స్లీపింగ్ బ్యూటీ
ఇంటర్వ్యూ
కుర్రకారు మతులు పోగొడుతున్న అందాల భరిణె ఆలియాభట్.
ఇంతకీ ఆ అందం వెనుక రహస్యం ఏమిటో తెలుసా? నిద్ర.
అవును.
‘అవకాశం దొరికితే ఏకధాటిగా పదిహేను గంటలైనా నిద్రపోతాను,
అదే నా బ్యూటీ సీక్రెట్’ అంటోంది ఆలియా.
ఈ స్లీపింగ్ బ్యూటీ తన గురించి చెప్తోన్న మరిన్ని రహస్యాలివి...
* నాకు మూడేళ్లున్నప్పుడు నాన్న గారు (దర్శకుడు మహేష్‌భట్) తన సినిమా ఒకటి సేషెల్స్‌లో తీయాలని ప్లాన్ చేశారు. తాను ఎలాగూ వెళ్తున్నాను కదా అని ఫ్యామిలీని కూడా వెంట తీసుకెళ్లారు. అప్పుడు నేను తప్పిపోయానట. హోటల్ రూమ్ నుంచి నడచుకుంటూ అలా అలా బయటికి వెళ్లిపోయానట. కంగారుపడి వెతికితే ఓచోట రోడ్డుమీద నడుస్తూ కనిపించానట. అప్పుడు వాళ్లకి దొరక్కపోయి ఉంటే ఇప్పుడు నేనెక్కడుండేదాన్నో!
* నాకు జంక్‌ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే పడి చస్తాను. రోజులో ఎన్నిసార్లు తినమన్నా, ఎన్ని తినమన్నా తినేస్తాను. అయితే నేనేదీ వేడిగా ఉంటే తినలేను. కాఫీ దగ్గర్నుంచి ప్రతి ఫుడ్‌నీ చల్లారబెట్టుకునే తింటాను. పైగా ఏం తిన్నా అందులో పెరుగు కలుపుకోవడం ఇష్టం నాకు. చైనీస్, ఇటాలియన్, మెక్సికన్... తినేది ఏదైనా అందులో పెరుగు కలిపేస్తా. నేనలా చేస్తుంటే నా ఫ్రెండ్సంతా ముఖాలు అదోలా పెడతారు. అయినా నేను మానను!
* నాకు విమాన ప్రయాణాలంటే కూడా యమా ఇష్టం. గాలిలో తేలేటప్పుడు మనసు కూడా ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటుంది. అదో గొప్ప అనుభూతి. ఆ అనుభూతి కోసం ఎప్పుడూ అలా విమానాల్లో ప్రయాణిస్తూనే ఉండిపొమ్మన్నా ఓకే నాకు!
* బయటి నుంచి వచ్చి ఇంట్లో అడుగు పెట్టగానే నేను చేసే మొదటి పని ఏంటో తెలుసా? కాళ్లు కడుక్కోవడం. ఆ పని చేశాకే ఏ పనైనా చేస్తా!
* నేను అస్తమానం నా స్టయిల్‌ను మార్చేస్తూ ఉంటాను. ఎప్పుడూ ఒకేలా ఉండటం నాకు నచ్చదు. ఏ కొత్త స్టయిల్ కనిపిస్తే దాన్ని ఫాలో అయిపోతుంటా. ఒక్కోసారి అది నప్పక నాకు నేనే విచిత్రంగా కనిపిస్తాను. దాంతో దెబ్బకి దాన్ని మార్చేసి మరో కొత్త స్టయిల్ మొదలుపెడతాను!
* అందరూ తన లవర్ అందంగా ఉండాలి, అర్థం చేసుకునేవాడై ఉండాలి అని చెబుతుంటారు కదా! నాకు మాత్రం నా లవర్ ఎప్పుడూ సువాసనలు వెదజల్లుతూ ఉండాలి. మంచి వాసన నన్ను వెంటనే అట్రాక్ట్ చేస్తుంది. అబ్బాయిల విషయంలో కూడా నేను త్వరగా పడిపోయేది దానికే. ఇంకో సీక్రెట్ చెప్పనా? నేను ఎప్పుడూ మగాళ్ల పర్‌ఫ్యూమ్సే వాడతాను. పైగా నెలకొకటి మారుస్తుంటాను!
* నాకు పుస్తకాలు చదవడం ఇష్టం. కానీ పడుకుని మాత్రమే చదవాలి. కూర్చుని చదివితే ఎక్కదు. గుర్తు కూడా ఉండదు. అదో వీక్‌నెస్‌లెండి!
* నేను హిందీ చాలా బాగా మాట్లాడతానని కొందరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. వాళ్లకు అలా ఎందుకనిపించిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే... నాకు హిందీ అంత బాగా ఏమీ రాదు. స్కూల్లో హిందీ వక్తృత్వ పోటీల్లో ఎప్పుడూ ఓడిపోయేదాన్ని. మరి నా హిందీ బాగోవడమేమిటో!
* నేను బాగా నటిస్తానని చాలామంది మెచ్చుకుంటుంటారు. అయితే నాకు ఏడవడం సరిగ్గా రాదు తెలుసా? నా ఏడుపు నాకే ఆర్టిఫీషియల్‌గా అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ పరిణీతి చోప్రా ట్రాజెడీ సీన్లలో ఎంత బాగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుందో. అందుకే ‘ఇషక్‌జాదే’ సినిమా చూశాక తన దగ్గరకు వెళ్లి... ‘నాకు నీ అంత బాగా ఏడవడం నేర్పించు’ అని అడిగాను!
* నేను చాలా యాక్టివ్‌గా ఉంటానని అందరూ అంటుంటారు. నాకు బద్దకం ఎంత ఎక్కువో వాళ్లకు తెలీదు పాపం. నిద్రపోవడమంటే నాకెంత ఇష్టమో! షూటింగ్ లేనప్పుడు పద్నాలుగు పదిహేను గంటలు ఏక ధాటిగా నిద్రపోతుంటాను. అయినా గ్లామర్ పెరగడానికి నిద్ర కూడా అవసరమే తెలుసా!