భావజాలం రగిలించిన ఘర్షణలు | Aunindyo Chakravarty Guest Column On Religious Violence | Sakshi
Sakshi News home page

భావజాలం రగిలించిన ఘర్షణలు

Published Sat, Feb 29 2020 12:02 AM | Last Updated on Sat, Feb 29 2020 12:03 AM

Aunindyo Chakravarty Guest Column On Religious Violence - Sakshi

నాటి ప్రధాని ఇందిర హత్యానంతరం సిక్కులపై పనిగట్టుకుని చేసిన విషప్రచారం కారణంగా 1984లో మూక భయంకరదాడులకు పాల్పడింది. 35 ఏళ్ల తర్వాత సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై బీజేపీ నేత కపిల్‌ మిశ్రా విద్వేష ప్రసంగం మరోసారి మూకదాడులకు దారితీసింది. ఆనాడు ఢిల్లీలో జరిగిన ఘోర దాడులు, నేడు ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాకాండ సందర్భంగా.. పోలీసులు చేష్టలుడిగి నిమిత్తమాత్రులుగా ఉండిపోయారు. మూక మనసత్వంతో ఘర్షణలకు పాల్పడిన యువతలో చాలామంది రాజ్యం దన్నుతో తీవ్రమైన ముస్లిం వ్యతిరేక భావజాలాన్ని పుణికిపుచ్చుకుంటూ పెరిగారు. ముస్లింలు చావడానికి సిద్ధపడాలని ఛాందసవాదులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. మొత్తం మీద మెజారిటీ వర్గ దురభిప్రాయాలతో కూడిన తప్పుడు పక్షం వైపు నిలబడకూడదన్న స్పృహను మన నేతలు కోల్పోయారు. ఇలాంటి పిరికి మనస్తత్వంతో కూడిన రాజకీయాల దుష్ఫలితాలు రానున్న తరాల్లో కానీ స్పష్టమైన రూపం తీసుకోవు.

ఢిల్లీ నగరంలో 1984లో సిక్కు వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాల్లో ఒకటి ఏమిటంటే నగరవ్యాప్తంగా పుకార్లను శరవేగంగా వ్యాప్తి చెందించడం. సిక్కులు ఢిల్లీ నగర నీటి సరఫరా చానల్స్‌లో విషం కలిపారని, పంజాబ్‌లో హత్యకు గురైన హిందువుల శవాలను రైళ్లలో కుక్కి ఢిల్లీకి పంపుతున్నారనే స్థాయి పుకార్లను నాటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం వ్యాపింపచేశారు. అప్పట్లో వాట్సాప్‌ ఉండేది కాదని గుర్తుంచుకోవాలి. పుకార్లను ఒకరి నుంచి ఒకరికి వ్యాపింపజేసేవారు. ఇందిర హత్య ఘటన జరి గిన 24 గంటలలోపే ఢిల్లీని ఈ రకమైన పుకార్లు ఆరకంగానే చుట్టుముట్టాయి. ఢిల్లీ పోలీసులు కూడా ఈ పుకార్ల వ్యాప్తికి తమవంతు పాత్ర పోషించారు.

పోలీసులే కొన్ని ప్రాంతాలకు వాహనాల్లో వచ్చి లౌడ్‌ స్పీకర్ల ద్వారా పంజాబ్‌ నుంచి శవాలతో కూడిన రైళ్లు వస్తున్నాయని, నగరంలో తాగునీటిలో విషం కలుపుతున్నారని గట్టిగా అరుస్తూ ప్రచారం చేశారని అప్పట్లో కొన్ని నిజనిర్ధారణ కమిటీలు నిర్ధారించాయి.  కొన్ని ప్రాంతాల్లో అయితే పోలీసు అధికారులు ఇంటి తలుపులు తట్టి జనాన్ని లేపి తాగు నీటిని తాగవద్దని మరీ సలహా ఇచ్చేంతవరకు వ్యవహారం సాగింది. పోలీసులకు, వ్యవస్థీకృత మూకలకు మధ్య అసాధారణమైన కుమ్మక్కుకు ఇదొక స్పష్టమైన ఉదాహరణ. ఆనాడు సిక్కులను ఢిల్లీలో ఊచకోత కోస్తున్నప్పుడు పోలీసులు పత్తా లేకుండా పోయారని, లేక ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారని లేక ఆ హత్యాకాండలో తామూ స్వయంగా పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు నిర్ధారించారు.

1984 ఘర్షణలు వ్యాపించిన కీలక ప్రాంతాల్లో ఒకటైన త్రిలోక్‌పురిలో పోలీసులే మూకలకు రక్షణగా వచ్చారని, తమ వాహనాల్లోని ఇంధన ట్యాంకులను ఖాళీ చేసి అమాయకులను, ఇళ్లను, దుకాణాలను తగులబెట్టడానికి అవసరమైన డీజిల్‌ను స్వయంగా అందించారని అప్పట్లోనే వార్తలొచ్చాయి. సిక్కు యువతులను దుండగులు సామూహిక అత్యాచారం చేస్తున్నప్పుడు అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసులను ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులు వెనక్కు రప్పించారని, సుల్తాన్‌పురి ప్రాంతంలో ఒక పోలీసు అధికారి ఇద్దరు సిక్కులను స్వయంగా చంపాడని కూడా అప్పట్లో నివేదికలు వచ్చాయి. ఆనాడు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఘర్షణలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయడానికి కూడా పోలీసులు తిరస్కరించారు. తమ పొరుగున ఉన్న సిక్కు ప్రజలకు హిందువులు రక్షణగా నిలబడి పోలీసు ఠాణాలకు తోడుకెళ్లి ఫిర్యాదు చేయిస్తే మీ మతస్తులకోసం పోరాడండ్రా అంటూ అక్కడి పోలీసులు సలహాఇచ్చిన ఘటనలు కూడా నమోదయ్యాయి.

ఒకవైపు హింసోన్మాదులను స్వేచ్ఛగా వది లిపెడుతూ మరోవైపు శాంతియాత్రలు చేస్తున్నవారిని ఎక్కడికక్కడ నిలిపివేశారు. పైగా, ఘర్షణలను నిరోధించాలని చూసిన కొందరు పోలీసులకు తమ సీనియర్‌ అధికారులు ఏమాత్రం సహకరించలేదు. పోలీసులు తమకు తాముగా ఆ ఘర్షణల పట్ల అలా స్పందించారన్న ముసుగులో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక ఘటనలపై అధికారులు శీతకన్ను వేశారు. అందరూ ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలే ఆ హింసాకాండకు మొత్తంగా పథకరచన చేసి అమలు చేశారని బాధితులు, ప్రత్యక్షసాక్షులు, జర్నలిస్టులు, పౌర బృందాలు ఏకకంఠంతో చెప్పారు. ఆనాడు చుట్టుపక్కల గ్రామాలనుంచి, రీసెటిల్‌మెంట్‌ కాలనీలనుంచి గూండాలను టూవీలర్లలో, టెంపో వ్యాన్లలో, ట్రక్కులలో తీసుకొచ్చి హింసకు ప్రేరేపించారు. చివరకు డీటీసీ బస్సులలో కూడా ఒకచోటినుంచి ఒకచోటికి గూండాలను తరలించి హింసకు పాల్ప డ్డారు.

స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు తమ తమ నివాస ప్రాంతాల్లో సిక్కు కుటుంబాలకు చెందిన ఇళ్లకు గుర్తు పెట్టి మరీ రంగం సిద్ధం చేశారు. తర్వాత పోలీ సులు తీరుబడిగా మూకతో వచ్చి అలా గుర్తు పెట్టి ఉన్న ఇళ్లపైపడి మృత్యుతాండవం చేయించారు. ఆ విషాద సమయంలో సిక్కు వితంతువులకు ఉపశమన చర్యల్లో పాల్గొన్న కొందరు వ్యక్తులు ఆనాడు వారి దిగ్భ్రమను ప్రపంచానికి చాటి చెప్పారు. అన్నాళ్లూ తమ పొరుగునే ఉంటూ పలకరించిన వారే తమను విద్రోహులుగా ముద్రవేసిచూడటం కలిచివేసిందని భర్తల్ని పోగొట్టుకున్న వితంతువులు పేర్కొన్న వైనాన్ని చరిత్రకారిణి ఉమా చక్రవర్తి రాశారు. ఆ దహనకాండ ఎంత ఆకస్మికంగా సంభవించిందంటే ఆ వాస్తవాన్ని జీర్ణం చేసుకోవడానికి బాధితులకు ఏళ్ల సమయం పట్టింది. ఒక్క రాత్రిలోనే వారు ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్‌పట్ల విశ్వాసాన్ని కోల్పోయారు.
అందుకే పైకి రెండు ఘటనల మధ్య సాదృశ్యం ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఇప్పుడు ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాకాండకు, 1984లో సిక్కువ్యతిరేక హింసాత్మక దాడులకు మధ్య పోలికలు తీసుకురావడం సమస్యను పక్కదారి పట్టిస్తుంది.

ఈ రెండు ఘటనల్లో పోలీసులు చేష్టలుడిగి నిమిత్తమాత్రులుగా ఉండిపోయారు, ఈ వారం జరిగిన ఘర్షణల్లో కూడా ఏదోమేరకు ముస్లింల ఇళ్లు, షాపులు, కార్లను గుర్తు పెట్టి మరీ దాడి చేయడానికి పథకం పన్నిన ఘటనలు చోటు చేసుకున్నట్లు మనకు తెలుసు. కానీ ఈ రెండు ఘటనల మధ్య పోలిక ఇంతటితోనే ఆగిపోతుంది. 1984 నాటి హింసాత్మక ఘటనల్లో కాంగ్రెస్‌ నేతల పాత్రకు సంబంధించి విస్తృతంగా సాక్ష్యాలు లభించినప్పటికీ నేటి ఢిల్లీ ఘర్షణల్లో అంతవేగంగా మంటలు చెలరేగడం తమను సైతం నివ్వెరపర్చిందని బీజేపీ నేతలే చెబుతున్నట్లు నేను మాట్లాడిన రిపోర్టర్లు తెలిపారు. అందుకే ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారీ ఇటీవలి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని తట్టుకోలేక తమ పార్టీనేత కపిల్‌ మిశ్రా చేసిన విద్వేష ప్రసంగాన్ని తప్పు పట్టాల్సి వచ్చింది. అంతే కాకుండా మిశ్రాను పార్టీ పదవి నుంచి తొలగించాలని కూడా తివారీ చెప్పారు. తివారీ అలా మాట్లాడిన కొన్ని గంటల్లోపే కపిల్‌ మిశ్రా తన మద్దతుదారులతో ర్యాలీ తీయడమే కాకుండా ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్‌లో తిష్టవేసిన సీఏఏ వ్యతిరేక నిరసనకారులను డిల్లీ పోలీసులు తక్షణం తొలగించనట్లయితే తాను వీధుల్లోకి వస్తానని తీవ్ర హెచ్చరిక చేశాడు. మిశ్రా ప్రసంగం తర్వాత కొన్ని గంటల్లోపే అంటే మరుసటి దినం ఉదయాన్నుం పూర్థి స్థాయి ఘర్షణలు చెలరేగాయి. 

బీజేపీలో విభేదాలు తివారీ, మిశ్రాలకే పరిమితం కాలేదు. భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ కూడా మిశ్రా చేసిన విద్వేష ప్రసంగం ఆమోదనీయం కాదని, తనపై కఠిన చర్య తీసుకోవాలని చెప్పాడు. కానీ బీజేపీ ఢిల్లీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్‌ జాజు మిశ్రాను వెనకేసుకు రావడమే కాకుండా మిశ్రా ప్రసంగం శాంతికి పిలుపుగా వర్ణించాడు. గంభీర్‌ను సమర్థించాలా లేక మిశ్రాను సమర్థించాలా అనే విషయంపై పార్టీ ట్విట్టర్‌ విభాగం కూడా చీలిపోవడాన్ని చూస్తే బీజేపీలో విభజన ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇక క్షేత్ర స్థాయిలో సైతం, మూక హింసపై స్థానిక స్థాయిలోని బీజేపీ నేతలు రెండుగా చీలిపోయారని వార్తాహరులు చెబుతున్నారు. కొందరు మూకహింసను సమర్థించగా, మరికొందరు ముస్లిం కుటుంబాలను కాపాడటంలో మునిగిపోయారు. 1984లో స్వయంగా కాంగ్రెస్‌ నేతలే తమ కార్యకర్తలను హింసాత్మక ఘర్షణలవైపు నడిపించగా, ఇటీవలి ఢిల్లీ ఘర్షణలు కింది స్థాయి నుంచి ప్రేరేపితం కావడం గమనార్హం. మూక మనస్తత్వంతో ఘర్షణలకు పాల్పడిన యువతలో చాలామంది తీవ్రమైన ముస్లిం వ్యతిరేక భావజాలాన్ని పుణికిపుచ్చుకుంటూ పెరిగారు.

ఏ పార్టీకి ఓటేసినా వీరంతా హిందుత్వ భావజాలంతోనే ఐక్యమయ్యారు. కపిల్‌ మిశ్రా కూడా గతంలో ఆప్‌ పార్టీకి చెందినవాడే కదా. ఒక రీతిలో 2020 ఘర్షణలు 1984 ఘర్షణలకు కొనసాగింపు అని చెప్పవచ్చు. ఆనాడు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్‌ పార్టీ నేతలు రెచ్చగొట్టిన తీవ్ర హింసాకాండ ఫలితంగా సిక్కు కుటుంబాలు తమ జీవితాలను పునర్నిర్మించుకునే క్రమంలో ప్రభుత్వంపై, రాజకీయ పార్టీలపై, న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు. మరోవైపున రాజ్యానికి సంబంధించిన పలు విభాగాలు తమవైపు ఉన్నాయని హిందువులు విశ్వసించడం ప్రారంభించారు. ఒక మతానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరించినప్పుడు అది హిందువులను కాపాడటానికేనని వీరు నమ్మసాగారు. గత కొన్నేళ్లుగా ఈ సెంటిమెంట్‌ మరింత పెరుగుతూ వచ్చింది. అందుకే పోలీసులు తమ వైపు ఉన్నారనే భావనతో హిందూ మూకలు కెమెరా ముందుకు ధైర్యంగా వచ్చి ఘర్షణలకు పాల్పడ్డారు. పైగా కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు వచ్చాయి కాబట్టి ముస్లింలు చావడానికి సిద్ధపడాలని ఛాందసవాదులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. మొత్తం మీద రాజకీయనేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మెజారిటీ వర్గ దురభిప్రాయాలతో కూడిన తప్పుడు పక్షం వైపు నిలబడకూడదన్న స్పృహ కోల్పోయారు. ఇలాంటి పిరికిమనస్తత్వంతో కూడిన రాజకీయాల ఫలితాలు రానున్న తరాల్లో కానీ స్పష్టమైన రూపం తీసుకోవు.
    -అనింద్యో చక్రవర్తి, సీనియర్‌ జర్నలిస్టు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement