సోషల్‌ మీడియా ‘ఫోబియా’ | C Ramachandraiah Opinion On Social Media Phobia | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా ‘ఫోబియా’

Published Wed, Mar 21 2018 9:34 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

C Ramachandraiah Opinion On Social Media Phobia - Sakshi

ఇంతకాలం తమ రాతల ద్వారా ప్రజాభిప్రాయాన్ని కొన్ని పార్టీలకు, వ్యక్తులకు అనుకూలంగా మలచడంలో తలమునకలుగా ఉన్నవారు తాము కల్పిస్తున్న ‘భ్రమలు’ సోషల్‌ మీడియా కారణంగా తొలగిపోతాయని భయపడుతున్నారు.

తెలుగునాట సోషల్‌ మీడియా ఓ మాఫియాగా మారిపోతోందని కొందరు తెగ బాధపడిపోతున్నారు. పనిగట్టుకొని సాగిస్తున్న సోషల్‌ మీడియా దుష్ప్రచారం కొందరు ప్రముఖులకు ప్రాణ సంకటంగా మారిందన్నది వారి ప్రధాన ఆరోపణ. ఇంతకాలం ప్రధానస్రవంతి మీడియా ఏకచత్రాధిపత్యంగా రాజ్యమేలింది. ఇపుడు ఆ పరిస్థితి మారింది. ప్రధాన స్రవంతి మీడియా (మొత్తం కాదు) చేస్తున్న వక్రీకరణలు, వండివారుస్తున్న కథనాలు, నిజాలుగా చెలామణి చేస్తున్న అసత్య వార్తల వెనుకనున్న గుట్టుమట్లను సోషల్‌ మీడియా ఎత్తి చూపిస్తున్నది. నిజాలేమిటో గ్రహించడానికి ఈ రోజు ప్రజలకు ఓ ప్రత్యామ్నాయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. బహుశ ఆ దుగ్ధతోనే కాబోలు ప్రధాన స్రవంతి మీడియాకి చెందిన కొందరు ‘సోషల్‌ మీడియా’ మొత్తాన్ని ఓ భూతంగా, మాఫియాగా చిత్రీకరిస్తున్నారు.

ఏపీ విషయంలో ‘సోషల్‌ మీడియా’ నిర్వర్తిస్తున్న పాత్రను విశ్లేషించి చూసినపుడు అది మాఫియానా? లేక ప్రజలకు మేలు చేస్తున్న మీడియానా? అన్నది అర్థమవుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల అసెంబ్లీలో ప్రసంగిస్తూ ‘‘దేశంలోని రాజకీయ వేత్తల్లో నా అంత సీనియర్‌ ఎవరూ లేరు’’ అని ప్రకటించుకున్నారు. దేశంలోని సీనియర్‌ రాజకీయ వేత్తల్లో బాబు ఒకరేగానీ.. ఆయన సీనియర్‌ మోస్ట్‌ కాదు. ఈ వాస్తవాన్ని మాజీ పార్లమెంట్‌ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సోషల్‌ మీడియా ద్వారా తాను ప్రజలకు తెలియపర్చకపోతే.. అసెంబ్లీ సాక్షిగా బాబు చెప్పిన అబద్ధమే నిజంగా చెలామణి అయిపోయేది.

ముందూవెనుకా ఆలోచించకుండా బాబు తనకి సంబంధించి ఇటువంటి అనేక అసత్యాలను గతంలో ప్రచారం చేశారు. తాజాగా ఏపీ ప్రత్యేకహోదాకు సంబంధించి బాబు పలు సందర్భాలలో మాట మార్చారు. ఆయన ఏయే సందర్భాలలో ఏ విధంగా మాట మార్చిందీ వీడియో క్లిప్పింగ్‌ సాక్ష్యాలతో సోషల్‌ మీడియా ద్వారా ప్రజలు తెలుసుకోగలిగారు. అదేవిధంగా 2017 కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా.. మీడియా సాక్షిగా బాబు ‘‘రాష్ట్రానికి అన్నీ వచ్చాయి.. ఇంతకంటే ఎక్కువ ఎవరిస్తారు?’’ అంటూ చెప్పిన మాటల్ని హెడ్‌లైన్స్‌లో ప్రచురించిన వార్తా పత్రికల క్లిప్పింగులు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ కావడంతో.. అధికార పార్టీ నేతల గొంతుకల్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయింది. ప్రజలకిచ్చిన హామీల విషయంలోగానీ, ప్రత్యేకహోదా ప్యాకేజీల అంశాల్లోగానీ పూటకోమాట, రోజుకో విధానం అవలంభించే బాబు లాంటి రాజకీయనాయకుల ఊసరవెల్లి విన్యాసాల్ని సోషల్‌ మీడియా ద్వారా సామాన్య ప్రజలు చూస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు.
 
 ‘సోషల్‌ మీడియా’ను భూతంగా చూపుతున్న ప్రధాన స్రవంతి మీడియాలోని ఓ వర్గం  రాజకీయ నాయకుల ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించడం ఎప్పుడో మానేసింది. అధికారంలో  ఉన్న వారు ఏం చెప్పినా బుద్ధిగా వినడం, రాయడం.. దానిని ప్రజలకు చేరవేయడమే వాటి బాధ్యతగా మారింది. ఇటీవల బాబు.. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చ లేదని; తాను పరమ పవిత్రంగా రాజకీయాలు చేస్తున్నందునే హాయిగా నిద్రపోగలుగుతున్నానని కొన్ని పత్రికలకు, కొన్ని చానెళ్లకు చెప్పారు. ఆయన మాటల్లోని అసంబద్ధతను రిపోర్టర్‌లు ప్రశ్నించలేదు. బాబు అడ్డంగా దొరికిపోయిన ఓటుకు నోటు కేసును ఆ ప్రతినిధులు ప్రస్తావించలేదు. ఎందుకు అడ్డదారుల్లో ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయాల్సి వచ్చిందో అడగలేదు. బాబు ఏం చెప్పినా అదే శిరోధార్యంగా.. అబద్ధాలను నిజాలుగా జనం మీదకు వదిలే ‘మీడియా’ను ఏమనాలి?

అధికారంలోకి వచ్చాక రైతులకు బేషరతుగా చేస్తానన్న రుణమాఫీపై బాబు మాట మార్చారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అనేక హామీలకు మంగళం పాడారు. గతంలో ఇలాంటి విమర్శలు వస్తే వాటిని అవలీలగా తిప్పికొట్టగలిగేవారు. కానీ, నేడు సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి కనుక ఇబ్బందిపడుతున్నారు. ఇక, అమరావతి నిర్మాణానికి సంబంధించి బాబు చేస్తున్న డొల్ల ప్రకటనలు.. సింగపూర్‌ను మించిన రాజధాని, టోక్యోను మించిన రాజధాని, న్యూయార్క్‌ను తలదన్నే రాజధాని అంటూ ఏ దేశం వెళితే ఆ దేశాన్ని మించిన రాజధాని కడతానంటూ చేసిన ప్రకటనలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఇంతకాలం తమ రాతల ద్వారా ప్రజాభిప్రాయాన్ని రాజకీయంగా కొన్ని పార్టీలకు, వ్యక్తులకు అనుకూలంగా మలచడంలో తెలుగునాట తలమునకలుగా ఉన్నవారు తాము కల్పిస్తున్న ‘భ్రమలు’ సోషల్‌ మీడియా కారణంగా తొలగిపోతాయని ఇప్పుడు భయపడుతున్నారు. అందుకే సోషల్‌ మీడియా ఫోబియాతో దానిని ఓ మాఫియాగా చిత్రీకరిస్తున్నారు. సోషల్‌ మీడియాను దుర్వినియోగపర్చేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. అయితే, మొత్తం సోషల్‌ మీడియానే లేకుండా చేయాలన్న ప్రయత్నాలు మంచిదికాదు. వాస్తవాల విశ్లేషణకు నేడు సోషల్‌ మీడియానే సామాన్యులకు దిక్కుగా మారిందనడం అతిశయోక్తికాదు.

- సి. రామచంద్రయ్య
వ్యాసకర్త మాజీ ఎంపీ
ఫోన్‌: 81069 15555

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement