దొంగ.
ఈలోపే ఫోన్ మోగింది...
‘‘నువ్వు అడిగినట్లే డబ్బు, నగలు ఎక్కడ ఉన్నాయో చెబుతాను.
అయితే ఆ ఫోను ఎత్తనివ్వు’’ అన్నది హారిక.
‘‘ఇంట్లో దొంగ దూరాడని చెప్పడానికా?’’ కళ్లెర్ర చేశాడు దొంగ.
‘‘కాదు... నేను ఆ ఫోన్ అటెండ్ చేయకపోతే... నేనేదో ప్రమాదంలో ఉన్నారనుకుంటారు. అందుకే...’’ అంది తెలివిగా హారిక.
‘‘సరే, మాట్లాడు. నా గురించి ఒక్క మాట చెప్పినా... నీ ప్రాణాలు తీస్తాను’’ అని బెదిరించాడు దొంగ.
ఫోన్ ఎత్తింది హారిక.
అటు నుంచి హారిక అమ్మ రజనీ: ‘ఎలా ప్రిపేరవుతున్నావు?’
‘‘నోట్స్ కోసం ఆ రవిని హెల్ప్ అడిగాను. నీరజను హెల్ప్ అడిగాను. శ్రీని హెల్ప్ అడిగాను... ప్లీజ్ ఎమర్జెన్సీ అని కూడా చెప్పాను. కానీ ఎవరూ హెల్ప్ చేయలేదు’’ అని ఫోన్ పెట్టేసింది హారిక.
ఇది జరిగిన పదినిమిషాల్లోనే ఆ ఇంటిని పోలిసులు చుట్టుముట్టారు. దొంగను అరెస్ట్ చేసి పోలిస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లాడు ఇన్‌స్పెక్టర్ ఆనంద్.
ఇప్పుడు చెప్పండి...
హారిక ప్రమాదంలో ఉన్నట్లు బయటి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మరి ఎలా ఈ ప్రమాదం నుంచి హారిక బయట పడింది?
ఫోన్‌లో మ్యూట్ బటన్ ఉపయోగించి ‘ఆ రవిని నోట్స్ కోసం అడిగాను’, ‘నీరజను అడిగాను’, ‘శ్రీని అడిగాను’ అనే మాటలు వినబడకుండా కేవలం ‘హెల్ప్’ ‘హెల్ప్’ ‘హెల్ప్’ ‘ప్లీజ్ ఎమర్జెన్సీ’ అనేవి మాత్రమే తల్లికి వినబడేలా చేసింది హారిక. దీంతో కూతురు ప్రమాదంలో ఉందని గ్రహించి వెంటనే ఇన్‌స్పెక్టర్ ఆనంద్‌కి ఫోన్ చేసింది రజనీ.