కాస్టింగ్‌ కౌచ్‌తో భయపడ్డాను..! | Vani Kapoor Exclusive Interview In Sakshi Funday | Sakshi
Sakshi News home page

కాస్టింగ్‌ కౌచ్‌తో భయపడ్డాను..!

Published Sun, Oct 6 2019 8:08 AM | Last Updated on Sun, Oct 13 2019 8:43 AM

Vani Kapoor Exclusive Interview In Sakshi Funday

యశ్‌రాజ్‌ ఫిల్మ్‌ వారి ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’తో బాలీవుడ్‌కు పరిచయమైన వాణీ కపూర్‌ ‘ఆహా కళ్యాణం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. శ్రుతి సుబ్రమణ్యం పాత్రతో ఆకట్టుకుంది. ఆదిత్యచోప్రా భారీ చిత్రం ‘వార్‌’తో ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమాలో హృతిక్‌రోషన్, టైగర్‌ ష్రాఫ్‌లతో కలిసి నటించిన వాణి కపూర్‌ అంతరంగాలు...

ఎంత ప్రేమంటే...
ఢిల్లీలో పుట్టి పెరిగాను. భోజనప్రియురాలిని. సినిమాలు...కొత్త, పాత, హిట్టు, ఫట్టు అనే తేడా లేకుండా తెగ చూసేదాన్ని. మా ఫామ్‌హౌస్‌లో ఎన్నో జంతువులు ఉండేవి. కుక్కలు, కోతులు, గుర్రాలు, కుందేళ్లు, పిల్లులు..ఇలా ఎన్నో. మినీ జూ అని చెప్పుకోవచ్చు. కుక్కపిల్లలంటే ఎంత ప్రేమంటే..బురదలో పొర్లాడే వాటిని కూడా ఇంటికి తీసుకువచ్చి శుభ్రపరిచేదాన్ని. ఇంట్లో చాలా క్రమశిక్షణగా పెంచారు. స్వేచ్ఛగా ఎక్కడికైనా ఎగిరిపోవాలనిపించేది. టూరిజం స్టడీస్‌ కోసం మొదటిసారి ఢిల్లీలో హాస్టల్‌లో ఉన్నాను. నేను మోడలింగ్‌లోకి రావడం మా నాన్నకి ఎంతమాత్రం ఇష్టంలేదు. ఆర్మీ నేపథ్యం నుంచి వచ్చిన అమ్మ మాత్రం నన్ను ప్రోత్సహించేది. మా అక్కకు పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్లయింది. నాకు స్వతంత్రభావాలు ఎక్కువ. మోడలింగ్‌ ఏజెన్సీలకు ఇంటర్వ్యూలకు  వెళుతున్న సమయంలో లావుగా ఉండేదాన్ని. అయినప్పటికీ సెలెక్ట్‌ అయ్యాను. ఆ తరువాత మాత్రం రకరకాల వ్యాయమాలు చేసి బరువు తగ్గాను. కాస్టింగ్‌ కౌచ్‌ భయంతో మొదట్లో ఫిల్మ్‌ ఇండస్ట్రీకి రావడానికి భయపడ్డాను. గుర్తింపు ఉన్న మోడలింగ్‌ ఏజెన్సీ నుంచి రావడం వల్ల కావచ్చు...అదృష్టవశాత్తు నాకు అలాంటి సమస్యలు ఎదురుకాలేదు.

ఇష్టపడే డైరెక్టర్‌
ఆదిత్య చోప్రాతో కలిసి పని చేయడం ఇష్టం. ఆయనలో మంచి సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఉంది. ఎంతో జ్ఞానం ఉంది. ఏ విషయాన్ని గురించి అడిగినా టక్కుమని చెప్పేస్తారు. ప్రొఫెషనల్‌గా ఉంటారు. స్పష్టమైన దార్శనికత ఉంది.  సినిమా షూటింగ్‌ ముందు  వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంటారు. టైమ్‌ విషయంలో ఆయన కచ్చితంగా ఉంటారు. సందేహాలు ఏమైనా ఉంటే షూట్‌కు ముందే అడగాలి. కెమెరా ముందుకు వెళ్లాక మాత్రం...బాగా నటించాలి. అందుకే బాగా ప్రిపేరై కెమెరా ముందుకు వెళ్లేవాళ్లం.

ఇష్టమైన ప్రదేశం
ప్యారిస్‌ అంటే చాలా ఇష్టం. ఈ సిటీ అందాలను ఆస్వాదించాలంటే కారు ప్రయాణం చెయ్యనేకూడదు. నడవాలి. అక్కడి వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంటుంది. అర్కిటెక్చర్‌ అద్భుతం. ‘శుద్ధ్‌దేశీ’ సినిమాలో ప్యారిస్‌లో పుట్టి, పెరిగిన అమ్మాయి పాత్ర చేశాను.  షూటింగ్‌ చేయడానికి ముందు ఎన్నో ఫ్రెంచ్‌ సినిమాలు చూశాను. ప్యారిస్‌కు వెళ్లి ఫ్రెంచ్‌ ప్రజలతో చాలా సమయాన్ని గడిపాను. వారి హావభావాలను క్షుణ్ణంగా పరిశీలించాను.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement