
వివాదాలూ ఉన్నాయ్..!
విజయంతో పాటే వివాదాలూ ప్రతి చోటా ఉంటాయి. ప్రపంచకప్ దీనికి అతీతం కాదు. అప్పటిదాకా ఆటతో ఆనందించే అభిమానులు... ఒక్కసారిగా కోపంతో ఊగిపోవచ్చు. లేదా గెలవాల్సిన జట్టు నిబంధనల కారణంగా ఓడిపోవచ్చు. ఇలా ఇప్పటివరకు ప్రపంచకప్‌లలో ప్రధానంగా వార్తల్లో నిలిచిన వివాదాలను ఓ సారి పరిశీలిస్తే....
ఈడెన్‌లో రభస
1996 ప్రపంచకప్... కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, శ్రీలంక సెమీస్. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 251 పరుగులు చేసింది. సచిన్ మినహా అందరూ విఫలమవడంతో భారత్ 120 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. కచ్చితంగా నెగ్గుతామనే అంచనాతో ఉన్న భారత అభిమానులు స్టాండ్స్‌కు నిప్పు పెట్టడంతో పాటు మైదానంలోకి నీళ్ల సీసాలను విసిరేశారు. ఎంతకీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లంకను విజేతగా ప్రకటించారు.
దక్షిణాఫ్రికా ఒక్క బంతికి 22 పరుగులు
1992 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు తొలిసారిగా పాల్గొంది. ఈ టోర్నీ వారికి నిజంగానే పీడకలగా మారింది. ఆద్యంతం అద్భుతంగా రాణించి సెమీఫైనల్‌కు చేరిన సఫారీలకు ఈ మ్యాచ్‌లో దిమ్మతిరిగే షాక్ తగిలింది.
ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 13 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో నాలుగు వికెట్లున్నాయి. ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్‌కు కొద్దిసేపు బ్రేక్ పడింది. ఆ తర్వాత ఐసీసీ ‘అత్యధిక ఓవర్ల స్కోరింగ్’ నిబంధనతో సవరించిన టార్గెట్ ప్రకారం ఒక్క బంతికి 22 పరుగులు చేయాలని తేల్చింది. దీంతో తెల్లబోవడం ఆటగాళ్ల వంతైంది. ఇది తీవ్ర వివాదం కావడంతో ఆ తర్వాత డక్‌వర్త్ లూయిస్ పద్ధతి అమల్లోకి వచ్చింది.
డ్రగ్ టెస్టులో విఫలమైన షేన్ వార్న్
2003 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు సంచలన వార్త బయటికి వచ్చింది. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో అతడిని టోర్నీలో ఆడనీయకుండా స్వదేశానికి పంపారు. అయితే ఈ సంఘటనను వార్న్ తోసిపుచ్చాడు. తన బరువును తగ్గించుకునేందుకు తల్లి సలహాతో మాత్ర వేసుకున్నానని వాదించాడు.
బాబ్ వూమర్ మరణం
2007 వెస్టిండీస్ ప్రపంచకప్ పాకిస్తాన్‌ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. లీగ్ దశలో ఐర్లాండ్ చేతిలో షాక్ తిన్న పాకిస్తాన్ జట్టును ఆ మర్నాడే కోచ్ బాబ్ వూమర్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. స్థానిక పోలీసులు హత్య కేసుగా విచారణను ప్రారంభించినా అది ఎటూ తేలలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ మాఫియానే ఆయన్ని హత్య చేయించిందా అనే సందేహాలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి. అయితే ఇది సహజ మరణమా? ఉద్దేశపూర్వకంగా చంపారా? అనేదానికి తగిన సాక్ష్యాధారాలు లేవని జ్యూరీ తెలిపింది.
2007 ఫైనల్
ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ముగింపు తీవ్ర విమర్శలకు దారితీసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 36 ఓవర్లకు కుదించారు. అయితే చివర్లో వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించగా... అధికారిక ప్రకటన, స్కోరుబోర్డు మాత్రం ఆసీస్‌ను విజేతగా చూపించింది.
దీంతో ఆటగాళ్లు సంబరాల్లో మునిగారు. వాస్తవానికి డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన కనీసం ఫలితం తేలేందుకు 20 ఓవర్ల పాటు మ్యాచ్ జరిగితే చాలు. అప్పటికే 33 ఓవర్లయ్యాయి. కానీ అంపైర్లు మాత్రం మ్యాచ్ ముగియలేదని ఇంకా మూడు ఓవర్లు ఆడాల్సి ఉందని గుర్తుచేశారు. ఆ మసక వెలుతురులోనే లంక బ్యాటింగ్‌ను పూర్తి చేసింది. ఆ తర్వాత ఈ సంఘటనపై ఐసీసీ, అంపైర్లు క్షమాపణ చెప్పారు. అంతేకాకుండా అనంతరం జరిగిన టి20 ప్రపంచకప్ నుంచి ఆ మ్యాచ్‌కు సంబంధించిన అంపైర్లు, మ్యాచ్ రిఫరీలని ఐసీసీ సస్పెండ్ చేసింది.
- రంగోల నరేందర్ గౌడ్