
ప్రస్తుతానికి ఎవరూ లేరు..!
ఇంటర్వ్యూ
మోడలింగ్‌లోంచి నటనలోకి దూసుకొచ్చింది కృతి సనన్.
రావడంతోనే ‘నేనొక్కడినే’లో మహేశ్‌బాబు సరసన మెరిసింది.
‘దోచెయ్’లో నాగచైతన్యతో జతకట్టింది.
అందంమైన రూపంతో పాటు చక్కని ప్రతిభ కూడా ఉంది
అంటూ ప్రశంసలు కొట్టేసిన కృతి మనసులోని మాటలివి...
♦ మోడలింగ్ నుంచి నటనలోకి ఎలా?
ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు మోడలింగ్ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ అప్పుడు నేను ఓ పక్క చదువుకుంటూ, మరోపక్క కథక్ నేర్చుకుంటూ బిజీగా ఉన్నాను. దాంతో మోడలింగ్‌ను ఓ హాబీలాగా మొదలుపెట్టాను. కానీ నా యాడ్స్ డెరైక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ అనేవారు... నేను స్క్రీన్‌కి సరిగ్గా సూటవు తానని, చాలా సహజమైన ఎక్స్‌ప్రెషన్‌స ఇస్తానని. అప్పుడే నటన మీద ఆసక్తి పెరిగింది. అదృష్టం కొద్దీ అవకాశాలు కూడా త్వరగానే వచ్చాయి. దాంతో ‘హీరో పంతీ’తో బాలీవుడ్‌లో, ‘నేనొక్కడినే’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టాను.
♦ అంటే చదువు అక్కడితో ఆపేశారా?
లేదు. ఇంజినీరింగ్ పూర్తి చేశాను. విదేశాల్లో ఎంబీయే చేయాలని ఎంట్రన్స్ పరీక్ష కూడా రాశాను. తర్వాత సినిమాల్లో బిజీ అయిపోవడంతో దాన్ని పక్కన పెట్టాను. కానీ అది తాత్కాలికంగానే. ఎప్పుడో అప్పుడు ఎంబీయే కూడా పూర్తి చేసి తీరతాను. ఎందుకంటే నాకు చదువంటే చాలా ఇష్టం.
♦ మీ దృష్టిలో యాక్టర్‌కి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ?
మామూలుగా అయితే మనిషికి తృప్తి అనేది అవసరం అంటారు. కానీ నటికి గానీ నటుడికి గానీ తృప్తి అన్నది ఉండకూడదు అన్నది నా ఉద్దేశం. ఎంత చేసినా ఇంకా బాగా చేయాలి అని తపించాలి. ఆ లక్షణమే మనల్ని గొప్ప యాక్టర్‌గా నిలబెడుతుంది.
♦ మరి గ్లామర్ సంగతి?
అందం అనేది నటికి ఓ ప్లస్ పాయింట్. అంతే తప్ప అందమే కొలమానం కాదు. అందంగా ఉన్నా టాలెంట్ లేకపోతే ఎవరూ అవకాశాలు ఇవ్వరు.
♦ ఇండస్ట్రీలో రాణించాలంటే గాడ్‌ఫాదర్ ఉండాలా?
రాణించాలంటే అవసరం లేదు కానీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే మాత్రం ఎవరైనా మన వెనుక ఉండటం అవసరమేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంత లేదన్నా అవకాశాలు కాస్త త్వరగా వస్తాయి. అయితే రాణించాలంటే మాత్రం మన టాలెంటే ముఖ్యం. లక్కీగా నాకు మొదట్లోనే మహేశ్‌బాబు, నాగచైతన్య లాంటి స్టార్స్‌తో నటించే చాన్స్ వచ్చింది.
♦ అంటే మీరూ స్టార్ అయిపోయినట్టే?
లేదు లేదు. స్టార్ అవడం అంత తేలిక కాదు. హృతిక్ రోషన్‌లాగ అందరూ ఒక్క సినిమాతోనే స్టార్ అయిపోవాలంటే సాధ్యం కూడా కాదు. స్టార్ హీరోయిన్ అనిపించుకోవడానికి నేను చేయాల్సింది చాలా ఉంది.
♦ నటి అయ్యాక మీలో ఏదైనా మార్పు వచ్చిందా?
రాలేదు, రాదు. ఒకవేళ తర్వాత మెల్లమెల్లగా వచ్చినా, ఆ మార్పు కచ్చితంగా మంచిదే అయి ఉంటుంది. ఎందుకంటే ఆ మార్పు నాలో కాదు... నా పర్‌ఫార్మెన్స్‌లో వస్తుంది కాబట్టి!
♦ ప్రస్తుతం మీ ముందున్న చాలెంజ్?
పాత్రల ఎంపికే. అవకాశాలు బాగానే ఉన్నాయి. అయితే తొందరపడి ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకుని, నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చుకోవడం ఇష్టం లేదు నాకు. అందుకే జాగ్రత్తగా ఆలోచించి, మంచి పేరు తెచ్చే పాత్రల్ని మాత్రమే ఎంచుకోవాలని అనుకుంటున్నాను.
♦ షారుఖ్ సినిమాలో చేస్తున్నట్టున్నారు?
అవును... ‘దిల్‌వాలే’. రోహిత్‌శెట్టి దర్శకుడు. నేను షారుఖ్‌కి కాదు, వరుణ్ ధావన్‌కి జోడీని. కానీ షారుఖ్‌తో కాంబి నేషన్ సీన్లు ఉన్నాయి. ఆయనతో కలిసి పని చేయడం నా అదృష్టం. చిన్నతనం నుంచీ నేనాయన ఫ్యాన్‌ని. అలాంటిది ఇంత త్వరగా ఆయన సినిమాలో నటించే చాన్స్ వచ్చిందంటే నా ఆనందం ఎలా ఉంటుంది! పైగా ఆయన చాలా మంచి వారు. ఎంతో బాగా మాట్లాడతారు. మనలో ఏ కాస్త బెరుకైనా ఉంటే తన మాటలతో పోగొట్టేస్తారు. గొప్ప హీరో!
♦ ఇంతకీ మీ రియల్ లైఫ్ హీరో ఎవరు?
ప్రస్తుతానికి ఎవరూ లేరు. ఓ బంధం ఏర్పడాలంటే టైమ్ రావాలి. ఆ బంధాన్ని బలపర్చుకోవాలంటే టైమ్ కావాలి. నా దగ్గర ఇప్పుడు అంత టైమ్ లేదు. ముందు నేను నటిగా నిలదొక్కు కోవాలి. తర్వాతే అలాంటివన్నీ ఆలోచిస్తాను.