
నిన్న మొన్నటి వరకు మూర్తీభవించిన ఆత్మవిశ్వాసం ఉట్టిపడేలా కనిపించిన బీజేపీ అగ్రనాయకత్వానికి ఒక్కసారిగా వెన్నులో వణుకు మొదలైంది. సమీప భవిష్యత్తులో తమకు ఓటమే ఉండని పార్టీగా చెప్పుకొంటున్న బీజేపీకి ఎదురుగాలి పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచే మొదలైంది. మూడున్నరేళ్ల ముందు లక్షా 34 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన బీజేపీ అభ్యర్థి వినోద్‌ఖన్నా హఠాన్మరణం చెందడం వల్ల వచ్చిన ఉప ఎన్నికలో.. ప్రజలు ఎటువంటి సానుభూతి చూపకుండా ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థికి ఏకంగా లక్షా 90 వేల మెజార్టీ అందించిన సంఘటన అపూర్వం. గురుదాస్‌పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారని చెప్పుకొనే కంటే, అక్కడి ప్రజలు బీజేపీని కసితో ఓడించారని చెప్పుకోవడం సమంజసంగా ఉంటుంది.
నిజానికి, గురుదాస్‌పూర్ ఎన్నికల ఫలితం వెలువడటానికి ముందే బీజేపీ తన కలవరపాటును బహిర్గతపర్చింది. హిమాచల్ ప్రదేశ్‌తోపాటు గుజరాత్‌కు ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి సిద్ధమైన కేంద్ర ఎన్నికల ప్రధాన సంస్థ (సీఈసీ)పై ఒత్తిడి తెచ్చింది. ఎప్పుడో 4 నెలల క్రితం జూలైలో వచ్చిన వరదలకు సంబంధించిన పనులు గుజరాత్‌లో జరుగుతున్నాయి కనుక ఈ తరుణంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే.. ఆ పనులకు ఆటంకం కలుగుతాయంటూ కుంటిసాకులు చెప్పి సీఈసీపై ఒత్తిడి తెచ్చింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీల కారణంగా గుజరాత్‌లోని వ్యాపార వర్గాలు, వస్త్ర వ్యాపారంపై ఆధారపడిన కార్మికులు బీజేపీపై విముఖత పెంచుకొన్నారు. సంప్రదాయంగా బీజేపీకి మద్దతుదారులుగా నిలిచిన వారు.. ఇప్పుడా పార్టీకి గుణపాఠం చెప్పాలనుకుంటున్నట్లు పలు సర్వేల్లో తేలింది. దీంతో ఒక దశలో జీఎస్టీపై ఒక్క అడుగు కూడా వెనక్కు వేసేదిలేదంటూ మొండికేసిన ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, గుజరాత్ ఎన్నికలను, అక్కడి వ్యాపార వర్గాల ఆందోళనల్ని దృష్టిలో పెట్టుకొని చేనేత రంగంపై విధించిన శ్లాబ్‌తోపాటు గుజరాత్‌లో పేరొందిన ‘ఖాక్రా’ వంటి తినుబండారాలపై విధించిన పన్నులో కొంత సడలింపు ఇచ్చారు.
బీజేపీకి దేశంలో ఎదురుగాలి వీస్తున్న సంకేతాలు స్పష్టంగానే బయటపడ్డాయి. గుజరాత్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్‌పటేల్ రాజ్యసభకు ఎన్నిక కాకుండా చేయాలని చూశారు. ఆయన ఓటమికి పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి, ఫిరాయింపులకు పాల్పడినా ఫలితం దక్కలేదు. అహ్మద్ పటేల్ విజయం బీజేపీకి చావుదెబ్బగా విశ్లేషకులు అభివర్ణించారు. 2014లో మోదీ విజయానికి దోహదం చేసిన యువత, వర్సిటీ విద్యార్థులు ఎన్డీఏ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలతో ఉన్నారు. ప్రతి ఏడాది 2 కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోదీ.. ఈ మూడున్నరేళ్లల్లో మొత్తం 5 లక్షలకు మించి ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. ఎకనామిక్స్ టైమ్స్ సర్వే ప్రకారం ‘మేక్ ఇన్ ఇండియా’ కనీస స్థాయిలో కూడా ఉద్యోగాలు కల్పించలేకపోయింది. స్టార్టప్ ఇండియా, డిజి టల్ ఇండియాలు ఆరంభ శూరత్వంగా మిగిలిపోయాయి.
ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సూచీలను, అంకెలను అధికం చేసి చూపించడానికి.. ఇంతవరకూ అనుసరిస్తున్న విధానాలను మార్చేశారు. ఫలితంగానే, ద్రవ్యోల్బణ రేటు, ఆర్థిక వృద్ధి రేటు వాస్తవ అంకెల కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ అంకెల గారడీతో ప్రజలను ఎక్కువ కాలం నమ్మించలేరు. ముఖ్యంగా.. యువత వాస్తవాలను తెలుసుకోగలిగింది. ఫలితంగానే ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, గౌహతి యూనివర్సిటీ వంటి వాటిల్లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికలలో బీజేపీ విద్యార్థి అనుబంధ విభాగం ఏబీవీపీ చిత్తుగా ఓడిపోయింది. అసంతృప్తితో ఉన్న వివిధ వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించవలసిన బీజేపీ నాయకత్వం ప్రతిపక్షాలను దెబ్బతీయడంలో మూడున్నరేళ్లుగా తలమునకలై ఉంది. ‘ప్రతిపక్షాలనైతే నిలువరించవచ్చుననుకొన్నారు గానీ ప్రజలను ఎలా నిలువరించగలరు? అందుకే బీజేపీకి వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి.
ప్రధాని మోదీ చేసిన ‘పెద్దనోట్ల రద్దు’ ఓ పెద్ద దుస్సాహసం అని దేశంలోని ప్రతిపక్షపార్టీలే కాదు.. ప్రపంచం యావత్తూ విమర్శించింది. మోదీ తలపెట్టిన యుద్ధం పేదరికంపై కాదని, పేదల పైనేనని ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. ప్రజలకు ప్రభుత్వంపైన, బ్యాంకింగ్ వ్యవస్థపై విశ్వాసం పోయిందని న్యూయార్క్ టైమ్స్ సంపాదకీయం రాసింది. పెద్దనోట్ల రద్దు వల్ల దేశ స్థూల జాతీయోత్పత్తి 2% తగ్గుతుందని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పినట్లే.. నేడు దేశ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా తయారై.. స్థూల జాతీయోత్పత్తి 2% కంటే దిగువకు పడిపోయింది. మోదీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని బీజేపీ సీనియర్ నేతలైన అరుణ్ శౌరీ, సుబ్రమణ్యస్వామి ఇంతకుముందే ఎత్తిచూపగా తాజాగా యశ్వంత్ సిన్హా చేసిన విమర్శకు బీజేపీ వద్ద సమాధానం లేదు. అమిత్‌షా కుమారుడి అవినీతి వ్యవహారంపై బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు. తాము ఎవ్వరికీ జవాబుదారీ కాదని బహుశా మోదీ, అమిత్‌షాల ద్వయం భావిస్తూ ఉండొచ్చు. ప్రజ లకు జవాబుదారీగా ఉండకపోతే జరిగే నష్టం ఏమిటో బీటలు వారుతున్న బీజేపీని చూసిన వారికి అర్థం అవుతుంది.
- సి. రామచంద్రయ్య
వ్యాసకర్త మాజీ ఎంపీ
మొబైల్ : 81069 15555
Comments
Please login to add a commentAdd a comment