
ఆ క్షణం...
ఇప్పటి వరకు పది వన్డే ప్రపంచ కప్ టోర్నీలు జరిగాయి. విజేతలు... పరాజితులు...
పరుగులు... వికెట్లు... ఈ జాబితా చాలా పెద్దది. అయితే కొన్ని ఘటనలు, క్షణాలు మాత్రం
ప్రతీ క్రికెట్ అభిమానికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వీటికి స్కోర్లతో పని లేదు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారనేది తర్వాతి సంగతి. గణాంకాలతో సంబంధం లేకుండా ఆ క్షణం మాత్రం
మరచిపోలేని ముద్ర వేస్తుంది. కొన్ని ఆహా అనిపించేవైతే... మరి కొన్ని అయ్యో అనిపిస్తాయి.
ఇన్నేళ్ల వరల్డ్ కప్ చరిత్రలో అలాంటి కొన్ని ఘట్టాలను గుర్తు చేసుకుంటే...
బాధను దిగమింగి...
సచిన్ వంద శతకాలు బాది ఉండొచ్చు. కానీ ఆ సెంచరీ ప్రత్యేకం. 1999 ప్రపంచకప్‌లో బ్రిస్టల్‌లో చేసిన సెంచరీ ఎప్పటికీ అభిమానులకు గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్‌కు ముందు తండ్రి మరణించడంతో సచిన్ స్వదేశం తిరిగొచ్చాడు. సచిన్ గైర్హాజరీలో ఆడిన భారత్, అనూహ్యంగా జింబాబ్వే చేతిలో ఓడింది. అంత్యక్రియలు ముగిసిన అనంతరం జాతి ఆశలు మోస్తూ సచిన్ మళ్లీ ఇంగ్లండ్‌కు వచ్చాడు. కెన్యాతో జరిగిన తర్వాతి మ్యాచ్‌లో 101 బంతుల్లో 140 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. ప్రత్యర్థి బలహీనమైనదే కావచ్చు, కానీ ఆ సమయంలో మాస్టర్ తన మనసులోని సంఘర్షణల నడుమ చేసిన ఆ శతకం ఎప్పటికీ ప్రత్యేకం. సెంచరీ చేయగానే తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆకాశం వైపు బ్యాట్ చూపించడం అభిమానులు ఎన్నటికీ మరచిపోలేరు. ఆ తర్వాత సచిన్‌కు అదే అలవాటుగా మారిపోయింది.
అదీ ఫీల్డింగ్ అంటే...
1992కు ముందు ఫీల్డింగ్‌కు అంత గ్లామర్ లేదు. దానికి కొత్త నడకను, నడతను నేర్పిన ఘనత జాంటీ రోడ్స్ సొంతం. ఇంజమామ్ ఉల్ హక్‌ను ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు రనౌట్ చేసిన తీరు అద్భుతం. మెక్‌మిలన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయి విఫలమైన హక్ లెగ్‌బై కోసం ప్రయత్నించాడు. అనూహ్య రీతిలో పాయింట్ వైపునుంచి వేగంగా రోడ్స్ దూసుకొచ్చాడు. నేరుగా త్రో చేయకుండా బ్యాట్స్‌మన్‌తో పోటీ పడి పరుగెత్తుతూ వచ్చి బంతితో మొత్తం స్టంప్స్‌ను గిరాటేశాడు. ఈ సమయంలో గాల్లో తేలుతూ రోడ్స్ చేసిన విన్యాసం అభిమానుల మనసుల్లో ముద్రించుకుపోయింది. హక్ ఎంత ప్రయత్నించినా రనౌట్‌నుంచి తప్పించుకోలేకపోయాడు. ఈ వికెట్ అనంతరం తడబడిన పాక్ 20 పరుగుల తేడాతో ఓడింది.
సీన్ రివర్స్
మూడు సార్లు ఫైనల్‌కు చేరినా ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్టు ఇంగ్లండ్. 1987 ఫైనల్ ఆ జట్టును మరీ బాధించింది. చిరకాల ప్రత్యర్థి ఆసీస్ చేతిలో 7 పరుగులతో ఇంగ్లండ్ ఓడింది. 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 2 వికెట్లకు 135 పరుగులతో నిలకడగా సాగుతోంది. కెప్టెన్ మైక్ గ్యాటింగ్ చేసిన ఒకే ఒక్క పొరపాటు ఆ జట్టు అదృష్టాన్ని మార్చింది. బోర్డర్ బౌలింగ్‌లో అత్యుత్సాహం ప్రదర్శించిన గ్యాటింగ్ రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చాడు. ఆ వెంటనే ఇంగ్లండ్ వరుస వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. గ్యాటింగ్ షాట్ సీన్ రివర్స్ చేసిందంటూ ఇప్పటికీ ఆ జట్టు అభిమానులు ఆవేదన చెందుతూనే ఉంటారు.
కావాలనే వదిలేశాడు...
నత్తనడకలో మన సన్నీకి అన్నలాంటి జెఫ్ బాయ్‌కాట్ 1979 ఫైనల్లో సొంత జట్టు ఇంగ్లండ్‌ను ముంచాడు. 287 పరుగుల భారీ లక్ష్యం ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 194 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్‌గా వచ్చిన బాయ్‌కాట్ 105 బంతుల్లో 57 పరుగులే చేశాడు. ఒక దశలో రిచర్డ్స్ బౌలింగ్‌లో బాయ్‌కాట్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను వైడ్ మిడాన్‌లో కెప్టెన్ లాయిడ్ వదిలేశాడు.
లాయిడ్‌కు అత్యుత్తమ ఫీల్డర్‌గా పేరుంది. బాయ్‌కాట్ బ్యాటింగ్ తెలిసిన లాయిడ్ కావాలనే ఆ క్యాచ్‌ను వదిలేశాడన్నారు. బాయ్‌కాట్ ఎంత సేపు క్రీజ్‌లో ఉంటే ఇంగ్లండ్ అన్ని ఓవర్లు కోల్పోతుంది! చివరకు అదే జరిగింది. తొలి వికెట్‌కు 129 పరుగులైతే వచ్చాయిగానీ 39 ఓవర్లు ముగిసిపోయాయి. చివరకు హడావిడిగా ఆడబోయి ఇంగ్లండ్ 11 పరుగులకే చివరి 8 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. నేరుగా అంగీకరించకపోయినా, ‘అదేమీ తప్పుడు వ్యూహం కాదుగా’ అంటూ లాయిడ్ తనను తాను సమర్థించుకున్నాడు.
వదిలింది క్యాచ్ కాదు... కప్
1999లో దక్షిణాఫ్రికా ఆటగాడు హెర్షల్ గిబ్స్ చేసిన చిన్న పొరపాటు ఆ జట్టుకు ఖేదం మిగిల్చింది. 272 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా తడబడింది. 56 పరుగులతో స్టీవ్‌వా జట్టును రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమయంలో క్లూస్‌నర్ బౌలింగ్‌లో వా మిడ్ వికెట్ వైపు ఆడాడు. అతి సునాయాసమైన ఈ క్యాచ్‌ను అందుకున్న గిబ్స్, సంతోషంతో గాల్లోకి విసిరే ప్రయత్నం చేశాడు. దాంతో అది చేజారిపోయింది. అందరిలోనూ ఆశ్చర్యం. ‘వదిలేశాడు, వదిలేశాడు’ అంటూ అరిచినంత పని చేసిన కామెంటేటర్ టోనీ గ్రెగ్ ఈ క్యాచ్ మ్యాచ్‌ను మారుస్తుందని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత అదే జరిగింది. స్టీవ్ వా సెంచరీతో ఆసీస్ ఈ మ్యాచ్ గెలిచి సెమీస్‌కు చేరింది. ‘నువ్వు వదిలింది క్యాచ్‌ను కాదు, ప్రపంచ కప్‌ను’ అని స్టీవ్‌వా అన్నట్లుగా ప్రచారం జరిగింది.
వాల్ష్ క్రీడా స్ఫూర్తి
ఎలాగైనా అవుట్ చేస్తే చాలనే క్రికెటర్లతో పోలిస్తే వెస్టిండీస్ పేస్ బౌలర్ కోట్నీ వాల్ష్ క్రీడా స్ఫూర్తి మరువలేనిది. 1987 ప్రపంచకప్‌లో పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరిగింది. చివరి బంతికి 2 పరుగులు చేస్తే పాక్ గెలుస్తుంది. క్రీజ్‌లో అబ్దుల్ ఖాదిర్ ఆడుతుండగా, నాన్ స్ట్రైకింగ్‌లో సలీం జాఫర్ ఉన్నాడు. కచ్చితంగా పరుగు తీయాల్సిన స్థితిలో జాఫర్... వాల్ష్ బంతి విసరక ముందే క్రీజ్ వదిలి చాలా ముందుకు వచ్చేశాడు. వాల్ష్ స్టంప్స్ పడగొడితే(మన్కడింగ్) విండీస్ మ్యాచ్ గెలిచేది. అయితే అది క్రీడా స్ఫూర్తి కాదంటూ జాఫర్‌ను హెచ్చరించి వదిలేశాడు వాల్ష్. చివరి బంతికి 2 పరుగులు రావడంతో పాక్ సెమీస్‌కు చేరగా, వెస్టిండీస్ ఆ అవకాశం కోల్పోయింది. తర్వాత పాక్ ప్రభుత్వం వాల్ష్ క్రీడాస్ఫూర్తిని గౌరవిస్తూ ప్రత్యేక పతకంతో సత్కరించింది.
గుండె పగిలింది...
మొత్తం ప్రపంచ కప్ టోర్నీలలో ఎన్ని పరాజయాలు ఎందరిని బాధించినా... ఇది మాత్రం విషాదానికి పరాకాష్ట. 1999 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య బర్మింగ్‌హామ్‌లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులందరి చేత అయ్యో అనిపించింది. ఆస్ట్రేలియా చేసిన 213 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో దక్షిణాఫ్రికా కూడా తడబడింది. అయితే ఈ టోర్నీలో అద్భుతంగా ఆడుతున్న ఆల్‌రౌండర్ లాన్స్ క్లూసెనర్ మరోసారి దూకుడుగా జట్టును విజయానికి చేరువగా తెచ్చాడు.
చివరి ఓవర్లో విజయానికి 9 పరుగులు కావాలి. మరో వికెట్ మాత్రమే ఉంది. క్లూసెనర్ స్ట్రైకింగ్‌లో ఉండగా, అలెన్ డొనాల్డ్ నాన్ స్ట్రైకర్‌గా ఉన్నాడు. ఫ్లెమింగ్ బౌలింగ్‌లో తొలి రెండు బంతులను అలవోకగా ఆడిన క్లూసెనర్ బౌండరీ దాటించాడు. స్కోర్లు సమమయ్యాయి. ఇక కావాల్సింది నాలుగు బంతుల్లో ఒక పరుగు మాత్రమే. మూడో బంతికి కాస్త గందరగోళం ఏర్పడటంతో డొనాల్డ్ రనౌటయ్యే అవకాశం వచ్చినా త్రో నేరుగా తాకలేదు.
నాలుగో బంతిని నేరుగా ఆడిన క్లూసెనర్ పరుగు కోసం దూసుకొచ్చాడు. బంతి వైపే దృష్టి పెట్టిన డొనాల్డ్ సహచరుడిని గమనించనే లేదు. అంతే... ఇద్దరూ ఒకే వైపుకు చేరిపోయారు. బ్యాట్ చేజారిన డొనాల్డ్ రెండో వైపు పరుగెత్తే ప్రయత్నం చేసినా అప్పటికే అవతలి ఎండ్‌కు బంతి చేరిపోయింది. ఫలితంగా డొనాల్డ్ రనౌట్, మ్యాచ్ టై. సూపర్ సిక్స్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఆసీస్ నిబంధనల ప్రకారం ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్ చాలా కాలం పాటు దక్షిణాఫ్రికాను బాధించింది. సింగిల్ తీయలేని డొనాల్డ్‌దే తప్పని కొందరూ.... మరో రెండు బంతులు ఉండగానే అనవసర పరుగుతో క్లూసెనర్ గందరగోళం సృష్టించాడనీ, అసలు డొనాల్డ్‌ను నమ్మకుండా అతనే పూర్తి చేయాల్సిందనీ మరికొందరు అభిప్రాయ పడ్డారు. ఈ చర్చ సుదీర్ఘ కాలం కొనసాగింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ప్రపంచ కప్ విజయానికి అంత చేరువగా ఎప్పుడూ రాలేకపోయింది.