
బహుశా... ఇదే నా చివరి ఇంటర్వ్యూ అవుతుందేమో!
‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకొన్న నటుడు సాయి. అయితే ఆ తర్వాత మాత్రం మితంగానే తెరమీద కనిపిస్తున్నాడు. ఎందుకలా? లెక్కకు మించి అవకాశాలు పలకరిస్తున్నా, సాయి ఎందుకు వాటిని ఒప్పుకోవడం లేదు! ప్రస్తుతం దర్శకుడిగా మారే ప్రయత్నంలో ఉన్న సాయి అంతరంగం ఏమిటి?
మీ నేపథ్యం ఏమిటి? సినీరంగం వైపు ఎలా వచ్చారు?
మాది తూర్పుగోదావరి జిల్లా తుని. స్కూల్ దశ నుంచే చదువు మీద కన్నా సాంస్కృతిక కార్యక్రమాలు, స్పోర్ట్స్ మీదే ఆసక్తి ఎక్కువ. జనాలు కొట్టే చప్పట్లలో ఏదో కిక్ ఉందనిపించింది. అందుకే క్రికెటరయిపోదామని అనుకొన్నా. అండర్-19 సెలక్షన్స్ కోసం కాకినాడకు వెళ్లడంతో ఆ క్రికెట్ జర్నీకి బ్రేక్ పడింది. సెలక్షన్స్ జరుగుతున్నన్ని రోజులూ అక్కడ ఉండటం కూడా కష్టమైంది. వసతి కోసమని ఇంట్లో వాళ్లు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అదే సమయంలో చదువుకు కూడా ఫుల్‌స్టాప్ పడటంతో ఏదో ఒక పని చేయక తప్పలేదు. దీంతో తెలిసిన వారి ద్వారా చెన్నై వెళ్లి అక్కడ సినిమాల సాంకేతిక విభాగంలో ట్రై చేయడం మొదలు పెట్టాను. ఇదంతా పదిహేనేళ్ల కిందటి సంగతి.
మరి నటుడిగా ఎలా మారారు?
ఉన్న పరిచయాలతో మొదట సీరియళ్లలో అవకాశం వచ్చింది. తమిళ, తెలుగు భాషల కోసం చెన్నైలో రూపొందించే చాలా సీరియళ్లకు దర్శకత్వ విభాగంలో పనిచేశాను. అలా ఒక ఐదేళ్లు గడిచిపోయాయి. కనీసం 30 సీరియళ్లకు పనిచేశాను. అలా చేస్తున్నప్పుడు ‘కుర్రాడు బాగున్నాడు...’ అంటూ దర్శకులు ఏదైనా చిన్న పాత్రను చేయమనేవారు. ఆ సీరియళ్లు తెలుగులో ప్రసారం అయినప్పుడు మా అమ్మ చూసి తెగమురిసిపోయేది. ‘‘అప్పడప్పుడు అలా కనిపించరా’’ అని చెప్పేది. దీంతో నటన మీద కూడా దృష్టిపెట్టాను.
తొలి సినిమాతోనే గుర్తింపు లభించినా, తర్వాత ఆ దూకుడు లేదే...!
ఈ రోజుల్లో, బస్‌స్టాప్ సినిమాల తర్వాత ముప్పై నలభై సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. వాటిల్లో చాలా వరకూ వెకిలి పాత్రలే! డబుల్ మీనింగ్ డైలాగ్స్ ద్వారా నవ్వించాలని చెప్పే దర్శకులు, నిర్మాతలే కనిపించారు. అయితే అర్థంపర్థం లేకుండా సాగే అలాంటి పాత్రలు చేయడం సరికాదనిపించింది.
సెలెక్టివ్‌గా చేయవచ్చు కదా!
నాకంత స్థాయి లేదండీ. ఒకసారి సినిమాను ఒప్పుకొన్నాకా అలా చేయను, ఇలా చేయను అంటే కుదరదు. అయితే రాజీపడి అలాంటి పాత్రలను చేయలేను. శారీరకంగా నేను ఒక క మేడియన్‌లా కనిపిస్తానేమో కానీ నా తాత్వికత వేరు. ‘నటన వేరు, వ్యక్తిగతం వేరు’ అనుకోలేకపోయాను. ‘ఏం విత్తామో, అదే కోస్తాం’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఈ విషయంలో నాకు నా భార్య సౌందర్యప్రియ కూడా పూర్తిగా మద్దతుగా నిలబడింది. ఇటీవలే మాకు బాబు పుట్టాడు. మరి భవిష్యత్తులో వాడు ఇప్పుడు నేను చేసిన సినిమాలను చూసి ఇబ్బంది పడకూడదు. నాకు సినిమాలే అక్కర్లేదు, ఏదోఒక పనిచేసి బతకగలను, నావాళ్లను పోషించుకోగలను. నేను నమ్మే దైవత్వం కూడా అలాంటి పాత్రలకు సమ్మతించకుండా చేసింది. అందుకే వాటికి దూరంగా జరిగాను.
మరి భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?
ఒక స్క్రిప్ట్ డిజైన్ చేసుకొంటున్నా. అదొక పీరియాడికల్ మూవీ. వర్క్ అంతా దాదాపుగా పూర్తయ్యింది. అది కార్యరూపం దాల్చి నేను దర్శకుడిగా నిలదొక్కుకొంటే, అందరికీ గుర్తుండిపోతా. లేకపోతే ఇదే నా చివరి ఇంటర్వ్యూ అవుతుందేమో!
చెన్నైలో ఉన్న మీకు తెలుగు సినిమా అవకాశాలు ఎలా లభించాయి?
ఏడేళ్ల కిందట చెన్నై నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాను. సీరియళ్లకు పనిచేయడం మానేసి... సొంతంగా రియాలిటీ షో కాన్సెప్ట్‌ను డిజైన్ చేసుకొన్నాను. వాటికి మంచి క్రేజ్ ఉండటంతో నా కాన్సెప్ట్‌ను నిర్మాత బన్నీవాసుకు వినిపించాను. ఆయన ద్వారా మారుతిగారితో పరిచయం కలిగింది. అప్పటికి మారుతి ‘బస్‌స్టాప్’ తీస్తున్నారు. దానికి నేను కూడా అసోసియేట్‌గా జాయిన్ అయ్యాను. అయితే ఆ సినిమా ఆగిపోయింది. ఆ విరామంలో ‘ఈ రోజుల్లో’ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడం మొదలుపెట్టారు. దానికి కూడా అసోసియేట్‌గా పనిచేసిన నేను మారుతి గారి సూచనమీదే నటుడిగా కూడా మారాను. ఆగిపోయిన బస్‌స్టాప్ మళ్లీ మొదలవ్వడంతో అందులో కూడా పాత్ర లభించింది.
- బీదాల జీవన్‌రెడ్డి