ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగికి వన్ ఫైన్ డే అలహాబాద్ పేరు తీరు నచ్చలేదు. వెంటనే కేబినెట్ సమావేశం నిర్వహించి ఆ పేరుని ప్రయాగ రాజ్‌గా మార్చి పారేశారు. ఇంతకు ముందు చాలా ఏళ్ల క్రితం రెండు సార్లు ఆ ప్రయత్నం జరిగినా ఫలితం లేకపోయింది. యోగినా మజాకా.. వెంటనే తేల్చి పారేశారు. దెబ్బకు అలహాబాద్ చరిత్ర పుటల్లో కలిసిపోయింది. అయితే కారణం కూడా సెలవిచ్చారు. అక్బర్ తప్పుని తాను సరిచేస్తున్నట్టు ప్రకటించారు. క్షణ కాలం తికమక పడ్డాను.. ఈమధ్య కేంద్ర మంత్రి అక్బర్ తప్పుల మీద కుప్పలు కుప్పలుగా అమ్మాయిల ఆరోపణలు వస్తున్నాయి. వాటికీ, దీనికీ లింకేమిటా అని. అప్పుడు బల్బు వెలిగింది. ఈ అక్బర్ కాదు.. నాటి మొఘల్ చక్రవర్తి అక్బర్ అని. ఆయన పెట్టిన పేరు అలహాబాద్.
అలహాబాద్ పేరు 500 ఏళ్ల నుంచి జనం నోళ్లలో నానుతూ, అలవాటైన తరువాత దాన్ని ప్రస్తుత యూపీ ముఖ్యమంత్రి తప్పు అంటున్నారు. పోనీ ఆయన అంతవరకూ వేరే పేరుతో ఉన్న నగరానికి పేరు మార్చి పెట్టారా అంటే అదీ లేదు. మరి తప్పేమిటో? ఎవరైనా దీనిపై సందేహం వెలిబుచ్చితే మీకు సంస్కృతి గురించి ఏమాత్రం తెలియదంటారు. అయినా ఊరు పేరు మార్చి గొప్పలు పోవడమే వింత. ఇంతవరకూ ఏడుగురు ప్రధానుల్ని అందించిన అలహాబాద్, జీవన ప్రమాణాల్లో (లివబుల్ సిటీస్) 111 భారతీయ పట్టణాల్లో, 96వ స్థానంలో నిలిచింది. అంటే అంత తీసికట్టులో ఉంది. అక్కడ సౌకర్యాలు పెంచడానికి కృషి లేకపోయినా, పేరు మార్చి ఘనకార్యంగా భావిస్తోంది ఆ ప్రభుత్వం. అయినా ఆ బ్రహ్మచారి ముఖ్యమంత్రికి బారసాల కార్యక్రమాలు కొత్తేమి కాదు. వీధులు పేర్లు, వాడల పేర్లు వందల కొద్దీ మార్చేస్తున్నారు. అంతగా మాట్లాడితే అక్కడంతా అదే తీరు. మాయావతి ముఖ్యమంత్రిగా జిల్లాల పేర్లు మార్చేస్తే, తరువాత పదవిలోకి వచ్చిన అఖిలేష్ మళ్లీ వాటిని మార్చారు. ఈ అనవసర నామకరణం, బారసాల కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా స్ఫూర్తిగా తీసుకొనే ప్రమాదం కనబడుతోంది. అదే బాధాకరం. నగరాలు, పట్టణాల పేర్లను మార్చడంలో రికార్డు సృష్టిస్తున్న పాలకులు వాటి అధ్వాన పరిస్థితులను కూడా కాస్త పట్టించుకుంటే బావుంటుంది కదా!
డా‘‘ డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం
Published Thu, Oct 18 2018 1:27 AM | Last Updated on Thu, Oct 18 2018 1:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment