
అరణ్యం: ప్రమాదం వస్తే కంగారూ ఏం చేస్తుంది?
కంగారూలు నాలుగు కాళ్లమీదా నడవగలవు, రెండు కాళ్లమీదా నడవగలవు. వెనక్కి మాత్రం ఒక్క అడుగు కూడా వేయలేవు. వాటి కాళ్ల నిర్మాణం అందుకు సహకరించదు!
మగ కంగారూని బక్ లేదా బూమర్ అంటారు. ఆడ కంగారూని డో లేదా ఫ్లయర్ అంటారు. కంగారూ పిల్లని జోయ్ అంటారు!
కంగారూల చెవుల నిర్మాణం విచ్రితంగా ఉంటుంది. అవి ఎటునుంచి శబ్దం వస్తే అటువైపు తిరుగుతూ ఉంటాయి!
ఇవి నీళ్లు తాగకుండా రెండు నుంచి నాలుగు నెలల వరకూ ఉండగలవు!
కంగారూలు ఉప్పగా ఉండే ఆకులను ఇష్టంగా తింటాయి. యూకలిప్టస్, అకాసియా చెట్ల ఆకుల్ని అస్సలు ముట్టకోవు. అయితే కంగారూలు ఉండే ఆస్ట్రేలియాలో అత్యధికంగా ఉండేవి ఈ రెండు రకాల చెట్లే!
ఎందుకో తెలీదు కానీ... ఇవి వాతావరణం చల్లగా ఉన్నప్పుడే ఆహారాన్ని తీసుకుంటాయి. అందుకే మధ్యాహ్నం పూట తినవు. సాయంత్రం చల్లబడిన తర్వాత తింటాయి. అంతేకాదు... ఇవి పగలు కంటే రాత్రిపూట ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాయి!
నాలుగు నుంచి ఇరవై కంగారూలు కలిపి గుంపుగా ఉంటాయి. ఈ గుంపును ట్రూప్ లేదా కోర్ట్ అంటారు. అన్నిటిలోకీ పెద్దదైన మగ కంగారూ గుంపునకు లీడర్‌గా ఉంటుంది. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఇది తన కాలును నేలకేసి టపటపా కొడుతుంది. వెంటనే అన్నీ అలర్ట్ అయిపోతాయి!
ఇది మహా తుంటరి!
‘ప్రపంచాన్ని మర్చిపోవాలంటే... పక్కన ఓ పెంపుడు జంతువు ఉండాలి’ అంటారు కంగనా రనౌత్. బాలీవుడ్‌లో ఫేమస్ హీరోయిన్ అయిన కంగనా... ‘ఏక్ నిరంజన్’ చిత్రంతో తెలుగువారికి కూడా దగ్గరయ్యారు. సినిమా షూటింగులతో బిజీ బిజీగా ఉండే ఈమె... కాస్త తీరిక దొరికిందంటే చేసే పనేంటో తెలుసా? తన పెంపుడు కుక్కతో ఆడుకోవడం.
కంగనా ఇంటికి వెళితే... తెలుపు, బ్రౌన్ కలర్స్ కలగలిపి ఉండే బుజ్జి కుక్కపిల్ల అటూ ఇటూ పరిగెడుతూ కనిపిస్తుంది. ఇది ఒకచోట కుదురుగా కూర్చోదు, నిలబడదు. కాళ్లకడ్డుపడుతూ పరుగులు తీస్తుంది. సోఫాలు, కుర్చీలు ఎక్కి నానా హంగామా చేస్తుంది. దాని అల్లరి చూడటం తనకెంతో ఇష్టం అని మురిసిపోతూ చెబుతుంటారు. కంగనా. దానితో ఎంతసేపు ఆడుకున్నా విసుగే రాదని అంటారు. అది కూడా కంగనా దగ్గర భలే గారాలు పోతుంటుంది.
ఒకసారి ఏమయ్యిందంటే... కంగనా షూటింగుకి వెళ్లడానికి రెడీ అయ్యారు. చెప్పులు వేసుకుందామని స్టాండ్ దగ్గరకు వెళ్లారు. అంతే, అక్కడ తన చెప్పులు చూసి షాకయ్యారామె. కొన్ని వేలు పోసి కొన్ని ఖరీదైన చెప్పులు ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి. వాటిని చూడగానే ఆమెకు అర్థమైపోయింది.. అది ఎవరి పనో! కానీ ఏం చేయగలదు? ‘‘నాకు తెలుసు ఇది దాని పనే అని. ఆ చెప్పుల విలువెంతో నాకు తెలుసు గానీ దానికేం తెలుసు’’ అంటూ నవ్వుకున్నారు కంగనా. అంత తుంటరిది ఆ బుజ్జి కుక్క!