kolakaluri enoch
-
వర్జీనియాలో ఇనాక్ ఆత్మీయ సమ్మేళనం
-
ప్రాచీన పాపం
రైతు బజారులో, సినిమా హాళ్ల దగ్గరా, రైల్వే, బస్స్టేషన్ల లోపల, స్కూళ్లూ కాలేజీ గేట్లలో యొహోవా ‘ప్రాచీన పాపం’ అనే శీర్షిక ఉన్న కరపత్రాలు పంచిపెడుతూ ఉంటాడు. అలా చాలాచోట్ల కనిపించిన వ్యక్తి సరాసరి మా ఇంటికి వచ్చి, తలుపు తెరుచుకుని, హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నన్ను చూసి నవ్వాడు. నవ్వాను కానీ నాకు ఆశ్చర్యం! అంతలోనే అడిగాడు ‘మనవడా, కరపత్రం చదివారా?’ మళ్లీ ఆశ్చర్యం! నాకా ఎనభై ఏళ్లు! మునిమనవళ్లు ఉన్నారు. నన్ను మనవడా అంటున్న యొహోవాకు యాభై ఏళ్లకంటే ఎక్కువ ఉండవు. క్రైస్తవులు ఎవరినైనా ‘బ్రదర్’ అంటారు. ఈ యొహోవా నన్ను ‘మనవడా’ అంటున్నాడు. మరి ఆశ్చర్యమే కదా! ‘చదివాను’ అన్నాను. ‘అర్థమైందా?’ ‘కాలేదు!’ ‘పుట్టిన ప్రతి మనిషీ పాపే! పిల్లలతో సహా!’ ‘పిల్లలు– పసివాళ్లు– ఏం పాపం చేస్తారు?’ ‘తల్లిదండ్రుల రోగాలలాగా పాపాలూ పిల్లలకు సంక్రమిస్తాయి!’ ‘వాళ్లేం పాపం చేసి ఉండకపోతే?’ ‘పుట్టుకే పాపం! పుట్టకపోతే పాపమూ లేదు. శాపమూ లేదు.’ ‘పుట్టటం మన స్వాధీనంలో లేదు. మనం కోరి పుట్టలేదు. అసలు పుట్టకముందు మనమున్నామో లేదో తెలియదు. పుట్టటం పాపమంటే ఈ పాపపు బతుకెందుకు? అసలు పుట్టకుండా ఉంటే పోలా? అయినా పాపమంటే ఏమిటి?’ కొంచెం చికాకుగానే అడిగాను. ‘ఆజ్ఞాతిక్రమమే!’ అన్నాడు. ‘అంటే?’ ‘వద్దన్న పని చేయటమే!’ ‘వద్దన్న పని చేస్తే తప్పుకాని, పాపం ఎలా అవుతుంది?’ ‘తప్పే పాపం!’ ‘ఎవరు తప్పు చేశారు?’ ‘మీ ప్రాచీన మానవుడు!’ ‘ఏం తప్పు చేశాడు?’ ‘వద్దన్న పండు తిన్నాడు!’ నాకు కోపంగా ఉంది. యొహోవా దైవసేవకుడిగా ఉన్నాడని కోపం అణచుకున్నాను. ‘మీ పేరు నాకు కొత్తగా ఉంది. యొహోవా నా దేవుడు అనే మాట విన్నాను కాని, యొహోవా అనే మనిషి ఉంటాడని నాకు తెలియదు. కొత్తగా ఉంది.’ ‘మీ పేరూ మనుషుల్లో ఉంటుందని నాకూ తెలియదు. అందుకే మీ ఇంటికి వచ్చాను.’ ‘నా పేరు మీకెట్లా తెలుసు?’ ‘రచయిత కదా!’ నాక్కొంచెం ఆనందం కలిగింది. ‘మీ పుస్తకాలు చూపిస్తారా?’ యొహోవా అడిగాడు. ‘రండి’ అని లోపలికి తీసుకువచ్చి, ‘ఇవి నా రచనలు. ఒక్కొక్క పుస్తకం ఇక్కడ పెట్టాను’ అద్దాల అలమరా చూపించాను. ‘చూడొచ్చునా?’ ‘నిరభ్యంతరంగా’ ‘తీసి చూడవచ్చునా?’ ‘వీల్లేదు!’ ‘ఏం?’ ‘ఆజ్ఞాతిక్రమం!’ పెద్దగా నవ్వాడు యొహోవా. ‘ఇవన్నీ, ఇన్ని షోకేసులు. ఏమిటవి?’ ‘జ్ఞాపికలు. ఆత్మీయుల అభినందన గుర్తులు.’ ‘ఈ సీసాలేమిటి?’ నేను జవాబు చెప్పే ముందే కూతురు కాఫీ కప్పు తెచ్చి ఇచ్చింది. కాఫీ తాగుతూ ‘నేను ద్రాక్షరసం తాగుతాను’ అన్నాడు. ‘ద్రాక్షపళ్లు మిక్సీలో వేసి చేయించనా?’ అని అడిగాను. ‘ఫ్రూట్ జూస్ కాదు, వైన్.’ అన్నాడు. నాకు చికాకు కలిగింది. యొహోవా ఎవరో, ఏ ఊరో, ఏం పనో, ఏమీ తెలియదు. ప్రాచీనపాపం కరపత్రాలు పంచడం మాత్రమే తెలుసు. చొరవగా చొరబడి ఇంట్లోకి రావడమే కాకుండా, మిత్రుడిలా, బంధువులా డిమాండు చేస్తుంటే చికాకుగా అనిపించింది. ఇంటికి వచ్చిన మనిషిని ఇబ్బంది పెట్టలేక మౌనంగా ఉన్నాను. ‘మీకు పుణ్యం కావాలని లేదా?’ అని ప్రశ్నించాడు. ‘యొహోవాగారూ! నేను ప్రాచీనపాపం చాలాసార్లు చదివాను. నాకు చాలా సందేహాలున్నాయి.’ అన్నాను. ‘అడగండి!’ అన్నాడు. ‘ఆ వనంలో ఆ చెట్టు నాటటం ఎందుకు? దానికి అంత అందమైన, పరిమళభరితమైన పళ్లు కాయించడం ఎందుకు? తాను సృష్టించిన మనిషిని పిలిచి, ఆ చెట్టు పళ్లు తినవద్దనడం ఎందుకు? తింటే పాపమని శపించడం ఎందుకు? తిన్నవాణ్ణే పాపి అనకుండా, ఆ పళ్లు తినని వాడి సంతానాన్ని– తరతరాల సంతానాన్ని పాపులు అనటం ఎందుకు? వేలాది సంవత్సరాల తర్వాత కోట్లాది మందిని పాపులు అనటం ఎందుకు? నన్ను పాపి అనటం ఎందుకు? మానవజాతిని పాపిష్టిజాతి అనటం ఎందుకు? నువ్వు స్వీట్లు టేబుల్ మీద పెట్టి, నీ కొడుకుల్నీ కూతుళ్లనూ తినవద్దంటే మానతారా? తినరాదనడం న్యాయమా? తినరానివి ఇంటికి తేవడం ఎందుకు? తినరాని చెట్టు పళ్లు కాయించడం ఎందుకు? తినరాని పళ్ల చెట్టు ఆ ఉద్యానవనంలో నాటించడం ఎందుకు?’ యొహోవా అందంగా నవ్వాడు. నవ్వు బాగుంది. నాకు అసహనం తగ్గలేదు. ‘మనిషికి సంయమనం ఉండాలి. సహనం ఉండాలి. వద్దన్న పని మానాలి. చేయమన్న పని చేయాలి.’ అన్నాడు యొహోవా. నాకు సంతృప్తి కలగలేదు. ‘నాకు కాఫీ ఇచ్చి మీరు తాగలేదేం?’ ‘నేను కాఫీ టీలు తాగను!’ ‘ఎందుకు?’ ‘నా ఆరోగ్యం కోసం!’ మళ్లీ యొహోవా అడిగాడు ‘ఈ అద్దాల షోకేసులోని రంగురంగుల సీసాలు, అందమైన సీసాలు, వివిధ ఆకారాల్లోని సీసాలు బాగున్నాయి. ఏమిటవి?’ ‘మీకెందుకు?’ అందామనుకుని అనకుండా జవాబు చెప్పాను. ‘మత్తు పానీయాలు!’ ‘అంటే?’ ‘వైన్, విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వోడ్కా ఇంకా ఏవో చాలా పేర్లు ఉన్నాయి.’ ‘కాఫీ బదులు మత్తు పానీయాలు తాగుతారా మీరు?’ యథాలాపంగా అడిగాడు. ‘తాగను.’ ‘మరి వీటిని ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు?’ ‘అంటే! చూసి ఆనందించడానికి’ ‘చూస్తే ఆనందమా?’ ‘అవీ జ్ఞాపికలే!’ ‘మత్తు పానీయాలు జ్ఞాపికలా?’ ‘అవును. మిత్రులు, బంధువులు, కొలీగ్స్ ఫారిన్ నుంచి నా ఆనందం కోసం, వాళ్ల ప్రయాణాల గుర్తులుగా ఇచ్చిన సీసాలు. అవి నాకు వాళ్ల జ్ఞాపికలు.’ ‘వాళ్లెందుకు ఇచ్చారు?’ ‘వాళ్ల ఆనందం కోసం. నేను తాగి ఆనందిస్తానన్న ఇష్టంతో. నేను తాగనని వాళ్లకు తెలియదు. తెలిసేసరికి నా ఉన్నతోద్యోగం ముగిసింది. వాళ్ల ప్రేమ గుర్తులుగా వాటిని చూసి ఆనందిస్తుంటాను.’ ‘తాగనివాడివి వాటిని స్వీకరించడం ఎందుకు?’ ‘వాళ్లను నొప్పించలేక!’ ‘మీకు ఇష్టంలేకపోయినా, నేను లోనికి వస్తే పొమ్మని తరమకుండా, ఇంట్లో ఉండనిచ్చి, మాట్లాడుతూ ఉన్నట్లా?’ ‘బాగా చెప్పారు’ అందామనుకున్నాను. కానీ ఏమీ అనకుండా ఉన్నాను. ‘రచయితలు, కళాకారులు చాలామంది తాగుతారే!’ ‘నిజమే!’ ‘మీరెందుకు తాగరు?’ ‘ఏమో! తాగను.’ ‘తాగకపోయినా రచనలు చేయగలనని రుజువు చేయటానికా?’ ‘అదేం కాదు!’ ‘కాఫీ టీలు తాగరు. సిగరెట్ బీడీలు తాగరు. గుట్కా చొట్కా నమలరు. మరి రచనకు ఎలా ఉత్తేజితులవుతారు?’ ‘లోపల ఉత్తేజం ఉన్నందువల్ల!’ ‘ఈ సీసాలు, వాటి అన్నింటి విలువ లక్షల్లో ఉంటుందా?’ ‘వేలల్లో ఉండవచ్చు!’ ‘ఈ అద్దాల అలమరా పాతికవేలయినా అయి ఉంటుందా?’ ‘ఉంటుంది’ ‘ఇంత సొమ్ము ఎందుకు దుర్వినియోగం చేశారు?’ ‘ఎవరీ మనిషి? ఏమిటీ ప్రశ్నలు? ‘నీకెందుకు’ అందామనిపించకపోలేదు. మర్యాద కాదని ఆగిపోయాను. అయినా ఆగలేక ‘తాగితే సద్వినియోగమా?’ అని అడిగాను. ‘వాటిని తీసి, వాటి స్థానంలో మరికొన్ని జ్ఞాపికలు పెట్టుకోవచ్చుకదా!’ ‘అవీ జ్ఞాపికలే!’ ‘వాటిలోని పదార్థం పాడయిపోయి ఉంటుందా?’ ‘తెలియదు. ఎంత పాతబడితే అంత విలువ పెరుగుతుందంటారు కదా!’ ‘ఎప్పుడైనా తాగాలనిపిస్తే తాగుతారా?’ ‘తాగను!’ ‘మరెందుకవి?’ ‘చెప్పానుకదా, ఆత్మీయుల ప్రేమగుర్తులు.’ ‘మత్తుమందు ప్రేమా?’ ‘అది మత్తు పదార్థమే’ ‘పానీయం!’ ‘ఆ.. పానీయం. కానీ అవి ఇచ్చినవాళ్ల ప్రేమ గుర్తులు’ ‘అవి అందమైన జ్ఞాపికలే! నిజమే కానీ, అవి ఆహారం కూడా!’ ‘నిజమే!’ ‘వాటిని వాడకపోటం అన్నాన్ని వ్యర్థం చేయటమే!’ ‘అలాగా?’ ‘అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు కదా!’ ‘అంటాం!’ ‘పరబ్రహ్మను పరాభవిస్తారా? అది నేరం కాదా?’ ‘నేరమా?’ ‘నేరమే. ఉపయోగిస్తే న్యాయం. మీరు తాగకపోతే తాగేవాళ్లకు ఇవ్వవచ్చు.’ ‘వాళ్లను తాగుబోతుల్ని చేయమంటారా?’ ‘కొత్తగా మీరు ఏమీ చేయడంలేదు. వాళ్లు మునుపటి నుంచి తాగుతున్నారు. ఈ సీసాలు వాళ్లు తాగితే, ఇవి వినియోగమవుతాయి. ఆహారం దుర్వినియోగం కాదు. వీటి మీద పెట్టిన ఖర్చు– డబ్బురూపంలో– చలామణీలో లేకుండాపోయిన ప్రమాదం తప్పుతుంది. ఆ తాగే మిత్రుల డబ్బు ఆదా అవుతుంది.’ యొహోవా నాకేవో ఆర్థికసూత్రాలు చెబుతున్నట్లుగా అనిపించింది. ‘‘మీకు నేను వీటిని ఇవ్వాలని మీ ఇష్టమా?’ ‘ఇష్టమా అంటే ఇష్టమే! వైన్ కావాలన్నాను. మీరు మాట మార్చారు.’ అని నిష్ఠూరమాడాడు. ‘నేను తాగను. ఎవరినీ ప్రోత్సహించను. తాగించను. అయినా మత్తు పానీయాలు సేవించరాదని మీకు మీ దైవగ్రంథం చెప్పదా?’ ‘చెప్పదు. ఏ మతమూ మత్తుపానీయాలను ప్రోత్సహించదు.’ ‘మీకు తెలియదు’ అన్నాను. నావైపు పరమ ఆశ్చర్యంగా చూశాడు. ‘ఉపయోగం లేనిది లోకంలో ఉండదు. ఏది ఎందుకు ఉపయోగమో, ఎందుకు నిరుపయోగమో తెలుసుకోవటమే జీవితం!’ యొహోవా మాటలు నిజమే అనిపించాయి. ‘ఉపయోగం లేని సీసాలను అందమైన అలమరాలో కంటికింపుగా పెట్టుకోవటం ప్రకృతి విరుద్ధం. ఎందుకంటే ఉపయోగం లేనిది అంతరిస్తుంది. ఎన్ని అంతరించలేదూ? ఎన్ని ఉద్భవించలేదూ?’ ‘నేను తాగరాదు. తాగాలనిపించరాదు. ఉన్నా తాగకుండా ఉండాలి. రెచ్చగొడుతున్నా సంయమనం పాటించాలి. డబ్బులేక తాగకుండా ఉండటం కాదు. లభ్యంగా ఉన్నా తాగకుండా ఉండాలి. వాటి ఉపయోగం వాటికి ఉంది. అదిలేక తాగకపోవడం కాదు. ఉండీ తాగకపోవడం. అది నన్ను రెచ్చగొట్టకూడదు. నేను లొంగిపోకూడదు. నేను జయించడం– అదీ ముఖ్యం.’ యొహోవా ప్రేమగా నవ్వాడు. ‘మీ మీద మీకు నమ్మకం లేదా?’ ‘ఉంది!’ ‘ఆ సీసాలు ఎదుట లేకుండా కూడా మీరు తాగకుండా ఉండవచ్చు కదా!’ ‘ఉండవచ్చు. కానీ అవి ఉంటే కూడా నేను బలహీనుణ్ణి కానని నాకు నేను రుజువు చేసుకోవటానికి అవి అక్కడ ఉండాలి.’ ‘అది మానసిక శిక్ష కాదా?’ ‘కాదు!’ ‘మానసికానందం!’ ‘అసలు ఎందుకు తాగరాదనుకున్నారు?’ ‘నాకిష్టం లేదు!’ ‘ఎందుకిష్టం లేదు?’ ‘ఏ బహిర్శక్తీ, నా అంతశ్చైతన్యాన్ని ప్రభావితం చేయరాదు.’ ‘తాగితే?’ ‘మనిషి అనర్థాలు సృష్టిస్తాడు!’ ‘హాయిగా నిద్రపోతాడు.’ ‘అది సహజనిద్రే కాదు. మత్తు నిద్ర. అది మంచిది కాదు. అది కృత్రిమం. కృత్రిమ మానవుడు– కృత్రిమ నిర్ణయాలు, కార్యాలు, నేరాలు ఒక్కటా– చాలా ప్రమాదం!’ ‘అయితే అంత విలువైన పానీయాలను వ్యర్థం చేస్తారా?’ ‘వ్యర్థం కాదు. తాగితే అప్పటికే ఆనందం, అహంకారం, ఉపయోగం. తాగకపోతే ప్రతిరోజూ ఉపయోగమే.’ ‘అంటే?’ ‘అవి నన్ను జయించే శక్తిని కోల్పోతాయి. అవి అక్కడే ఉండటం నా విజయానికి గుర్తు.’ యొహోవా ప్రేమగా నవ్వాడు. ‘మీ సాహిత్య జ్ఞాపికలను మరచిపోయినట్లే, మీ మిత్రుల సీసాలను కూడా మీరు మరచిపోయి ఉంటారు.’ ‘గుర్తే!’ ‘ఎప్పుడో ఒకసారి గుర్తుకు వస్తాయి.’ ‘అవి ఎదుట లేకపోయినా జ్ఞాపకం మిగిలి ఉంటుంది కదా!’ ‘ఉంటుంది!’ ‘అది ఆనందకరమే కదా!’ ‘ఆ..! ఆనందదాయకమే!’ ‘మీ సంయమనం మీద మీకు నమ్మకం ఉంది కదా!’ ‘ఉంది.’ ‘అటువంటి సమయంలో ఆ సీసాలు ఎదుట ఉన్నా, లేకున్నా, ఒకటే.! పెద్ద ప్రభావం ఏమీ ఉండదు!’ ‘కాదు!’ నేను అడ్డం పడ్డాను. ఏమిటన్నట్లు తేరిపార చూశాడు ముఖంలోకి యొహోవా. ‘అవి అక్కడే ఉండాలి. వాటి ప్రభావానికి నేను లోనుకాకుండా ఉండాలి!’ యొహోవా మళ్లీ నవ్వాడు. ‘ఆ వనం ఉండాలి. ఆ చెట్టు ఉండాలి. ఆ పళ్లు ఉండాలి. వాటిని తినకూడదని గుర్తుండాలి. తినకుండా ఉండాలి. తినటం తప్పని గుర్తించాలి. ఆ తప్పు పాపమని తెలియాలి. అది ఆదిమానవుడి తప్పు. ప్రాచీనుడి తప్పు పాపం. ప్రాచీన పాపం.’ అని యొహోవా నవ్వాడు. ‘ప్రాచీన పాపం ప్రాచీనుణ్ణి జయించింది. అది ఆ కాలం ప్రభావం. నవీన పాపం నవీనుణ్ణి జయించలేదు. పరిణామ ప్రభావం.’ ‘ప్రాచీనమైనా, నవీనమైనా, పాపం మనిషిని జయించకూడదు’ అన్న యొహోవా ముఖంలో సంతోషం తాండవించింది. ‘నేను మానినట్టే, మీరూ ఏదైనా మానేయండి!’ నేను సలహా ఇచ్చాను. ‘మీరు నవీనులు. మీరు మానగలరు. నేను ప్రాచీనుణ్ణి. నేను మానలేను!’ నిక్కచ్చిగా చెప్పాడు. ‘మీరేం ప్రాచీనులు. నా చిన్నకొడుకు కంటే చిన్నవాళ్లు. మీరూ నవీనులే!’ యొహోవా పెద్దగా నవ్వాడు. ‘నేను ఆదిమానవుడి కన్నతండ్రిని’ మళ్లీ నవ్వాడు. నాకు ఆశ్చర్యంగా ఉంది. తాగుబోతు మాటలు. ‘అందరూ నవీనులయిందాకా ‘ప్రాచీనపాపం’ పంచిపెడుతూ ఉంటాను! సరేనా మనవడా?’ ‘అన్నం వడ్డించుకుందామా?’ నేను అర్థించాను. ‘కడుపు నిండింది!’ తృప్తిగా నవ్వాడు. చూస్తూ ఉండగానే ఎట్లా వచ్చాడో అట్లాగే వెళ్లాడు యొహోవా! నాకదేదో అర్థంకాని అనుభూతి. - ఆచార్య కొలకలూరి ఇనాక్ -
ఆవేశమే అక్షరం రాయించింది
సాక్షి, న్యూఢిల్లీ: రాయాలన్న ఆవేశమే తనచేత ఇప్పటి వరకు 96 పుస్తకాలు రాసేలా చేసిందని ప్రముఖ రచయిత, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. రాయాల్సిన అవసరం, ఆవేశం, ఆవేదన, సమాజంలో కావాల్సిన పరిణామాలకు హేతువు అయిన దృక్పథం తాను రచనలు చేసేందుకు ప్రేరేపించిందని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆయన రచించిన ‘విమర్శిని’వ్యాస రచనకు 2018 ఏడాదికిగానూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ తన జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో రచనలు, కవిత్వాలు, అనువాదాలు రాసినా ‘విమర్శిని’వ్యాసరచనకు పురస్కారం వరించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు యువత అద్భుతంగా సాహిత్యం రాస్తోందని, వారి నుంచి గొప్ప సాహిత్యం వస్తోందన్నారు. సామాజిక జీవితాన్ని సందర్శించానికి సిద్ధంగా ఉన్న యువత గొప్ప సాహిత్యాన్ని సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా కొలకలూరి ఇనాక్ కుమారుడు శ్రీకిరణ్, కుమార్తె ఆశా జ్యోతి, కోడలు అనిత పాల్గొన్నారు. -
తెలుగు సాహిత్య దర్శిని ‘విమర్శిని’
ఆచార్య కొలకలూరి ఇనాక్ రచించిన సాహిత్య విమర్శ గ్రంథం ‘విమర్శిని’కి 2018 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఆయనకు ఆరు దశాబ్దాల సాహిత్య జీవితముంది. ఆయన కవి, కథకుడు, నవలాకారుడు, నాటక రచయిత, పరిశోధకుడు, విమర్శకుడు, మంచి వక్త. ‘తెలుగు వ్యాస పరిణామం’ అంశం మీద పరిశోధన చేశారు. సాహిత్య పరామర్శ, ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం, జానపదుల సాహిత్య విమర్శ, శూద్రకవి శంభుమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం, సాహిత్య దర్శిని, పత్రత్రయి మొదలైన విమర్శ గ్రంథాలు ప్రచురించారు. విమర్శినిలో మూడు భాగాలున్నాయి. 1.తెలుగు వెలుగులు. 2. తెలుగు నవల. 3. తెలుగు కథానిక. తెలుగు వెలుగులులో ప్రాచీన ఆధునిక కవిత్వం, రచయితలు, సాహిత్యాంశాల మీద రాసిన పదహైదు వ్యాసాలున్నాయి. వాటిలో మౌలికమైన ప్రతిపాదనలు ఉన్నాయి. పరవస్తు చిన్నయసూరి బ్రాహ్మణులతో తిరస్కరింపబడినా, వాళ్లు నెత్తిమీద పెట్టుకునే బాలవ్యాకరణం, పంచతంత్రం రాశారన్నాడు. భద్రిరాజు తెలుగులో నాలుగు మాండలికాలు ఉన్నాయంటే కొలకలూరి ఆరు మాండలికాలు ఉన్నాయన్నాడు. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర మాండలికాలుగా భద్రిరాజు విభజిస్తే– తెలంగాణ, రాయలసీమకు పూర్వాంధ్ర మాండలికం, గోదావరి మాండలికం, సర్కారు మాండలికం, నెల్లూరు చిత్తూరు కొంత ఒంగోలుతో కూడిన మాండలికాలను జత చేశారు. ‘వలస రచయితలు’ అంశం మీద రాసిన కొలకలూరి, ఒక ప్రాంతంలో పుట్టి పెరిగి కొత్త జీవితం వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లిన రచయితలు, వెళ్లిన ప్రాంతం గురించి రాయకుండా తమ ప్రాంతం గురించే ఎందుకు రాస్తారు అనే అంశాన్ని చర్చించారు. వెళ్లిన ప్రాంతపు భాషను కొంత ఒంటబట్టించుకోగలమే గానీ ఆ జీవితాన్ని ఆకళింపు చేసుకోలేమని ఆయన అభిప్రాయం. పైగా సొంత ప్రాంతం గురించి రాసి మెప్పించినంతగా ఉంటున్న ప్రాంతం గురించి రాసి మెప్పించడం కష్టమని కూడా ఆయన ఉద్దేశం. శ్రీ కృష్ణదేవరాయలు– రాజ్యం, రాసిక్యం, మతం కూడలి అన్నారు. ఏ దేశ ప్రజలయినా వాళ్ల మాతృభాషలో విద్యాబోధనం జరిగితేనే విశిష్ట మానవులుగా అవతరిస్తారని చెప్పారు. 1909లో వచ్చిన ‘మాలవాండ్ర పాట’ మీద 2009లో వ్యాసం రాస్తూ ఆ పాట రచయిత దళితుడే అయ్యుండాలని కొలకలూరి ఊహించారు. ఆ తర్వాత ఆ ఊహ నిజం కాదని తేలింది. దాని రచయిత మంగిపూడి వెంకట శర్మ. బోయి భీమన్న మీద రాసిన వ్యాసంలో భారతదేశంలో జాతీయభావన రాజకీయ అవసరాల కోసం ఏర్పడిందే తప్ప ప్రజల మీద ప్రేమతో కాదని అన్నారు. ఈ భాగంలో సినారె, కీలుబొమ్మలు లాంటి అంశాల మీద రాసిన వ్యాసాలున్నాయి. కొలకలూరి దృష్టి ద్రావిడ దృష్టి. దళిత బహుజన దృష్టి. చారిత్రక వాస్తవిక దృష్టి. చాలామంది భావించినట్లు కందుకూరి ‘రాజశేఖర చరిత్ర’ను తొలి తెలుగు నవలగా ఆయన ఆమోదించలేదు. ఆయన దృష్టిలో శ్రీ రంగరాజ చరిత్ర తొలి తెలుగు నవల. అందులో లంబాడీ జీవిత చిత్రణ, కులాంతర ప్రేమ అనే ప్రగతిశీల అంశాలున్నాయని గుర్తించారు. రాజశేఖర చరిత్ర మౌలిక రచన కాదని కూడా అన్నారు. ప్రగతిశీలవాదులు మాలపల్లి నవలను అభ్యుదయ నవలగా గుర్తిస్తే, కొలకలూరి అందులో హిందూమత ప్రచార స్వభావం ఉందన్నారు. మాలపల్లిలో బ్రాహ్మణ వ్యవస్థను తిరస్కరించే జస్టిస్ పార్టీని తిరస్కరించే లక్షణముందన్నారు. విశ్వనాథను హైందవత్వ ప్రతినిధి రచయితగానే ఆయన గుర్తించారు. విశ్వనాథ దళిత జీవితం వస్తువుగా రాసిన నవలల్ని కూడా ఆయన ఆమోదించలేదు. విశ్వనాథ దళితుడు దళితుడిగా ఉంటేనే వాళ్ల శౌర్యాన్నీ పరాక్రమాన్నీ అంగీకరిస్తారు. వీరవల్లడు గొప్పవాడే, తమకు దాస్యం చేసినంత కాలం. చేయకపోతే వీరవల్లడు ఉట్టి వల్లప్ప అవుతాడు. తొలినాళ్లలో తెలుగు నవలల్లో బ్రాహ్మణ జీవితమే వస్తువు కావడం గురించి కొలకలూరి చర్చించారు. త్రిపురనేని గోపీచంద్‌తోనే తెలుగు నవలల్లోకి అబ్రాహ్మణ జీవితాలు ప్రవేశించాయన్నారు. చలం, కొడవటిగంటి కుటుంబరావు స్త్రీ విముక్తి కోరినా అది బ్రాహ్మణ స్త్రీ విముక్తే అన్నారు. కానీ వాళ్లు అబ్రాహ్మణ స్త్రీ స్వేచ్ఛను తిరస్కరించలేదన్నారు. తెలుగు కథా వికాసాన్ని పరామర్శించిన కొలకలూరి, గురజాడ అప్పారావు దిద్దుబాటు(1910) తొలి తెలుగు కథ అనే అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించి, బండారు అచ్చమాంబ ‘ధన త్రయోదశి’ని తొలి తెలుగు కథానికగా నిర్ణయించారు. అంతేగాక దిద్దుబాటు ఓ.హెన్రీ రాసిన ఆంగ్ల కథానికకు అనుసరణ అన్నారు. గురజాడ కథానికల్లో ‘మీ పేరేమిటి?’, ‘పెద్ద మసీదు’ మాత్రమే తెలుగు జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. తొలినాళ్లలో స్త్రీ స్వేచ్ఛను కోరే కథానికలు ఎక్కువగా రావడం మీద ఆంగ్ల సాహిత్య ప్రభావం బలంగా ఉందని కొలకలూరి సిద్ధాంతం. అబ్రాహ్మణ దృక్పథంతో ‘ఆంధ్ర దేశంలో ముగ్గురి జీవితం చిత్రించిన కథానికలే తెలుగు కథానికలుగా చలామణి అయ్యాయి. నూటికి ముగ్గురి సాహిత్యం నూరుగురి సాహిత్యమయింది’ అన్నారు. అరసం సమాజంలో నూత్న ఆలోచనలు రేకెత్తించిందంటూ చాసో మొదలైనవారి కథలను విశ్లేషించారు. అభ్యుదయ, విప్లవ, స్త్రీ, గిరిజన, మైనారిటీ, బహుజన, ప్రాంతీయ అస్తిత్వ కథలను విపులంగా చర్చించారు. తెలుగు నవలలకన్నా తెలుగు కథానికను కొలకలూరి మరింత లోతుకి వెళ్లి చర్చించారు. పుస్తకం చివర్లో కొన్ని అనుబంధాలు పెట్టారు. అవి ఆయన ఎప్పుడో రాసినవి. ఒకదానిలో ఆధునిక కథానిక గురజాడతోనే ఆరంభమయింది వంటి అభిప్రాయం మనల్ని ఆకర్షిస్తుంది. కొలకలూరికి తెలుగు జానపద, ప్రాచీన, ఆధునిక సాహిత్యాల అధ్యయన పరిజ్ఞానం ఉంది. సాహిత్య విమర్శకులకు ఒక ప్రాపంచిక దృక్పథం, ఒక నిబద్ధత, ఒక తాత్విక నేపథ్యం ఉండటం ఎంత అవసరమో విమర్శిని ద్వారా రుజువు చేశారు. విశ్వనాథ, కొ.కు., కేతు, శ్రీశ్రీ, వల్లంపాటి వలె కొలకలూరి ఒకవైపు సృజనాత్మక రచనలు చేస్తూ, మరోవైపు సాహిత్య విమర్శను సుసంపన్నం చేశారు. ఆయన సవ్యసాచి. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి -
కొలకలూరి కీర్తిలో ‘విమర్శిని’
ఎట్టకేలకు ఆచార్య కొలకలూరి ఇనాక్‌ను సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఈ వార్త చూసిన వారిలో కొంతమందైనా ‘ఏంటి? ఇనాక్‌కి ఇంతకాలం అకాడమీ అవార్డు రాలేదా?’ అని ఆశ్చర్యపోయి ఉంటారు. అందుకు కారణం ఆయన ఆ అవార్డుకు మించి ఎదిగిపోవడమే. జ్ఞాన పీఠ్ వారి ప్రతిష్టాత్మకమైన మూర్తిదేవి పురస్కారంతోపాటు, పద్మశ్రీ కూడా ఇప్పటికే అందుకున్నారాయన. జులై 1, 1939లో గుంటూరు జిల్లా వేజెండ్లలో జన్మించిన ఇనాక్ అంచెలంచెలుగా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ శ్రీవేంకటేశ్వరి యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ స్థాయి వరకూ ఎది గారు. తన తండ్రి మరణం ప్రేరణతో 1954లో తొలి కథ రాశారు. ఈ దేశ నిర్మాణంలో పాలుపంచుకున్న దళితుల చరిత్రను వెలికితీస్తూ అనేక గ్రంథాలు వెలువరించారు. చరిత్రలో మరుగునపడిన దళితుల కృషిని ‘ఆది ఆంధ్రుడు’ కావ్యంలో, శూర్పణఖ అంతరంగాన్ని ‘కన్నీటి గొంతు’ కావ్యంలో అపూర్వంగా ఆవిష్కరించారు. అళ్వారుల్లో ప్రసిద్ధుడైన ‘మునివాహనుడు’పై నాటకం రాశారు. ఇక కథలకైతే లెక్కేలేదు. ఊరబావి, అస్పృశ్య గంగ, సూర్యుడు తలెత్తాడు, గులాబీ నవ్వింది, కొలుపులు కథలు పాఠకులకు సుపరిచితం. సర్కార్ గడ్డి, అనంత జీవనం వంటి నవలలు ప్రసిద్ధాలు. వైవిధ్యభరితమైన సమాజాన్ని తన కథల ద్వారా అన్ని కోణాల్లో ఆవిష్కరించారు. దళితులు, దళిత స్త్రీలు, కులవృత్తులవారి కన్నీటితడిని రంగరించుకున్న ఇనాక్ సాహిత్యమంతా అట్టడుగువర్గాల జీవితానికి అద్దంపడుతుంది. తన చుట్టూ వున్న జీవితాల్ని, తాను చూసిన జీవితాల్ని, తాను అనుభవించిన జీవితాన్ని అక్షరాల్లో బందించడం వల్లే ఆయన రచనలన్నీ చెమటవాసనతో గుబాళిస్తుంటాయి. అనేక ప్రక్రియల్లో బడుగుల జీవితాన్ని చిత్రించడం ద్వారా అన్ని వర్గాలను చేరుకోవచ్చనేది ఇనాక్ ఆలోచన. కవిత, కథ, నవల, నాటకం, పరిశోధన, విమర్శ ఏది రాసినా వాటిపై ఆయన ముద్ర స్పష్టం. ఇప్పటి వరకు తొమ్మిది పదులకుపైగా పుస్తకాలను వెలువరించారు. తన రచనలు నచ్చినవారికైనా, నచ్చనివారికైనా; తాను లేవనెత్తిన సమస్యలు అంగీకరించక తప్పని పరిస్థితి కల్పించడమే ఆయన సాహిత్యం ప్రధాన ఉద్దేశం. ఆయన రచనలు ఆవేశపూరితంగానో, రెచ్చగొట్టేవిగానో ఎప్పుడూ ఉండవు. ఆలోచనాత్మకంగా, నిలకడగా సాగుతూ ఆయా సంఘటనపట్ల పాఠకుడిలో వాస్తవిక దృష్టిని కలిగిస్తాయి. ఆయన రచనలు దేశ, విదేశీ భాషల్లోకి అనువాదమయ్యాయి. పలు విశ్వవిద్యాలయాల్లో ఆయన రచనలపై అనేకమంది ఎం.ఫిల్, పీహెచ్‌డీలు చేశారు. ఇనాక్‌కు అందని పురస్కారంమంటూ దాదాపు లేదనే చెప్పవచ్చు. ఎప్పుడో అలనాడు జాషువాకు, మధ్యలో ఓసారి బోయి భీమన్నకు దక్కిన అకాడమీ పురస్కారం చాలా ఆలస్యంగానే అయినా ఇనాక్ రచించిన వ్యాస సంపుటి ‘విమర్శిని’ని వరించడం తెలుగు దళిత సాహిత్యానికి కొత్త ఉత్సాహాన్నిస్తుందని భావించవచ్చు. – దేశరాజు (కొలకలూరి ఇనాక్‌కు సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించిన సందర్భంగా) -
నా కన్నీళ్ళే నా సాహిత్యం..!
ఎస్.కె. యూనివర్సిటీ తెలుగు విభాగంలో 1983–85 మధ్య పాఠాలు చెప్పిన ప్రొఫెసర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టులో నిష్ణాతులు. వీరిలో నాకు అత్యంత ఇష్టమైన వాళ్లలో ఒకరు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, మరొకరు కొలకలూరి ఇనాక్ సార్లు. రచనా పథంలో ఇద్దరివీ రెండు వేర్వేరు దార్లు. కానీ వీరిద్దరూ సమాజ రచయితలు. అభ్యుదయ రహదార్లు. మా ఇనాక్సారు మాట్లాడుతుంటే ఆధునిక వచన కావ్యాన్ని వింటున్నట్లుగా ఉండేది. ఆయన వచనం అద్భుతం. ఆయన రాసినా, మాట్లాడినా, చదివినా ఆలోచనాత్మకంగా ఉంటుంది. ఆయన పాఠం చెబుతున్నప్పుడు ధారాళంగా వచనాన్ని ప్రయోగించి పిల్లల్ని సమ్మోహనులుగా చేసేవారు. ‘మునివాహనుడు’ అన్న నాటకం దగ్గర్నుంచి ‘ఊరబావి’ క«థల వరకు ఆయన రచనలు జీవితం నుంచి వచ్చినవి. అట్టడుగు కులాలపై, అందునా కింది కులాలైన మాల, మాదిగల పట్ల అగ్రవర్ణ దురహంకారాలు, అంటరానితనాలు, అవమానాలు, ఆధిపత్యాలు, వెలివేతల నుంచి, వెలివాడల నుంచి నడుచుకుంటూ తెలుగు సాహిత్య విశ్వపీఠం మీదకు వచ్చారు. అట్టడుగు వర్గాల జీవితం ఎన్ని బాధలు పెడు తుందో ఆ బాధలన్నింటిని అనుభవించి కొలకలూరి ఒక క«థగా, కవి తగా, పద్యంగా, పాటగా, నాటకంగా రచనలయ్యారు. అగ్రవర్ణ ఆధిపత్యంపై కొలకలూరి ఎక్కుపెట్టిన సాహిత్య మహాస్త్రమే ‘ఊరబావి’. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌గా ఎంతో కాలం పనిచేశారు. తిరుపతి ఎస్.వి.యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ, పద్మశ్రీ లాంటివి ఎన్నో అవార్డులు పొందారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో దళిత బహుజన ప్రతిఘటనకు సంబంధించిన తొలి సాహిత్య ఆనవాళ్లు ఇనాక్ సాహిత్యంలో ఉన్నాయి. అప్పటి వరకు వచ్చిన సాహిత్యంలో దళిత జీవిత చిత్రణ మాత్రమే చేశారు. ‘ఊరబావి’ కథలో దళిత ప్రతిఘటనను చెప్పిన తొలిదళిత సాహితీవేత్త ఇనాక్. ‘ఊరబావి’ క«థలన్నీ ప్రతిఘటనా ప్రతి రూపాలుగా నిలుస్తాయి. ఆ ప్రతిఘటనాస్వరాన్ని తర్వాత దళిత సాహిత్యం అందిపుచ్చుకుంది. ఇనాక్ 1954లో ‘ఉత్తరం’ అన్న దళిత కథతో రచనా రంగంలోకి ప్రవేశించారు. 1969లో ‘ఊరబావి’ క«థలు రాశారు. ‘నా కన్నీళ్లే నా సాహిత్యం’ అని చెప్పుకున్న ఇనాక్ ‘ఈ సమాజం భయం పునాదిపై నిర్మించబడింది. దీన్ని కూల్చివేసి భయంలేని సమాజాన్ని నిర్మించుకోవాలి’ అని చెబుతారు. ఇప్పటికి ఇనాక్ 96 పుస్తకాలు, 300 క«థలు రాశారు. దళితులు, గిరిజనులు, బహుజనులు, ముస్లిం మైనార్టీలు, సమాజంలో సగభాగమైన మహిళల చుట్టూతా ఇనాక్ రచనలు నిండి ఉంటాయి. ఈయన రచనల్లో ఆధిపత్య శక్తులపై నేరుగా దాడులు చేసినట్లుగా ఉండదు. బహుజనుల విజయం కోరతాడు. వీళ్లు గెలవాలంటారు. ఇనాక్ ఏ రచనలో కూడా పీడిత వర్గాలు ఓడిపోవటం చెప్పడు. దళిత, బహుజన, గిరిజన, మైనార్టీలు ఓటమిలో కూడా తలెత్తుకొని తిరుగగలిగే ధైర్యాన్నిస్తూ సాహిత్యసృష్టి చేశారు. 64 ఏళ్ల క్రితం తొలికథ ‘ఉత్తరం’లో ఇనాక్ కన్నీళ్లతో సమాజాన్ని చూశారు. ఇపుడు ఆ కన్నీళ్లు ఆరి పోయి చూసే క్రొత్త సమాజం రాబోతుంది. ఇపుడు దళిత, బహుజన, గిరిజన, మైనార్టీ, మహిళా సాహిత్యంలో ఒక్క ఇనాక్ లేడు. వందల మంది ఇనాక్లున్నారు. ఇది పెద్దమార్పు. ఇనాక్ ఆధునిక ఆది దళిత బహుజన ప్రతిఘటనా స్వరం. ఆయన బహుజన పక్షంవైపు స్పష్టంగా నిలబడి సాహిత్య విమర్శచేశారు. కథలు రాశారు. కవిత్వం రాశారు. తన కన్నీళ్లనే తన కావ్యాలుగా ఆవిష్కరించిన దళిత బహుజన సాహిత్యశిఖరం కొలకలూరి ఇనాక్. ఇనాక్సారూ, నువ్వు నూరేళ్లూ జీవించూ.. (కొలకలూరి ఇనాక్ 80వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని త్యాగరాయగానసభలో ఈ నెల 6 నుంచి 12 వరకు రోజూ సాయంత్రం 6 గంటలకు సాహితీ సప్తాహం సందర్భంగా) జూలూరు గౌరీశంకర్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు ‘ 94401 69896 -
పీడితవర్గ రచయితకు పద్మశ్రీ
కొలకలూరి ఇనాక్‌కు పద్మశ్రీ రావడం అంటే అశ్రువుకు పద్మశ్రీ రావడం... వేదనకు పద్మశ్రీ రావడం... తరతరాలుగా చెప్పుల్లేకుండా పరుగులెత్తిన పాదాలకీ సీసపుపోతతో నెత్తురు కార్చిన చెవులకీ తాటాకులు కట్టిన వీపుకీ రక్తమే చెమటగా చిందించిన మట్టి కట్టెకీ శ్రమజీవికీ బడుగుజీవికీ దళిత ఆక్రందనికీ పద్మశ్రీ రావడం. ఇది అక్షరం తనను తాను గౌరవించుకోవడం కాదు. సమాజం తనను తాను గౌరవించుకోవడం. కింద పడ్డ అన్నం ముద్దను దోసిళ్లలో అందుకొని కళ్లకద్దుకొని భుజించడం. కథకుడిగా, కవిగా, విమర్శకుడిగా, అధ్యాపకుడిగా ఇనాక్ ప్రస్థానాన్ని రెండు నెలల క్రితం ఇదే పేజీలో ప్రస్తావించింది సాక్షి. ఇనాక్‌కు సాహిత్య అకాడెమీ పురస్కారం రాకపోవడాన్ని ప్రశ్నించింది. ఇప్పుడు అంతకు మించిన గౌరవం అందుకున్నందుకు హర్షం ప్రకటిస్తోంది. నిలదీసే కథలు ఆయనవి నా కన్నీళ్లే నా సాహిత్యం అని కొలకలూరి ఇనాక్ అన్నంత మాత్రాన కేవలం కష్టాలు చెప్పి, బాధలు ఏకరువు పెట్టి పాఠకుల్ని ఏడిపించడం ఆయన తన రచనా ధోరణిగా పెట్టుకోలేదు. కరుణ ఆయన సాహిత్యంలో అంతర్గతంగా ఉన్నా అది పాఠకులను ఆలోచన వైపు మళ్లిస్తుంది. పీడితులను మారుతున్న సమాజంలో భాగస్వాములను కమ్మని చైతన్యపరుస్తుంది. ఆయన పాత్రలేవీ శ్రమ నుంచి దూరం కావు. అవి పిరికివి కావు. వాటికి తామెలా ఉన్నామో, అలా ఎందుకున్నామో, తామెలా ఉండాలో, అలా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసు, లేదా తెలుసుకుంటాయి. హక్కుల సాధనను ఆయన పాత్రలు అనేక రకాలుగా చేస్తుంటాయి. కూలి రాబట్టుకోవడం, దేవాలయ ప్రవేశం, నీళ్లు సంపాదించుకోవడం, ఆకలిని తీర్చుకోవడం, మద్యపాన రుగ్మత వంటి వస్తువుల నుండి కులాంతర వివాహాల దాకా ఆయన సాహిత్య వస్తువు విస్తరించి ఉంటుంది. కంచికచర్ల కోటేశు సజీవ దహనం, రూప్‌కన్వర్ సహగమనం, ప్యాపిలి వినాయక చవితి సంఘటన వంటి నిర్దిష్ట వస్తువులు ఆయన కథలు కావడం విశేషం. నిర్దిష్టతను సంభాషణల ద్వారా, వ్యాఖ్యల ద్వారా సాధారణీకరించడం కొలకలూరికి తెలిసిన విద్య. - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, విమర్శకులు ఇనాక్ కథల నుంచి... పొట్ట పేగులిబ్బందిగోడు.... ఇబ్బందిగోడు మాంసం గోత్తే పెద్ద గిరాకీ. లేద్దూడల్ని, రోగం రొచ్చు లేనివాటిని, కుర్రాటిని, కొవ్వినాటిని గోత్తాడు ఇబ్బందిగోడు. పక్కూళ్ల పల్లెలోళ్లు గూడా ఆదోరవైతే అజీలుగా ఆడింటిముందు తెల్లారగట్టకే కాకులోలినట్టోలి కావుకావుమంటుంటారు. వొక్కక్కడూ రెండూ మూడూ కుప్పలెత్తుకుంటాడు. ఆల్లొత్తన్నారు గందాని ఈడు బేరం బెంచడు. కొంటన్నారు గందాని రోగిష్టోటిని గొయ్డు. ఆదోరం యాపారం. ఇంక వారవంతా కాళ్లారజావుక్కూకోటమే. ఉంటే కూడొండుకుంటాడు లేబోతే గంజి కాసుకుంటాడు. గంజిగ్గతిలేనోడు కాడీడు. ఆడి కొంపని గుడిసెంటే సిన్నమాట. ఇల్లంటే పెద్ద మాట. గూడంటే సరిపోద్ది. మట్టిగోడలు, తడికె తలుపు, ఒంటి నిట్టాడి, తాటాక్కప్పు, కిటికీలంటే తప్పు, బొక్కలంటే సెల్లు. తడికేత్తే ఇల్లంతా సీకటి గుయ్యారం. పొయ్యి ముట్టిచ్చకపోతే పొగులు. బెడ్డలిగిచ్చకపోతే రేత్రి. ఆడి గూట్లో కన్ను బొడసుకున్నా యేందీ కానరాదు..... తాకట్టు..... శాస్త్రి ఇంట్లోగాని వంటి మీద గాని విలువైన వస్తువేదీ లేదు. ‘తాకట్టు పెట్టడానికి నా దగ్గరేముంది?’ ‘ఏమున్నా సరే’ ‘ఏమీ లేదనేగా. ఇవ్వననరాదూ?’ ‘ఇస్తానంటున్నానుగా’ ‘ఏం తాకట్టు పెట్టేది?’ ‘నీ జందెం’ ‘జంధ్యమా?’ శాస్త్రి బిత్తరపోయాడు. తిక్కపట్టినవాడిలాగా మిత్రుడి ముఖంలోకి చూశాడు. జంధ్యం మంత్రపునీతం. ద్వితీయ జన్మం. ఉపనయన చిహ్నం. ద్విజలక్షణం. వేదవిద్యా పరిరక్షణభారం. మోక్షదాయని. శత్రు సంహారిణి, గాయత్రీ మంత్ర పరిరక్షితం. ఆలోచిస్తున్నకొద్దీ శాస్త్రికి పిచ్చెక్కుతూ ఉంది. ఓబిలేసు మాట్లాడకుండా కూర్చున్నాడు.... ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాలు: ఉత్తమమైన కవిత్వానికి ప్రతి ఏటా ఇచ్చే ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాలను 2012, 2013 సంవత్సరాలకుగాను వరుసగా రామాచంద్రమౌళి, ఈతకోట సుబ్బారావులకు ప్రకటించారు. ఫిబ్రవరి 1 సాయంత్రం చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయంలో బహుమతి ప్రదానం.