ప్రాచీన పాపం | Special Story On Funday Magazine In Sakshi | Sakshi
Sakshi News home page

ప్రాచీన పాపం

Published Sun, Oct 20 2019 11:45 AM | Last Updated on Sun, Oct 20 2019 11:45 AM

Special Story On Funday Magazine In Sakshi

రైతు బజారులో, సినిమా హాళ్ల దగ్గరా, రైల్వే, బస్‌స్టేషన్ల లోపల, స్కూళ్లూ కాలేజీ గేట్లలో యొహోవా ‘ప్రాచీన పాపం’ అనే శీర్షిక ఉన్న కరపత్రాలు పంచిపెడుతూ ఉంటాడు. అలా చాలాచోట్ల కనిపించిన వ్యక్తి సరాసరి మా ఇంటికి వచ్చి, తలుపు తెరుచుకుని, హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నన్ను చూసి నవ్వాడు. నవ్వాను కానీ నాకు ఆశ్చర్యం! అంతలోనే అడిగాడు ‘మనవడా, కరపత్రం చదివారా?’ మళ్లీ ఆశ్చర్యం! నాకా ఎనభై ఏళ్లు! మునిమనవళ్లు ఉన్నారు. నన్ను మనవడా అంటున్న యొహోవాకు యాభై ఏళ్లకంటే ఎక్కువ ఉండవు. క్రైస్తవులు ఎవరినైనా ‘బ్రదర్‌’ అంటారు. ఈ యొహోవా నన్ను ‘మనవడా’ అంటున్నాడు. మరి ఆశ్చర్యమే కదా!

‘చదివాను’ అన్నాను.
‘అర్థమైందా?’
‘కాలేదు!’
‘పుట్టిన ప్రతి మనిషీ పాపే! పిల్లలతో సహా!’
‘పిల్లలు– పసివాళ్లు– ఏం పాపం చేస్తారు?’
‘తల్లిదండ్రుల రోగాలలాగా పాపాలూ పిల్లలకు సంక్రమిస్తాయి!’
‘వాళ్లేం పాపం చేసి ఉండకపోతే?’
‘పుట్టుకే పాపం! పుట్టకపోతే పాపమూ లేదు. శాపమూ లేదు.’
‘పుట్టటం మన స్వాధీనంలో లేదు. మనం కోరి పుట్టలేదు. అసలు పుట్టకముందు మనమున్నామో లేదో తెలియదు. పుట్టటం పాపమంటే ఈ పాపపు బతుకెందుకు? అసలు పుట్టకుండా ఉంటే పోలా? అయినా పాపమంటే ఏమిటి?’ కొంచెం చికాకుగానే అడిగాను.
‘ఆజ్ఞాతిక్రమమే!’ అన్నాడు.
‘అంటే?’
‘వద్దన్న పని చేయటమే!’
‘వద్దన్న పని చేస్తే తప్పుకాని, పాపం ఎలా అవుతుంది?’
‘తప్పే పాపం!’
‘ఎవరు తప్పు చేశారు?’
‘మీ ప్రాచీన మానవుడు!’
‘ఏం తప్పు చేశాడు?’
‘వద్దన్న పండు తిన్నాడు!’
నాకు కోపంగా ఉంది. యొహోవా దైవసేవకుడిగా ఉన్నాడని కోపం అణచుకున్నాను.
‘మీ పేరు నాకు కొత్తగా ఉంది. యొహోవా నా దేవుడు అనే మాట విన్నాను కాని, యొహోవా అనే మనిషి ఉంటాడని నాకు తెలియదు. కొత్తగా ఉంది.’
‘మీ పేరూ మనుషుల్లో ఉంటుందని నాకూ తెలియదు. అందుకే మీ ఇంటికి వచ్చాను.’
‘నా పేరు మీకెట్లా తెలుసు?’
‘రచయిత కదా!’
నాక్కొంచెం ఆనందం కలిగింది.
‘మీ పుస్తకాలు చూపిస్తారా?’ యొహోవా అడిగాడు.
‘రండి’ అని లోపలికి తీసుకువచ్చి, ‘ఇవి నా రచనలు. ఒక్కొక్క పుస్తకం ఇక్కడ పెట్టాను’ అద్దాల అలమరా చూపించాను.
‘చూడొచ్చునా?’
‘నిరభ్యంతరంగా’
‘తీసి చూడవచ్చునా?’
‘వీల్లేదు!’
‘ఏం?’
‘ఆజ్ఞాతిక్రమం!’ పెద్దగా నవ్వాడు యొహోవా.
‘ఇవన్నీ, ఇన్ని షోకేసులు. ఏమిటవి?’
‘జ్ఞాపికలు. ఆత్మీయుల అభినందన గుర్తులు.’
‘ఈ సీసాలేమిటి?’ నేను జవాబు చెప్పే ముందే కూతురు కాఫీ కప్పు తెచ్చి ఇచ్చింది. కాఫీ తాగుతూ ‘నేను ద్రాక్షరసం తాగుతాను’ అన్నాడు. 
‘ద్రాక్షపళ్లు మిక్సీలో వేసి చేయించనా?’ అని అడిగాను.
‘ఫ్రూట్‌ జూస్‌ కాదు, వైన్‌.’ అన్నాడు. నాకు చికాకు కలిగింది.
యొహోవా ఎవరో, ఏ ఊరో, ఏం పనో, ఏమీ తెలియదు. ప్రాచీనపాపం కరపత్రాలు పంచడం మాత్రమే తెలుసు. చొరవగా చొరబడి ఇంట్లోకి రావడమే కాకుండా, మిత్రుడిలా, బంధువులా డిమాండు చేస్తుంటే చికాకుగా అనిపించింది. ఇంటికి వచ్చిన మనిషిని ఇబ్బంది పెట్టలేక మౌనంగా ఉన్నాను.
‘మీకు పుణ్యం కావాలని లేదా?’ అని ప్రశ్నించాడు.
‘యొహోవాగారూ! నేను ప్రాచీనపాపం చాలాసార్లు చదివాను. నాకు చాలా సందేహాలున్నాయి.’ అన్నాను.
‘అడగండి!’ అన్నాడు.
‘ఆ వనంలో ఆ చెట్టు నాటటం ఎందుకు? దానికి అంత అందమైన, పరిమళభరితమైన పళ్లు కాయించడం ఎందుకు? తాను సృష్టించిన మనిషిని పిలిచి, ఆ చెట్టు పళ్లు తినవద్దనడం ఎందుకు? తింటే పాపమని శపించడం ఎందుకు? తిన్నవాణ్ణే పాపి అనకుండా, ఆ పళ్లు తినని వాడి సంతానాన్ని– తరతరాల సంతానాన్ని పాపులు అనటం ఎందుకు? వేలాది సంవత్సరాల తర్వాత కోట్లాది మందిని పాపులు అనటం ఎందుకు? నన్ను పాపి అనటం ఎందుకు? మానవజాతిని పాపిష్టిజాతి అనటం ఎందుకు? నువ్వు స్వీట్లు టేబుల్‌ మీద పెట్టి, నీ కొడుకుల్నీ కూతుళ్లనూ తినవద్దంటే మానతారా? తినరాదనడం న్యాయమా? తినరానివి ఇంటికి తేవడం ఎందుకు? తినరాని చెట్టు పళ్లు కాయించడం ఎందుకు? తినరాని పళ్ల చెట్టు ఆ ఉద్యానవనంలో నాటించడం ఎందుకు?’

యొహోవా అందంగా నవ్వాడు. నవ్వు బాగుంది. నాకు అసహనం తగ్గలేదు.
‘మనిషికి సంయమనం ఉండాలి. సహనం ఉండాలి. వద్దన్న పని మానాలి. చేయమన్న పని చేయాలి.’ అన్నాడు యొహోవా. 
నాకు సంతృప్తి కలగలేదు.
‘నాకు కాఫీ ఇచ్చి మీరు తాగలేదేం?’
‘నేను కాఫీ టీలు తాగను!’
‘ఎందుకు?’
‘నా ఆరోగ్యం కోసం!’
మళ్లీ యొహోవా అడిగాడు ‘ఈ అద్దాల షోకేసులోని రంగురంగుల సీసాలు, అందమైన సీసాలు, వివిధ ఆకారాల్లోని సీసాలు బాగున్నాయి. ఏమిటవి?’
‘మీకెందుకు?’ అందామనుకుని అనకుండా జవాబు చెప్పాను. ‘మత్తు పానీయాలు!’
‘అంటే?’
‘వైన్, విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వోడ్కా ఇంకా ఏవో చాలా పేర్లు ఉన్నాయి.’
‘కాఫీ బదులు మత్తు పానీయాలు తాగుతారా మీరు?’ యథాలాపంగా అడిగాడు.
‘తాగను.’
‘మరి వీటిని ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు?’
‘అంటే! చూసి ఆనందించడానికి’
‘చూస్తే ఆనందమా?’
‘అవీ జ్ఞాపికలే!’
‘మత్తు పానీయాలు జ్ఞాపికలా?’
‘అవును. మిత్రులు, బంధువులు, కొలీగ్స్‌ ఫారిన్‌ నుంచి నా ఆనందం కోసం, వాళ్ల ప్రయాణాల గుర్తులుగా ఇచ్చిన సీసాలు. అవి నాకు వాళ్ల జ్ఞాపికలు.’
‘వాళ్లెందుకు ఇచ్చారు?’
‘వాళ్ల ఆనందం కోసం. నేను తాగి ఆనందిస్తానన్న ఇష్టంతో. నేను తాగనని వాళ్లకు తెలియదు. తెలిసేసరికి నా ఉన్నతోద్యోగం ముగిసింది. వాళ్ల ప్రేమ గుర్తులుగా వాటిని చూసి ఆనందిస్తుంటాను.’
‘తాగనివాడివి వాటిని స్వీకరించడం ఎందుకు?’
‘వాళ్లను నొప్పించలేక!’
‘మీకు ఇష్టంలేకపోయినా, నేను లోనికి వస్తే పొమ్మని తరమకుండా, ఇంట్లో ఉండనిచ్చి, మాట్లాడుతూ ఉన్నట్లా?’
‘బాగా చెప్పారు’ అందామనుకున్నాను. కానీ ఏమీ అనకుండా ఉన్నాను.
‘రచయితలు, కళాకారులు చాలామంది తాగుతారే!’
‘నిజమే!’
‘మీరెందుకు తాగరు?’
‘ఏమో! తాగను.’
‘తాగకపోయినా రచనలు చేయగలనని రుజువు చేయటానికా?’
‘అదేం కాదు!’
‘కాఫీ టీలు తాగరు. సిగరెట్‌ బీడీలు తాగరు. గుట్కా చొట్కా నమలరు. మరి రచనకు ఎలా ఉత్తేజితులవుతారు?’
‘లోపల ఉత్తేజం ఉన్నందువల్ల!’
‘ఈ సీసాలు, వాటి అన్నింటి విలువ లక్షల్లో ఉంటుందా?’
‘వేలల్లో ఉండవచ్చు!’
‘ఈ అద్దాల అలమరా పాతికవేలయినా అయి ఉంటుందా?’
‘ఉంటుంది’
‘ఇంత సొమ్ము ఎందుకు దుర్వినియోగం చేశారు?’
‘ఎవరీ మనిషి? ఏమిటీ ప్రశ్నలు? ‘నీకెందుకు’ అందామనిపించకపోలేదు. మర్యాద కాదని ఆగిపోయాను. అయినా ఆగలేక ‘తాగితే సద్వినియోగమా?’ అని అడిగాను.
‘వాటిని తీసి, వాటి స్థానంలో మరికొన్ని జ్ఞాపికలు పెట్టుకోవచ్చుకదా!’
‘అవీ జ్ఞాపికలే!’
‘వాటిలోని పదార్థం పాడయిపోయి ఉంటుందా?’
‘తెలియదు. ఎంత పాతబడితే అంత విలువ పెరుగుతుందంటారు కదా!’
‘ఎప్పుడైనా తాగాలనిపిస్తే తాగుతారా?’
‘తాగను!’
‘మరెందుకవి?’
‘చెప్పానుకదా, ఆత్మీయుల ప్రేమగుర్తులు.’
‘మత్తుమందు ప్రేమా?’
‘అది మత్తు పదార్థమే’
‘పానీయం!’
‘ఆ.. పానీయం. కానీ అవి ఇచ్చినవాళ్ల ప్రేమ గుర్తులు’
‘అవి అందమైన జ్ఞాపికలే! నిజమే కానీ, అవి ఆహారం కూడా!’
‘నిజమే!’
‘వాటిని వాడకపోటం అన్నాన్ని వ్యర్థం చేయటమే!’
‘అలాగా?’
‘అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు కదా!’
‘అంటాం!’
‘పరబ్రహ్మను పరాభవిస్తారా? అది నేరం కాదా?’
‘నేరమా?’
‘నేరమే. ఉపయోగిస్తే న్యాయం. మీరు తాగకపోతే తాగేవాళ్లకు ఇవ్వవచ్చు.’
‘వాళ్లను తాగుబోతుల్ని చేయమంటారా?’
‘కొత్తగా మీరు ఏమీ చేయడంలేదు. వాళ్లు మునుపటి నుంచి తాగుతున్నారు. ఈ సీసాలు వాళ్లు తాగితే, ఇవి వినియోగమవుతాయి. ఆహారం దుర్వినియోగం కాదు. వీటి మీద పెట్టిన ఖర్చు– డబ్బురూపంలో– చలామణీలో లేకుండాపోయిన ప్రమాదం తప్పుతుంది. ఆ తాగే మిత్రుల డబ్బు ఆదా అవుతుంది.’ యొహోవా నాకేవో ఆర్థికసూత్రాలు చెబుతున్నట్లుగా అనిపించింది.
‘‘మీకు నేను వీటిని ఇవ్వాలని మీ ఇష్టమా?’
‘ఇష్టమా అంటే ఇష్టమే! వైన్‌ కావాలన్నాను. మీరు మాట మార్చారు.’ అని నిష్ఠూరమాడాడు.
‘నేను తాగను. ఎవరినీ ప్రోత్సహించను. తాగించను. అయినా మత్తు పానీయాలు సేవించరాదని మీకు మీ దైవగ్రంథం చెప్పదా?’
‘చెప్పదు. ఏ మతమూ మత్తుపానీయాలను ప్రోత్సహించదు.’
‘మీకు తెలియదు’ అన్నాను.
నావైపు పరమ ఆశ్చర్యంగా చూశాడు.
‘ఉపయోగం లేనిది లోకంలో ఉండదు. ఏది ఎందుకు ఉపయోగమో, ఎందుకు నిరుపయోగమో తెలుసుకోవటమే జీవితం!’
యొహోవా మాటలు నిజమే అనిపించాయి.
‘ఉపయోగం లేని సీసాలను అందమైన అలమరాలో కంటికింపుగా పెట్టుకోవటం ప్రకృతి విరుద్ధం. ఎందుకంటే ఉపయోగం లేనిది అంతరిస్తుంది. ఎన్ని అంతరించలేదూ? ఎన్ని ఉద్భవించలేదూ?’
‘నేను తాగరాదు. తాగాలనిపించరాదు. ఉన్నా తాగకుండా ఉండాలి. రెచ్చగొడుతున్నా సంయమనం పాటించాలి. డబ్బులేక తాగకుండా ఉండటం కాదు. లభ్యంగా ఉన్నా తాగకుండా ఉండాలి. వాటి ఉపయోగం వాటికి ఉంది. అదిలేక తాగకపోవడం కాదు. ఉండీ తాగకపోవడం. అది నన్ను రెచ్చగొట్టకూడదు. నేను లొంగిపోకూడదు. నేను జయించడం– అదీ ముఖ్యం.’
యొహోవా ప్రేమగా నవ్వాడు.
‘మీ మీద మీకు నమ్మకం లేదా?’
‘ఉంది!’
‘ఆ సీసాలు ఎదుట లేకుండా కూడా మీరు తాగకుండా ఉండవచ్చు కదా!’
‘ఉండవచ్చు. కానీ అవి ఉంటే కూడా నేను బలహీనుణ్ణి కానని నాకు నేను రుజువు చేసుకోవటానికి అవి అక్కడ ఉండాలి.’
‘అది మానసిక శిక్ష కాదా?’
‘కాదు!’
‘మానసికానందం!’
‘అసలు ఎందుకు తాగరాదనుకున్నారు?’
‘నాకిష్టం లేదు!’
‘ఎందుకిష్టం లేదు?’
‘ఏ బహిర్శక్తీ, నా అంతశ్చైతన్యాన్ని ప్రభావితం చేయరాదు.’
‘తాగితే?’
‘మనిషి అనర్థాలు సృష్టిస్తాడు!’
‘హాయిగా నిద్రపోతాడు.’
‘అది సహజనిద్రే కాదు. మత్తు నిద్ర. అది మంచిది కాదు. అది కృత్రిమం. కృత్రిమ మానవుడు– కృత్రిమ నిర్ణయాలు, కార్యాలు, నేరాలు ఒక్కటా– చాలా ప్రమాదం!’
‘అయితే అంత విలువైన పానీయాలను వ్యర్థం చేస్తారా?’
‘వ్యర్థం కాదు. తాగితే అప్పటికే ఆనందం, అహంకారం, ఉపయోగం. తాగకపోతే ప్రతిరోజూ ఉపయోగమే.’
‘అంటే?’
‘అవి నన్ను జయించే శక్తిని కోల్పోతాయి. అవి అక్కడే ఉండటం నా విజయానికి గుర్తు.’
యొహోవా ప్రేమగా నవ్వాడు.
‘మీ సాహిత్య జ్ఞాపికలను మరచిపోయినట్లే, మీ మిత్రుల సీసాలను కూడా మీరు మరచిపోయి ఉంటారు.’
‘గుర్తే!’
‘ఎప్పుడో ఒకసారి గుర్తుకు వస్తాయి.’
‘అవి ఎదుట లేకపోయినా జ్ఞాపకం మిగిలి ఉంటుంది కదా!’
‘ఉంటుంది!’
‘అది ఆనందకరమే కదా!’
‘ఆ..! ఆనందదాయకమే!’
‘మీ సంయమనం మీద మీకు నమ్మకం ఉంది కదా!’
‘ఉంది.’
‘అటువంటి సమయంలో ఆ సీసాలు ఎదుట ఉన్నా, లేకున్నా, ఒకటే.! పెద్ద ప్రభావం ఏమీ ఉండదు!’
‘కాదు!’ నేను అడ్డం పడ్డాను. ఏమిటన్నట్లు తేరిపార చూశాడు ముఖంలోకి యొహోవా.
‘అవి అక్కడే ఉండాలి. వాటి ప్రభావానికి నేను లోనుకాకుండా ఉండాలి!’
యొహోవా మళ్లీ నవ్వాడు.
‘ఆ వనం ఉండాలి. ఆ చెట్టు ఉండాలి. ఆ పళ్లు ఉండాలి. వాటిని తినకూడదని గుర్తుండాలి. తినకుండా ఉండాలి. తినటం తప్పని గుర్తించాలి. ఆ తప్పు పాపమని తెలియాలి. అది ఆదిమానవుడి తప్పు. ప్రాచీనుడి తప్పు పాపం. ప్రాచీన పాపం.’ అని యొహోవా నవ్వాడు.
‘ప్రాచీన పాపం ప్రాచీనుణ్ణి జయించింది. అది ఆ కాలం ప్రభావం. నవీన పాపం నవీనుణ్ణి జయించలేదు. పరిణామ ప్రభావం.’
‘ప్రాచీనమైనా, నవీనమైనా, పాపం మనిషిని జయించకూడదు’ అన్న యొహోవా ముఖంలో సంతోషం తాండవించింది.
‘నేను మానినట్టే, మీరూ ఏదైనా మానేయండి!’ నేను సలహా ఇచ్చాను.
‘మీరు నవీనులు. మీరు మానగలరు. నేను ప్రాచీనుణ్ణి. నేను మానలేను!’ నిక్కచ్చిగా చెప్పాడు.
‘మీరేం ప్రాచీనులు. నా చిన్నకొడుకు కంటే చిన్నవాళ్లు. మీరూ నవీనులే!’
యొహోవా పెద్దగా నవ్వాడు.
‘నేను ఆదిమానవుడి కన్నతండ్రిని’ మళ్లీ నవ్వాడు.
నాకు ఆశ్చర్యంగా ఉంది. తాగుబోతు మాటలు.
‘అందరూ నవీనులయిందాకా ‘ప్రాచీనపాపం’ పంచిపెడుతూ ఉంటాను! సరేనా మనవడా?’
‘అన్నం వడ్డించుకుందామా?’ నేను అర్థించాను.
‘కడుపు నిండింది!’ తృప్తిగా నవ్వాడు.
చూస్తూ ఉండగానే ఎట్లా వచ్చాడో అట్లాగే వెళ్లాడు యొహోవా!
నాకదేదో అర్థంకాని అనుభూతి.
- ఆచార్య కొలకలూరి ఇనాక్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement