భారీ విషాదం జరగాలని కోరుకున్నారు
ఖర్గే, ఆఖిలేష్ యాదవ్‌పై యూపీ
సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపాటు
ప్రయాగ్‌రాజ్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తోపాటు సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే కొందరు వ్యక్తులు మహా కుంభమేళాలో భారీ విషాదం జరగాలని కోరుకున్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు. ఆయన బుధవారం ప్రయాగ్‌రాజ్‌లో మీడియాతో మాట్లాడారు. ఇక్కడ జరుగుతున్న సనాతన ధర్మ వేడుకను చూసి దేశ ప్రజలు గర్వస్తున్నారని చెప్పారు. కొందరు దుష్టులు మాత్రం ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కుంభమేళా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజల్లో అనుమానాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.
ఖర్గే, అఖిలేష్ యాదవ్‌లు పార్లమెంట్‌లో మాట్లాడిన మాటలు చూస్తే వారి అసలు అజెండా ఏమిటో తెలిసిపోయిందని అన్నారు. కుంభమేళాపై వారు మొదటి నుంచే దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమాన్ని అప్రతిష్టపాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై అధికారులు ఇచ్చిన గణాంకాలనే తాను విడుదల చేశానని తెలిపారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదన్నారు. తొక్కిసలాటపై సమాచారం అందిన వెంటనే తమ ప్రభుత్వం చాలా వేగంగా స్పందించిందని చెప్పారు.
విశ్వాసానికి, సనాతన ధర్మానికి కుంభమేళా ఒక ప్రతీక
అయోధ్యలో రామమందిర నిర్మాణం, ప్రజలకు కోవిడ్–19 వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం పట్ల అసంతృప్తితో ఉన్న కొన్ని గ్రూప్‌లు మహా కుంభమేళాను వ్యతిరేకిస్తున్నాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. ఆయన మంగళవారం సాయంత్రం ప్రయాగ్‌రాజ్‌లోని జగద్గురు రమణానందాచార్య స్వామి రామ్ భద్రాచార్య క్యాంప్‌ను సందర్శించారు. 151 కుండ్లీ అఖండ్ భారత్ సంకల్ప్ మహా యజ్ఞంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.
మన విశ్వాసానికి, సనాతన ధర్మానికి మహా కుంభమేళా ఒక ప్రతీక అని ఈ సందర్భంగా స్పష్టంచేశారు. మన ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటుతున్న గొప్ప వేడుక అని అన్నారు. లక్షలాది మంది సాధువులు, యోగులు సనాతన ధర్మాన్ని చక్కగా కాపాడుతున్నారని చెప్పారు. మారీచులు, సుబాహులు మన సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేరని తేల్చిచెప్పారు. కుంభమేళాలో ఇప్పటిదాకా 38 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment