మంచితనమై పరిమళించనీ! | dileep reddy article on Life style and development | Sakshi
Sakshi News home page

మంచితనమై పరిమళించనీ!

Published Fri, Dec 29 2017 1:58 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

dileep reddy article on Life style and development - Sakshi

అతి సంపన్నుల్లో ఇటీవల పొడసూపుతున్న దాతృత్వ గుణం ఓ మంచి లక్షణమే! ఫ్రెంచ్‌ తాత్వికుడు రూసో అన్నట్టు, తగిన నిర్వచనం చెప్పని ‘అభివృద్ధి’ ముసుగులో రాజ్యం, దాన్ని గుప్పిట పట్టిన పాలకులు చేసే విధ్వంసాలెన్నో! మన రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ అమరావతిలో చెప్పిన అక్షరసత్యంతో ముగిస్తా. ‘‘భవనాలు, రహదారులు, వంతెనలు అభివృద్ధి సంకేతాలు మాత్రమే! సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండటమే నిజమైన అభివృద్ధి’’.

కాలం, గతం నుంచి వర్తమానం గుండా భవిష్యత్తుకు సాగే ఓ నిరంతర పయనం. సహజంగానో, కృత్రిమంగానో చోటుచేసుకునే సమస్త ఘటనలు, పరిణామాలు, జయాపజయాలు... వాటి ఉనికికి ప్రత్యక్ష సాక్షి కాలం. అగణితం, అనంతమైన ఈ కాలానికి మనిషి ఊహతో గీసుకున్న విభజన రేఖలే... క్షణం, నిమిషం, గంట, దినం, వారం, మాసం, ఏడాది. ఇదొక రకంగా కాలానికి మనిషి కట్టిన కొలతల వంతెన. నడుస్తున్న ఏడాది ముగుస్తుంటే, కొత్త ఏడాది వాకిట్లో నిలబడి ఉన్నాం. 30, 31....1 ఇలా తేదీలూ, గణాంకాలు ఎప్పుడూ ఉండేవే! మనిషి అనేక అవసరాల కోసం ఈ లెక్కలు కడుతూనే ఉన్నాడు, ఉంటాడు! డిసెంబరు 31 కాగానే, జనవరి 1తో కొత్త సంవత్సరం మొదలు! మార్పన్నది, గోడకు వేలాడదీసిన ఉత్తి క్యాలెండర్‌ మారడమేనా? మనిషేమయినా మారుతున్నాడా? ఏడాదికోసారి తప్పనిసరిగా మనిషి మారాలా? ఇవన్నీ శేషప్రశ్నలే! మార్పు అనేది సహజం. ఎంత మార్పు జరిగింది? ఎక్కడ్నుంచి మార్పు మొదలయింది? మార్పుతో ఆశిం చిన లక్ష్యసాధన జరిగిందా? మార్పు మంచికా, చెడుకా? అన్న ప్రశ్నలకు సమాధానం సాపేక్షంగా పోల్చి చెప్పాల్సిందే తప్ప చాలాసార్లు నేరుగా జవాబుండదు.

మార్పును ఆశించే వారంతా, ఎక్కడో ఇది మొదలవాలి కనుక కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, ఆశయాలతో ముందుకు వస్తారు. మార్పు తమకు అనుకూలంగా ఫలితమివ్వాలని ఆశించడం సహజం! అదంతా అలా ప్రతిఫలిస్తే ఇప్పటివరకు సమాజంలో సర్వత్రా మంచే జరిగుండాలి! కానీ, మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు సదరు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. పరిశోధన, శాస్త్రసాంకేతికత మనిషిని ముందుకు నడిపిస్తుంటే, విలువలు పతనమౌతున్న దుస్థితి, పర్యవసానాలు సగటు మనిషి ఆలోచన, ఆచరణను వెనక్కి నడుపుతున్నాయి. వొళ్లు గగుర్పొడిచే కొన్ని ఘటనలు, పరిణామాల్ని లోతుగా విశ్లేషిస్తే భవిష్యత్తు భయంగొల్పేదిగా ఉంటోంది! మనకేమైంది? ఎటుపోతున్నామని మనల్ని మనం నిలదీసి ప్రశ్నించాలనిపిస్తుంది. అదే సమయంలో, ఎడారిలో ఒయాసిస్సులా గుండెల్ని కదిలించే  పరిణామాలూ చోటు చేసుకుంటున్నాయి. మంచి–చెడు నిష్పత్తిలో హెచ్చుతగ్గులే కాలధర్మాన్ని నిర్దేశిస్తాయంటారు. సదరు నిష్పత్తి మార్పునకు ఎవరి వంతు కృషి వారు చేయలేరా? కొత్త సంవత్సరం ముంగిట్లో సంకల్పం తీసుకోలేరా?

ఎంత అమానవీయం!
తన ప్రేమ ప్రతిపాదనను అంగీకరించలేదని నిర్దాక్షిణ్యంగా పెట్రోల్‌ పోసి కాల్చి చంపాడో ఉన్మాది. తండ్రిలేని కుటుంబానికి జీవనాధారమైన యువతి జీవితాన్నే హరించాడు. జనమంతా తూ... అంటున్నా, పశ్చాత్తాపమే లేని పశుప్రవృత్తితో పోలీసుస్టేషన్‌కొచ్చి లొంగిపోయాడు! సమాజానికి ఇదేం సంకేతం? ఒకరిపై వేరొకరికుండే అధికారమేంటి? ‘ప్రేమ’ పవిత్రత తాలూకు వాసనైనా లేని స్వార్థ ఆలోచనాపరులు, తమ సంకుచిత వ్యామోహానికి ఆ ముసుగు కప్పి అరాచకాలకు దిగుతున్నారు. తప్పొప్పుల మీమాంసే లేదు, ప్రతీకార బాట పడుతున్నారు. ఈ భావనల్ని ప్రేరేపించే వస్తువుతో, బాధ్యతారహితంగా తీస్తున్న సమకాలీన సినిమా ప్రభావాన్ని ఎలా చూడాలి? ఇదమిత్ధంగా ఏమీ తెలియని యువతరం బలహీనతలపై ఆడుకుంటూ ఓ చౌకబారు ‘వాణిజ్య నమూనా’ను ‘ప్రేమ’ చుట్టూ అల్లి సొమ్ము చేసుకునే సినీ పెద్దల దోషమేమీ లేదా? ప్రేమించినా, విడిపోవాల్సి వచ్చిన ఓ తప్పనిసరి పరిస్థితిలో... ‘‘ప్రేమించినదే నిజమైతే, నిను మరచుటయే ఇక రుజువుకదా....’’ (ఆత్రేయ) అని తనకుతానుగా దూరమయ్యే ప్రేమ పిపాసుల్ని సృష్టించి, సమాజానికి మార్గదర్శకులుగా నిలిచిన నాటి దర్శకులు ఇప్పుడు మనకేరి?  సాంకేతికత, ఆర్థికాభివృద్ధి అవి రెండూ నియంత్రిస్తున్న వస్తు వినిమయ ప్రపంచం మానవ సంబంధాలను పలుచన చేస్తోంది. మనిషి మనుగడపై వ్యతిరేక ప్రభావం చూపిస్తోంది. అన్ని స్థాయిల్లో విలువలు పతనమవుతున్నాయి. వాటిని పునరుద్ధరించే వస్తువు ఇప్పుడు సమకాలీన సాహిత్యం, కళలు, థియేటర్, సినిమా, టీవీ, ఇతర ప్రసారమాధ్యమాల్లో రావలసి ఉంది. కానీ, జరుగుతున్నది అందుకు పూర్తి విరుద్ధం. వస్తువు నిర్ణయించే అత్యధికుల్లో సామాజిక బాధ్యత గుండు సున్నా.

జీవనశైలిపై తీవ్ర ప్రభావం
ఇష్టపడి చేసుకున్న భర్తని ఓ గృహిణి తన ప్రియుడితో చేతులు కలిపి హతమార్చింది. ఆమ్లం–ప్లాస్టిక్‌ సర్జరీతో ముఖకవళికల్ని మార్చి అతడే మొగుడని నమ్మింపజూసి అడ్డంగా దొరికిపోయింది. ఏమిటీ దారుణమంటే, ‘టీవీ సీరియల్‌ చూసి చేశాను, అందులో లాగానే అంతా సజావుగా జరిగిపోతుందనుకున్నాన’ని బదులిచ్చింది. ఇదా సగటు మనుషులు జనమాధ్యమాల నుంచి పొందాల్సిన స్ఫూర్తి? పలు నేరాలకు, అసహజ పరిణామాలకు సినిమాలు, టీవీ సీరియళ్లు ప్రేరణ అవుతున్నాయి. తరచూ ఇటువంటి ఘటనలు బయటపడుతున్నాయి. నిజానికి టీవీ దుష్ప్రభావం వల్ల జనం చెడి, వెలుగుచూడని దురాగతాల సంఖ్యతో పొలిస్తే ఇవి పిసరంతే! కుటుంబ సంబంధాలు బెడిసికొడుతున్నాయి, ఆర్థిక లావాదేవీలు మనుషుల్ని విడదీస్తున్నాయి. వావివరసలు గాల్లో కలుస్తున్నాయి. కనీస మానవ విలువలు అడుగంటుతున్నాయి. టీవీ కార్యక్రమాలు నూరిపోసే పగ–ద్వేషం, కక్ష–కార్పణ్యం, అలవోక అక్రమసంబంధాలు, చీటికిమాటికి చిందే నెత్తురు... సగటు జీవి నరనరానికి పాకుతున్నాయి. నిద్రలో, మెలకువలో వెంటాడుతున్నాయి. జీవితాన్ని–వినోదాన్నీ వేరు చేసి చూపే/చూసే విజ్ఞత లోపించినపుడు పరిణామాలిలాగే ఉంటాయి. టీవీ మాధ్యమం వచ్చిన కొత్తలో జిందగీ, తమస్, బునియాద్, ఎజోహై జిందగీ, హమ్‌లోగ్‌ వంటి టీవీ కార్యక్రమాలు వినోదంతో పాటు జీవితపు బాధ్యతను తెలిపేవి. అంతర్లీనంగా మావనసంబంధాల్లోని, సంఘ భావన– సమిష్ఠి కుటుంబ జీవన విధానాల్లోని మాధుర్యాన్ని అవి అందించేవి.

ప్రపంచం దగ్గరైంది, మనుషులు దూరమయ్యారు
సాంకేతిక ప్రపంచం నూతన ఆవిష్కరణలెన్నో! కాల్‌ సెంటర్లు, కృత్రిమ మేధ యుగంలో ఉన్నాం. సౌకర్యాల సంగతెలా ఉన్నా, సగటు మనిషి సరళ జీవితం మరింత సంక్లిష్టమైంది. జీవన పోరాటం జటిలమైంది. ‘మానవ సంబంధాల్ని సాంకేతికత అధిగమించే ఓ రోజొస్తుంది, అప్పుడిక మిగిలేది మూర్ఖుల లోకమే!’ అని ఈ సహస్రాబ్ది మహామేధావిగా పేరొందిన ఐన్‌స్టీన్‌ అన్నారు. పక్కంటివారి జీవితం పట్టదు. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో, ఎవరొచ్చి పోతున్నారో, వారి మంచి–చెడులేంటో పొరుగునున్న వారికేమాత్రం తెలియని పరిస్థితి. రెండు దశాబ్దాల కింద ఉన్న సామాజిక జీవన పరిస్థితులు నేడు లేవు. ఆనందం లేకున్నా సౌఖ్యంగా జీవించాలనుకోవడం, తృప్తి లేకున్నా ఇతరుల గుర్తింపుకోసం వెంపర్లాడటం, ‘సెలబ్రిటీ’ ముద్రకోసం అర్రులు చాచడం.. రివాజయ్యాయి. కోట్ల రూపాయలు అప్పులు చేసి, నమ్మకం లేని షేర్‌ మార్కెట్‌లో పెటి,్ట ఒక్కరోజులోనే కోట్లకు అధిపతి కావాలనే ఆత్రుత ఎందుకో! ఇదే నేపథ్యంతో అమీన్‌పూర్‌కు చెందిన ఓ కుటుంబం మొత్తం అనాథల్లా రోడ్డు పక్కన బతుకు చాలించింది.

కరీంనగర్‌ హుజూరాబాద్‌లోనూ ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. పచ్చని జీవితాల్లో నిప్పుపెట్టుకొని, యుక్తవయసులోనే నూరేళ్లు నింపుకుంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారెం దరో! తరచి చూస్తే తెలిసివచ్చేది చిన్న చిన్న కారణాలే! చదువే ఒక శాపంలా ఒత్తిళ్ల మధ్య చావులు. పెళ్లే ఒక నరకంగా వేధింపుల మధ్య బలవన్మరణాలు! బెడిసిన కుటుంబ, ఆర్థిక సంబంధాలే వెంటాడే కష్టాలుగా తనువు చాలించడాలు... ఇదీ పరిస్థితి! కష్టాలను ఎదుర్కొనే పాటి ధైర్యం చిక్కటం లేదు. స్థయిర్యం చాలటం లేదు. గతంలో, కఠిన సమయాల్లోనూ చిరు సహాయాలు ప్రాణాలు నిలిపేవి. వ్యక్తిగత సమస్యల్లో నలుగుతుంటే సమిష్టి కుటుంబంలో ఓ ఆసరా దొరికేది. ఆర్థిక సమస్యల్లో సతమతమౌతుంటే ఇరుగుపొరుగు నుంచి ఓ అనునయింపు లభించేది. చావు ఆలోచన దరికొచ్చేది కాదు.

మధ్యగడులు మాయం!
సమాజంలో ఈ రోజు చాలా మందికి స్పష్టమైన విభజన రేఖ కావాలి! మంచి–చెడు, తెలుపు–నలుపు, ఎడమ–కుడి, లాభం–నష్టం... అంతే, మధ్యలో గడులుంటాయన్న స్పృహే వారికి లేదు. కనీస మానవ సంబంధాల ఊసేలేదు! ఫలితంగా పిల్లలు, కిశోరవయస్కులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. కూతురు కులం కాని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని కన్నతండ్రే ఆ యువకుడ్ని కిరాతకంగా హతమార్చిన ఘటన భువనగిరిలో సంచలనం సృష్టించింది. ఎదిగిన సమాజాల్లో కూడా ఇలాంటి పరువు హత్యలు పొడచూపడం ప్రమాద సంకేతం! పిల్లలకు ఏమి ఆసక్తో కాకుండా, వారిని తామేమి చేయాలనుకుంటున్నారో... ఆ చదువులు రుద్దుతున్నారు. వయసు పైబడిన కన్నవాళ్లను తమకొక భారంగా భావించి రోడ్డుపైన వదిలేస్తున్నారు. ఇంట్లో అన్నీ ఉన్నా, నిర్దాక్షిణ్యంగా వృద్ధాశ్రమాలకు తరలిస్తున్నారు. సమాజంలోనూ అసహనం తీవ్రస్థాయికి చేరింది. అయితే నాతో, లేదంటే శత్రువుతో.... మధ్యలో మరో ప్రత్యామ్నాయమే లేదంటున్నారు.

అది ఆహారపు అలవాటో, వస్తు వినియోగమో, నిరసన తెలుపడమో.... ఏదైతేనేం, గిట్టని పనులు చేసే వారిని హతమారుస్తున్నారు. చర్చ, సంప్రదింపులకు బదులు భౌతికనిర్మూలనే మార్గంగా ఎంచుకుంటున్నారు. శాస్త్ర సాంకేతికత పుణ్యమా అని సామాజిక మాధ్యమాలు మనిషి జీవితాల్లో తిష్ట వేసుకున్నాయి. ఫేస్‌బుక్, మెసెంజర్, వాట్సాప్‌... ఇలా ఎన్నెన్నో! ఉపయోగాలున్నా, వ్యసనంగా మారి యుక్తవయస్కుల్ని సోమరి, దద్దమ్మల్ని చేస్తున్న సందర్భాలెన్నో! సరైన ‘సెక్స్‌ ఎడ్యుకేషన్‌’ లేని మన సమాజంలో కిశోరవయస్కుల్ని పోర్నో సైట్లు, సామాజిక మాధ్యమాలు కల్లోలపరుస్తున్నాయి. వయసుకు మించిన అనుచితాలకు పురికొల్పుతున్నాయి. మైనర్, అదీ మందు తాగి, లైసెన్సు లేకుండా కారు నడిపి.. ఏ మాత్రం సబంధంలేకుండా దారిన పోయే ఒక కుటుంబాన్నే నాశనం చేసిన ఓ దుర్మార్గాన్ని హైదరాబాద్‌ నగరం కన్నీటి పర్యంతమై చూసింది.

మంచి మార్గం ఎంచుకోలేమా?
జరుగుతున్న ఎన్ని అనర్థాల గురించి మాట్లాడినా... మంచికీ మార్గముంది. సత్సంకల్పం, ఆచరించే చిత్తశుద్ధి కావాలి. సాటి మనిషిని మనిషిగా గుర్తించే సద్బుద్ధి ఉండాలంతే! దేశం కోసం ప్రాణ త్యాగానికీ సిద్ధపడి ఒక పోలీసు కానిస్టేబుల్‌ ఉగ్రవాదిని పట్టుకున్నాడు. కర్ణాటకకు వెళ్లి, కత్తిపోట్లకూ వెరవకుండా, ఐసిస్‌ వైపు మళ్లి కుట్రదారుడైన యువకుడ్ని బంధించి శౌర్యచక్ర పొందాడు. కరీంనగర్‌లో రొడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి, తన అవయవదానం ద్వారా మరణానంతరం కూడా ఇతరులకు ఉపయోగపడ్డాడు. ఈ భావన ఇటీవల చాలా పెరిగింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పరోపకారం గురించి యోచించి, ఆచరించే మానవతామూర్తులెందరో! పెరుగుతున్న ఆర్థిక అసమానతలు సమాజంలో అశాంతికి కారణమవుతున్నాయి. అతి సంపన్నుల్లో ఇటీవల పొడసూపుతున్న దాతృత్వ గుణం ఓ మంచి లక్షణమే! ఫ్రెంచ్‌ తాత్వికుడు రూసో అన్నట్టు, తగిన నిర్వచనం చెప్పని ‘అభివృద్ధి’ముసుగులో రాజ్యం, దాన్ని గుప్పిట పట్టిన పాలకులు చేసే విధ్వంసాలెన్నో! మన రాష్ట్రపతి కోవింద్‌ అమరావతిలో చెప్పిన అక్షరసత్యంతో ముగిస్తా. ‘‘భవనాలు, రహదారులు, వంతెనలు అభివృద్ధి సంకేతాలు మాత్రమే! సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండటమే నిజమైన అభివృద్ధి’’.

దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement