సేవామూర్తులకు ఇదేనా గౌరవం?! | Cheruku Sudhakar Article On Corona Pandemic | Sakshi
Sakshi News home page

సేవామూర్తులకు ఇదేనా గౌరవం?!

Published Sat, Apr 25 2020 2:07 AM | Last Updated on Sat, Apr 25 2020 2:07 AM

Cheruku Sudhakar Article On Corona Pandemic - Sakshi

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టాక మానవ విలువల్ని ఎత్తిపడు తున్న అనేక ఉదంతాలు జరుగుతున్నాయి. మనిషి సగర్వంగా తలెత్తుకునేలా చేస్తున్నాయి. అదే సంద ర్భంలో కొన్ని సంఘటనలు అందరినీ ఆగమాగం చేస్తూ తలదించుకునేలా చేస్తున్నాయి. ఇరవై లక్షలకు చేరు వవుతున్న కరోనా కేసులు, రెండు లక్షలకు చేరుకో బోతున్న మరణాలు ప్రపంచ ప్రజానీకాన్ని భయ పెడుతున్నాయి. భూగోళం మొత్తం మీద జానాబెత్తెడు భూమిలో తప్ప కరోనా అన్నిచోట్లా అల్లుకుపోయి హారర్‌ సినిమాను తలపిస్తోంది. చైనాలోని వుహా న్‌లో మొదలైన ఆ వైరస్‌ అన్నిచోట్లకూ విస్తరిం చింది. ఆఫ్రికాలో ప్రపంచ ప్రఖ్యాత వైరాలజిస్టు గీతా రాంజీ, బ్రిటన్‌లో నైజీరియా సామాజిక వైద్యులు అల్ఫా సాదూ, అమెరికాలో సీనియర్‌ కార్డియాలజిస్టు, తెలుగువారు నటరాజన్‌ తదితర ప్రముఖులెందరినో కరోనా మింగేసింది.

సాదూ మృతికి బ్రిటన్‌ ప్రభుత్వం నివాళులర్పించింది. మన దేశంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పేదల కాలనీలో వైద్య సేవలు అందిస్తున్న శతృఘ్న పంజ్‌వాని తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ కరోనా బారినపడి కన్నుమూశారు. ఆయనను చికిత్స కోసం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పుడు ఐసీయూలో చేర్చడానికి ఆయన సామాజిక వర్గానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు అవసరమైంది! ఆయన అంత్యక్రియలకు ప్రముఖులెవరూ హాజరు కాలేదు సరికదా కనీసం నివాళులర్పించే దిక్కు కూడా లేకుండా పోయింది. నెల్లూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ లక్ష్మీనారాయణరెడ్డి లాక్‌డౌన్‌కు ముందు వైద్య సేవలు అందిస్తూనే కరోనాతో అస్వస్థులై కన్ను మూశారు.

చెన్నైలో ఒక వైద్యుడు కరోనా రోగులకు చికిత్స చేస్తూ, అదే రోగం బారినపడి మరణిస్తే ఆయన ఖననానికి కూడా జనం అడ్డుతగిలారు. చివరకు రాత్రివేళ ఎవరికీ తెలియకుండా ఆ ప్రక్రియ పూర్తి చేయవలసివచ్చింది. ఢిల్లీ, అహ్మదా బాద్, వరంగల్‌ తదితర నగరాల్లో వైద్యులనూ, నర్సులనూ ఇళ్లు ఖాళీ చేయమని వారి ఇంటి యజ మానులు ఘర్షణ పడిన వార్తలు చూశాం. ప్రధాని నరేంద్ర మోదీ, ఆరోగ్యమంత్రి కూడా ఈ ఉదంతా లను ప్రస్తావించవలసి వచ్చింది. ప్రస్తుత సంక్షోభంలో వైద్యులు అందిస్తున్న సేవలు చూస్తుంటే చైనా–జపాన్‌ యుద్ధ సమ యంలో మన వైద్యులు చేసిన అసాధారణ సేవలు గుర్తుకొస్తాయి. తుపాకి గుళ్ల బారినపడిన సైనికు లకు శస్త్ర చికిత్సలు చేయడానికి చేతి తొడుగులు కూడా లేని ఆ సమయంలో ద్వారకానాథ్‌ శాంతా రామ్‌ కొట్నీస్‌ ఎన్నో ఆపరేషన్లు నిర్వహించారు. ఆ క్రమంలో ఆయన సెప్టిసీమియా బారినపడి చని పోయారు. ఇలాంటి ధైర్యసాహసాలు కలిగిన వైద్యులు అప్పుడే కాదు... ఇప్పుడూ వున్నారని వర్త మాన సంక్షోభం నిరూపిస్తోంది. 

అటువంటివారు అదే వ్యాధిబారిన పడి చని పోయినప్పుడు కనీసం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలన్న ధ్యాస పాలకులకు లేకుండాపోయింది. ఎంతో కర్తవ్యనిష్టతో పనిచేసి ప్రాణాలు కోల్పోతున్నవారిని ఇలా అనామకు లుగా, అవమానాల మధ్య వీడ్కోలు పలకడం న్యాయమేనా అని మనలను మనం ప్రశ్నించు కోవాలి. మట్టిలో కలిసే వేల ప్రాణాలను నిలబెట్టే డాక్టర్‌ చనిపోతే మట్టిలో కప్పడానికి కుస్తీ పడాలనా? అద్భుతమైన, అనన్యమైన, అసమా నమైన త్యాగాలు చేసేవారికి మనం అర్పించ వలసిన నివాళులు ఇలాగేనా? మృతదేహం నుంచి వైరస్‌ సోకే ప్రమాదం చాలా తక్కువని ప్రముఖ వైరాలజిస్టులు చెబుతున్నా మనుషులు ఇలా మూర్ఖత్వంతో దాడులకు దిగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

అమెరికాలో మన దేశానికి చెందిన డాక్టర్‌ ఉమా మధుసూదన కరోనా రోగులకు చేసిన వైద్య సేవలు గుర్తించి 200 కార్లతో ర్యాలీ జరిపి ఆమెకు వినూత్న రీతిలో రోగులు, రోగుల కుటుంబాలకు చెందినవారు, స్థానికులు తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇకపోతే చైనాలోని జుహై నగరంలో వైద్య సేవలందించిన వైద్యులకు 300 డ్రోన్లతో అపూర్వ స్వాగతం పలికారు. చావుకు తెగించి సేవలం దిస్తున్న మన డాక్టర్లకు మరణానంతర పురస్కా రాలు, కిరీటాలేమీవద్దుగానీ అంతిమ సంస్కారం కాస్త గౌరవంగా జరిగేటట్లు చూడటం మన సమా జానికి గౌరవాన్ని తెస్తుంది.


డా. చెరుకు సుధాకర్‌
వ్యాసకర్త తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు
మొబైల్‌ : 98484 72329

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement