పౌరసత్వ సవరణ చట్టం దళితులకే వరం | Chintha Sambamurthy Writes Special Story On CAA | Sakshi
Sakshi News home page

పౌరసత్వ సవరణ చట్టం దళితులకే వరం

Published Tue, Mar 17 2020 12:49 AM | Last Updated on Tue, Mar 17 2020 12:49 AM

Chintha Sambamurthy Writes Special Story On CAA - Sakshi

పౌరసత్వ సవరణ చట్టం– 2019 పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో మతహింసను ఎదుర్కొంటున్న మైనార్టీ సముదాయాలకు వరం. ఆ దేశాల్లో మతహింసను తట్టు కోలేక ఎంతోమంది భార త్‌లో ఆశ్రయం పొందుతు న్నారు. వీరిలో 80 శాతం మంది షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు చెందినవారేనని అంబేడ్కర్‌ గణాంకాలతో వివరణ ఇచ్చారు. బెంగాల్‌ లోని నామసూద్రులలో అత్యధికంగా ఉన్న మాతువ ప్రజల పరిస్థితి హృదయ విదారకమే. పాండ్రా క్షత్రియ, మహి వంటి వారు షెడ్యూల్డ్‌ కులాలకు చెందినవారే. దేశ విభజన సమయంలోనే వారు భారత్‌ రాకుండా అప్పటి నాయకత్వం బలవంతంగా ఆపింది. మహ్మద్‌ అలీ జిన్నా తదితరులు వారి భద్రత విషయంలో హామీ ఇచ్చారు. దానికి తోడుగా కొంత మంది దళిత నాయకులు వారి రాజకీయ ప్రయోజ నాల కోసం, దళితులకు స్వేచ్ఛ, సమానత్వం పాకి స్తాన్‌లోనే ఉంటాయని మాట్లాడారు. 

దేశ విభజన సమయంలో అంబేడ్కర్, జోగేంద్ర నాథ్‌ మండల్‌ ఇరువురూ దళిత నాయకులు. అంబే డ్కర్‌ రాష్ట్రీయ నిష్ఠకు ప్రతీక. కానీ మండల్‌ను పాకి స్తాన్‌ ప్రధాని చేస్తామని జిన్నా ఆశలు కల్పించారు. దీంతో ఆయన విభజనకు అనుకూలంగా నిలబ డ్డారు. మండల్‌ వెనక పెద్ద సంఖ్యలో దళితులు ఉన్నారు. వారంతా పాకిస్తాన్‌లోనే ఉండిపోయారు. దళితులంతా భారత్‌ రావాలంటూ మండల్‌ను ఒప్పించడానికి అంబేడ్కర్‌ చేసిన ప్రయత్నాలు విఫల మైనాయి. మత రాజ్యాలలో అణగారిన వర్గాలకు స్థానం ఉండదని ఆనాడే అంబేడ్కర్‌ చెప్పారు. పాకి స్తాన్‌ నుండి ఏ దారి దొరికితే ఆ దారి ద్వారా భారత్‌కు రావాలని పిలుపునిచ్చారు. 

జోగేంద్రనాథ్‌ మండల్‌ పాకిస్తాన్‌ తొలి న్యాయ శాఖమంత్రి అయ్యారు. విభజనానంతరం అక్కడ  హిందువులపై మతహింస ప్రజ్వరిల్లింది. మత హింసకు గురైన ప్రదేశాలను సందర్శించిన మండ ల్‌ను పరిస్థితులు కలచివేశాయి. తూర్పు బెంగాల్‌లో దళితులను సమున్నతంగా చూడాలన్న ఆయన కలలు కల్లలయ్యాయి. మైనార్టీలపై జరిగిన అకృత్యా లకు నిరసనగా నెహ్రూ–లియాకత్‌ ఒప్పందం కుది రిన ఆరు మాసాలకే తన పదవికి రాజీనామా చేశారు. పాక్‌ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ మండల్‌ రాసిన రాజీనామా లేఖ హిందువులపై సాగిన దుష్కృ త్యాలకు అద్దం పడుతుంది. చివరికి ఆయన చడీ చప్పుడు కాకుండా భారత్‌ వచ్చి, పశ్చిమ బెంగాల్‌లో ఒక అనామక శరణార్థిగా శేష జీవితాన్ని గడిపారు. జీవితంలోని చివరి 18 సంవత్సరాలు తన తప్పుడు నిర్ణయానికి పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. 

ఈ రోజు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో వివక్షకు గుర వుతున్న హిందువులు దళితులే అని అర్థం చేసుకో వాలి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం అంటే దళితులకు అన్యాయం చేయడమే! మత హింసకు గురై శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను ఆదుకోవడమే పౌరసత్వ సవరణ చట్టపు లక్ష్యం. రాజస్తాన్, గుజరాత్‌లోని జిల్లా మెజిస్ట్రేట్‌లకు పాకి స్తాన్‌ నుండి వచ్చిన శరణార్థుల పౌరసత్వ దరఖా స్తులను పరిశీలించే ప్రత్యేక అధికారాలను కట్టబెట్టి ఎన్‌డీఏ1 ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేసింది. 

ఈ చట్టం ముస్లింల పట్ల వివక్ష చూపుతుందన్న వాదన అర్థరహితం. ఇస్లాం దేశాలలో మతహింసను ఎదుర్కొంటున్న మైనార్టీలకు ఉద్దేశించిందీ చట్టం. ఈ చట్టం ద్వారా ఆయా దేశ ముస్లింలు భారత పౌరసత్వం పొందేందుకు సడలింపులు పొందలేరు. అంతమాత్రం చేత వారికి పౌరసత్వం పూర్తిగా నిరా కరిస్తున్నామని కాదు, ఇతర విధాలుగా వారు పౌర సత్వం పొందే అవకాశం ఉంది. 

పౌరసత్వ సవరణ చట్టం అమలయితే భార తదేశంలో ఉన్న ముస్లింల పౌరసత్వం తొలగిస్తారనే అపోహలను ముస్లిం వర్గాలలో సృష్టించే పనిని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, వామపక్ష, టీఆర్‌ఎస్‌ తదితర పార్టీలు చేస్తున్నాయి. విభజన సమయంలో జాతి నేతలు ఇచ్చిన హామీ మేరకు మన సాంస్కృతిక మూలాలున్న వారికి ద్వారాలు తెరుస్తుంటే వారికి కంటగింపుగా ఉంది. ఆ శరణార్థులు భారత నాగరి కతకు అసలైన వారసులనీ, వారికి పౌరసత్వం ఇవ్వాలనీ బీజేపీ, నాటి జనసంఘ్‌ పలుమార్లు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది. ఇది దశాబ్దాల తరబడి శరణార్థులకు కాంగ్రెస్‌ చేసిన అన్యాయాన్ని సరిదిద్దుతుంది. ఆధు నిక భారత చరిత్రలో ఇదో మేలిమలుపు.

వ్యాసకర్త: చింతా సాంబమూర్తి,
బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
జాతీయ సఫాయి కర్మచారి కమిషన్‌ మాజీ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement