ఆదిశేషుడు అర్చించిన ఆలయం తిరుప్పాంపురం | Srikalahasti Special Story | Sakshi
Sakshi News home page

ఆదిశేషుడు అర్చించిన ఆలయం తిరుప్పాంపురం

Published Sun, Jun 11 2017 12:08 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

ఆదిశేషుడు అర్చించిన ఆలయం తిరుప్పాంపురం

ఆదిశేషుడు అర్చించిన ఆలయం తిరుప్పాంపురం

జాతకంలో కాలసర్ప దోషం, కళత్ర దోషాలు ఉంటే ఆ దోషాలను తొలగించుకునేందుకు శ్రీకాళహస్తి వెళ్లి పూజలు చేయించుకుంటారు తెలుగునాట. మరి తమిళ తంబీలకు..? వాళ్లకు కూడా ఇలాంటి క్షేత్రం ఒకటి ఉంది. అదే తిరుప్పాంపురం. రాహుకేతువులు ఏకశరీరంగా ఉన్న మహా మహిమాన్వితమైన సర్పక్షేత్రమిది. ఈ క్షేత్రాన్ని తమిళులే కాదు.. ఇరుగు పొరుగు రాష్ట్రాల వారు కూడా దర్శించుకుని సర్పదోషనివారణ పూజలు చేయించుకుని ఉపశమనం పొందుతుంటారు.

తిరుక్కాళాత్తి, కుడండై, తిరునాగేశ్వరం, నాగూర్, కీయ్‌ పెరుపల్లం తదితర అయిదు పుణ్యక్షేత్రాల మేలు కలయికే తిరుప్పాంపురం.ఈ   ఆలయంలో ఉన్న దైవం శేషపురీశ్వరుడు. అమ్మవారు వండుచేర కుయిలి. ఇక్కడ ఉన్న పుణ్యతీర్థం ఆదిశేష తీర్థం.స్థలపురాణం: ఒకసారి కైలాసంలో శివుడిని వినాయకుడు పూజిస్తున్నాడు. అప్పుడు శివుడి మెడలోని పాములు తమనూ కలుపుకుని పూజిస్తున్నట్లు గర్వపడ్డాయి. అది గ్రహించిన శివుడు ఆగ్రహించి, ఇక మీదట నాగుపాములన్నీ తమ దివ్యశక్తులను కోల్పోయి సామాన్య సర్పాలవలె మానవుల చేత చిక్కి నానాహింసల పాలూ అయి మరణిస్తాయని శపించాడు.

 దీంతో శివుడి మెడలోని వాసుకితోపాటు ఆదిశేషువు, కర్కాటకుడు, తక్షకుడు... తదితర సర్పాలు తమ శక్తిని కోల్పోయాయి. అవి తమ తప్పు తెలుసుకుని  శాపవిమోచనం కల్పించ వలసిందిగా పరమేశ్వరుని ప్రాధేయపడ్డాయి. బోళాశంకరుడి మనసు కరిగిపోయింది. మహాశివరాత్రిరోజున తిరుప్పాంపురం వెళ్లి అక్కడ కొలువై ఉన్న తనను ఆరాధిస్తే శాపవిమోచనం కలుగుతుందని చెప్పాడు. అప్పుడు వాసుకి, ఆదిశేషుడు తదితర అన్ని నాగులూ కలసి మహాశివరాత్రిరోజు తిరునాగేశ్వరంలోని నాగనాథ స్వామిని, తిరుప్పాంపురంలోని పాంబునాథుడిని, నాగూరులోని నాగనాథుని ఆరాధించాయి.

తిరుప్పాంపురం క్షేత్రంలో ఆరాధించిన వెంటనే నాగుల శాపం తొలగిపోయింది. ఇక్కడ ఈశ్వరుడిని ఆరాధించేందుకు వచ్చిన సర్పాలు ఒక పుణ్యతీర్థాన్ని ఏర్పాటు చే సుకున్నాయి. అదే ఆదిశేష తీర్థం. బ్రహ్మ, ఇంద్రుడు, అగస్త్యుడు, గంగాదేవి వంటి వారు ఇక్కడి ఆలయాన్ని సందర్శించి ధన్యులైనట్లు పురాణగాథలున్నాయి. ఇక్కడ ఉన్న మూడవ కుళోత్తుంగ చోళుడి శిలాఫలకాన్ని బట్టి చూస్తే ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నాటిదని చెప్పవచ్చు. తంజావూరును పాలించిన శరభోజీ చక్రవర్తి ఈ ఆలయానికి వసంతమండపాన్ని, రాజగోపురాన్ని నిర్మించారు.

 ఈ గోపురానికి ఎదురుగా ఉన్న వినాయక విగ్రహానికి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి స్వామికి శేషపురీశ్వరుడు, పాంబుపుర నాథుడు, పాంబుపురీశ్వరుడు తదితర నామాలున్నాయి. గర్భగుడిలో శివుని పూజించే రీతిలో ఉన్న ఆదిశేషుని విగ్రహం కనువిందు చేస్తుంది. వెలుపలి ప్రాకారానికి ప్రదక్షిణ మార్గంలో భైరవుడు, సూర్యుడు, దుర్గ, శనీశ్వరుడు, రాహువు, కేతువు తదితర సన్నిధులున్నాయి. ఇక్కడ ఉన్న రావిచెట్టుకింద అసంఖ్యాకంగా సర్పశిలలున్నాయి. ఆలయంలో ఈశాన్య దిక్కుమూలలో రాహుకేతువులు ఒకే సన్నిధిలో కనిపిస్తారు. ఇక్కడ రాహుకాల పూజలు విశేషంగా జరుగుతాయి.

 అలాగే సర్పదోష పరిహార పూజలకు ఈ ఆలయం పెట్టింది పేరు. రాహుకాలంలో ఆలయం తెరిచిన వెంటనే నేతిదీపాలు కొని వెలిగిస్తారు. రాహు, కేతు దోషాల పరిహారపూజలకు తగిన సంబారాలు ఇక్కడే లభిస్తాయి. భక్తులు ముందుగా చెప్పడం మంచిది. చెప్పకుండా నేరుగా వచ్చినవారు తెల్లవారు జామున వస్తే మేలు. సర్పదోష నివృత్తికోసం చేయించుకునే పూజకు సుమారు 5,500 వరకు వసూలు చేస్తారు. జాతకంలో సర్పదోషం ఉన్నవారు, ఏ పని తలపెట్టినా ముందుకు సాగనివారు, విద్యా, ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతున్నవారు రాహుకేతువులకు మొక్కుకుని, తిరుప్పాంపురంలో పూజలు చేయించుకునే వారు అధిక సంఖ్యాకంగా కనిపిస్తుంటారు.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement