
వేడి పెంచే ప్రత్యర్థులు
‘ఓడిపోయే వాడు వెంటాడుతూనే ఉంటాడు. కానీ ఎప్పటికీ వెనుకాలే ఉంటాడు.
అదే గెలవాలనుకునేవాడు ఎప్పుడూ ముందుంటాడు’. భారత్, పాక్ మ్యాచ్‌లకు ఇది సరిగ్గా సరిపోతుంది. ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ అంటే చాలు పాకిస్తాన్ వేటాడటం మొదలుపెడుతుంది. షెడ్యూల్ విడుదలైనప్పట్నించీ ఈ మ్యాచ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు, కసరత్తులు, వ్యూహాలు... అప్పటి వరకు అమ్ములపొదిలో భద్రంగా దాచుకున్న ఆయుధాలను ఒక్కొక్కటిగా ప్రయోగిస్తుంది. కానీ రేసు ముగిసే సరికి వెనకాలే ఉంటుంది. ఇది కల్పితం కాదు... చరిత్ర చెబుతున్న సత్యం. ప్రపంచకప్ మొత్తం ఒక రకంగా ఆడే పాక్ ఆటగాళ్లు... టీమిండియాతో పోరులో మాత్రం అసలు సిసలు సత్తా చూపాలని తహతహలాడతారు. అయితే మిగిలిన మ్యాచుల్లో హై టెన్షన్‌ను చూపెట్టే పాక్...
భారత్‌తో మాత్రం లో ఓల్టేజ్‌తో కొట్టుమిట్టాడుతుంది. ఫలితంగా ఇప్పటి వరకు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో ఈ రెండు జట్లు తలపడిన ఐదు సార్లూ భారత్ విజేతగా నిలిచింది. ఈసారి కూడా ఫిబ్రవరి 15 (ఆదివారం) ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లను ఓ సారి గుర్తు చేసుకుందాం.
ప్రధానులు హాజరైన వేళ
2011 ప్రపంచకప్ సెమీఫైనల్. ఇరు దేశాల ప్రధానులు మన్మోహన్ సింగ్, యూసుఫ్ రజా గిలానీ మ్యాచ్‌కు వచ్చారు. సొంతగడ్డపై కప్‌ను గెలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు నాకౌట్‌లో పాక్ ఎదురుకావడంతో అభిమానులు పోటెత్తారు. మ్యాచ్ మొహాలీలో జరుగుతుండటం, పాక్‌కు ఇది దగ్గరి ప్రదేశం కావడంతో భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. పాక్ అభిమానుల కోసం ప్రత్యేక వీసాలు ఇచ్చారు. భారత్‌కు సెహ్వాగ్, సచిన్ మెరుపు శుభారంభాన్నిచ్చారు. కోహ్లి, యువీ విఫలం కావడంతో భారత్ తడబడినా... రైనా, ధోని వేగంతో గాడిలో పడింది. రియాజ్ 5 వికెట్లు తీయడంతో భారత్ స్కోరు 260 పరుగులకు పరిమితమైంది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌ను టీమిండియా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. మిస్బా, యూనిస్, హఫీజ్ పోరాడినా 231 పరుగులకే పాక్ పరిమితమైంది. ఐదోసారి కూడా భారత్‌నే విజయం వరించింది.
మియాందాద్ కుప్పిగంతులు
1992 ప్రపంచకప్‌లో తొలిసారి భారత్, పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్ జరిగింది. మామూలుగానే భారత్‌తో మ్యాచ్ అంటే అభిమానులతో పాటు పాక్ ఆటగాళ్లూ కాస్త అతి చేస్తారు. అలాంటిది ఇక వరల్డ్‌కప్ పోరులో ఆగుతారా? పొరుగుదేశం క్రికెటర్ల కోతి చేష్టలకు మ్యాచ్ మధ్యలో స్వల్ప వివాదాలు చోటు చేసుకున్నా చివరకు భారతే పైచేయి సాధించింది. భారత్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ ఏ దశలోనూ నిలకడగా ఆడలేపోయింది. మ్యాచ్ మధ్యలో కీపర్ కిరణ్ మోరే చేసిన అవుట్ అప్పీల్‌కు మియాందాద్ కోపంతో ఊగిపోయాడు. దూషణ పర్వం మొదలుపెట్టి కుప్పిగంతులు వేస్తూ మోరెను హేళన చేశాడు. అయితే మోరె... రెండు క్యాచ్‌లు, ఓ రనౌట్, ఓ స్టంపింగ్‌తో భారత్ పాలిట హీరోగా మారితే... మియాందాద్ మాత్రం 110 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టు ఓటమికి బాధ్యుడయ్యాడు. ఈ మ్యాచ్‌లో సచిన్ అజేయంగా 54 పరుగులు చేయడంతో పాటు ఒక్క వికెట్ తీశాడు.
వకార్ స్టార్ట్.... ప్రసాద్ ఫినిషింగ్
బెంగళూరులో 1996 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. సెమీస్ బెర్త్ కోసం భారత్, పాక్ రంగంలోకి దిగాయి. అయితే ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఉన్నట్టుండి చిన్న అలజడి. చివరి నిమిషంలో వసీం అక్రమ్ మ్యాచ్ నుంచి వైదొలగడంతో తాత్కాలిక కెప్టెన్‌గా ఆమిర్ సోహైల్ నాయకత్వం వహించాడు. తొలుత భారత్ 287 పరుగుల భారీ స్కోరు చేసింది. సిద్ధూ (93) టాప్ ఆర్డర్‌లో ఒంటరి పోరాటం చేస్తే, జడేజా స్లాగ్ ఓవర్లలో 25 బంతుల్లో 45 పరుగులతో బుల్లెట్‌లా విరుచుకుపడ్డాడు. పాక్ ఓపెనర్లు అన్వర్, సోహైల్ తొలి 10 ఓవర్లలో 84 పరుగులు చేశారు. దీంతో మ్యాచ్‌పై పట్టు సాధించిన ఆనందంలో సోహైల్ వరుస బౌండరీలతో వెంకటేశ్ ప్రసాద్‌ను రెచ్చగొట్టాడు. ఎక్స్‌ట్రా కవర్స్‌లో బంతిని కొట్టి ‘మళ్లీ అక్కడికే కొడతా... వెళ్లి తెచ్చుకో’ అంటూ బ్యాట్‌ను ఫెన్స్ వైపు చూపుతూ ఎగతాళి చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన వెంకీ తర్వాతి బంతిని ఆఫ్‌స్టంప్ బయటకు వేశాడు. అంతే బంతిని టచ్ చేయబోయిన సోహైల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఒక్కసారిగా పట్టరాని ఆవేశంతో వెంకీ ‘బాస్టర్డ్... గో హోమ్’ అంటూ పెవిలియన్ వైపు దారి చూపడంతో స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత భారత్ మ్యాచ్ గెలిచింది.
వెంకీ సూపర్ స్పెల్ (1999)
ఓవైపు కశ్మీర్‌లో కార్గిల్ యుద్ధం... మరోవైపు మాంచెస్టర్‌లో భారత్, పాక్‌ల మధ్య క్రికెట్ సమరం. దీంతో రెండు దేశాల్లో అభిమానులు ఆవేశాలతో ఊగిపోతున్నారు. పాక్ అభిమానులైతే ఓ అడుగు ముందుకేసి జెండాలు ఊపుతూ, డ్రమ్స్ మోత మోగిస్తూ, ఈలలు, కేరింతలతో మైదానంలో రెచ్చగొడుతున్న పరిస్థితిని కల్పించారు. పాక్ ఆటగాళ్లు కూడా గత రెండు ప్రపంచకప్ మ్యాచుల్లో ఓడటంతో ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో మైదానంలోకి దిగారు. సచిన్ (45) ఇచ్చిన శుభారంభాన్ని మధ్యలో ద్రవిడ్ (61), అజహరుద్దీన్ (59) అద్భుతంగా ఉపయోగించుకోవడంతో భారత్ 227 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనలో సయీద్ అన్వర్ (36) వేగంగా ఆడినా... టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఇంజమామ్ (41), మొయిన్ ఖాన్ (34) చెలరేగినా... మిగతా బ్యాట్స్‌మన్ ప్రసాద్ (5/27) దెబ్బకు కుదేలయ్యారు. దీంతో 180 పరుగులకే కుప్పకూలిన పాక్ వరుసగా మూడో ఓటమిని సొంతం చేసుకుంది. 1992 నుంచి 99 వరకు భారత్ ఆడిన మూడు మ్యాచులకూ అజహర్ కెప్టెన్ కావడం విశేషం.
పాక్‌కు కాళరాత్రి
మార్చి 1, 2003... శివరాత్రి. కానీ సచిన్ మాత్రం పాకిస్తాన్‌కు కాళరాత్రిని చూపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత పాకిస్తాన్ 273 పరుగుల భారీ స్కోరు చేసింది. కానీ సచిన్ జోరుతో పాటు సెహ్వాగ్ కూడా చెలరేగడంతో భారత్ 12 ఓవర్లలోనే 100 పరుగులు సాధించింది. మధ్యలో తొడ కండరాల నొప్పితో సచిన్ బాధపడినా... చివరకు 98 పరుగులు చేసి జట్టును విజయపథంలో నిలిపాడు. మధ్యలో ద్రవిడ్ (44 నాటౌట్), యువరాజ్ (50 నాటౌట్) నిలకడగా ఆడటంతో భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.
- చిలుక హరిప్రసాద్