కొత్త అమరావతి కథ | abk prasad write a story on new amravati | Sakshi
Sakshi News home page

కొత్త అమరావతి కథ

Published Tue, Oct 17 2017 1:02 AM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM

abk prasad write a story on new amravati - Sakshi

ఈ ‘అమరావతి కథలు’ ఇప్పటితో ముగిసేటట్టు లేవు. ఇప్పుడు పాలకుడేమంటున్నాడు? ‘అమరావతిని ప్రపంచ సుందర నగరం’గా యాభై ఏళ్లలో మారుస్తానని అంటున్నారు. అంటే, అన్నేళ్లు అధికార పీఠం కావాలని చెప్పకనే చెబుతున్నారాయన. కానీ రాజధాని నగర పరిపూర్ణ నిర్మాణం పేరుతో వేస్తున్న కుప్పిగంతులు ఎంతవరకు వచ్చాయి? ‘సినీ సెట్టింగ్స్‌’ నమూనాల (పైన పటారం–లోన లొటారం అన్నట్టుగా ఉంటాయి) నుంచి మూడో పార్టీ లాభాల వేటకు అనుకూలంగా ఉండే ‘స్విస్‌ ఛాలెంజ్‌’ నమూనాల దాకా!

‘అమరావతి రాజధాని ప్రాంత రైతులతో, రైతు సంఘాలతో, వందలాది బాధిత కుటుంబాలతో క్షేత్ర స్థాయిలో ప్రపంచ బ్యాంక్‌ తనిఖీ బృందం సమావేశమైంది. వారందరి సాధకబాధకాలు విన్న తరువాత బ్యాంకుకు నివేదికను సమర్పించింది (27–9–2017). కానీ ఆ నివేదిక మూడు రోజులలోనే (30–9–2017) బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హఠాత్తుగా అదృశ్యమైంది. ఢిల్లీలోని బ్యాంక్‌ అధికారులపైన రాష్ట్ర పాలకుల ఒత్తిడి వల్లనే ఇది జరిగిందని అధికార వర్గాల భోగట్టా.’ – మీడియా వార్తలు (10–10–2017)

‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలపై మంత్రి నారాయణ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, సా«ధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, రాజధాని ప్రాంత అభివృద్ధి శాఖ కమిషనర్‌ శ్రీధర్, సినీ దర్శకుడు రాజమౌళి (బాహుబలి) లండన్‌ వెళ్లి అక్కడి వాస్తుశిల్పి, డిజైనర్‌ సంస్థ నార్మన్‌ ఫాస్టర్‌ అండ్‌ పార్ట్ట్‌నర్స్‌తో రాజధానికి సంబంధించిన నమూనాల గురించి ఈ నెల 14న చర్చలు జరిపారు.’ – మీడియా వార్తలు (15–10–2017)

ఇంతకూ ప్రపంచ బ్యాంక్‌ క్షేత్రస్థాయికి వెళ్లి తయారు చేసిన వాస్తవాలతో కూడిన నివేదిక మూడు రోజులలోనే వెబ్‌సైట్‌ నుంచి అదృశ్యం కావడానికీ, ఫాస్టర్‌–పార్ట్‌నర్స్‌ సంస్థతో రాష్ట్ర ప్రతినిధులు ఈ నెల 14నే హడావుడిగా చర్చలు (నిజానికి 24, 25 తేదీలలో జరగవలసినవి) జరపడానికీ మధ్య లంకె ఏమై ఉంటుందన్నదే అసలు ప్రశ్న. అదెలా అంటే– ఈ మొత్తం వ్యవహారమంతా చంద్రబాబు తొలి విడత ముఖ్యమంత్రి హయాం (1995–2004) నాటి సంబంధాల వెలుగునీడల పరిధిలోనిదే. తనిఖీ బృందంతో బ్యాంక్‌ జరూరుగా నివేదిక తెప్పించుకోవడానికి కారణం ఉంది. అక్కడి పరి స్థితులను (పర్యావరణ పరిస్థితులు, నదీ తీరం కావడంతో 15 అడుగులకే నీరు ఉబకడం వంటివి) బట్టి అసలు అమరావతి ప్రాజెక్టు సాధ్యపడుతుందా అన్న అంశంతో సంబంధిత కంపెనీలన్నీ ప్రశ్నలు లేవనెత్తడమే ఈ కారణాలలో ఒకటి.

ఈ కంపెనీలు ప్రపంచ బ్యాంక్‌ విధానాలతో విభేదిస్తున్నాయి కూడా. తమ అనుమానాల నివృత్తి కోసం ఒక అధికారిక బృందాన్ని పంపాలని కూడా ఆ కంపెనీలు కోరడం ఇంకొక కారణం. భూములు కోల్పోయిన వారు, చౌక ధరలకు ప్రభుత్వం గుంజుకోవడంతో భూములు కోల్పోయినవారు; బ్యాంకుతో సంబంధం ఉన్న కొన్ని నిర్మాణ సంస్థలు కూడా రాజధాని నిర్మాణ ప్రాజెక్ట్‌ పట్ల అనుమానాలు వ్యక్తం చేసి, సమాధానం కోసం ఒత్తిడి తెచ్చాయి. వాస్తవాలను తెలుసుకోవడానికో, కాకుంటే కంటి తుడుపుగానో మొత్తానికి ప్రపంచ బ్యాంక్‌ ఒక తనిఖీ బృందాన్ని పంపిందని అర్థం చేసుకోవాలి. మరొక అంశం కూడా ఉంది. ఆ తనిఖీ బృందం తన నివేదిక ముక్తాయింపులో (ఐదో అధ్యాయం) ఇలా వ్యాఖ్యానించవలసి వచ్చింది: ‘తనిఖీ పర్యవసానంగా బ్యాంక్‌ యాజమాన్యం అమరావతి నిర్మాణ ప్రాజెక్టుకు పెట్టుబడులు పెట్టాలా వద్దా అనే అంశం మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు.’

ఇదంతా లౌక్యం
ఆకుకు అందని, పోకకు పొందని ప్రపంచ బ్యాంక్‌ నిర్ణయాలన్నీ కేవలం లౌక్యం తప్ప, మరొకటి కాదు. ఆంగ్లో–అమెరికన్‌ గుత్తవర్గాల, బహుళ జాతి గుత్త సంస్థల పెట్టుబడులన్నీ వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులకూ, పథకాలకూ మళ్లేది ప్రపంచ బ్యాంక్‌ ‘గొట్టం’ ద్వారానే అన్న వాస్తవాన్ని మరచిపోరాదు. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చర్చలు, నిర్ణయాలు ప్రభుత్వ అధికారుల సమక్షంలో కాకుండా నేరుగా ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు, అధికారులతో జరిగాయి. ఆనాడు రాష్ట్రం దివాళా వైపు నడవడం దీని ఫలితమే. రాష్ట్రానికి ప్రపంచ బ్యాంక్‌ బేషరతుగా రుణం ఇచ్చినట్టు చంద్రబాబు ప్రకటనలు గుప్పించారు కూడా. అయితే వ్యాపార సూత్రం బాగా తెలిసిన ప్రపంచ బ్యాంక్‌ వెంటనే వివరణ ఇచ్చింది: ‘ఏపీ ప్రభుత్వం అన్ని షరతులకు ఆమోదించింది’అన్నదే దాని సారాంశం. ఆ తరువాతి బాగోతం తెలిసిందే కదా! రెండు శాతం వంతున ప్రభుత్వోద్యోగులను తొలగించడం, సహకార బ్యాంకులను నిర్వీర్యం చేయడం అందుకు సంబంధించిన ఫలశ్రుతే.

ఇరవై కాదు యాభై ఏళ్లు కావాలట!
అసలు తెలుగుజాతి విభజనే అక్రమ మార్గంలో జరిగింది. ఆపై అధికార లాలస అవధులు దాటిపోయి రాజధాని నిర్మాణ వ్యూహం పేరుతో అనేక అనర్థాలకు మార్గం ఏర్పరిచింది. రోజుకొక తీరు వంతున ప్రపంచ పర్యటనలకు ఏతాం ఎత్తడం కూడా ఇందులో భాగమే. ముఖ్యమంత్రి, ఆయన బృందాలు ఏమీ ‘పాలుపోక’ సింగపూర్, మలేసియా, జపాన్, చైనా, దుబాయ్, డావోస్‌ పర్యటనల ‘యాత్రా స్పెషల్స్‌’ నడపడమూ, వెళ్లిన చోటల్లా అక్కరకురాని ఒప్పందాలు చేసుకోవడం. అవి నచ్చకుంటే మరో దేశానికి యాత్రలు కట్టడం. ఇదీ గత మూడేళ్లుగా సాగుతున్న తంతు. ప్రపంచవ్యాప్తంగా పెక్కు విమానాశ్రయాల్లో ‘వ్యాపారాలకు అత్యంత సులువైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌’ అన్న బోర్డులు పెట్టించినా– అమరావతీ రాజధాని సుందర నగర నిర్మాణానికి ఎవరూ ముందుకు రాకపోవడం, వచ్చినవాళ్లు కుదురుకోకపోవడం, ఆ గందరగోళంలో ఎవరి డిజైన్లూ నచ్చకపోవడం, నచ్చిన కంపెనీతో అనుకున్న విధంగా ‘బేరాలు’ కుదరకపోవడం– మళ్లీ కథ మొదటికి చేరడం.

ఈ ‘అమరావతి కథలు’ ఇప్పటితో ముగిసేటట్టు లేవు. ఇప్పుడు పాలకుడేమంటున్నాడు? ‘అమరావతిని ప్రపంచ సుందర నగరం’గా యాభై ఏళ్లలో మారుస్తానని అంటున్నారు. అంటే, అన్నేళ్లు అధికార పీఠం కావాలని చెప్పకనే చెబుతున్నారాయన. కానీ రాజధాని నగర పరిపూర్ణ నిర్మాణం పేరుతో వేస్తున్న కుప్పిగంతులు ఎంతవరకు వచ్చాయి? ‘సినీ సెట్టింగ్స్‌’ నమూనాల (పైన పటారం–లోన లొటారం అన్నట్టుగా ఉంటాయి) నుంచి మూడో పార్టీ లాభాల వేటకు అనుకూలంగా ఉండే ‘స్విస్‌ ఛాలెంజ్‌’ నమూనాల దాకా! అక్కడితో ఆగకుండా తాజా అంతర్జాతీయ నిర్మాణ శిల్ప, నమూనా సంస్థ నార్మన్‌ ఫాస్టర్‌–పార్ట్‌నర్స్‌ వరకూ డేకాయి. ఈలోగా పేరెన్నికగన్న ప్రపంచ వాస్తు శిల్ప సంస్థ మాకీ అండ్‌ అసోసియేట్స్‌ వ్యవస్థాపక సంస్థ అధ్యక్షుడు మాకిని రంగంలోకి దించితే ఆయన ‘ఆంధ్రప్రదేశ్‌లో స్థితిగతులు అత్యంత దారుణంగా ఉన్నాయ’ని చెప్పారు. ఇంకా ఏపీలో ‘స్పష్టమైన అవగాహన ప్రక్రియే లేకుండా పోయిందనీ విమర్శించారు. మాకీ డిజైన్లను అంతర్జాతీయ జ్యూరీ ఎంపిక చేసి చీఫ్‌ ఆర్కిటెక్ట్‌గా ఆ సంస్థనే ఎంపిక చేసిన తరువాత, తాజాగా ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం నివేదికను మాయం చేసినట్టే మాకీ డిజైన్‌నూ మాయం చేశారు. చివరికి జ్యూరీనే కనపడకుండా చేశారు.

ఇంతకూ రాజధాని నిర్మాణం కోసం ఇన్ని అంతర్జాతీయ కంపెనీల నుంచి టెండర్లు పిలిచినా కూడా ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందోనని ప్రశ్నించుకుని, నేతల మనో చాంచల్యం ఫలితమే ఈ విదేశీ తిరుగుళ్లూ, తంతూనని ప్రజలు నిర్ణయానికి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో పాలకులు ఆలోచించుకోవాలి. డావోస్‌లో జరిగిన ప్రపంచ కుబేర వర్గాల సదస్సుకు ముఖ్యమంత్రి వెళ్లినంత మాత్రాన రాజధాని సమస్య పరిష్కారం కాదు. అలాగే రాజమౌళి ఎంతటి సినీ దర్శకుడైనా లండన్‌ ఫాస్టర్‌– పార్ట్‌నర్స్‌ డిజైనర్స్‌ రూపకల్పనతో అమరావతీ నగర నిర్మాణాన్ని తీర్చిదిద్దలేరు. ఎందుకంటే రాజధాని నిర్మాణం తాత్కాలిక సినీ సెట్టింగ్స్‌తో గాని, భ్రమాపూరితమైన ‘గ్రాఫిక్స్‌’ సృష్టితో గానీ సాధ్యపడదు. అయినా లండన్‌ ఫాస్టర్స్‌ ఆర్కిటెక్చర్‌– డిజైన్‌ సంస్థ ఎంత పేరు ప్రతిష్టలున్నదైనా, దానికీ లొసుగులు ఉన్నాయని మరచిపోరాదు.

ఈ తాజా కంపెనీ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ భవంతిని వజ్రం ఆకారంలో, హైకోర్టును బౌద్ధ కట్టడం నమూనాలో నిర్మిస్తుందనీ, అయితే ఇంతవరకు వచ్చిన డిజైన్లన్నీ తను ఆశించినట్టుగా లేవని భావించిన చంద్రబాబు వాటిని మార్చాలంటున్నారనీ లండన్‌ నుంచి గల్లా జయదేవ్‌ ప్రకటిస్తున్నారు! అంతేగాని, మూడున్నర సంవత్సరాల తర్వాత కూడా ఈ చపల చిత్తులకు డిజైన్లపై ఇంకెప్పుడు మనసు లగ్నమవుతుందో మాత్రం జయదేవ్‌ చెప్పలేదు. అలాగే, బాబు ‘స్వప్నాన్ని’ (విజన్‌) ఫాస్టర్‌ కంపెనీ ప్రతినిధుల కళ్లకు కట్టి చూపించడమే తన పని అంటూ రాజమౌళి సరిపెట్టుకున్నారు. ఆ విజన్‌ను చూస్తే 22 ఏళ్లు దాటి మరో 50 ఏళ్లకు పాకిపోయింది. మనం చేయగలిగిందల్లా, అది అక్కడితో ఆగితే బాగుండునని ఆశించడమే. 

తప్పుడు సమాచారం ఇచ్చిన ఏపీ సర్కారు
ఇదే సందర్భంగా ఇంకొక అంశం– ప్రపంచ బ్యాంక్‌ తాజా తనిఖీ బృంద నివేదికలో పొందుపరిచిన ‘ఫిర్యాదులు–సమాధానాలు’ అధ్యయనం కోసం రాష్ట్ర పాలకులు తప్పుడు సమాచారం ఇచ్చారు. రాజధాని గురించి ప్రభుత్వం తలపెట్టిన ‘భూసేకరణ–భూసమీకరణ’ తంతు గురించి ఈ వ్యాసకర్త సహా మరో ఇద్దరు సీనియర్‌ పాత్రికేయులు సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (నం: 632/2016) దాఖలు చేశారు. దానిలోని అంశాన్ని పరిశీలించకుండా, ‘రైతుల్నే ఢిల్లీ వచ్చి తమ విజ్ఞాపనను వినిపించుకోమనండి!’ అంటూ నిమిషంలో కోర్టు తోసిపుచ్చింది. నిజానికి ఈ తీర్పుతో నాటి ప్రధాన న్యాయమూర్తి ‘పిల్‌’ఉద్దేశాన్నే కించపరిచినట్టయింది. సామాన్య ప్రజలు తమ సమస్యలను లేదా ఫిర్యాదులను ఒక కార్డు ముక్క ద్వారా కూడా కోర్టుకు పంపుకునే సౌలభ్యాన్ని ‘పిల్‌’ ద్వారా కల్పించిన గౌరవ న్యాయమూర్తులు జస్టిస్‌ వీఆర్‌ కృష్ణయ్యర్, జస్టిస్‌ భగవతి.

ఢిల్లీ కోర్టుకు రాగల ఆర్థిక స్తోమతే రైతులకు ఉంటే ఇన్ని అగచాట్లు వారు పడవలసిన పనిలేదు. ఈ కనీస అవగాహన నాటి గౌరవ న్యాయమూర్తికి కలగలేదు. ఇంతకీ క్షణాల్లో తిరస్కరిం చిన (కారణం తెలియదు) ఆ రిట్‌ పత్రాన్నే బ్యాంక్‌ తాజా తనిఖీ బృందానికి రాష్ట్ర ప్రభుత్వం తన రైతాంగ వ్యతిరేక విధానాలకు సమర్థనగా సమర్పిం చింది. ఇది సిగ్గుచేటు. 140 మంది భాగస్వాములతో లండన్, సింగపూర్, కజకిస్తాన్, అర్జెంటీనాలలో రకరకాల నిర్మాణాలు చేపట్టిన ఫాస్టర్‌ కంపెనీ ప్రాథమికంగానే కొన్నిచోట్ల (ఉదా. బల్గేరియా) ఎలా తప్పుడు ప్లానింగ్‌తో నిర్మాణాలు తలపెట్టి అభాసుపాలయిందో బ్రిటిష్‌ పత్రిక ‘గార్డియన్‌’ బహిర్గతం చేసింది. అలాగే లాస్‌వేగాస్‌లోని (అమెరికా) హర్మోన్‌ హోటల్‌ నిర్మాణంలో ఎన్ని లోపాలు బయటపడ్డాయో, ఫలితంగా ఎన్ని కేసులు ఎదుర్కోవలసి వచ్చిందో, ఒక మోస్తరు భూకంపానికే ఈ కంపెనీ నిర్మాణాలు కొన్ని ఎలా కూలిపోయాయో ఆరోపిస్తూ ఫిర్యాదులొచ్చాయి. ఇంతకూ అద్భుతమైన దేశీయ ఇంజనీర్ల, వాస్తు శిల్పుల, డిజైనర్లను విస్మరించడమే దౌర్భాగ్యం!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement