రేపటి దీపాల్ని వెలిగిద్దాం రండి | Devi Writes Guest Columns Over International Womens Day 2019 Special | Sakshi
Sakshi News home page

రేపటి దీపాల్ని వెలిగిద్దాం రండి

Published Thu, Mar 7 2019 2:42 AM | Last Updated on Tue, Mar 3 2020 7:07 PM

Devi Writes Guest Columns Over International Womens Day 2019 Special - Sakshi

కొంత ప్రజాస్వామ్యం, కొన్ని పౌరహక్కులు, కాస్తంత సమభావన వైపు సాగుతున్నాం అనుకునే లోపే భారీ తిరోగమనం ప్రారంభమైంది. ఆర్థికరంగంలో స్త్రీ పాత్ర 19.5 శాతానికి పడిపోవడమే కాదు.. మగ ఛాతీ కొలతల్ని సామర్థ్యంగా ప్రకటించుకోవడంతో ఆగకుండా స్త్రీలపై భౌతిక, లైంగిక హింసలు, అంతర్జాలపు దాడులు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల వలయం నుంచి బయటపడాలంటే శతాబ్దాల పోరాట స్ఫూర్తి ఆసరా తప్పనిసరి. ఈ మార్చి 8ని ముందుకే సాగే కాలం సాక్ష్యంగా పరిణామం చెందే లోకాన్ని మార్పులోకి వరుగులెత్తించే పోరాటాల స్ఫూర్తిగా భుజాన్నేసుకుని మోసుకుపోవాలి. పాత లోకాల్ని కాల్చే రేపటి దీపాల్ని వెలిగిద్దాం పదండి.

ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు పిలుపులూ వచ్చాయి. ఒకటి స్వచ్ఛంద సంస్థల నుంచి ’’మెరుగుపడాలంటే సమతుల్యం అవసరం’’ అని. మరొకటి ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం నుంచి ’’సమభావపు ఆలోచన చురుకుగా నిర్మించడం, పురోగమనం కోసం వినూత్నత’’ అనే పిలుపూ వచ్చింది. సమానం అనే ఆలోచన చేసినంత మాత్రాన సమానత్వం ఉందా, వస్తుందా.. లేక ఆలోచనతో మొదలు పెట్టి చురుకుగా సమానత్వం నిర్మించాలా అనే అనుమానం రాకుండా అలవాటైపోయిన ఈ అసమ వ్యవహార శైలిని ఛేదింది సమానత్వం సాధించే దిశగా సాగాలని దానికి వినూత్న పద్ధతులు, ప్రక్రియలు కనిపెట్టాలని ఐరాస  కోరింది.

ప్రతివారు సాధికారిత గురించే మాట్లాడుతున్నారు కానీ ఆచరణలో అంగుళం కూడా ముందుకు సాగడం లేదు. ఎందుకంటే కనీస హక్కులు అంటే చదువుకోవడం ఉద్యోగం వంటివి ఇస్తే చాలు సాధికారతే అంటూ ప్రతిపనికీ సాధికారత పేరు తగిలిస్తున్నారు. సాధికారత అంటే అధికారం కావాలి. దేనిపైన అధికారం కావాలి స్త్రీలకు? భర్తపైనా? పిల్లలపైనా? కుటుంబం పైనా? సమాజంపైనా? అంటే వందసార్లు కాదు అని చెప్పాల్సి ఉంటుంది.వారి శరీరాలపైనా, వారి చదువులు, ఉపాధి అవకాశాల పైనా, వనరులపైనా, భాగస్వామి ఎంపికపైనా మొత్తంగా చెప్పాలంటే వారి జీవితాలపై నిర్ణయాధికారం కోరుకుంటున్నారు.

బీజింగ్‌ సదస్సు పత్రాల ఆధారంగా 2001–02లో ఐరాస ప్రత్యుత్పత్తి హక్కుల తీర్మానం ప్రతిపాదించింది. దానిపై భారతదేశం సంతకం చేసింది. కానీ ఆనవాయితీ అది అమలులో పెట్టేందుకు ఏ చర్యా తీసుకోకపోగా పరిస్థితి మరింత విషమించింది. స్త్రీలకు ప్రత్యుత్పత్తి హక్కు ఎంత ఘోరంగా నిరాకరించబడుతున్నదో ఆడపిల్లల జననాల రేటు సరోగసీ వ్యాపారాన్ని పరిశీలిస్తే చాలు. నీతిఆయోగ్‌ 2018లో ప్రచురించిన ’’ఆరోగ్యకరమైన రాష్ట్రాలు భారత దేశ పురోగతి’’ ప్రకారం ప్రధానమైన 17 పెద్ద రాష్ట్రాల్లో ఆడపిల్లల జననాల సంఖ్య దారుణంగా పడిపోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యిమంది మగపిల్లలకు కేవలం 914 మంది అమ్మాయిలు పుడుతుండగా (జాతీయ సగటు) అది ఇప్పుడు 900కి తగ్గిపోయింది. దక్షిణాది రాష్ట్రాలు బాలికా భ్రూణ హత్యల్లో మేం తక్కువ కాదు అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బాలికల జననాల రేటు దారుణంగా పడిపోయిందన్న విషయం గుర్తించినట్లు గానీ మాట్లాడినట్లు గానీ కనపడదు. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో ఇది 918గా ఉంది. నీతి ఆయోగ్‌ లెక్కప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అమ్మాయిల పుట్టుక 907 (ప్రతి వెయ్యిమంది మగపిల్లలకు) అంటే మొత్తంమీద అమ్మాయిలను పుట్టనీయకుండా గర్భస్రావాలకు పాల్పడుతున్నారా లేక తాజా టెక్నాలజీతో పిండంగా మారకముందే ఎలిమినేట్‌ చేస్తున్నారా అనే అంశంపై ఏ లెక్కలూ లేవు.

అమ్మాయిల సంఖ్య పడిపోవడంలో గమనించాల్సిన అంశాలు డబ్బున్న, విద్యావంతులున్న ప్రాంతాలు నగర సంస్కృతిలో అమ్మాయిల పుట్టుక రేటు అతి తక్కువ. ఆదివాసీలు అమ్మాయిల, స్త్రీల సంఖ్య ప్రకృతి నిర్దేశించిన ప్రకారం మగవాళ్ల కంటే అధికంగా అంటే 1000: 1121 (బాలలు: బాలికలు) నిష్పత్తిలో ఉంది. స్త్రీ పురుష వివక్షత ఆదివాసీల్లో చాలా తక్కువగా ఉంది. స్త్రీలపై హింస కూడా. ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఆధిపత్య కులాల్లో పెళ్లికి అమ్మాయిల కొరత ఏర్పడింది. హరియాణా, ఉత్తరాఖండ్, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు పేద రాష్ట్రాల నుంచి అమ్మాయిల్ని కొనుక్కుని ద్రౌపది ఆచారానికి తిరోగమిస్తున్నారు. హరియాణాలో పెళ్లికాని యువకులు పెరిగిపోవడం, ఫోర్న్‌ అందుబాటుతో రోజుకి సగటున 8 సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయి.

సంపద పెరుగుదలకూ, శాస్త్ర సాంకేతిక అభివృద్ధికీ, అమ్మాయిల సంఖ్య బాగా పడిపోవడానికి, స్త్రీలపై హింస విపరీతంగా పెరగడానికీ మధ్యగల సంబంధం ఏమిటి? కారణాలు ఏమిటి? అనే విషయం ఈ దేశంలో కనీస చర్చకు నోచుకోలేదు. దేశం కోసం నలుగురు కొడుకుల్ని కనాలని ఒక సాధ్వి, కాదు.. 10 మందిని కనాలని వారిని సైన్యంలోకి పంపాలంటూ ఒక మహారాజు (ఇద్దరూ పార్లమెంటు సభ్యులే) వాగుతుంటే పట్టించుకోని పార్లమెంటరీ వ్యవస్థ స్త్రీలకు ప్రత్యుత్పత్తి హక్కు ఉందని ఒప్పుకోవడానికి నిరాకరించినట్లు కాదా? 53 శాతం విద్యార్థులు ప్రైవేట్‌ విద్యావ్యాపారపు వనరుగా మారాక ప్రభుత్వ పాఠశాల కూడా వదిలి అన్నదమ్ముల ఫీజు కోసమో, ఇంటి పనుల భారం మోయడానికో బడి వదిలేసే ఆడపిల్లలను ఏ విద్యా హక్కు ఆదుకుంటోంది?

ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా చేసే ఉద్యోగాలు, వృత్తులే స్త్రీలు ఎంచుకుంటే కుటుంబాలు నడుస్తాయనే అభ్యుదయవాదులకు శాస్త్ర సాంకేతిక రంగాల పురోగమనంలో ఏర్పడుతున్న విస్తృతావకాశాల  క్రీనీడలు స్త్రీపురుషుల మధ్య డిజిటల్‌ అగాధాలు ఏర్పరుస్తున్నాయని గమనిస్తున్నారా? గణితంలో, భౌతిక రసాయన శాస్త్రాల్లో పరిశోధనా రంగాల్లో అసలే అంతంతమాత్రంగా ఉంటున్న మహిళలు మరింత ముందుకు సాగి వారి మేధోఫలితాలు సమాజానికి అందించడానికి బదులు కుటుంబంలో కూరుకుపోవడం వల్ల దేశానికి జరిగే నష్టం ఎంతో అంచనా వేస్తున్నారా? పనిచేయగలిగే వయస్సులోని స్త్రీలకు వారు చేయగలిగే ఉపాధి ఇవ్వలేకపోవడంతో ఈ దేశం ఏటా 1.7 ట్రిలియన్‌ డాలర్ల ఆదాయం కోల్పోతున్నదని ఏ అర్థశాస్త్రవేత్తలయినా పాలకుల కళ్లు తెరిపించే కాలం కోసం ఇంకెంత కాలం వేచి చూడాలో?

ఈనాటికీ ఇంటా బయటా స్త్రీలు చేస్తున్న పని విలువను గుర్తించడంలో దేశాలు, సమాజాలు, కుటుంబాలు విఫలం అయ్యాయని చెప్పాలా? లేక గుర్తించ నిరాకరిస్తున్నారా? ఇంటి పనుల్లో రోజూ పురుషునికంటే కనీసం 3 నుంచి 5 గంటలు స్త్రీలు వెచ్చిస్తున్నారు. ప్రపంచంలో మూడింట రెండొంతుల శ్రమ స్త్రీలదేనని ఐరాస అధికారిక అధ్యయనం వెల్లడించింది. అయినా ఒక్క వెనిజులా తప్ప మరే దేశం కూడా ఇంటి చాకిరి విలువను స్థూల జాతీయోత్పత్తిలో భాగంగా లెక్కగట్టేందుకు చొరవ చూపడం లేదు. స్త్రీలు ఉపాధుల్లో ఉండటం అన్నిరకాల ఉత్పత్తిని పెంచుతుందని తెలిసినా స్త్రీల ప్రథమ బాధ్యత పిల్లలు, ఇల్లు అని ఎందుకు నీతులు ఎడతెగకుండా ప్రచారం చేస్తున్నారు? అలాగే స్త్రీలు పనిలో ఆదాయం పొందటం ద్వారా పెరిగే కొనుగోలు శక్తి వలన ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంటుంది. అయినా ఆ వైపుగా విధానాలు రూపొందించడం లేదు.

స్త్రీలు సహజసిద్ధమైన పిల్లల పెంపకం నైపుణ్యాలు, సేవాభావం కలిగి ఉంటారనడానికి శాస్త్రీయ ఆధారాలేవీ లేదు. పిల్లల్ని కనడం, పాలివ్వడం వంటి జైవిక ధర్మాలను పిల్లల పెంపకం, త్యాగం, ప్రేమలతో ముడిపెట్టడం ద్వారా స్త్రీలను ఇంటికి పరిమితం చేయడం ఒక సహజ విషయంగా ప్రచారం జరుగుతోంది. స్త్రీ పురుషుల్లో ఎవరైనా నేర్చుకుంటే ఆసక్తి ఉంటే పిల్లల పెంపకం, పెద్దల సేవ చేయవచ్చు. కానీ అలాంటి భావాలకు చోటిస్తే అతి మామూలుగా జరిగిపోతున్న స్త్రీల శ్రమదోపిడీకి దెబ్బతగులుతుంది. పైగా బయట సంపాదించే బాధ్యత మగాడిదే అని చెప్పడం ద్వారా పొలాల్లో, ఫ్యాక్టరీల్లో, అసంఘటిత రంగంలో స్త్రీల ఉపాధికి పురుషుని కంటే తక్కువ వేతనం ఇచ్చి మరింత లాభాలు పొందే అవకాశం పోతుంది.

ధర్మశాస్త్రాలు, రస వివేచనలు, సకల కళలు వాడి ఇంట్లో పనిముట్లు. స్వర్గానికీ నరకానికీ వాడే కామందు అంటూ ధనస్వామ్యం లాభం కోసం పవిత్రాత్మ తోక చివర ఈకలమ్ముతుందంటాడు మయకోవస్కీ. కులసతుల త్యాగాలతో సినిమాలు, మాదకద్రవ్యాల నిషాలో హింసాత్మక ఫోర్నోగ్రఫీ స్త్రీల శరీరాల సరకుపై వారు లాభాలార్జిస్తారు. కొంత ప్రజాస్వామ్యం, కొన్ని పౌరహక్కులు, కాస్తంత సమభావన వైపు సాగుతున్నాం అనుకునే లోపే భారీ తిరోగమనం ప్రారంభం అయింది. ఆర్థికరంగంలో స్త్రీ పాత్ర 19.5 శాతానికి పడిపోవడం ఒక్కటే కాదు. మగ ఛాతీ కొలతల్ని సామర్థ్యంగా ప్రకటించుకోవడంతో ఆగకుండా స్త్రీలపై  భౌతిక, లైంగిక హింసలు, అంతర్జాలపు దాడులు పెరుగుతున్నాయి. పురుగులు పడ్డ శవంలా కుళ్లి గబ్బు కొడుతున్న ఆధిపత్యం సాంస్కృతిక రంగాన్ని సైతానులాగా ఆక్రమించుకుంటోంది. స్త్రీలను రాతిబొమ్మలుగా, దేవతలుగా కొలుస్తాం తప్ప రక్తమాంసాలున్న మనుషులుగా పరిగణించం అని  పురుషత్వం చిందులు దొక్కుతోంది.

ఈ నేపథ్యంలో ఏది నిజం, ఏది కాదు, ఎటుపోవడం సరైంది, ఏది నీతి, ఏది అభివృద్ధి, ఏది అభ్యుదయం, ఏది అమ్ముడుపోవడం అర్థం కాక స్త్రీల జీవితం దళారులకు అమ్ముడుపోతోంది. తమ జీవితాలపై హక్కుకోసం సంఘటితంగా ఉద్యమించిన మహిళల పోరాట స్ఫూర్తి దినోత్సవం కూడా తార్పుడు భావాల వలలో చిక్కి ఒకరోజు ’బారు’ మహిళల కోసం దాగా ఎగబాకింది.  నూనెలో తడిసిన పాలరాయి గచ్చుపై నిలుచున్నట్లున్న ఈ పరిస్థితుల వలయం నుంచి బయటపడాలంటే శతాబ్దాల పోరాట స్ఫూర్తి ఆసరా తప్పనిసరి. దిక్కూ దివాణం తెలియనట్లు కకావికలంగా పరుగులు పెడుతున్న గందరగోళం మధ్య నిదానంగా, నిశ్శబ్దంగా ఒక ఉద్యమ ప్రణాళిక రేఖా చిత్రం కూడా చూడొచ్చు.

సమభావన బలం పుంజుకుంటోంది కాబట్టి ఈ ఇనుప డేగలు వేట ఉధృతం చేశాయని గమనించక తప్పదు. కాబట్టి ఈ మార్చి 8ని ముందుకే సాగే కాలం సాక్ష్యంగా పరిణామం చెందే లోకాన్ని మార్పులోకి వరుగులెత్తించే పోరాటాల స్ఫూర్తిగా భుజాన్నేసుకుని మోసుకుపోవాలి. జీవితం పట్ల ప్రేమతో సమానతపై అచంచల విశ్వాసంతో మన లక్ష్యంపై అకుంఠిత దీక్షతో ముందుకు సాగుదాం పదండి. ఇది మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళల పోరాట దినోత్సవం. పాత లోకాల్ని కాల్చే రేపటి దీపాల్ని వెలిగిద్దాం పదండి.

వ్యాసకర్త: పి.దేవి, సాంస్కృతిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement