తపాలా: దాదాపు 35 యేళ్ల క్రితం సంఘటన ఇది. అప్పుడు గుంటూరు నుంచి హైదరాబాద్‌కు రెండు రైళ్లు నడిచేవి. ఉదయం కృష్ణా, మధ్యాహ్నం గోల్కొండ. బీబీనగర్-నడికుడి రైలుమార్గం అప్పుడు లేదు. హైదరాబాద్ వెళ్లాలంటే బెజవాడ మీదుగా పోవాల్సిందే!
ఒకసారి మా పిన్నిని, బాబాయిని గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఎక్కించటానికి గుంటూరు స్టేషన్‌కు వచ్చాం. టికెట్ కౌంటర్ దగ్గర బాగా రష్‌గా ఉంది. టికెట్ ఎలా తీసుకోవాలి? అని ఆలోచిస్తూ మా బాబాయి నిలబడ్డాడు. మా తమ్ముడు జయప్రసాద్ అభిమన్యుడిలా గుంపులోకి చొరబడి, ఐదు నిమిషాల్లో కొనుక్కుని వచ్చాడు విజయగర్వంతో.
అంతలో ప్లాట్‌ఫారమ్ మీదకు ట్రైన్ వచ్చింది. మేం అన్ని సామాన్లు ఖాళీ కంపార్ట్‌మెంట్‌లో పెట్టి, ఇద్దరికీ కిటికీ పక్కన సీటు సంపాదించాం. మా శ్రమకు మెచ్చి చెరో పది రూపాయలు చేతిలో పెట్టాడు బాబాయి.
ఆ రోజు ఆలస్యంగా రావటంతో త్వరగా బయలుదేరింది ట్రైన్. మేం వీడ్కోలు చెప్పి స్టేషన్ బయటకు వచ్చాం. మా తమ్ముడు జేబులో డబ్బులు పెట్టుకుంటూ, ‘‘అన్నా! టిక్కెట్లు నా దగ్గరే ఉన్నాయి. పిన్నీవాళ్లకు ఇవ్వలేదు’’ అంటూ ఏడుస్తూ చెప్పాడు.
అది వర్షాకాలం. అప్పుడే జోరుగా వర్షం మొదలైంది. మా వద్ద ఉన్న ఆ ఇరవై రూపాయలతో స్కూటర్‌లో పెట్రోల్ పోయించుకుని, గోల్కొండ ఎక్స్‌ప్రెస్ విజయవాడ చేరేలోపు మేం స్పీడుగా రోడ్డుపై ప్రయాణించి, విజయవాడ చేరాం.
అప్పుడే ట్రైన్ ప్లాట్‌ఫారమ్ మీదకు వచ్చింది. మేం పరుగుపరుగున కంపార్ట్‌మెంట్ దగ్గరకు పోయాం. మమ్మల్ని చూసి, ‘‘ఇదేమిటిరా. మీరు ఇక్కడికి వర్షంలో తడుచుకుంటూ ఎందుకు వచ్చారు?’’ అని ఆశ్చర్యపోయారు పిన్ని, బాబాయి.
విషయం చెప్పి, టికెట్లు ఇచ్చి స్టేషన్ బయటకు వచ్చాం. అసలు సంగతేమిటంటే, మేం వారికి టికెట్లు ఇచ్చేవరకు వాళ్లకి ఈ సంగతే గుర్తురాలేదట!
- జన్నాభట్ల నరసింహప్రసాద్
నాగారం, రంగారెడ్డి జిల్లా
టికెట్లు జేబులో! బాబాయి రైల్లో!
Published Sun, Oct 19 2014 1:38 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM
Advertisement