మౌలిక ప్రజాస్వామిక, గణతంత్ర వ్యవస్థ సంప్రదాయానికి అలవాటుపడిన మన ఆదివాసీ గిరిజనులు తమ ఓటింగ్ ఎంపికను స్వేచ్ఛగా ప్రకటించడానికి.. ఏ రోడ్డు రవాణా, వాహన సౌకర్యాలు లేని ప్రాంతంలోనే 12 నుంచి 16 కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళ్లి ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నూటికి 94 మందికి పైగా ఆదివాసీలు తమ ఓటు విలువను కాపాడుకోగలిగారు! ఆధునికులమనుకునే మనందరికీ ఆ గిరిజనుల చైతన్యం ఒక చెంపపెట్టు. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడి రక్షించగల గణతంత్ర గిరిజన సంస్కృతి మిణుకు మిణుకుమంటూ సుదూరంగా కొండకోనల్లో మనగలుగుతూండటం ఒక మరవరాని ఆనవాలు కాదా?
‘‘ఓటర్ల జాబితా నుంచి వేలాదిమంది ఓటర్ల పేర్లు తొలగించారు. ఇలా ఓటర్ల పేర్లను గల్లంతు చేసినందున నిజాయితీగా ఎన్నికలు జరపడానికి రాష్ట్రం (తెలంగాణ) స్థిరంగా లేని సమయంలో ఎన్నికలొ చ్చాయి. ఈ పరిణామానికి ప్రధాన ఎన్నికల అధికారి క్షమాపణ చెప్పు కోవాలి’’
– ఇందుకు కారకులైన రాజకీయ శక్తుల్ని పేర్కొనకుండా కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన ప్రకటన (08–12–2018)
‘నేను ఓటేయకపోతే నేను చచ్చిపోయినట్లుగా భావిస్తారు. అందుకే గత నలభై ఏళ్లుగా వోటు వేస్తున్నాను’ అని అవిభక్త ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ, ఆదివాసీయేతర గిరిజన మండలాలకు చెందిన ఆదివాసీ రాజగోండ్ ఓటరు కుడిమేత భీంబాయి చెప్పింది– కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మారుమూల ఉన్న మేటి గూడ గ్రామవాసి. అలాగే ఇదే జిల్లాకు చెందిన గడిగూడ నార్నూర్ మండలాల్లో మొత్తం 31,317 మంది ఓటర్లలో 29,317 మంది (రాష్ట్రం లోనే 94.27 శాతంమంది) వోట్లు వేశారు. కాగా ఖనామార్, ఇంద్రవెల్లి గిరిజన ప్రాంతాల్లో 71.41 శాతం మంది వోటింగ్‌లో పాల్గొన్నారు. పోల్ అయిన ఓట్ల శాతం పెరగడానికి గిరిజన ఆదివాసీల ప్రజాస్వామ్య భావన కారణమైంది‘
‘‘ది హిందు’’ ; 9–12–18
తెలంగాణ అసెంబ్లీకి అర్ధంతరంగా 9 మాసాలు ముందే జరిగిన ఎన్ని కల్లో ఫలితాలు ప్రకటించకముందు పోటీలో ఉన్న నాలుగు ప్రధాన రాజ కీయ పార్టీలు నిలబెట్టిన అభ్యర్థుల్లో 181 మంది నేరస్థులుగా ఆరో పణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులు వీరిపైన అయిదేళ్లకు పైగా నాను తూనే ఉన్నాయి. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ క్రిమినల్ కేసుల గురించి పదేపదే హెచ్చరిస్తూ ఉండే కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లు గానీ ఏళ్లో పూళ్లోగా స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. పైగా కొన్ని అసెంబ్లీల (ఆంధ్ర–తెలంగాణ శాసనసభల) స్పీకర్లు సైతం అధికార, ప్రతిపక్షాల మధ్య స్వేచ్ఛగా జరుగుతూండే ఫిరాయింపుదార్లపైనగానీ ఉన్న చట్టాలను గౌరవించి చర్యలు తీసుకోవడం లేదు!
ఓటు విలువకు పట్టం కట్టిన సంస్కృతి
ఈ దారుణ పరిస్థితుల్లో 70 ఏళ్లకు పైగా కొట్టుమిట్టాడుతున్న ధనిక (పెట్టుబడిదారీ) వ్యవస్థలో సైతం ప్రజాస్వామ్య విలువల్ని కాపాడి రక్షించగల మూలవాసులైన గణతంత్ర ఆదివాసీ గిరిజన సంస్కృతి మిణుకుమిణుకుమంటూ రాష్ట్రంలో సుదూరంగా కొండకోనల్లో మన గలుగుతూండటం ఒక మరవరాని ఆనవాలు కాదా? అది ప్రాచీన గణతంత్ర వ్యవస్థ కాబట్టే ఇంకా మన మైదానప్రాంతాల దోపిడీ వ్యవస్థా సంస్కృతికి భిన్నంగా–ప్రజాస్వామ్య విలువలకు ఒక ప్రతీకగా ఆదివాసీ గిరిజన జనాభాలో నూటికి 94 మందికి పైగా తమ ఓటు విలువను కాపాడుకోగలిగారు! కటిక దారిద్య్రంలో కాలం గడుపుతున్నప్పటికీ ప్రయివేట్ ఆస్తులకు కోటికి పడగలెత్తని వారిని గురించి దక్షిణాఫ్రికా గాంధీగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దక్షిణాఫ్రికా విమోచన ప్రదాత నెల్సన్ మండేలా అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తుకొస్తున్నాయి. ‘‘బానిస త్వంలా, జాతి వివక్షలాగా దారిద్య్రం అనేది ఆకస్మికంగా రుద్దబడే ఘటన కాదు – దారిద్య్రాన్ని సృష్టించేది మానవుడే. దాన్ని నిర్మూలిం చడం అనేది మానవమాత్రుల నిశ్చయాత్మకమూ, నిర్మాణా త్మకమైన చర్యల ద్వారానే సాధ్యం, సుసాధ్యం’’ అన్నాడు.
కనుకనే ఈ రాష్ట్ర లేదా దేశవ్యాపిత ఎన్నికలనే కాదు, ధనికవర్గ వ్యవస్థ జనాభాలోని కొద్దిమంది లేదా కొన్ని సంపన్నవర్గాల ప్రత్యేక ప్రయోజనాలకు ఎప్పుడు రక్షణ కవచంగా నిలబడుతుందో, అప్పుడు బీఆర్ అంబేడ్కర్ లాంటి రాజ్యాంగ నిర్ణేతలు రూపొందించిన సెక్యులర్ రాజ్యాంగమూ, దాని విలువలూ ఆచరణలో ప్రజా బాహుళ్యానికి దూర మైపోతూ ఉంటాయి. మన దేశంలో కాంగ్రెస్–బీజేపీ పాలకవర్గాల మూలంగా రాజ్యాంగ విలువలు దఫదఫాలుగా పతనమవుతూ, వీలును బట్టి ఆ పరిమిత లౌకిక రాజ్యాంగ స్వచ్ఛత కూడా రానురాను మసక బారిపోయి, ప్రజా ప్రయోజనాలకు హానికరంగా మారుతోంది. ఇప్పుడు రాజ్యాంగాన్నే మార్చేసి ఏనాడూ ‘హిందూ రాజ్య’ భావనను ప్రతిపాదిం చని వైదిక నీతిని వదిలేసి, ‘హిందు’ పదమే ‘సింధు’ పదానికి అపభ్రం శమని చెప్పి, మనది సర్వమత సమ్మేళనను ప్రబోధించి ‘సర్వజనులు సుఖశాంతులతో’ వర్ధిల్లాలి (సర్వేజనాః సుఖినోభవంతు) అని, ‘ప్రపం చం నలుమూలల నుంచి వచ్చే సకల భావధార’ను ఆహ్వానించాలని బోధిం చిన పూర్వ వైదిక ధర్మం మాత్రమే మనదనీ చాటిన ఆదిశంకరుల నీతిని సహితం పక్కకు తోసిపుచ్చుతున్నాయి బీజేపీ–ఆరెస్సెస్ వర్గాలు.
ఈ దశలో ప్రధానంగా కాంగ్రెస్–బీజేపీల పాలనా కాలంలోనే 1580 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు క్రిమినల్ నేరారోపణలను తీవ్ర స్థాయిలో ఎదుర్కొనవలసి వచ్చిందని మరవరాదు. అయినా అత్యున్నత న్యాయస్థానం, అనేక ప్రజా ప్రయోజనాల రక్షణకు వీలైన ఎన్నికల చట్ట నిబంధనలను, అవినీతి నిర్మూలనకు ఉద్దేశించిన చట్టాలనూ తీవ్ర నేరా రోపణలున్న లెజిస్లేటర్లపైన (అభ్యర్థులపైన) ఎన్నికల్లో పోటీ చేయ కుండా రాజకీయ అనర్హులుగా ప్రకటించడానికి ఆరోపణలను వాడరా దని చెప్పడం (ఇండియాటుడే: 25.9.2018) ఎంతవరకు సమంజసమో చర్చనీయాంశం కావాలి. ప్రస్తుత లోక్‌సభలో క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు 35 శాతం ఉన్నారని సాధికార ఏడీఆర్ నివేదిక పేర్కొన్నప్పుడు కూడా సుప్రీం చర్యకు దిగకపోవడం, ఆ పనిని పార్ల మెంట్ నిర్ణయానికి వదిలిపెట్టడం సబబా? బ్రూట్ మెజారిటీ పేరుతోనో లేదా రాజకీయ స్వార్థ ప్రయోజనాలతో కూడిన రాజకీయ పార్టీలు అధి కారంలో ఉన్నప్పుడు న్యాయస్థానం సహృదయంతో చేసిన ప్రతిపాద నకు ఎంతవరకు వీలు ఉంటుంది? ఆలోచించాలి. దీనికితోడు కుల వ్యవ స్థను, అసమానతల సమాజాన్ని దేశంలో పెంచి పోషిస్తున్న పాలకులు కుల, మత, వర్గ వివక్షకు తావులేని సామాజిక వ్యవస్థ స్థాపనకు కనీస ప్రజాస్వామ్య విలువలను కూడా కాపాడలేని దుర్గతికి చేరుకున్నారు.
నేరమయ రాజకీయాలు, నేరారోపణలు
చివరికి దేశ పాలకులు కొందరు ఓటింగ్ మిషన్ల లోపాలను సరిచేయకుం డానే వాడకంలోకి పెట్టి వాటంగా వాడుకోజూస్తున్న ఘటనలు ఎన్నో ప్రచారంలో ‘వైరల్’ అవుతున్నాయి. వేలు, లక్షల సంఖ్యలోనే పలుచోట్ల ఓటర్లు తమకు ఫొటో–ఓటర్ చీటీలు అందలేదని, ఓటర్లయినా ‘స్లిప్స్’ లేకపోయినా, ఆధార్ కార్డులున్న వారిని కూడా పోలింగ్ బూత్ నుంచి వెనక్కి తిప్పి పంపించేస్తున్న ఫిర్యాదులూ లక్షల్లోనే ఉంటున్నాయి. అసలు తాము ఓటు వేసే పోలింగ్ బూత్స్ ఉన్న ప్రాంతాలు స్పష్టంగా తెలియక పలు బూత్స్ తిరిగినా ఎక్కడా తమ పేర్లు కనిపించక పోయే సరికి హతాశులై వెనక్కి మళ్లిన వారి సంఖ్య కూడా అసంఖ్యాకంగా నమో దైంది. వీరిలో సరైన వయస్సులో వారే కారు, వృద్ధులు కూడా ఉన్నారు. పలుచోట్ల ఈవీఎంలు, ఓటర్ ఓటు వేసిన తర్వాత అది నమోదైన తీరును చూసుకునే అవకాశమివ్వాల్సిన వివిపాట్స్ యంత్రాలు అనేక చోట్ల మొరాయించి 2–3 గంటలపాటు పనిచేయక పోవడంతో ఓటర్లు తమ ఓటు వినియోగించుకోకుండానే వెనుదిరిగిపోయారు. కొన్ని చోట్ల యితే అసలు పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా మార్చేయడంతో ఓటర్లు అయోమయంలో పడ్డారు. ఇదీ మన ప్రజాస్వామ్యపు ‘మేడిపండు’ గాథ. కనుకనే చూసి, చూసి ఈ అధర్మ, అరాచక వ్యవస్థను కొంత వరకైనా గాడిలో పెట్టే సదుద్దేశంతోనే సుప్రీం ధర్మాసనం ఓటింగ్ సరళిని ‘ప్రజాస్వామికం’ చేసేందుకు పార్టీలు, అభ్యర్థులు వారి ఓటు గుర్తులున్న జాబితాలో ‘పై అభ్యర్థులెవరూ మాకిష్టం లేదు’ (నోటు–ఎబౌ–నోటా) అన్న ఇంటూ సింబల్‌ను కూడా ఆఖర్లో చేర్చారు.
ప్రజాస్వామ్యమా? ‘వంచనా’ స్వామ్యమా?
ఇటీవల కొంతకాలంగా ఈ ‘నోటా’కు ఓటు వేసే వారి సంఖ్య డజన్ల స్థాయినుంచి, వందలకు, ఆపైన వేలకు, ఇటీవల కాలంలో లక్షల సంఖ్య లోకి పెరుగుతోందని పత్రికల సమాచారం. ఇటీవల కొన్ని ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లోనూ ‘నోటా’ ఓటర్ల సంఖ్య పెరగ డాన్ని పత్రికలు నమోదు చేశాయి. అంటే, ప్రజాస్వామిక భావాలకు, పౌర సమాజ సభ్యుల భావ ప్రకటనా స్వేచ్ఛకూ పాలకుల నుంచి రోజు రోజుకు ఎదురవుతున్న ఆంక్షలకు, బెదిరింపులకు సమాధానంగా ఒక ప్రజాస్వామిక నిరసనగా ఈ ‘నోటా’ విలువ పరిమితమైనది. కానీ మౌలిక ప్రజాస్వామిక సంప్రదాయానికి, గణతంత్ర వ్యవస్థ సంప్రదా యానికి అలవాటుపడి ఇప్పటికీ ఆ ప్రజాస్వామిక సంప్రదాయం ప్రకారం తమ ఎంపికను స్వేచ్ఛగా ప్రకటించడానికి ఏ రోడ్డు రవాణా, వాహన సౌకర్యాలు లేని ఆదివాసీ గిరిజనులు 12 నుంచి 16 కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళ్లి ఓటింగ్‌లో పాల్గొనడం... ఆధునికమని చెప్పు కునే మన నేటి స్వార్థపూరిత ధనికవర్గ సమాజంలో మనందరికీ ఒక చెంప పెట్టు. కాగా, శ్రీశ్రీ అన్నట్టుగా ‘నేటి రివల్యూషనరీ రేపటి రియా క్షనరీ’ అయితే ఎలా ఉంటుందో ప్రజాయుద్ధ నౌక, దళిత కవి గద్దర్ మనకు నమూనాలా కనిపిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం గద్దర్ ఏ చంద్రబాబు తుపాకీ గుండు దెబ్బతిన్నాడో అదే చంద్రబాబు నేడు ఆ గద్దర్ దృష్టిలో ‘ప్రజాస్వామ్య రక్షకుడి’గా కన్పించడం సృష్టిలోపమా, దృష్టిలోపమా, మనకు తెలియదు. అందుకే దేశంలో నేడున్నది ప్రజాస్వామ్యమా? లేక ఆ పేరుతో ప్రబోధాలతో ప్రజాశక్తుల్ని దశలవారీగా లొంగదీసుకోవడా నికి వేగంగా ప్రయత్నిస్తున్న వంచనా స్వామ్యమా అన్నది శేష ప్రశ్న.
ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment