
అదీ ఫీల్డింగ్ అంటే...
1992కు ముందు ఫీల్డింగ్‌కు అంత గ్లామర్ లేదు. దానికి కొత్త నడకను, నడతను నేర్పిన ఘనత జాంటీ రోడ్స్ సొంతం. ఇంజమామ్ ఉల్ హక్‌ను ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు రనౌట్ చేసిన తీరు అద్భుతం. మెక్‌మిలన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయి విఫలమైన హక్ లెగ్‌బై కోసం ప్రయత్నించాడు. అనూహ్య రీతిలో పాయింట్ వైపునుంచి వేగంగా రోడ్స్ దూసుకొచ్చాడు. నేరుగా త్రో చేయకుండా బ్యాట్స్‌మన్‌తో పోటీ పడి పరుగెత్తుతూ వచ్చి బంతితో మొత్తం స్టంప్స్‌ను గిరాటేశాడు.
ఈ సమయంలో గాల్లో తేలుతూ రోడ్స్ చేసిన విన్యాసం అభిమానుల మనసుల్లో ముద్రించుకుపోయింది. హక్ ఎంత ప్రయత్నించినా రనౌట్‌నుంచి తప్పించుకోలేకపోయాడు. ఈ వికెట్ అనంతరం తడబడిన పాక్ 20 పరుగుల తేడాతో ఓడింది.