
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో కీలక ఘట్టానికి తెర లేచింది. రాజకీయ యుద్ధ మేఘాలు దట్టంగా అలముకున్నాయి. తదుపరి లోక్‌సభ ఎన్నికలకు అతి సమీపంలో జరుగుతున్న ఈ ఎన్నికలు ముఖ్యంగా జాతీయ పార్టీలకు అగ్ని పరీక్ష. హస్తినలో పాగా వేయడానికి అవసరమైన పోరాడే స్థైర్యం, నైతిక బలం ఇచ్చే ఈ ఎన్నికల ఫలితాలపై బీజేపీ, కాంగ్రెస్ ఆశలు పెట్టుకోవడంలో ఆశ్చర్యం లేదు.
ఆయా రాష్ట్రాల పార్టీ నాయకత్వం కన్నా మోదీ, రాహుల్ నాయకత్వాలకు ఈ ఎన్నికలే లిట్మస్ పరీక్ష. మిజోరం, తెలంగాణ మినహా మిగతా మూడు రాష్ట్రాలు బీజేపీ పాలనలో ఉన్నాయి. వాటిని నిలుపుకోవడం వారికి అత్యవసరం. అయినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభావంతో అది కష్టసాధ్యంగా కనిపిస్తోంది. మరోవైపున ఆ మూడు రాష్ట్రాలను చేజి క్కించుకోవడం చెయ్యి గుర్తు కాంగ్రెస్‌కి అత్యంత కీలకం. రాజకీయ అవసాన దశలో ఉన్న ఆ పార్టీ ఐదు రాష్ట్రాల్లో కనీసం మూడు, హీనపక్షం రెండు, రాజస్తాన్, మధ్యప్రదేశ్ అయినా గెలుచుకుంటేనే వచ్చే సాధారణ ఎన్నికల్లో జాతీయ పార్టీగా మనగలుగుతుంది. లేదంటే ప్రాంతీయ పార్టీ స్థాయికి కుచించుకుపోతుంది. ప్రస్తుతానికి ఇతర పార్టీలు దానితో కలిసి రాకున్నా ఆ మూడు రాష్ట్రాల్లో వాతావరణం దానికే అనుకూలంగా ఉంది. తెలంగాణలో కూటమిగా అధికార తెరాసకు బలమైన పోటీదారు. కాబట్టి నాయకుడిగా రాహుల్ గాంధీకి ఇక్కడ గెలుపు చాలా అవసరం. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ప్రస్తుతానికి మోదీకి నష్టం ఏమీ లేకున్నా, నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. వ్యతిరేక కూటమి బలోపేతం కావడానికి ఊతం దొరుకుతుంది. కాబట్టి హస్తిన పార్టీలు రెండూ ఈ ఐదు ఊళ్ళు ఇమ్మంటున్నాయి.
తెలంగాణలో మాత్రం ఎన్నికల ఫలితాలు అటు కాంగ్రెస్‌కూ, ఇటు తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా అగ్నిపరీక్షే. అన్నిపక్షాల్లో అపరిమితంగా ఆశలు రేపుతున్న ఈ ఎన్నికల్లో తెలం గాణ ప్రజల మొగ్గు ఎటువైపు అన్నది తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది. కానీ ప్రజలకు మాత్రం మళ్లీ లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకూ కునుకు పట్టదు. ఎన్నికల కోడ్ ఫలితంగా ఇక ప్రచారాలు, హామీలు, తిట్లూ, దీవెనలే తప్ప నిఖార్సయిన పనులు, పథకాలకు బ్రేకులు పడ్డట్టే.
నర్సింగ్ యాదవ్, నాచారం, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment