అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఆయన తరచూ విదేశీ పర్యటనల పేరుతో కాలక్షేప యాత్రలు చేయలేదు. చైనా, పాకిస్తాన్‌తో ముడిపడిన సమస్యలను సామరస్యంతో పరిష్కరించడానికి ఆయన అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ప్రస్తుతం అటు మోదీ ఫలితం లేని అసంఖ్యాక విదేశయాత్రలకు, ఇటు రాజధాని నిర్మాణం పేరిట చంద్రబాబు సాగిస్తున్న విదేశ పర్యటనలకూ వినియోగిస్తున్న డబ్బు దేశ ప్రజలది, రాష్ట్ర ప్రజలది మాత్రమే. అన్నిటికంటే మించి ఇప్పటికి 65 ఏళ్లకు పైబడిన వ్యక్తి ‘అమరావతి’ని ప్రపంచ నగరంగా ‘రాబోయే 50 ఏళ్లలో’ నిర్మిస్తానని ‘జంతరపెట్టి’ చూడర బాబూ అంటూ విడుపులేని ప్రకటనలు గుప్పిస్తుండటమే పెద్ద ప్రహసనం.
ఈ మధ్య సోషల్ మీడి యాలో చక్కర్లు కొడుతున్న ఓ ఆధునిక కవితలో కవి నేటి భారత రాజకీయాల వ్యంగ్య చిత్ర పటాన్ని ఇలా ఆవిష్కరించాడు: ‘‘నా దేశంలో ఆకలి చావులు లేవు/ఔను మరి అబ్బాయిలు గుట్కాలు తింటున్నరు/పోలీసులు లంచాలు తింటున్నరు/పొలిటీషియన్లు కోట్లు తింటు న్నరు/రైతులు విషం తింటున్నరు/ యువకులు బలం కోసం మందులు తింటున్నరు/ఇంకెక్కడు న్నయ్ ఆకలిచావులు../నా దేశం ప్రగతిలో ముందం జలో ఉంది/ఔను గదా మరి.. ఇలా మొదలైన ఈ కవిత... దేశంలో అగరుబత్తీలు వాడేది రెండు విష యాల్లో.. దోమల్ని వెళ్లగొట్టడానికి../దేవుణ్ని పిలవ డానికి../దేవుడూ రాడు, దేశమూ మారదు...అలా పోతూ ఉండేలా, అందరితో పాటూ...!
అలా కవి ఎందుకు తన వేదనను, ఆవేదననూ, ఆక్రోశాన్ని మనకు వినిపిస్తున్నాడంటే అది వర్తమాన భారత రాజకీయాల్లో ప్రజాబాహుళ్యం వేదన, ఆవే దన కూడా అదే మోతాదులో ఉంది కాబట్టి! చిత్ర మేమంటే దేశంలో ఎవరూ జరపనన్ని విదేశీ యాత్ర లకు 2014 తర్వాత తెరలేపిన నాయకులు ఇద్దరే ఇద్దరు. వారు ‘బడా మోదీ’ (ప్రధాని), ఛోటా మోదీ (ఏపీ సీఎం చంద్రబాబు) రాచరిక వ్యవస్థ పోయినా రాజసాలు పోలేదు. ఇలాంటి పోకడలపై సొంత పార్టీల్లోని సామాన్య కార్యకర్తలు, కొందరు సొంత పార్టీ ప్రముఖులు గొంతు విప్పక తప్పడంలేదు. ఇవాళ ఓట్ల కోసం శతకోటి వాగ్దానాలు, వాగ్దాన భంగాలకు అలవాటుపడిన అన్ని జాతీయ పక్షాలు ‘దళిత’, ౖ‘మెనారిటీ’ అనే మాటలు వాడకుండానే పేద వర్గాలను మోసం చేస్తున్నాయి.
గళం విప్పుతున్న దళితవర్గాల నేతలు
ఈ సత్యాన్ని ఆలస్యంగా గ్రహించిన ఈ వర్గాల ప్రజలు కొన్ని ప్రశ్నలను పార్టీ నాయకులకు సంధిస్తు న్నారు. మంత్రివర్గాల్లో దళిత, మైనారిటీల నేతలు అప్రధాన స్థానాల్లో కొనసాగడాన్ని కూడా ప్రశ్నిస్తు న్నారు. ఇందుకు తాజా ఉదాహరణ–బీజేపీ, తెలుగు దేశం పార్టీలో ప్రారంభమైన దళిత, మైనారిటీ నాయ కుల ఆందోళనోద్యమాలు. బీజేపీ నాయకత్వం దళి తులకిచ్చిన హామీలు అమలు పరచకుండా అవమా నపరుస్తోందని బీజేపీ దళిత ఎంపీ డాక్టర్ ఉదిత్ రాజ్ తీవ్రంగా విమర్శించారు. కేంద్ర మంత్రివర్గంలోని దళితుల ప్రతినిధులు పేదవర్గాల బాధలు, సమ స్యలు మరిచిపోయారని, పరాన్నభుక్కులుగా సౌక ర్యాలకు బానిసలయ్యారని కూడా ఆయన మండిప డ్డారు. దళితులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడు లను ప్రభుత్వం నిలిపితీరాలని ఉదిత్‌రాజ్ హెచ్చరిం చారు. చంద్రబాబు పాలనలో ఇదే పరిస్థితిని దళిత, మైనారిటీ ప్రతినిధులు ఎదుర్కొంటున్నారని వారి నేతలు బాహాటంగా విమర్శిస్తున్నారు. అంతకు ముందు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంలుగా ఉన్నప్పటి రక్షణలు, ప్రయోజనాలకు ఇప్పుడు బాబు పాలనలో దూరం కావలసివచ్చిందని బీసీ నాయ కులు ఫిర్యాదు చేస్తున్నారు. అలాగే, కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ సర్కారులో భాగస్వామి అయిన లోక్ జనశక్తి పార్టీ ఆగస్ట్ 9న పెద్ద పెట్టున బీజేపీ విధా నాలకు నిరసనగా దళితవర్గాల ఆందోళనా కార్య క్రమం నిర్వహించాలని నిర్ణయించింది. దేశంలో ఇలాంటి సమస్యలు బడుగువర్గాలను వేధిస్తుంటే అటు ప్రధాని మోదీ, ఇటు ఏపీ సీఎం బాబు ఆచర ణలో అక్కరకురాని విదేశీ యాత్రలకు లెక్కకు మిక్కు టంగా దిగుతున్నారు. దూర తీరాల వైపు మోదీ ప్రయాణాలు కట్టడాన్ని రాజకీయ పరిశీలకులు, ప్రజలు తప్పుపడుతున్నారు. పొరుగు దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకోవడంపై మోదీ సర్కారు దృష్టి కేంద్రీకరించడం లేదు. బీజేపీ తొలి ప్రధానిగా పనిచేసిన వాజ్‌పేయి హయాంలో ఆయన తరచూ విదేశీ పర్యటనల పేరుతో కాలక్షేప యాత్రలు చేయలేదు. చైనా, పాకిస్తాన్‌తో ముడిపడిన సమస్య లను సామరస్యంతో పరిష్కరించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆ క్రమంలోనే ఆయన నాటి పాకిస్తాన్ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషా రఫ్‌తో జరిపిన చర్చలతో పరిష్కారం వైపుగా బల మైన అడుగులు వేసిన వైనాన్ని జనం మర్చిపోలేదు. ఇంకా చైనాతో పూర్తి పరిష్కారం కుదరకపోయినా ‘శుభారంభానికి’ ఒక మేరకు ఆయన పునాదులు వేసిన విధానాన్ని దేశ ప్రజలు స్వాగతించారు.
ఏ పొరుగు దేశంతోనూ సత్సంబంధాల్లేవ్!
మన ఇరుగు పొరుగున ఏ ఒక్క దేశంతోనూ (చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక) పరిపూర్ణ సంబంధాలు మనకు ఇంత వరకూ లేవన్నది సత్యం. కానీ ఎవరితో ఎక్కువగా రాసుకు పూసుకు తిరగడం వల్ల దేశ ప్రయోజనాలకు అంతిమంగా చేటు మూడే ప్రమాదం ఉందో ఆ దేశాలకు (అమెరికా, ఇజ్రా యెల్) మోదీ ప్రయాణమౌతున్నారు. ‘రవి అస్తమిం చని’ సామ్రాజ్యంగా చాలా కాలం కొనసాగిన బ్రిటన్ ఆ పేరు పోగొట్టుకుని 70 ఏళ్లు దాటింది. ఈ స్థానం లోకి వచ్చిన అమెరికా సామ్రాజ్యవాద విస్తరణ శక్తిగా అవతరించింది. ప్రపంచంలోని 90 దేశాల్లో ఇది ఇంకా తన సైనిక స్థావరాలు ఉపసంహరించలేదు. పైగా కొత్తగా ఇరాక్, అఫ్ఘానిస్తాన్‌లపైకి, అరబ్ ప్రపంచానికి యుద్ధాలు విస్తరింపజేస్తోంది. కాబూల్ ఆధారంగా అవసరాన్ని బట్టి దానికి పొరుగున ఉన్న కశ్మీర్‌లోకి యుద్ధాన్ని విస్తరించి తిష్టవేయడానికి వెనుకాడని స్థితిలో అమెరికా ఉంది. పైగా, సరి కొత్తగా తన పతనమౌతున్న ఆర్థిక వ్యవస్థను, ఎదు ర్కొంటున్న పలు సవాళ్లను అధిగమించే పేరిట ప్రపంచంపైన ముఖ్యంగా చైనా, ఆసియా దేశాలపైన వాణిజ్య యుద్ధాలకు తెరలే పింది. భారత ఎగుమ తులపైన, ఆంక్షలు విధిస్తూ మన దేశంలోకి దిగుమతి సుంకాలు రద్దు చేస్తావా, ఛస్తావా అని ఒత్తిడి చేస్తోంది. దీనిపైన ఇంత వరకూ మోదీ ప్రభుత్వం స్వతంత్ర భారత ప్రయోజనాల రక్షణకు ఎలాంటి చర్యలు తలపెట్టక పోవడాన్ని ప్రజలు గమనిస్తు న్నారు. అయినా అటు మోదీ ఫలితం లేని అసం ఖ్యాక విదేశయాత్రలకు, ఇటు రాజధాని నిర్మాణం పేరిట బాబు పదేపదే సాగిస్తున్న విదేశ పర్యటన లకూ వినియోగిస్తున్న డబ్బు దేశ ప్రజలదీ, రాష్ట్ర ప్రజలదీ గానీ మరెవరిదీ కాదని గ్రహించాలి. ప్రతి యాత్రకు ఫలితముండాలి, ఆ ఫలితం వల్ల మన దేశమూ, ప్రజలూ సుఖపూరితంగా ఉండాలి.
ఈ దృష్ట్యా అంచనా వేసుకుంటే 2014 జూన్ నుంచి 2018 జూన్ దాకా మోదీ మొత్తం 84 దేశాలు పర్యటించి రావడానికి, చార్టర్డ్ విమానాలపైన, వాటి నిర్వహణపైన అయిన ఖర్చు రూ. 1,484 కోట్లు. విచిత్రమేమంటే, యాత్రల సంగతి అలా పెడితే మోదీ వెళ్లిన దేశాలకు ఆయన వెళ్లేసరికి అక్కడ అంబానీలు వ్యాపారాల కోసం (రిలయన్స్) ప్రత్యక్ష మవటం. మోదీ మాస్కోలో ఉండగానే రష్యన్ ఆయుధ సరఫరా సంస్థతో ఆరు బిలియన్ డాలర్ల విలువగల ఆయుధ ఒప్పదంపైన ‘రిలయన్స్ డిఫెన్స్’ సంస్థ ఒప్పందం కుదుర్చుకోవటం (రాయి టర్స్/డాన్ వార్త). ఇంకా రాఫెల్ యుద్ధ విమాన సంస్థ ఫ్రెంచి దసాల్ట్ కంపెనీతో అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూపు మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్పుడు ఒప్పందం కుదుర్చుకుంది (‘ఫస్ట్ ఫోస్ట్’ వార్త). మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా ఆదానీ గ్రూపు బొగ్గుగని ప్రాజెక్టు ఒప్పందం కుదు ర్చుకుంది (‘లైవ్‌మింట్’). మోదీ బంగ్లాదేశ్ పర్యట నలో ఉండగానే బంగ్లాదేశ్‌లో ఆదానీ, రిలయన్స్ పవర్, పెట్రోనెట్ బంగ్లాదేశ్‌లో నెలకొల్పాలనుకున్న ప్రాజెక్టు ఒప్పందాలపై సంతకాలు చేసింది (హిందూ స్థాన్ టైమ్స్ వార్త). మోదీ అమెరికా పర్యటనలో ఉండగానే అమెరికా నావికా సంస్థతో రిలయన్స్ రక్షణోత్పత్తుల సంస్థ ‘రిలయన్స్ డిఫెన్స్’ యుద్ధ నౌకల బాగుచేతకు సంతకాలు ఖరారయ్యాయి (‘లైవ్ నెట్’ వాట్సాప్ వార్త). ఈ ఒప్పందం వచ్చే 3–5 సంవత్సరాల మీదట రిలయన్స్‌కు రూ. 15,000 కోట్ల రాబడికి అవకాశం కల్పిస్తుంది. ఇక మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఉండగానే మానవ రహిత వాహనాల ఉత్పత్తికి ఇజ్రాయెల్ సంస్థ ‘ఎల్ బిత్’ సంస్థకు ఆదానీ గ్రూపునకు మధ్య ఒప్పందం ఖరారయ్యింది.
రాజధాని పేరిట చంద్రబాబు పర్యటనలు!
ఇక చంద్రబాబు 2014 నుంచి 1017 డిసెంబర్ దాకా, ఆ తరువాత నేటి దాకా ఆంధ్రప్రదేశ్ రాజ ధాని అమరావతి ‘నిర్మాణం–అభివృద్ధి’ పేరిట మూడు రోజుల నుంచి వారం రోజుల వరకూ సింగ పూర్, జపాన్, దావోస్ (స్విట్జర్లాండ్), చైనా, టర్కీ, చికాగో (అమెరికా), బ్రిటన్, దక్షిణ కొరియా, దుబాయ్ వగైరా దేశాలకు పర్యటనలు జరిపారు. వెళ్లిన ప్రతిచోటా ఆయా రాజధాని నగరాల నమూ నాల్లో అమరావతిని నిర్మిస్తానని ప్రకటనలను చేశారు. ఇస్తాంబుల్‌లోనూ, సింగపూర్‌లోనూ, టోక్యోలోనూ మళ్లీ చంద్రబాబుది అదే ప్రకటన. ఇప్పటికి 65 సంవత్సరాలకు పైబడిన వ్యక్తి ‘అమ రావతి’ని ప్రపంచ నగరంగా ‘రాబోయే 50 సంవ త్సరాల్లో’ నిర్మిస్తానని ‘జంతరపెట్టి’ చూడర బాబూ అంటూ విడుపులేని ప్రకటనలు గుప్పిస్తున్నారు. చైనా నుంచి ఇక్కడికి బుల్లెట్ రైలు దించుతాననీ, కజి కిస్తాన్, ఆస్థానా పర్యటనలో కేబుల్ కార్లు తెస్తాననీ, రష్యా నుంచీ నౌకా శాస్త్ర (మెరైన్) యూనివర్సిటీని దించుతాననీ– ఇలా పొత్తూ పొంతనా లేని ప్రకట నలు పరంపర గుప్పించిన సీఎం బాబు. కానీ ఇన్ని వల్లించిన బాబు తనపై వచ్చిన 17 కేసుల రికార్డును వివిధ కోర్టుల నుంచి ఎలా తప్పించుకోగల్గుతూ వచ్చారన్నది అంత ‘బ్రహ్మ రహస్యమా?’, కాదు. ‘వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఆఖరి వరసలో కూర్చున్నా’ ఆరు రకాల రుచులూ అప్పనంగా అందుతుంటాయన్నది మనవాళ్ల సామెత. అందుకే దేశంలోని కొందరు పాలకుల చర్యలు, ముఖ్యంగా మన దేశ చట్టాలకు, న్యాయ స్థానాలకు కూడా అంద కుండా పోతుంటాయి కాబోలు. ఈ వ్యవస్థ ఇలా కొనసాగడానికి అంగీకరించి పడి ఉన్నంతకాలం మే«ధో, సివిల్ సొసైటీ కూడా నేరస్థులుగానే నమోద వుతూ ఉంటాయి కాబోలు!!
ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
abkprasad2006@ahoo.co.in
Published Tue, Jul 31 2018 12:42 AM | Last Updated on Wed, Aug 15 2018 2:37 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment