నిజాలను దాచేసే సినిమాలెందుకు? | Devulapalli Amar Article On NTR Movie | Sakshi
Sakshi News home page

నిజాలను దాచేసే సినిమాలెందుకు?

Published Wed, Feb 20 2019 12:05 AM | Last Updated on Wed, Feb 20 2019 8:15 AM

Devulapalli Amar Article On NTR Movie - Sakshi

ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి ఏ నాటికయినా ఇబ్బంది రాకుండా ఉండటానికే బాలకృష్ణను వియ్యంకుడిని చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలలో ఎన్టీఆర్‌ ఇమేజ్‌ అవసరం కాబట్టి బావమరిది చేత రెండు సినిమాలు తీయించ బూనుకున్నారు. బాలకృష్ణ తన తండ్రి ప్రజాజీవిత వ్యక్తిత్వాన్ని నిజాయితీగా చిత్రీకరిస్తే చంద్రబాబును విలన్‌గా చూపిం చాలి. ఎన్టీఆర్‌ చివరి శ్వాస వరకూ జరిగిన ఘటనలను మహానాయకుడు చిత్రీకరిస్తే మాత్రం చంద్రబాబు పాత్రలో వక్రీకరణలు తప్పవు. ఎన్టీఆర్‌ మహా నాయకుడు సినిమాలో వక్రీకరణలకు ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత రాం గోపాల్‌ వర్మ నిర్మించబోయే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా ఏమన్నా సమాధానం చెబుతుందేమో చూడాలి.

వి డోంట్‌ నీడ్‌ ఎన్టీఆర్‌ (మాకు ఎన్టీఆర్‌ అవసరం లేదు) అని ఎన్టీరామారావు నుంచి అధికారం లాక్కున్న కొద్ది రోజులకే ఒక స్థానిక ఆంగ్ల దిన పత్రికకు చంద్రబాబు నాయుడు ఇంటర్వూ్య ఇచ్చిన సమయానికి నందమూరి బాలకృష్ణ ఆయనతోనే ఉన్నాడు. బాలకృష్ణ, హరికృష్ణ మొదలయిన ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులంతా ఆ సమయంలో చంద్రబాబు వెంటనే ఉన్నారు. ఎన్టీ రామారావును దుర్మార్గంగా పదవీచ్యుతుడిని చేసిన తరువాత సచివాలయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో గోడలకు ఉన్న ఫొటోలను తీసి మరుగు దొడ్ల పక్కన పడేస్తే మీడియా వాళ్ళు ఫొటోలు తీసి ప్రచురించిన విషయం  ప్రపంచానికి తెలుసు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన రసీదు పుస్తకాల మీద పార్టీ ఆవిర్భావం నుంచీ ప్రచురిస్తూ వచ్చిన ఎన్టీఆర్‌ బొమ్మను తొలగించేసిన చంద్రబాబు తరువాత హరికృష్ణ అలగడంతో తిరిగి ఆ రసీదు పుస్తకాలను మార్చి ఎన్టీఆర్‌ బొమ్మ ముద్రించిన విషయమూ తెలుసు. ఇప్పుడు ఎన్టీరామారావు స్థాపించిన పార్టీ అని, ఆయన విగ్రహాలకు దండలు వేసినంత మాత్రాన ఆయన మీద చెప్పులు వేయించిన విషయం ఎవరూ మరిచిపోరు. ఎన్నికలలో గెలుపు కోసం ఎన్టీఆర్‌ భజన తప్ప ఈ బృందం ఆయనను నిజాయితీగా గౌరవించింది ఎప్పుడూ లేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి కాబట్టి ఎన్టీఆర్‌ స్తోత్ర పారాయణంలో స్వరం పెంచారు చంద్రబాబు.

ప్రపంచంలో ప్రతి విషయాన్ని పదవి కోణంలో నుండి చూడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈ అయిదేళ్ళ కాలంలో చంద్రబాబు పరిపాలనను చూసిన జనం మార్పు కోరుతున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్న తరుణంలో మళ్ళీ ఒకసారి ఎన్టీఆర్‌ను ఎన్నికలలో లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం సినిమాల రూపంలో మొదలుపెట్టారు చంద్రబాబు. బాలకృష్ణ తన తండ్రి జీవితాన్ని వెండితెరకు ఎక్కిస్తుంటే చంద్ర బాబును ఎందుకు మధ్యలోకి తేవడం అని ఎవరయినా అనుకోవొచ్చు. చంద్రబాబు అన్నీ అట్లాగే చేస్తారు. ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి ఏ నాటికయినా ఇబ్బంది రాకుండా ఉండటానికే బాలకృష్ణను వియ్యంకుడిని చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలలో ఎన్టీఆర్‌ ఇమేజ్‌ అవసరం కాబట్టి బావమరిది చేత రెండు సినిమాలు తీయించ బూనుకున్నారు. మొదటిది ఎన్టీఆర్‌ కథానాయకుడు ఇప్పటికే విడుదల అయింది. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ నట జీవితం చివరన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించే వరకే చూపించారు. ఎన్టీఆర్‌ రాజకీయాలు, ఎన్నికలు, అధికారంలోకి రావడం ఇట్లాంటివన్నీ ఉండే రెండో భాగం ఎన్టీఆర్‌ మహా నాయకుడు ఎల్లుండి విడుదల కాబోతున్నది. మొదటి భాగం కథానాయకుడును జనం పెద్దగా ఆదరించలేదు. 

ఈ రెండో భాగం ఎట్లా ఉండబోతున్నది అన్న ఆసక్తి అందరిలో నెలకొన్నది. దాని గురించి పెద్దగా ఆలోచించడానికి ఏముంది? ఎన్టీరామారావు రాజకీయాల్లో నిలబడటానికి, కొనసాగడానికీ విజయాలు సాధించడానికీ బాబు నిర్వహించిన గొప్ప పాత్ర ప్రముఖంగా ఉంటుందన్నది నిర్వివాదాంశం. ఎన్టీరామారావు కథానాయకుడిగా తీసిన మొదటి భాగం పెద్ద ఇబ్బందికరమైందేమీ కాదు. రెండవ భాగం అట్లా కాదు రెండు ఆగస్టు సంక్షోభాలను ఇందులో తెరకెక్కించాలి. 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర్‌రావు చేసింది ఎన్టీఆర్‌కు వెన్నుపోటు అయితే, 1995 ఆగస్టులో బాబు చేసింది కూడా ఎన్టీఆర్‌కు వెన్నుపోటే కావాలి, బాబు చేసింది ప్రభుత్వాన్ని, పార్టీని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభీష్టం మేరకు జరిగినదిగా భావిస్తే 84లో నాదెండ్ల చేసిందీ అదే అనుకోవాలి, అయితే నాదెండ్ల విఫలం అయ్యారు, బాబు సఫలం అయ్యారు. ఇవన్నీ ఎట్లా చూపిస్తారు ఈ సినిమాలో, అసలు చూపిస్తారా లేదా? ఆ రెండు ఎపిసోడ్‌లు లేకుండా ఎన్టీఅర్‌ రాజ కీయ జీవితాన్ని తెరకు ఎక్కించడం ఎట్లా సాధ్యం? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఎన్టీఆర్‌ అభిమానులనూ, రాజ కీయ పరిశీలకులనూ వేధిస్తూ ఉండవచ్చు.

ఈ మధ్యలో డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి జీవి తంలోని ఒక స్వల్ప ఘట్టం, ఎంతో ముఖ్యమయిన ఘట్టం కూడా, పాదయాత్రను ఆధారం చేసుకుని తీసిన యాత్ర సినిమా అద్భుత ప్రజాదరణ పొందింది. ఈ సినిమా రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి కొంత లాభం చేస్తే చెయ్యొచ్చు కానీ అందుకోసమే తీసిన సినిమా కాదు, ఎందుకంటే ఇందులో ఎన్నికలలో లబ్ధి కోసం ఉద్దేశించిన వక్రీకరణలు లేవు. అటువంటి వక్రీకరణలకు ఈ సినిమాలో అవకాశం కూడా లేదు. యాత్ర తీసిన వాళ్ళు చాలా స్పష్టంగా వైఎస్‌ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొం టున్న కొన్ని తీవ్ర సమస్యలకు అధికారంలోకి రాగానే కనుగొన్న పరిష్కారాలకు సంబంధించినంత వరకే పరిమితం అయ్యారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు రుణమాఫీ అందులో ప్రధానమైనవి. ఈ పథకాల కారణంగా రాజశేఖరరెడ్డి పరిపాలనలో లాభపడ్డ కోట్లాది మందికి కొత్తగా చెప్పాల్సింది, మెప్పించాల్సింది ఏమీ లేదు. ఇంకెవరికో రాజకీయ లబ్ధి చేకూరేందుకు కాకుండా ప్రజా జీవి తంలో వైఎస్‌ ఆర్‌ వ్యక్తిత్వాన్ని చిత్రీకరించడం వరకే పరిమితం అయ్యారు కాబట్టి యాత్ర సినిమా అందరినీ ఆకట్టుకున్నది. మరి ఎన్టీఆర్‌ రాజకీయ జీవి తాన్ని తెరకు ఎక్కించాలనుకుంటున్న బాలకృష్ణ కేవలం ఆయన ప్రజాజీవిత వ్యక్తిత్వాన్ని నిజాయితీగా చిత్రీకరిస్తారా లేక చంద్రబాబు రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా తీస్తారా అన్నది చూడాలి. నిజాయితీగా తీస్తే చంద్రబాబును విలన్‌గా చూపించాలి. ఎందుకంటే ఎన్టీఆర్‌ చెప్పిన చివరి మాటలు అవే కదా. జామాతా దశమగ్రహం అన్నాడు ఎన్టీఆర్‌ చంద్రబాబును ఉద్దేశించి. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అతడిని నమ్మడమే అని కూడా చివరి మాటల్లో బాధపడ్డాడు ఎన్టీఆర్‌.

పోనీ చంద్రబాబు పాత్ర లేకుండా ఎన్టీఆర్‌ రాజకీయ జీవితాన్ని సినిమాగా తీస్తారా, అదెట్లా సాధ్యం? మా నాయకురాలు కోరితే మామ మీద అయినా పోటీ చేస్తాను అన్న దగ్గరి నుంచి వైస్రాయ్‌ కుట్ర దాకా చంద్రబాబు పాత్ర లేకుండా ఎన్టీఆర్‌ రాజకీయ సినిమా ఎట్లా తీస్తారు? చంద్రబాబు ఒక్కడే కాదు లక్ష్మీ పార్వతి లేకుండా కూడా ఈ సినిమా సంపూర్ణం కాదు. అయితే తనను గొప్ప రాజకీయ దురంధరుడిగా, లక్ష్మీపార్వతి ఒక చవకబారు స్త్రీగా చిత్రించే విధంగా గతంలో పుస్తకాలు రాయించిన చరిత్ర చంద్రబాబుది. బాలకృష్ణ తీసే సినిమాలో కూడా బావగారి రాజకీయ చతురత, పరిపాలనా సామర్థ్యం ముందు పీఠిన ఉండి మొత్తానికి ఎన్టీఆర్‌ వ్యక్తిత్వం మరుగున పడే ప్రమాదం ఉంది. ఎన్టీఆర్‌ చివరి శ్వాస వరకూ ఈ సిన్మా ఉంటే మాత్రం చంద్రబాబు పాత్రలో విపరీతమైన వక్రీకరణలు తప్పవు. ప్రజా జీవితంలో ఎన్టీఆర్‌ మహనీయతకు మహానాయకుడు సినిమాలో చంద్రగ్రహణం తప్పదు. నా తండ్రి వంగవీటి రంగాను హత్య చేయించింది తెలుగుదేశంవారు కాదు అని ఆయన కుమారుడు రాధా చేత చెప్పించి రాజకీయ నడివీధిలో అతడిని వదిలేయగలిగిన తెలివితేటలూ చంద్రబాబువి. అటువంటి చంద్రబాబు బాలకృష్ణ చేత ఈ సినిమాలో మా బావ బంగారం అనిపించకుండా ఉంటాడని ఎట్లా అనుకుందాం.
 
ఎన్టీఆర్‌ మరణించిన 23 ఏళ్ళ తరువాత ఇప్పుడెందుకు ఆయన జీవితాన్ని తెరకెక్కించాలని అని పించింది అంటే రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో లబ్ధి కోసమే అనడంలో సందేహం లేదు. మరి రాజశేఖరరెడ్డి మీద సినిమా ఆయన మరణించిన పదేళ్లకు ఎందుకు తీయాల్సి వొచ్చింది అన్న ప్రశ్న కూడా చంద్రబాబు అభిమానులు అడగొచ్చు. రాజశేఖర్‌ రెడ్డి సినిమా తీసింది ఆయన కొడుకు కాదు, రాజకీయాల్లో కూడా లేడు. ఎన్టీఆర్‌ సినిమా తీస్తున్నది ఆయన కుమారుడు, రాజకీయంగా తన బావకు, తద్వారా తన అల్లుడికి లాభం చెయ్యాలని అనుకుంటున్న వ్యక్తి. బాలకృష్ణ తీయబోయే ఎన్టీఆర్‌ మహా నాయకుడు సినిమాలో వక్రీకరణలకు ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత రాం గోపాల్‌ వర్మ నిర్మించబోయే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా ఏమన్నా సమాధానం చెబుతుందేమో చూడాలి. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అనగానే ఇది లక్ష్మీ పార్వతికి అనుకూలంగా ఉంటుందనే భావన వెంటనే కలుగుతుంది, 1989లో ఎన్టీఆర్‌ నాయకత్వంలోని తెలుగుదేశం ఘోర పరాజయం నుండి ఆయన తుది శ్వాస దాకా ఉండే ఈ సినిమాలో అయినా లక్ష్మీపార్వతి పాత్రకు న్యాయం జరుగుతుందేమో చూడాలి.


- దేవులపల్లి అమర్‌
datelinehyderabad@gmail.com 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement