ఎందుకూ కొరగాని ఆర్టీజీఎస్‌! | Analysis On Chandrababu Naidu White Paper Over RTGS | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 27 2018 6:29 AM | Last Updated on Thu, Dec 27 2018 8:23 AM

Analysis On Chandrababu Naidu White Paper Over RTGS - Sakshi

దేశంలో ఏ ముఖ్యమంత్రీ ప్రకటించుకోవడానికి సాహసించని ధోరణి ప్రదర్శిస్తూ ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు సాగిస్తున్న డాంబిక ప్రచారానికి అడ్డూ ఆపూలేకుండా పోతోంది. అన్నీ తానే సాధించినట్లు, అభివృద్ధికి తానే బ్రాండ్‌ పేరు అన్నట్లుగా నిత్యం ప్రచార మోతలో మునుగుతున్న బాబు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ అనే భావనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇది తాను కనిపెట్టిన అద్భుత సాధనంగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కావడం తప్ప ఉపయోగం లేదని ఏపీ ప్రభుత్వంలోని అత్యంత సీనియర్‌ అధికారులే చెబుతున్నారు. ప్రభుత్వ శాఖలు ఇచ్చే నివేదికలను ఆర్టీజీ నివేదికలతో పోల్చి సరిచూడడం వల్ల యంత్రాంగంలో అసహనం రోజురోజుకూ పెరిగిపోతోంది.

ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వం విని యోగించని టెక్నాలజీతో రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నానని చంద్రబాబు చెబుతున్న మాటలు కోటలు దాటుతున్నా ఆచరణలో మాత్రం గడప దాటడంలేదు. తన పాలన ప్రపంచానికే ఆదర్శమని, తాను చేసే అన్ని కార్యక్రమాలు చారిత్రాత్మకమని, గుప్తులకాలం స్వర్ణయుగమైతే ఇప్పటి తన హయాం అంతకు మించిపోయిందని చెబుతున్న అతిశయాలు కాగితాల్లోనే కనిపిస్తున్నాయి. రియల్‌టైమ్‌ గవర్నెన్స్, ఈ–ప్రగతి ప్రజలకు అంతుబట్టని మిథ్యగా మారిపోయింది. సుపరిపాలన పేరుతో ఆయన విడుదల చేసిన శ్వేతపత్రంలో అంతా భ్రాంతే తప్ప వాస్తవం అణుమాత్రమైనా గోచరించడంలేదు. అన్ని వర్గాలు ప్రశాంతంగా ఉన్నాయని ప్రకటించుకున్నా నాలుగున్నరేళ్లలో జరిగిన అనేక ఘటనలు శాంతిభద్రతల వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ (ఆర్టీజీఎస్‌)ను తాను కనిపెట్టిన ఒక అద్భుత సాధనంగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నా దానివల్ల కోట్ల రూపాయల ప్రజాధానం వృధాయే తప్ప ఉపయోగం లేదని పలువురు సీనియర్‌ అధికారులు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. 

పరిష్కార వేదిక ఒక బోగస్‌ 
‘ఆర్టీజీఎస్‌’ను ఒక ప్రభుత్వ శాఖగా ఏర్పాటుచేసి మిగిలిన శాఖలన్నింటిపైనా దానికి పెత్తనం ఇవ్వడంతో ప్రభుత్వ యంత్రాంగంలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ శాఖలు ఇచ్చే నివేదికలను ఆర్టీజీఎస్‌ నివేదికలతో పోల్చి సరిచూడడం వల్ల యంత్రాంగంలో అసహనం రోజురోజుకూ పెరిగిపోతోంది. మిగిలిన శాఖలన్నింటికీ సమాం తరంగా చంద్రబాబు ఆర్టీజీఎస్‌ని ప్రోత్సహిస్తుండడంతో ఆయా శాఖల స్వతంత్రత దెబ్బతింటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆర్టీజీఎస్‌లోనే పరిష్కార వేదిక పేరుతో 1100 కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసి అందులో రెండు వేల మందికిపైగా ఆపరేటర్లను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. 2017 నవంబర్లో ఇది ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకూ 1,72,11,367 ఫిర్యాదులు రాగా అందులో 1,41,92,898 పరిష్కారమైనట్లు ప్రకటించారు. కానీ ఇదంతా బోగస్‌ అని అధికారవర్గాలే చెబుతున్నాయి. కొద్దిరోజుల క్రితం మచిలీపట్నం రూరల్‌ మండలానికి చెందిన ఒక వ్యక్తి తమ గ్రామంలో రోడ్డు వేయాలని కోరితే ఆర్టీజీఎస్‌ దాన్ని గ్రామీణ నీటిసరఫరా విభాగానికి పంపింది. ఆ పిటీషన్‌ వివిధ దశల్లో తిరిగి చివరికి ప్రస్తుతం నిధుల్లేవు, ఉన్నప్పుడు రోడ్డు వేస్తామనే సమాధానంతో ముగిసింది. సంబంధిత అధికారి ఇదే విషయాన్ని ఆర్టీజీఎస్‌ సైట్లో అప్‌లోడ్‌ చేస్తే అక్కడి నుంచి మీ సమస్య విజయవంతంగా పరిష్కారమైనట్లు పిటీషన్‌ పెట్టిన వ్యక్తికి మెసేజ్‌ వచ్చింది. ఇళ్ల నిర్మాణం, భూసమస్యల ఇతర అంశాలపై వచ్చే ఫిర్యాదుల్లో 90 శాతం ఇలాగే అధికారుల సమాధానంతోనే పరిష్కారమైనట్లు చూపిస్తున్నారు. విజయవాడలోని ఒక మాల్లో సినిమాకు వెళ్లిన కొందరు మిత్రులు అక్కడి కౌంటర్లలో తినుబండారాల ధరలు సాధారణ రేట్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తే కాల్‌సెంటర్‌ నమోదు చేసుకోవడానికే అరగంటకు పైగా విసిగించడంతో వారు వదిలేశారు. దీంతో పరి ష్కార వేదిక ఒక బోగస్‌ అనే అభిప్రాయం ఉద్యోగుల్లోనే స్పష్టంగా ఏర్పడిపోయింది.

సంతృప్తి సర్వేలు సొంతానికి 
ఆర్టీజీఎస్‌ చేస్తున్న సంతృప్తి సర్వేలు ప్రభుత్వ పెద్దల అవసరానికే తప్ప ప్రజల కోసం కాదని స్పష్టమవుతోంది. రెండు వేల మందికి పైగా ఆపరేటర్లతో ఏర్పాటైన కాల్‌ సెంటర్‌ నుంచి ప్రతిరోజూ 15 లక్షల మందికి ఫోన్లు చేసి ప్రభుత్వ పథకాలపై సంతృప్తిగా ఉన్నారా, లేదా అని వివిధ రకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఇవికాకుండా మరో 15 లక్షల ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో ఈ సర్వేలు చేస్తున్నా అవన్నీ రాజకీయ ప్రయోజనాల కోణంలోనే సాగుతున్నాయి. వీటి ఆధారంగానే ముఖ్యమంత్రి నిత్యం ప్రజల్లో ఇంత సంతృప్తి స్థాయి ఉందని, ఇంకా పెరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. నిజానికి ఈ సర్వేలను అధికారులే నమ్మడంలేదు. ముఖ్యమంత్రి వాయిస్‌తో వెళ్లే ఆర్టీజీఎస్‌ ఫోన్‌ కాల్స్‌ను 40 శాతం మందికిపైగా జనం తిరస్కరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. కాల్‌ సెంటర్‌ ఫోన్‌రాగానే మెజారిటీ జనం కట్‌ చేస్తున్నట్లు ఆర్టీజీ వర్గాలే వాపోతున్నాయి. అంటే ఈ సర్వేలపై ప్రజల్లో నమ్మకం లేకపోగా విసుగుపుడుతోందని అర్థమవుతోంది. ప్రజలు ముఖ్యమంత్రిని నేరుగా సంప్రదించే కైజలా యాప్స్‌ను అభివృద్ధి చేశామని మొదట్లో గొప్పలు చెప్పిన ఆర్టీజీఎస్‌ అది విఫలమవడంతో దాని ఊసే ఎత్తడంలేదు. ఆర్టీజీఎస్, ఏపీ ప్రభుత్వం ఉపయోగిస్తున్న సాంకేతికతపై నీతి ఆయోగ్‌ పెదవి విరిచింది. నీతి ఆయోగ్‌ నివేదికలో ఏపీ దేశంలో నాలుగో స్థానంలో ఉందని ప్రకటించుకున్నా అదే నీతి ఆయోగ్‌ ఏపీ ప్రభుత్వం చేస్తున్న సర్వేలు బూటకమని కొట్టిపారేసింది. తమకు తామే సర్వేలు చేసుకుని చంకలు గుద్దుకోవడం ఏమిటనే ప్రశ్నకు రాష్ట్రం నుంచి సమాధానం కరువైంది.

తుఫాను హెచ్చరికల పాత్రతో కామెడీ 
వాతావరణ కేంద్రం తుఫాను హెచ్చరికలను జారీ చేసే ప్రక్రియను కూడా ఆర్టీజీఎస్‌ హైజాక్‌ చేసింది. ఇటీవల పెథాయ్‌ తుఫానును కచ్చితంగా అంచనా వేశామని ఇది తమ సమర్థతకు నిదర్శనమని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు కొద్దిరోజుల ముందు వచ్చిన తిత్లీ తుఫానునూ తాను నియంత్రించినట్లు చెప్పారు. చంద్రబాబు ఆయన పరివారం ఎంత హడావుడిగా తిరిగినా తిత్లీ తుఫాను వల్ల తీవ్ర నష్టం ఏర్పడింది. ఈ హడావుడి వల్ల సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడగా నష్టపరిహారం చెల్లింపులు సక్రమంగా జరగలేదు. పెథాయ్‌ తుఫాను బాధితులకు 25వ తేదీకల్లా పరిహారం అందిస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెప్పినా ఇంతవరకూ బాధితులకు సాయం అందలేదు. విపత్తులు వచ్చినప్పుడు వాటి గురించి హెచ్చరించే యంత్రాంగాలు ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నాయి. చంద్రబాబు మాత్రం వీటిని తాను కొత్తగా కనుగొన్నట్లు ప్రచారం చేసుకుంటూ తుఫాను ఎంత వేగంతో ప్రయాణిస్తుంది, ఎక్కడ తీరం దాటుతుంది, ఏ ప్రాంతాలపై ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం చెప్పే విషయాలను చెబుతూ కామెడీ చేస్తుండడం అధికారులను నివ్వెరపరుస్తోంది. పిడుగులు ఎక్కడ పడతాయో ముందే చెబుతామంటూ హడావుడి చేసి కొద్దిరోజులు షో చేసినా పిడుగుపాటు మరణాలను ఆపలేకపోయారు. తాను కనిపెట్టిన టెక్నాలజీతో తుఫానుల వల్ల పంటలు దెబ్బతినకుండా కాపాడానని, రైతులను హెచ్చరించానని, మత్స్యకారులను కాపాడానని చెబుతున్నా అవన్నీ ఉత్తిదే అని పలుసార్లు స్పష్టమైంది. ఇటీవల పెథాయ్‌ తుఫాను సందర్భంగా కాకినాడ తీరంలో మత్స్యకారుల పడవ గల్లంతైంది. ముందే హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేస్తే వారి బోటు ఎందుకు తుఫానులో చిక్కుకుందనే దానికి ఆర్టీజీఎస్‌ నుంచి సమాధానం కరువైంది. 

ప్రజలకు దూరంగా మీ–సేవ
మీ–సేవ ద్వారా అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్‌లైన్‌లోనే అందిస్తున్నట్లు చేస్తున్న ప్రచారంలోనూ వాస్తవం కనిపించడంలేదు. 37 శాఖలకు చెందిన 196 ప్రభుత్వ సేవలను మీ–సేవ పరిధిలోకి తెచ్చినా అందులో ప్రజలకు అందుబాటులో ఉన్నవి పదిలోపే. ఈ సేవలను వినియోగించుకుందామని వెళ్లిన జనానికి సర్వర్ల డౌన్‌ అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. సర్వర్ల సమస్యతోనే మీ–సేవ చాలా వరకూ విఫలమైంది. వాటి సంఖ్యను 3,506 నుంచి 11835కి పెంచినా సర్వర్ల సమస్యకు ఉపయోగం లేకుండా పోయింది. ఈ–ప్రగతి పేరుతో 76 సర్వీసులను కంప్యూటరీకరించినా వాటివల్ల ఉపయోగంలేదు. ప్రధానంగా రెవెన్యూ శాఖలో భూదార్‌ను ప్రవేశపెట్టినా ప్రజలు ఇంకా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సివస్తోంది. ఆన్‌లైన్‌లోనే అంతా జరిగిపోతుందని ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవ పరిస్థితికి చాలాతేడా కనిపిస్తోంది. ఈ–ప్రగతి ఎటువంటి ప్రయోజనం కనిపించలేదని చెబుతున్నారు. గతం నుంచి ఉన్న సౌకర్యాలే తప్ప కొత్తగా ఇ–ప్రగతి ద్వారా సాధిం చింది పెద్దగా ఏమీ లేదని చెబుతున్నారు. 

అధికారంలోకి రాగానే చంద్రబాబు మద్యం బెల్టు షాపులు రద్దు చేసే ఫైలుపై సంతకం చేసినా అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బెల్టు షాపుల్ని మొత్తం నిర్మూలించామని, సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని ప్రకటించినా అదంతా అవాస్తవమనేది బహిరంగ రహస్యం. మద్యం అమ్మకాల్లో రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించింది. చంద్రబాబు అధికారంలోకొచ్చే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల వరకు బెల్టు షాపులుంటే, ఇప్పుడు ఈ సంఖ్య 60 వేలకు చేరిందని ఎక్సైజ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం షాపులుంటే, వీటికి అనుబంధంగా 40 వేలకు పైగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఏడాదికి మద్యం, బీరు అమ్మకాలు మొత్తం కలిపి రూ.17,291 కోట్ల మేర జరుగుతున్నాయి. ఇందులో బెల్టు దుకాణాల వ్యాపారం రూ.9 వేల కోట్లకు పైగా అంటే సగంకు పైగా  మద్యం వ్యాపారం బెల్టు షాపుల ద్వారానే జరుగుతోంది. 

పుష్కరాల్లో ప్రచార యావ.. 29 మంది మృత్యువాత 
చంద్రబాబు ప్రచార యావతో 2015లో జరిగిన గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 మంది ప్రాణాలు గోదాట్లో కలిసిపోయాయి. దీనిపై వేసిన సోమయాజులు కమిషన్‌ మూడేళ్ల తర్వాత ఇచ్చిన నివేదికలో వాస్తవాలను మసిపూసి మారేడుకాయ చేసింది. కృష్ణా నదిలో 2017 నవంబర్లో జరిగిన పడవ బోల్తా ఘటనలో ఏకంగా 22 మంది ప్రాణాలు నీటిపాలయ్యాయి. విశాఖ మన్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యే, టీడీపీ విప్‌ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేయడంలో భద్రతా వైఫల్యం, నిఘా నీరుగారిన వైనంపై విమర్శలు వెల్లువెత్తాయి. అతిపెద్ద ఆర్థిక కుంభకోణంగా సంచలనం రేపిన అగ్రిగోల్డ్‌ విషయంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు పోలీసుల మెడకు చుట్టుకున్నాయి. నిజాయితీగా విధులు నిర్వర్తించిన మహిళా తహశీల్దార్‌ వనజాక్షిపై టీడీపీ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తన అనుచరులతో దాడిచేíసినప్పటికీ ఆమెకు న్యాయం చేయడంలో ప్రభుత్వం పక్షపాతం చూపింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రమణ్యం విధులకు ఆటంకం కలిగించి దుర్భాషలాడటంతోపాటు ఆయన గన్‌మెన్‌పై దౌర్జన్యం చేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై కేసు నమోదు చేయకపోగా కనీసం క్రమశిక్షణ చర్యలు లేవు.

శాంతిభద్రతల అదుపులో ఘోర వైఫల్యం 
రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉందని, ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేస్తున్నా నాలుగున్నరేళ్లుగా చోటుచేసుకున్న అనేక ఘటనలు శాంతిభద్రతల వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, ఆర్థిక నేరాల సంఖ్య పెరిగిపోయింది. జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం మహిళలపై రాష్ట్రంలో 2016లో 16,362 నేరాలు జరగ్గా 2015లో 15,967 నేరాలు జరిగాయి. మహిళలపై నేరాల్లో ఏపీ దేశంలోనే 4.9 శాతంతో 8వ స్థానంలో ఉంది. మహిళల అక్రమ రవాణాలోను రాష్ట్రం ఏడవ స్థానంలో ఉంది. ఎస్సీలపై జరిగిన నేరాల్లో ఐదు, ఎస్టీలపై నేరాల్లో నాలుగు, ఆర్థిక నేరాల్లో పది, సైబర్‌ నేరాల్లో ఆరవ స్థానంలో ఉంది. మొత్తం నేరాలన్నింటిలో ఏపీ 13వ స్థానంలో ఉంది.

రాష్ట్రమంతటా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను మట్టుపెట్టడం, వారిపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్తగా ఉన్న చెరుకులపాడు నారాయణరెడ్డిని 2017 మే నెలలో పెళ్లికి వెళ్లి వస్తుండగా కాపుకాసిన ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి్డపై జరిగిన హత్యాయత్నం కేసును ఏపీ పోలీసులు నీరుగార్చారన్న అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఈ ఏడాది అక్టోబర్‌ 23న కత్తితో హత్యాయత్నం చేసిన ఘటనలో పోలీసులు, ప్రభుత్వం స్పందించిన తీరు ప్రజల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) కుట్ర కోణం వైపు దృష్టి పెట్టకుండా నిందితుడు శ్రీనివాసరావు చుట్టూనే దర్యాప్తును పరిమితం చేయడం అనుమానాలకు తావిచ్చింది.

రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు సీరియస్‌గా తీసుకోకపోవడంతో కుట్ర కోణాన్ని వెలికితీయాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పని పరిస్థితైంది. ప్రత్యేక హోదా కోసం 2017 జనవరి  26న విశాఖలో తలపెట్టిన కొవ్వొత్తుల నిరసనకు సంఘీభావంగా వెళ్లిన ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని విమానాశ్రయం రన్‌వే పైనే అడ్డుకున్న పోలీసుల తీరు వివాదాస్పదమైంది. అమరావతిలో 2017 ఫిబ్రవరిలో నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంటుకు హాజరయ్యేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను గన్నవరం విమానాశ్రయంలోనే దౌర్జన్యంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌కు తీసుకెళ్లి నిర్బందించారు. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను ఇంటి నుంచి బయటకు రాకుండా అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి, తదితర పలువురు నేతలతోపాటు, ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణలను పలుమార్లు గృహ నిర్బంధాలు, అరెస్టులు చేసిన తీరు విమర్శలకు తావిచ్చింది. ముఖ్యమంత్రి వస్తున్నారంటే అక్కడ ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, బాధితుల  ముందస్తు అరెస్టులు, కేసులను పరిపాటిగా మార్చేశారు. కాపులకు రిజర్వేషన్ల ఉద్యమంలో భాగంగా జరిగిన తుని సభ హింసాత్మకంగా మారి రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్, పోలీస్‌ స్టేషన్లు దగ్ధమైన ఘటనను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపైకి నెట్టి అపఖ్యాతిపాల్జేసేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం అభాసుపాలైంది.

రాజధాని అమరావతిలో భూ సమీకరణకు తమ భూములు ఇవ్వని రైతులపై కక్ష సాధింపు చర్యలు జాతీయ మానవ హక్కుల నేతలను సైతం విస్మయానికి గురిచేశాయి. తమ మాట వినని రైతుల అరటితోటలు, తాటాకు పాకలు తగలబెట్టించిన కొందరు సంఘ విద్రోహశక్తులు భయాందోళనలు సృష్టించారు. తుందుర్రు, గరగపర్రు, దివీ స్లలో శాంతిభద్రతలను అదుపుచేయలేక ప్రభుత్వం ప్రజలను ఇబ్బం దులకు గురిచేసింది.
-బొల్లికొండ ఫణికుమార్, సాక్షి ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement