బ్యాలెట్ పోరులో ‘బ్రహ్మ’సూత్రాలు | Ballet wars 'Brahma' principles | Sakshi
Sakshi News home page

బ్యాలెట్ పోరులో ‘బ్రహ్మ’సూత్రాలు

Published Tue, May 13 2014 11:18 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

బ్యాలెట్ పోరులో ‘బ్రహ్మ’సూత్రాలు - Sakshi

బ్యాలెట్ పోరులో ‘బ్రహ్మ’సూత్రాలు

 ఏకసభ్య ఎన్నికల కమిషన్‌ను ప్రభుత్వం త్రిసభ్య సంఘంగా మార్చినపుడు శేషన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ చర్య తనను పక్కకు నెట్టివేయడానికి తీసుకున్నదేనని వాదించారు. కానీ, ఏ కమిషన్ అధికారాన్ని సర్వ సత్తాక శక్తి అని న్యాయస్థానం నిర్వచించిందో, అదే నిర్వచనాన్ని గౌరవించడం దగ్గర ఆ న్యాయస్థానమే విఫలమైంది.
 
 సాంకేతిక సమాచార వ్యవస్థ లేని రోజులలో, బ్యాలెట్ మాత్రమే వినియోగంలో ఉన్న కాలంలో పోలింగ్ బూత్‌లను ఆక్రమించేవారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో ఆ పద్ధతి తిరిగి అమలులోకి వచ్చేసింది. ఇంతకంటె ఈ ఎన్నికలు విసిరిన పెద్ద సవాలు - ప్రచార ఆయుధంగా, సమాచారాన్ని బట్వాడా చేసే ఆయుధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని రాక్షసంగా ఉపయోగించడం. ఇవన్నీ కలిసి ప్రజాస్వామిక వ్యవస్థలోనే ఎన్నికలలో పోటీ పడుతున్న అభ్యర్థుల మధ్య సమన్యాయం సాధ్యం కాని అసమ వ్యవస్థకు దోహదం చేశాయి.

 హెచ్ ఎస్ బ్రహ్మ (కేంద్ర ఎన్నికల కమిషనర్)

 సమన్యాయానికి చోటులేని వ్యవస్థలో రాజ్యాంగ ఉల్లంఘనలే కాదు, ఎన్నికల చట్టాల, నిబంధనల ఉల్లంఘన కూడా పెద్దపెద్ద నాయకుల స్థాయిలోనే యథేచ్ఛగా సాగిపోతుంది. 1990 డిసెంబర్‌లో టీఎన్ శేషన్ భారత ఎన్నికల కమిషనర్‌గా పదవీ స్వీకారం చేసే వరకు పలు రాజకీయ పక్షాలూ, వాటి అభ్యర్థులూ అలాంటి ఉల్లంఘనలలో ఆరితేరినవారే. ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని తు.చ. తప్పకుండా పాటించి అన్ని రాజకీయ పార్టీలను గడగడలాడించినవాడు శేషన్. ప్రభుత్వమే రూపొందించిన ఎన్నికల నిబంధనలకూ, ప్రవర్తనా నియమావళికీ ఆ ప్రభుత్వమే ఎంత విరుద్ధంగా నడుచుకుంటున్నదో శేషన్ ఎత్తి చూపే సరికి పీవీ నరసింహారావు నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంగారు పడవలసి వచ్చింది.

బహుళ సభ్య కమిషన్ నిర్మాణం వెనుక

 అలాంటి పరిస్థితులలోనే ఏకసభ్య కమిషన్‌గా ఉన్న ఎన్నికల సంఘాన్ని బహుళ సభ్యుల వ్యవస్థగా మార్చడానికి పీవీ ప్రభుత్వం సాహసించింది. మరో ఇద్దరు కమిషనర్‌లను జత చేసింది. ఈ ఎత్తు అటు అధికార వర్గంలోని వారికీ, ఇటు ప్రతిపక్షాలకూ, అవినీతి రాజకీయ నేతలకూ వాటంగానే తోచింది. ‘తిలా పాపం తలా పిడికెడు’ పంచుకునే వ్యవస్థలో ఈ ఏర్పాటు సంపన్న వర్గ పక్షాలన్నింటికీ ఆమోదయోగ్యమే అయింది. నిజానికి ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అక్షరసత్యంగా  శేషన్ ఎప్పుడు అమలు జరపడం ప్రారంభించారో అప్పటి నుంచి రాజకీయ పక్షాలూ, నేతలూ అంతా శేషన్ కమిషన్ అధికారాలను ప్రశ్నిస్తూ కోర్టులకు వెళ్లారు. ఎన్నికల కమిషన్ వంటి వ్యవస్థకు వ్యతిరేకంగా అసాధారణ పరిస్థితులలో తప్ప, తప్పని పరిస్థితులలోనే జోక్యం చేసుకునే సుప్రీంకోర్టు తలుపులు తట్టినవారు కూడా లేకపోలేదు.

న్యాయస్థానాల వైఫల్యం

 ఎన్నికల నిర్వహణ, నియంత్రణ వంటివి పూర్తిగా ఎన్నికల సంఘం స్వతంత్ర నిర్ణయాల ఆధారంగా జరుగుతాయని రాజ్యాంగంలోని 324వ అధికరణ పేర్కొంటున్నది.  ఎన్నికల కమిషన్ అధికారాన్ని ‘సాధికారిక సర్వసత్తాక శక్తి’ అని ఒక తీర్పులో సుప్రీంకోర్టు నిర్వచించింది కూడా. ఇదంతా కాలగర్భంలో కలిసిపోయి ఎన్నికల సంఘం బహుళ సభ్య సంఘంగా మారిపోయింది. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికీ, న్యాయవ్యవస్థకూ మధ్య పరిధులు ఉన్నందువల్ల ఒక వ్యవస్థ నిర్ణయాలలో మరొక వ్యవస్థ జోక్యం ఉండరాదని పాలకశక్తులు బెదిరించడం వల్లనో ఏమో,  కోర్టు కూడా ఒక్కొక్క సందర్భంలో ముందు ఇచ్చిన మంచి తీర్పులను తిరగదోడుతూ ఉంటుంది. ఏకసభ్య ఎన్నికల కమిషన్‌ను ప్రభుత్వం త్రిసభ్య సంఘంగా మార్చినపుడు శేషన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ చర్య తనను పక్కకు నెట్టివేయడానికి తీసుకున్నదేనని వాదించారు. కానీ, ఏ కమిషన్ అధికారాన్ని సర్వ సత్తాక శక్తి అని న్యాయస్థానం నిర్వచించిందో, అదే నిర్వచనాన్ని గౌరవించడం దగ్గర ఆ న్యాయస్థానమే విఫలమైంది.

 నానాటికీ తీసికట్టు

 ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, శేషన్ తరువాత ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వర్తించిన చాలా కమిషన్‌లు నియమావళి అమలులో సడలింపు ధోరణినే ప్రదర్శించాయి. నిబంధనలను ఉల్లంఘించిన అనేక మంది నాయకులకు మొదట నోటీసులు జారీ చేయడం, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం కనిపించినా; బెదిరింపులు, ఒత్తిళ్ల మేరకు క్రమంగా సడలించుకుంటున్నాయి. బాహాటంగా జరుగుతున్న ఉల్లంఘనలను కూడా ఎన్నికల కమిషన్‌లు చూసీచూడనట్టు ఊరుకుంటున్నాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గాంధీనగర్‌లో ఓటు వేసిన(ఏప్రిల్ 30) తరువాత, బయటకు వచ్చి వేలి మీది సిరా ముద్రను చూపుతూనే, తన పార్టీ గుర్తును కూడా ప్రదర్శించారు. టీడీపీ నాయకుడు చంద్రబాబు కూడా అదేరోజున జూబ్లీహిల్స్‌లోని ఒక కేంద్రంలో ఓటు వేసి వచ్చి, రెండు ఓట్లూ (లోక్‌సభ, శాసనసభ) బీజేపీకే వేశానని ఇతరులను ప్రభావితం చేసే తీరులో ప్రకటించారు. ఎవరికి ఓటు వేసినదీ ఓటరు బహిర్గతం చేయకూడదని కోడ్ చెబుతోంది. చంద్రబాబు కోడ్‌ను ఉల్లంఘించారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ ప్రకటించినందుకు, టీడీపీ నేత రాద్ధాంతం చేశారు.  ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కేసు నమోదు కావడంతో మోడీ కూడా అడ్డగోలు వాదనలకు దిగారు. పోలింగ్ బూత్‌కు వంద మీటర్ల అవతల పార్టీ గుర్తును చూపిస్తే ఉల్లంఘన కాదన్నది మోడీ వాదన. కానీ మీటర్ల లెక్కలు ఎక్కడా లేవు.  ప్రజా ప్రాతినిధ్య చట్టం (1951) ప్రకారం పోలింగ్ 48 గంటలకు ముందు నుంచి సభలూ సమావేశాల ఏర్పాటు నిషిద్ధం. 126(బి) ప్రకారం ఎన్నికలకు సంబంధించిన ఏ అంశాన్నీ ఏ రూపంలోనూ ప్రదర్శించకూడదు. అదే నిబంధన సెక్షన్-3 ఎన్నికల అంశం అంటే, ఓటరును ప్రభావితం చేసే, లేదా ప్రలోభపెట్టేదని స్పష్టం చేసింది.

 ఉల్లంఘనలలో మేటి జోడీ

 ఎన్నికల చట్టంలోని 125(ఎ) నిబంధన ప్రకారం అభ్యర్థులు మతం, జాతి, కులం పేరిట విద్వేష వాతావరణం సృష్టించడం శిక్షార్హం. కానీ  మోడీ ఆది నుంచీ మైనారిటీల భద్రతకు చిచ్చుపెట్టే తీరులోనే ప్రసంగాలు చేశారు. ప్రజలను మోసగించే వాళ్లు తమను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో గమనించరు. ఇందులో మోడీ, బాబు ఒకరికొకరు తీసిపోరు. అవసరమైతే ఇరువురు పరస్పరం మోసగించుకోవడానికి కూడా వెనుదీయరు.

 సొంత డబ్బాకు టెక్నాలజీ

 సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా దుర్వినియోగం చేయవచ్చునో బాబు, మోడీలకు బాగా తెలుసు. ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో మూడేళ్లుగా మోడీ ఫ్యాక్టరీ ఎలా పనిచేస్తున్నదో ప్రసిద్ధ విశ్లేషకుడు రాణా అయూబ్  వెల్లడించాడు. ఐటీ, బ్లాగర్లు, అనుకూల విద్యార్థి బృందం, ఎన్‌ఆర్‌ఐ వ్యాపారస్థులూ ఇందులో భాగస్వాములు. ‘దేశ్ గుజరాత్’ అనే వెబ్ మోడీ ప్రజా సంబంధాల గురించి ఊదరగొడుతుంది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ‘సంస్కార ధామ్’ మోడీ ప్రచారానికి ఆయన సీఎం కాకముందునుంచే పని చేస్తోంది. షికాగో కేంద్రంగా పనిచేసే నేషనల్ ఇండియన్ అమెరికన్ పబ్లిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ ముగ్గురు అమెరికా పార్లమెంటు సభ్యులు గుజరాత్‌లో పర్యటించడానికి ఏర్పాట్లు చేసింది. ‘నమో గుజరాత్’, ‘వికాస గుజరాత్’ అనే చానళ్లు మోడీ కీర్తిని చాటుతూ ఉంటాయి. గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టాలన్న కెనడా నిర్ణయానికి కారణం- ఆప్కో వరల్డ్‌వైడ్ అనే సంస్థ. యూరప్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ ఇంగ్లండ్ ప్రధాని డేవిడ్ కామెరూన్ గుజరాత్ పర్యటనకు ముందు లాబీయింగ్ చేసింది.  ఇండియన్ అమెరికన్స్ ఫర్ ఫ్రీడమ్ అమెరికా కాంగ్రెస్ సభ్యుడు జోయి వాల్ష్‌కు మద్దతు ఇస్తూ ఉంటుంది. మోడీకి వీసా ఇవ్వవలసిందని క్లింటన్‌కు లేఖ రాసినవాడు వాల్ష్. అక్కడే గుజరాతీలు నెలకొల్పిన హిందూ అమెరికన్ ఫౌండేషన్ నిధులు ఇస్తుంది.

 కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులలో ఒకరు హెచ్ ఎస్ బ్రహ్మ చెప్పినట్టు, మనది పేరుకే ప్రజాస్వామ్య వ్యవస్థ. కానీ ఆచరణలో మన పనులన్నీ ‘అసమ వ్యవస్థ’ నిర్మాణానికి దోహదం చేస్తున్నాయి.    
 
(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)  ఏబీకే ప్రసాద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement