టారో వారఫలాలు (సెప్టెంబర్‌ 1 నుంచి 7 వరకు) | Weekly Tarot For 1st September To 7th September 2019 | Sakshi
Sakshi News home page

టారో వారఫలాలు (సెప్టెంబర్‌ 1 నుంచి 7 వరకు)

Published Sun, Sep 1 2019 7:52 AM | Last Updated on Sun, Sep 1 2019 7:52 AM

Weekly Tarot For 1st September To 7th September 2019 - Sakshi

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
త్యాగాలు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగున్నా ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న పంతాలు పట్టింపులు మనస్తాపం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు నిలకడగా ఉంటాయి. విధి నిర్వహణ పట్ల పూర్తి స్పష్టతతో ఉంటారు. సకాలంలో లక్ష్యాలను సాధిస్తారు. పట్టుదలతో, అంకితభావంతో అసాధ్యమనుకున్న పనులను కూడా సునాయాసంగా పూర్తిచేసి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ప్రియతములకు తగినంత సమయం కేటాయించలేక, వారిని సముదాయించలేక సతమతమవుతారు.
లక్కీ కలర్‌: ఊదా

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
అంతరాత్మ ప్రబోధాన్ని నమ్ముకుంటారు. కుటుంబంలో ఏర్పడిన ఒక సమస్యను పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో తలెత్తిన ప్రతికూలతలను అధిగమిస్తారు. ప్రత్యర్థుల ఆటలను కట్టిస్తారు. చిరకాలంగా నలుగుతున్న ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఒక ఆకస్మిక సంఘటనతో భావోద్వేగాలకు లోనవుతారు. పని ఒత్తిడి పెరిగి వేళకు భోజనం చేయలేకపోతారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: పసుపు

మిథునం (మే 21 – జూన్‌ 20)
నిజాయతీని నిరూపించుకోవలసిన పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనంగా కొత్త బాధ్యతలను నెత్తిన వేసుకోకుండా ఉండటమే క్షేమం. పూర్తి చేయాల్సిన పనులు ఒత్తిడికి, ఆందోళనకు గురిచేసినా, సకాలానికి పనులు పూర్తి చేస్తారు. ఇబ్బందిపెడుతూ వచ్చిన అధికారులకు స్థానచలనం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పలుకుబడి గల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రియతముల మధ్య తలెత్తిన పొరపొచ్చాలు ఎడబాటుకు దారితీసే సూచనలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: నీలం

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
సంక్లిష్టమైన కాలం. అప్రమత్తంగా ఉంటేనే చిక్కుల్లో పడకుండా ఉంటారు. మిత్రుల ముసుగులోని ప్రత్యర్థులను పసిగట్టి, వారికి దూరంగా ఉంటేనే క్షేమం. వృత్తి ఉద్యోగాల్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరగడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతారు. అలాంటి వారే మిమ్మల్ని అతిగా పొగుడుతూ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తారు. ప్రేమికుల మధ్య తగవులు జరిగే అవకాశాలు ఉన్నాయి. స్వల్పకాలిక పెట్టుబడుల నుంచి లాభాలను అందుకుంటారు. మిత్రుల్లో ఒకరిని ఆర్థికంగా ఆదుకుంటారు. ఆధ్యాత్మిక గురువులను కలుసుకుంటారు.
లక్కీ కలర్‌: ముదురు గులాబి

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
విసుగెత్తించే రోజువారీ కార్యక్రమాలకు విరామం ప్రకటించి, విహారయాత్రలకు వెళతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు కొంత సానుకూలంగా మారుతాయి. ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో మీరు వెల్లడించే అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. వాక్చాతుర్యంతో బహిరంగ వేదికలపైనా రాణిస్తారు. కుటుంబంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెరిగిన బరువును తగ్గించుకోవడానికి వ్యాయామం ప్రారంభిస్తారు. పిల్లల పురోగతి సంతృప్తినిస్తుంది. కండరాల నొప్పులు, తలనొప్పి ఇబ్బందిపెట్టే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: తెలుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సంక్లిష్టంగా మారే సూచనలు ఉన్నాయి. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతారు. పని ఒత్తిడి పెరుగుతుంది. మానసికంగా అలజడికి, అభద్రతాభావానికి లోనవుతారు. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆరోగ్యంపై దృష్టిసారించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం అనివార్యమవుతుంది. ప్రేమికుల మధ్య ఎడబాటు తప్పకపోవచ్చు.
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఆశలు వదులుకోవద్దు. తప్పకుండా ఫలిస్తాయి. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై, అలంకరణలపై శ్రద్ధ తీసుకుంటారు.
లక్కీ కలర్‌: ఎరుపు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు.
లక్కీ కలర్‌: గోధుమ రంగు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు.
లక్కీ కలర్‌: నేరేడు రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి.
లక్కీ కలర్‌: నీలం

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది.
లక్కీ కలర్‌: గులాబి

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
పనులను పూర్తి చేయడంలో అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. చిరకాలంగా కొనసాగుతున్న స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రేమానుబంధాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు కుదిరే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ
- ఇన్సియా, టారో అనలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement