టారో : 10 ఏప్రిల్ నుంచి 16ఏప్రిల్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
ఈవారం మీరు మీకు దగ్గర అయిన వాళ్లందరితో సంతోషంగా, సరదాగా గడుపుతారు. భావోద్వేగాలకు లోనయ్యే పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. పెట్టుబడులు పెట్టడానికి ఇది తగిన సమయం. నమ్మకంతో అడుగేస్తే మీరు ఏమైనా సాధించగలరన్న విషయాన్ని అర్థం చేసుకోండి.
కలసివచ్చే రంగు: ఎమరాల్డ్ గ్రీన్
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
ఈ వారమంతా ఆనందమే. ఎటువంటి అవరోధాలూ ఇబ్బందులూ మీవైపు తొంగి చూడవు. సంతోషం, సంపద అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబంతో కలిసి విహారానికి వెళ్తారు. ఇంటి నిర్మాణంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయిస్తారు. మీరు కష్టపడి చేసేకొద్దీ మంచి ఫలితాలు, లాభాలు మీకు కలుగుతాయి.
కలసివచ్చే రంగు: ముదురు ఎరుపు
మిథునం (మే 21 - జూన్ 20)
ఈవారం మీకు అంతా శుభమే. మీ శక్తియుక్తులు, మీ చలాకీతనం మిమ్మల్ని లైమ్‌లైట్‌లోకి తీసుకొస్తాయి. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ పైవాళ్లు మీ విషయంలో తృప్తి చెందుతారు. విజయంతో పాటే సంపద కూడా చేకూరుతుంది. మంచైనా చెడైనా మీరు చేసే ప్రతి పనికీ పూర్తి బాధ్యత మీరే తీసుకోండి. ఆశావహ దృక్పథాన్ని వీడకండి.
కలసివచ్చే రంగు: నీలం
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
ఒక ముఖ్యమైన విషయంలో కలిగే ఇబ్బంది మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ముఖ్యంగా బాంధవ్యాల విషయంలో తలెత్తే ఇబ్బందులు చికాకు పెడతాయి. మీరెంతో ప్రేమించే వ్యక్తి మీకు దూరం కావడం మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తుంది. ఆ బాధ మీ పని మీద, కెరీర్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. పరిస్థితుల్ని చక్కబెట్టడం మీవల్ల కాకపోవచ్చు. కాలానికే వదిలేయండి.
కలసివచ్చే రంగు: తెలుపు
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
ఉద్యోగ విషయంలో మార్పులు సంభవించవచ్చు. పని చేసేచోట మిమ్మల్ని చూసి అసూయపడే వ్యక్తి ఎవరైనా ఉంటే... వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టవద్దు. మరింత పాజిటివ్ దృక్పథంతో పనిచేస్తే వ్యాపారాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. వాతావరణ మార్పులు మీ ప్రయాణాలకు ఆటంకం కలిగించవచ్చు.
కలసివచ్చే రంగు: కాషాయం
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
మీ జీవన విధానంలో కొత్త మార్పులు వస్తాయి. కొత్త ఆభరణాలు, సౌందర్య సాధనాలు కొనుగోలు చేస్తారు. మీలో మీరు కొత్త మార్పును తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. కొన్ని ఆసక్తికర సందర్భాలు మీకు ఎదురవుతాయి. నిర్ణయాలు తీసుకునే క్రమంలో కన్‌ఫ్యూజన్‌కి గురైతే మీ మనసు చెప్పేది తు.చ.తప్పకుండా ఆచరించండి.
కలసివచ్చే రంగు: పసుపు
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
అందమైన భవిష్యత్తుకు తలుపులు తెరచుకోనున్నాయి. విజయాలు పొందుతారు. సంతోషంగా ఉంటారు. భయాలను అధిగమించి గెలుపు బాటలో సాగిపోతారు. మీ కలలు నిజం చేసుకోవడానికి మీరు నిజాయతీగా చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. మీలో కొత్త ఉత్సాహం నిండుతుంది. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి.
కలసివచ్చే రంగు: సిల్వర్ గ్రే
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
ఈ వారమంతా రొమాంటిక్‌గా ఉంటుంది. కలల ప్రపంచంలో తేలియాడతారు. మీ అభిరుచులకు తగిన వ్యక్తిని కలుసుకుంటారు. ఇతరులు కొన్ని విషయాల కోసం మీ మీద ఆధారపడతారు. వారికి మీరు చేసే సాయం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఆఫీసులో పని ఒత్తిడి పెరగవచ్చు. ఇంటి ఆగ్నేయ మూలలో క్రిస్టల్స్ ఉంచుకుంటే అదృష్టం కలసి వస్తుంది.
కలసివచ్చే రంగు: సిమెంటు రంగు, నీలం
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
ఇంతవరకూ మీరు పెట్టుకున్న నియమాలు, మీ మనసులో బలంగా నాటుకుపోయిన నమ్మకాల్లో మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. ఆ జిజ్ఞాస మీకు చాలా ఉపయోగపడుతుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. మీ మనసుకు నచ్చే వ్యక్తి అతి త్వరలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు.
కలసివచ్చే రంగు: లేత వంకాయరంగు
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు, సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని వ్యతిరేకించేవాళ్లు మీ దారికి అడ్డుపడాలని ప్రయత్నించవచ్చు. కానీ గెలుపు మీదే అవుతుంది. మీ కష్టంతో పాటు, మీ కుటుంబ సహాయ సహకారాలు, ప్రోత్సాహం మిమ్మల్ని విజయాలకు చేరువ చేస్తాయి. కొన్ని ఊహించని అద్భుతాలు కూడా సృష్టిస్తారు.
కలసివచ్చే రంగు: బంగారువర్ణం
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అప్రమత్తంగా, తెలివిగా వ్యవహరించండి. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీరేమిటో అలానే ఉండండి. ఎవరి కోసమూ మారకండి. ఆధ్యాత్మిక అంశాలు మీకు మనశ్శాంతిని, ధైర్యాన్ని ఇస్తాయి. ఓ చిన్న ఫౌంటెయిన్ లాంటిదేమైనా ఇంట్లో ఏర్పాటు చేస్తే కెరీర్ బాగుంటుంది. సంపద పెరుగుతుంది.
కలసివచ్చే రంగు: ఇటుక ఎరుపు
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
నిజాయతీ, హుందాతనం, మంచితనం అనే మూడు లక్షణాల మీద మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీ నుంచి ఇతరులు స్ఫూర్తి పొందుతారు. కాబట్టి మీరెప్పుడూ మీ మాటలు, చేతలు ఆదర్శవంతంగా ఉండేలా మలచుకోండి. ఎదుటివాళ్లు చెప్పేది శ్రద్ధగా వినండి. కొన్ని ముఖ్యమైన సమాచారాలు మీకు తెలుస్తాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు అందుతుంది.
కలసివచ్చే రంగు: వెండి రంగు
- ఇన్సియా నజీర్, టారో అనలిస్ట్