కొంత ఉంది; కొంత లేదు | something is there | Sakshi
Sakshi News home page

కొంత ఉంది; కొంత లేదు

Published Sun, Dec 15 2013 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

కొంత ఉంది; కొంత లేదు

కొంత ఉంది; కొంత లేదు

 ఆజన్మం

 ఒక్కరికైనా లేచి సీటు ఇవ్వకపోవడానికి తగిన కారణం కనబడలేదు.
 
 చాలా రోజుల తర్వాత మేడ్చల్ వెళ్లాను. తెలియడంలేదుగానీ నిజానికి రోజులు కాదు, వెళ్లక ఏళ్లయింది. ఒక్కడినే పోవడానికి తోచక, పిల్లాణ్ని తీసుకెళ్దామనుకున్నాను. చూడండి... నేను అచ్చు సంసారినైపోతున్నాను!
 
 ‘వెళ్దాం’ అని ఊల పెట్టేసరికి, చిన్నోడు ఏడుప్పాట ఎత్తుకున్నాడు; ఎక్కడ వాణ్ని తీసుకెళ్లనేమోననీ, వాడికి బదులుగా అన్నను తీసుకెళ్తానేమోననీ. అదింకా ఎక్కువ బాధ కదా!
 పెద్దపిల్లల్తో పోల్చితే చిన్నవాళ్లు కొంత విస్మరణకు గురవుతారనుకుంటాను; ప్రతి ‘ఫస్ట్ మూమెంట్’ పెద్దపిల్లలే ఇస్తుంటారు కాబట్టి. ఆ ‘గ్రౌండ్’ మీద చిన్నోడివైపు మొగ్గాను.
 
 ‘పిల్లికి (కూడా) జిన్‌పాయింట్ ఏద్దా’మనే రకం వాడు! వేసుకుని, జుట్టు కట్టుకుని తయారైయాడు.
 బస్టాపుకు నడుస్తుండగా- ‘నేను ఎనుకకు వోత’ అని ముందు నడిచాడు; ‘ఆటో పీక ఒత్తుత నానా... నానా, ఆటో పీక ఒత్తుత’ అన్నాడు. అన్ని ఆటో హారన్లు ఒత్తించలేం; డ్రైవర్ ముఖం కొంత ప్రసన్నంగా కనబడాలి!
 ప్యారడైజ్ వెళ్తుండగా- ‘చీతపులి’ గురించి చెప్పాడు; ‘నేనింత పెద్దగైనగదా’ అని తన మూరెడు కొలత చూపించాడు; ‘నాగాజున్‌కు జిన్ పాయింట్ ఉంటదా’ అనడిగాడు; ‘నేను చిన్నగున్నప్పుడు’ పోయిన జా(రుడు)బండ గురించి చెప్పాడు. వాడికీ నాస్టాల్జియా! ఆ పూట మాటలు ‘ఖాళీ’ అయ్యాక, కునికిపాట్లు పడసాగాడు. దాంతో భుజం మీద వేసుకున్నాను.
 
 ప్యారడైజ్‌లో మేడ్చల్‌వి వరుసగా ఆరు బస్సులు వెళ్లిపోయాయి. అన్నీ ఫుల్లు! ఆదివారం పూట అంత రద్దీని ఊహించలేదు. ఏడోది కూడా వదులుకోవడం ఇష్టంలేక, వచ్చిన ‘మెట్రో’ ఎక్కేశాను(ము). రద్దీగా లేదుగానీ సీటు లేదు. ‘‘మీక్ సీట్ దొర్కలేదా?’’ టికెట్‌కు వచ్చిన కండక్టర్ ఆశ్చర్యపోయాడు! చంటిపిల్లాడిని ఎత్తుకుని కూడా నిలబడేవున్నానని ఆయన ఉద్దేశం! నవ్వి ఊరుకున్నాను. కాసేపు రాడ్ పట్టుకున్నాను; కాసేపు వాణ్ని కుడి భుజం మీదికి మార్చుకున్నాను; కొద్దిగా కదిలితే వీపుమీద నెమ్మదిగా తట్టాను.
 
 బస్సు వెనకవైపున్నాం. అందరూ ఊరికే కూర్చున్నారు. లగేజీలేం లేవు. ఒక్కరికైనా లేచి సీటు ఇవ్వకపోవడానికి తగిన కారణం కనబడలేదు. వాళ్లకు వాళ్లే బరువుగావుంటే ఏం లేస్తారులే! నేను కూర్చునివుండి, ఇంకెవరైనా ఇలా బాబుతో ఉంటే- ‘లేస్తానా, లేవనా’ అని తర్కించుకున్నాను. మహా అయితే పాతిక కిలోమీటర్ల దూరం! లేచేవాణ్నే, అనిపించింది. ఇక్కడ దూరం కన్నా కూడా, ఒక కన్సెర్న్ కదా!  నా చిన్నపాటి వ్యక్తిగత సౌఖ్యం సమాజంతో ముడిపడివుండటం బాధించింది. అంతకుముందటి ప్రయాణానందం చేదెక్కింది. అందరి ముఖాలు నాకు వికారంగా కనబడుతున్నాయి. వాళ్లు సెల్‌ఫోన్లల్లో మాట్లాడుతున్నది చెత్త! కిటికీల్లోంచి చూస్తున్నది పేలవమైన ప్రపంచం!
 
 జీడిమెట్ల దగ్గర ఒకాయన సీటు ఆఫర్ చేశాడు(‘‘ఫర్లేద్సర్.’’). చిత్రంగా ఆయన ‘ప్రేమ’ కూడా నాకు రుచించలేదు. ‘దగ్గర్లోనే దిగుతా’నని లేచాడు. కూర్చున్నాక- ఎవరివైపూ తేరిపారగా చూడటం ఇష్టం లేకపోయింది. ఆ బస్సే సుఖంగా లేదు.
 
 కొంపెల్లి అందాజాలో చిన్నోడు మేలుకున్నాడు. ‘ఇది ఎంత నానా? అది ఎంత నానా?’ (ఏంటి) అని అడుగుతూపోయాడు. ‘ఇది నానా! అది నానా!’ అని చెబుతూపోయాను. నానా: ఒకే పదాన్ని రెండు భిన్న ప్రేమల్తో పిలుచుకోవడం ఆశ్చర్యంగా లేదూ!
 
 ఒక విషయాన్ని రియలైజ్ అవుతున్నప్పుడు- కేవలం అందులో ఆనందం పొందుతాను. ఆ అనుభవపు అసలైన క్షణం దాటింతర్వాత, ‘అరె, ఇది రాయొచ్చుకదా!’ అనిపిస్తుంది. వాళ్లకు మోకాళ్ల నొప్పులుండొచ్చు; కడుపులో మంట కావొచ్చు; గంటక్రితం వేరే బస్సులో నిలబడి వచ్చి, ‘అమ్మయ్య సీటుదొరికిం’దని కూర్చునివుండొచ్చు; ఏదైనా ఆపరేషన్ జరిగివుండొచ్చు; కొందరికి ఇవ్వాలనివున్నా మొహమాటం అడ్డురావొచ్చు. సానుకూల మొహమాటం కూడా ఉంటుంది. ఎవరూ భిక్ష వేయనప్పుడు మనం వేయడానికి పడే ఇబ్బందిలాంటిది! కొందరికి ఈ ఇష్యూతో సంబంధం లేకుండా ఇప్పుడే వచ్చిన స్టాపులో ఎక్కివుండొచ్చు. అయినా వాళ్లందరివైపూ నా కోపం పాకింది. వర్గం, కులం, మతం, ప్రాంతం ప్రాతిపదికన ఏర్పడే ద్వేషభావన కూడా ఇలాగే ఎదుటివారిని గురించి ఆలోచించనీయని అహేతుకతకు దారితీస్తుందా!
 
 
 సాయంత్రం రిటర్నులో- ప్యాట్నీ దగ్గర- దిగడానికి ఫుట్‌బోర్డు మీద రెడీగావున్న హెడ్‌ఫోన్స్-బ్లాక్ జీన్సు- బ్లూ టీషర్టు కుర్రాడు కవర్లో ఏదో ద్రవం పట్టుకెళ్తున్నాడు. కారి, ప్యాంటు మీద బుడగల్లా పడిందది. వెంటనే, వెనకసీట్లో కూర్చున్న బ్లాక్ జీన్సు- చెక్స్ షర్ట్ అబ్బాయి తన ‘సర్టిఫికెట్ల’ కవర్ తీసిచ్చాడు (‘‘థాంక్సన్నా.’’). మనుషుల దగ్గర కొంతేదో ఉంది; కొంతేదో లేదు.
 
 - పూడూరి రాజిరెడ్డి
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement